బ్రిటన్‌లో తొలి మహిళా లార్డ్ ఛాన్సలర్ ఆమే. రెండో మహిళా విదేశాంగ మంత్రీ ఆవిడే. ఇప్పుడు థాచర్, థెరెసా మే తర్వాత ఆ దేశానికి ముచ్చటగా మూడో మహిళా ప్రధానీ ఆమే. అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ మార్పులో భాగంగా బోరిస్ జాన్సన్‌కు వారసురాలిగా సోమవారం ఎన్నికైన 47 ఏళ్ళ లిజ్ ట్రస్‌కు ఇలాంటి ఘనతలు చాలానే ఉన్నాయి. క్వీన్ ఎలిజబెత్2ను లాంఛనంగా కలసి, 96 ఏళ్ళ రాణిగారి సాంప్రదాయిక నియామకంతో బ్రిటన్ కొత్త ప్రధానిగా మంగళవారం బాధ్యతలు చేపట్టిన లిజ్ ఇప్పుడు ఆ ఘనతలు నిలబెట్టుకోవడానికి శ్రమించక తప్పదు. వరుస వివాదాలతో రెండు నెలల క్రితం జాన్సన్ బ్రిటీష్ ప్రధానిగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించినప్పటి నుంచి లిజ్ ప్రయాణం మలుపు తిరిగింది. జాన్సన్ హయాంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన ఆమె మాజీ ఆర్థిక మంత్రి రిషీ సునాక్‌ను అధిగమించి, పీఠం దక్కించుకున్నారు.
కొత్త నేతగా పీఠమెక్కడానికి కన్జర్వేటివ్ పార్టీలో ఆరుగురు ఉత్సాహపడితే, ఆఖరికి బరిలో మిగిలింది – లిజ్, భారతీయ మూలాలున్న రిషీ సునాక్. ‘ఇన్ఫోసిస్’ సుధ – నారాయణమూర్తి దంపతుల అల్లుడైన రిషి సోమవారం ఓటమి పాలయ్యారు. అయితేనేం, లక్షా 70 వేల పైగా కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఎన్నుకొనే పదవికి చివరి దాకా పోటీపడి, 60 వేలకు పైగా ఓట్లు సంపాదించడం విశేషమే. నిలబెట్టుకోలేని వాగ్దానాలు ఇవ్వలేనన్న రిషికి భిన్నంగా లిజ్ వ్యవహ రించడం గమనార్హం. బ్రిటీష్ ప్రజాస్వామ్య వ్యవస్థలోని రాజకీయ పార్టీల అంతర్గత ప్రజాస్వామ్యా నికి ప్రతీకగా నిలిచిన ఎన్నికల ప్రక్రియ ముగిసింది. పరిష్కారాల మాట దేవుడెరుగు, కనీసం దేశం ఆర్థికంగా క్లిష్టపరిస్థితుల్లో ఉన్నట్టు తన ప్రచారంలో ప్రస్తావించకుండా వాస్తవాన్ని చూడ నిరాక రించిన లిజ్ ఇప్పుడు కళ్ళెదుటి సంక్షోభం నుంచి దేశాన్ని ఎలా గట్టెక్కిస్తారన్నది ఆసక్తికరం.
వామపక్ష భావజాల కుటుంబంలో పుట్టి, తల్లితండ్రుల రాజకీయ పొత్తిళ్ళ నుంచి బయటపడి, ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకొనే రోజుల్లో ఉదారవాద ప్రజాస్వామ్య రాజకీయాల వైపు మొగ్గి, యువ ఉద్యోగినిగా కన్జర్వేటివ్ పార్టీలో చేరిన గమ్మల్తైన ప్రయాణం లిజ్‌ది. ముగ్గురు కన్జర్వేటివ్ పార్టీ ప్రధానమంత్రుల వద్ద ఆరు మంత్రి పదవులు నిర్వహించిన ఆమె ఇప్పుడు సరాసరి లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్ నివాసి అయ్యారు. ఈ ప్రధానమంత్రి పీఠంపై ఆమెకు మొదటి రోజు నుంచీ అనేక సవాళ్ళు ఎదురుకానున్నాయి. అంతకంతకూ పెరుగుతున్న ఇంధన ధరలు, కరెంట్ కోతల ముప్పు, గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా రెండంకెల ద్రవ్యోల్బణం, పొంచి ఉన్న దీర్ఘకాలిక ఆర్థిక మాంద్యం, పెరుగుతున్న తనఖా రేట్లు... వెరసి అలవి కాని జీవన వ్యయం – ఇలా సమస్యలెన్నో. దేశంలో వివిధ ఉద్యోగ సంఘాలు ఇప్పటికే సమ్మె సైరన్ మోగించాయి. ఉక్రెయిన్‌లో యుద్ధం, బ్రెగ్జిట్ పర్యవసానాల లాంటి విదేశాంగ విధానపు తలనొప్పులు సరేసరి.
