రాత్రి పదింటిదాకా కొనసాగిన పోలింగ్
ఓటేసిన ప్రధాని రిషి సునాక్, భార్య అక్షతామూర్తి
విపక్ష లేబర్ పార్టీయే గెలుస్తుందంటున్న విశ్లేషకులు
లండన్: పధ్నాలుగేళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనకు యూకే పౌరులు చరమగీతం పాడనున్నారన్న విశ్లేషణల నడుమ బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పర్వం గురువారం ప్రశాంతంగా పూర్తయింది. ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసరాల ధరలు, వలసల కట్టడిలో విఫలమయ్యారన్న విమర్శలు ఎదుర్కొంటున్న భారతీయ మూలాలున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారిన విషయం తెల్సిందే.
ఉదయాన్నే భార్య అక్షతామూర్తితో కలిసి సునాక్ నార్త్‌ఆలెర్టన్ సిటీ దగ్గర్లోని కిర్బీ సిగ్‌స్టన్ గ్రామంలోని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు. ‘మార్పు’ నినాదంతో ఎన్నికల్లో ఫేవరెట్‌గా నిలిచిన విపక్ష లేబర్ పార్టీ నేత కెయిర్ స్టార్మర్ సైతం భార్య విక్టోరియాతో కలిసి ఉత్తర లండన్‌లోని క్యామ్‌డెన్ విల్లింగ్‌హామ్ హాల్ పోలింగ్‌కేంద్రంలో హుషారుగా ఓటేశారు. బ్రిటిష్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం ఏడుగంటలకే 40,000 పోలింగ్‌బూత్‌లలో పోలింగ్ మొదలైంది.
బ్రిటన్‌లో 4.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 10 గంటలదాకా అంటే భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటల దాకా పోలింగ్ జరగనుంది. పోలింగ్ పూర్తయిన తర్వాత ఓట్ల లెక్కింపు మొదలుపెడతారు. బ్రిటన్ పార్లమెంట్ దిగువ సభ అయిన ‘హౌజ్ ఆఫ్ కామన్స్’లో ఉన్న మొత్తం 650 ఎంపీ స్థానాలకు పోలింగ్ చేపట్టారు. సాధారణ మెజారిటీ సాధించాలంటే 326 సీట్లు గెలవాలి.
ప్రధానమైన కన్జర్వేటివ్, లేబర్ పార్టీలతోపాటు లిబరల్ డెమొక్రాట్స్, గ్రీన్ పార్టీ, స్కాటిష్ నేషనల్ పార్టీ, ఎస్‌డీఎల్‌పీ, డెమొక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ, సిన్ ఫియెన్, ప్లెయిడ్ సిమ్రూ, ది యాంటీ ఇమిగ్రేషన్ రిఫామ్ పార్టీలతోపాటు స్వతంత్రులు బరిలో దిగారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 67 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిశాక ఎగ్జిట్‌పోల్స్ వెలువడే అవకాశముంది. కన్జర్వటివ్ పార్టీ కేవలం 53–150 సీట్లు సాధిస్తుందని, లేబర్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఇప్పటికే ఓపీనియన్స్ పోల్స్ వెల్లడయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment