
హేగ్: గాజాలో ఇజ్రాయెల్ దాడిలో రెండు చేతులు పూర్తిగా కోల్పోయిన పాలస్తీనా బాలుడి ఫొటోకి ఈ ఏడాది ప్రతిష్టాత్మక వరల్డ్ ప్రెస్ ఫొటో అవార్డు దక్కింది. న్యూయార్క్ టైమ్స్‌కు చెందిన సమర్ అబూ ఎలౌఫ్ అనే పాలస్తీనా మహిళా ఫొటోగ్రాఫర్ మహ్మద్ అజ్జౌర్ అనే ఈ 9 ఏళ్ల బాలుడి ఫొటో తీశారు.
తనకు రెండు చేతులూ లేవన్న విషయం తెలుసుకున్న వెంటనే ఆ బాలుడు మొట్టమొదటగా ‘అమ్మా, నేను నిన్నెలా కౌగిలించుకోను?’అని తనను ప్రశ్నించాడని అతడి తల్లి చెప్పడంతో తాను ఎంతో ఆవేదన చెందినట్లు సమర్ అబూ తెలిపారని వరల్డ్ ప్రెస్ ఫొటో ఆర్గనైజేషన్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
2024 మార్చిలో ఇజ్రాయెల్ దాడి నుంచి తప్పించుకునే క్రమంలో అజ్జౌర్ భుజాల దిగువ నుంచి రెండు చేతులనూ కోల్పోయాడని వివరించింది. 68వ ఎడిషన్ పోటీ కోసం మొత్తం 141 దేశాల నుంచి 3,778 మంది ఫొటోగ్రాఫర్లు పంపిన 59,320 ఎంట్రీల నుంచి ఈ ఫొటోను ఎంపిక చేశామంది. ఈ ఫొటో ఎన్నో విషయాలను చెబుతుంది. ఒక బాలుడి గురించే కాదు, తరాలపాటు ప్రభావం చూపే ఒక యుద్ధం గురించి కూడా ఈ చిత్రం చెబుతుందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జెయిన్ ఖౌరీ తెలిపారు. ఫొటో జర్నలిజం చేసిన అద్భుతం ఈ చిత్రమని జ్యూరీ చైర్ లూసీ కొంటిసెల్లో పేర్కొన్నారు.