పదవికి పోటీలో లిజ్ చేసిన వాగ్దానాలూ చిన్నవేమీ కావు. పన్నులను తగ్గిస్తాననీ, ప్రజా వ్యయాన్ని పెంచుతాననీ బాస చేశారు. దేశం ఇప్పుడున్న ఇక్కట్లలో ఇచ్చిన హామీలు నెరవేర్చా లంటే, ఆమె ఇంట్లో కల్పవృక్షమో, కామధేనువో ఉంటే కానీ సాధ్యం కాదని ఓ జోక్. బ్రిటన్ తాజా మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ లానే లిజ్‌కూ మాటల్లో ఘనత చాటుకొనే లక్షణం ఉంది. కానీ, ఆయనకున్న జనాకర్షణ, అవతలివారి అంగీకారం పొందే నేర్పు ఆమెకు లేవని విమర్శకుల మాట. ఒకప్పటి మార్గరెట్ థాచర్‌ను లిజ్‌లో ఆశించలేమని వారి విశ్లేషణ. అయితే ఎదగాలనే ఆకాంక్ష బలంగా ఉన్న ఈ దృఢచిత్తురాలికి స్వతఃసిద్ధ పోరాటగుణమే పెట్టనికోట. సమయానికి తగ్గట్టు అభిప్రాయాలు మార్చుకొనే దృక్పథం కలిసొచ్చే అంశం. 2016లో బ్రెగ్జిట్ విధానానికి తీవ్ర వ్యతిరేకిగా ఉన్న లిజ్, ఆపై బ్రెగ్జిట్‌కు పూర్తి అనుకూలంగా మారడం, 2019 నాటికి జాన్సన్ హయాంలో బ్రెగ్జిట్ అనంతరకాల వాణిజ్య మంత్రిగా వ్యవహరించడమే అందుకు ఉదాహరణ.
మాటల గారడీ జాన్సన్ హయాంలో వెనుకబడ్డ బ్రిటన్‌కు ఇప్పుడు చిత్తశుద్ధితో కూడిన స్థిర మైన, బలమైన నాయకత్వం అవసరం. రిషిని వెన్నుపోటుదారుగా భావిస్తూ, అతనికి తప్ప ఎవరి కైనా ఓటేయమన్న జాన్సన్ మాటలతో ఆయన అనుకూలుర మద్దతు లిజ్‌ను గెలిపించింది. అలా జాన్సన్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న లిజ్ పాత ప్రభుత్వ తప్పుడు విధానాల నుంచి ఎంత త్వరగా బయటకొస్తే, బ్రిటన్‌కు అంత మంచిది. ఇక, ఆప్తురాలైన లిజ్ ఎన్నిక భారత్‌కు శుభవార్తే. విదేశాంగ మంత్రిగా చైనాతో కయ్యానికి కాలుదువ్వుతూ, రష్యాపై కఠినవైఖరిని అనుసరించిన ఆమె ఇప్పటికి 3 సార్లు క్యాబినెట్ మంత్రిగా భారత్‌లో పర్యటించారు. ఇరుదేశాల పాత అనుబంధంతో మెతకగానే ఉన్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల చర్చలూ అక్టోబర్‌లో కొలిక్కిరానున్నాయి. ఏప్రిల్‌లో కుదుర్చుకున్న రక్షణ సహకార ఒప్పందం సహా అన్నీ సజావుగా సాగుతాయని అంచనా.
అయితే, బ్రిటన్ సమస్యల సుడిగుండంలోకి ప్రయాణిస్తోందన్న ఆలోచననే ఇన్నాళ్ళూ ‘క్షీణ వాద ప్రసంగం’గా కొట్టిపారేస్తూ వచ్చిన లిజ్ వాస్తవంలోకి రాక తప్పదు. సమస్యల పరిష్కారంలో జయాపజయాలను బట్టే చరిత్రలో ప్రధానిగా ఆమె అధ్యాయం లిఖితమవుతుంది. మరోపక్క దీర్ఘ కాలంగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ అంతర్గత సమస్యలు, పరస్పర విరుద్ధ ఆలోచనల వర్గా లతో సతమతమవుతోంది. ఆ పార్టీ, దాని సారథిగా ఈ ఇద్దరు టీనేజ్ కుమార్తెల తల్లి కొద్దిగా తడ బడినా, కొన్నేళ్ళుగా అధికారానికి దూరమైన ప్రతిపక్ష లేబర్‌పార్టీకి 2024 ఎన్నికల్లో సందు చిక్కినట్టే!
ఇదీ చదవండి: Indian Economy: త్వరపడితేనే... నిలబడతాం!
Comments
Please login to add a commentAdd a comment