
గాజాపై కొనసాగిన ఇజ్రాయెల్ దాడులు
డెయిర్ అల్–బలాహ్: గాజాపై క్షేత్రస్థాయి దాడులను తీవ్రతరం చేసిన ఇజ్రాయెల్.. ఆదివారం మరో దారుణానికి ఒడిగట్టింది. గాజాలో పూర్తిస్థాయిలో పనిచేస్తున్న అతి పెద్ద, చిట్టచివరి ఆస్పత్రి అల్–అహ్లిపై ఇజ్రాయెల్ ఆదివారం ఉదయం క్షిపణులతో దాడి చేసింది. రెండు క్షిపణి దాడుల్లో ఆక్సిజన్‌పై ఉన్న ముగ్గురు రోగులు మరణించారు. ఆసుపత్రిలోని రెండంతస్తుల ప్రయోగశాల కూలిపోయింది. ఫార్మసీ, అత్యవసర విభాగ భవనాలు దెబ్బతిన్నాయి. సెయింట్ ఫిలిప్స్ చర్చి భవనం సహా చుట్టుపక్కల భవనాలకు కూడా నష్టం వాటిల్లింది.
ఆస్పత్రిపై దాడి చేస్తామని ఇజ్రాయెల్ భద్రతా దళాల నుంచి కాల్ రావడంతో రోగులను ఖాళీ చేయిస్తుండగానే ఘటన జరిగింది. భయాందోళనకు గురైన రోగులు వీధుల్లోకి పరుగెత్తారు. క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన వారమైన పామ్ సండే నాడు ఇజ్రాయెల్ చేసిన దాడిని ఆస్పత్రిని నిర్వహిస్తున్న జెరూసలేం డయోసిస్ ఖండించింది. దాడి సమయంలో వందలాది మంది రోగులున్నారని తెలిపింది. రోగులకు ఆక్సిజన్ కూడా లేకుండా పోయిందని, వారు చనిపోతారనే ఆందోళనగా ఉందని తెలిపింది.
మరో దాడిలో ఏడుగురు సోదరులు మృతి
కొన్ని గంటల తరువాత, సెంట్రల్ గాజాలోని డెయిర్ అల్–బలాహ్‌లో కారుపై జరిపిన ప్రత్యేక దాడిలో ఆరుగురు సోదరులు, వారి స్నేహితుడు మరణించారు. వారిలో 10 ఏళ్ల బాలుడు ఉన్నాడు. గాజాలోని పాలస్తీనియన్లకు ఆహారాన్ని పంపిణీ చేసే స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్న తన కొడుకులను చంపారని వారి తండ్రి ఇబ్రహీం అబూ మహదీ వాపోయారు. ఏం పాపం చేశారని తనపిల్లలను చంపారంటూ రక్తసిక్తమైన కారులో ఉన్న మృతదేహాలపై పడి కన్నీరుమున్నీరుగా విలపించారు. గత 24 గంటల్లో 11 మంది చనిపోయారని, 100 మందికి పైగా గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది.
హమాస్ కేంద్రంగా ఉపయోగిస్తున్నందుకే..
ఉగ్రవాద సంస్థ హమాస్ కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలుగా ఉపయోగిస్తున్నందునే ఆయా ప్రాంతాలపై దాడి చేశామని ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాంతంలో ముందస్తు హెచ్చరికలు అందించడం సహా పౌరులకు, ఆసుపత్రికి హాని కలిగించే అవకాశాలను తగ్గించడానికి చర్యలు తీసుకున్నట్లు ఎక్స్‌లో పేర్కొంది. హమాస్‌ను తుదముట్టించాలంటే ఆస్పత్రులతో సహా పౌర మౌలిక సదుపాయాలపై దాడులు అవసరమని ఇజ్రాయెల్ గతంలో పేర్కొంది. అయితే, తన వాదనలకు మద్దతు ఇచ్చే ఆధారాలను మాత్రం చూపలేదు.