uk polls
-
లిజ్ ట్రస్‌కు ఇది ముళ్ళకిరీటమే!
బ్రిటన్‌లో తొలి మహిళా లార్డ్ ఛాన్సలర్ ఆమే. రెండో మహిళా విదేశాంగ మంత్రీ ఆవిడే. ఇప్పుడు థాచర్, థెరెసా మే తర్వాత ఆ దేశానికి ముచ్చటగా మూడో మహిళా ప్రధానీ ఆమే. అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ మార్పులో భాగంగా బోరిస్ జాన్సన్‌కు వారసురాలిగా సోమవారం ఎన్నికైన 47 ఏళ్ళ లిజ్ ట్రస్‌కు ఇలాంటి ఘనతలు చాలానే ఉన్నాయి. క్వీన్ ఎలిజబెత్2ను లాంఛనంగా కలసి, 96 ఏళ్ళ రాణిగారి సాంప్రదాయిక నియామకంతో బ్రిటన్ కొత్త ప్రధానిగా మంగళవారం బాధ్యతలు చేపట్టిన లిజ్ ఇప్పుడు ఆ ఘనతలు నిలబెట్టుకోవడానికి శ్రమించక తప్పదు. వరుస వివాదాలతో రెండు నెలల క్రితం జాన్సన్ బ్రిటీష్ ప్రధానిగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించినప్పటి నుంచి లిజ్ ప్రయాణం మలుపు తిరిగింది. జాన్సన్ హయాంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన ఆమె మాజీ ఆర్థిక మంత్రి రిషీ సునాక్‌ను అధిగమించి, పీఠం దక్కించుకున్నారు. కొత్త నేతగా పీఠమెక్కడానికి కన్జర్వేటివ్ పార్టీలో ఆరుగురు ఉత్సాహపడితే, ఆఖరికి బరిలో మిగిలింది – లిజ్, భారతీయ మూలాలున్న రిషీ సునాక్. ‘ఇన్ఫోసిస్’ సుధ – నారాయణమూర్తి దంపతుల అల్లుడైన రిషి సోమవారం ఓటమి పాలయ్యారు. అయితేనేం, లక్షా 70 వేల పైగా కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఎన్నుకొనే పదవికి చివరి దాకా పోటీపడి, 60 వేలకు పైగా ఓట్లు సంపాదించడం విశేషమే. నిలబెట్టుకోలేని వాగ్దానాలు ఇవ్వలేనన్న రిషికి భిన్నంగా లిజ్ వ్యవహ రించడం గమనార్హం. బ్రిటీష్ ప్రజాస్వామ్య వ్యవస్థలోని రాజకీయ పార్టీల అంతర్గత ప్రజాస్వామ్యా నికి ప్రతీకగా నిలిచిన ఎన్నికల ప్రక్రియ ముగిసింది. పరిష్కారాల మాట దేవుడెరుగు, కనీసం దేశం ఆర్థికంగా క్లిష్టపరిస్థితుల్లో ఉన్నట్టు తన ప్రచారంలో ప్రస్తావించకుండా వాస్తవాన్ని చూడ నిరాక రించిన లిజ్ ఇప్పుడు కళ్ళెదుటి సంక్షోభం నుంచి దేశాన్ని ఎలా గట్టెక్కిస్తారన్నది ఆసక్తికరం. వామపక్ష భావజాల కుటుంబంలో పుట్టి, తల్లితండ్రుల రాజకీయ పొత్తిళ్ళ నుంచి బయటపడి, ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకొనే రోజుల్లో ఉదారవాద ప్రజాస్వామ్య రాజకీయాల వైపు మొగ్గి, యువ ఉద్యోగినిగా కన్జర్వేటివ్ పార్టీలో చేరిన గమ్మల్తైన ప్రయాణం లిజ్ది. ముగ్గురు కన్జర్వేటివ్ పార్టీ ప్రధానమంత్రుల వద్ద ఆరు మంత్రి పదవులు నిర్వహించిన ఆమె ఇప్పుడు సరాసరి లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్ నివాసి అయ్యారు. ఈ ప్రధానమంత్రి పీఠంపై ఆమెకు మొదటి రోజు నుంచీ అనేక సవాళ్ళు ఎదురుకానున్నాయి. అంతకంతకూ పెరుగుతున్న ఇంధన ధరలు, కరెంట్ కోతల ముప్పు, గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా రెండంకెల ద్రవ్యోల్బణం, పొంచి ఉన్న దీర్ఘకాలిక ఆర్థిక మాంద్యం, పెరుగుతున్న తనఖా రేట్లు... వెరసి అలవి కాని జీవన వ్యయం – ఇలా సమస్యలెన్నో. దేశంలో వివిధ ఉద్యోగ సంఘాలు ఇప్పటికే సమ్మె సైరన్ మోగించాయి. ఉక్రెయిన్‌లో యుద్ధం, బ్రెగ్జిట్ పర్యవసానాల లాంటి విదేశాంగ విధానపు తలనొప్పులు సరేసరి. పదవికి పోటీలో లిజ్ చేసిన వాగ్దానాలూ చిన్నవేమీ కావు. పన్నులను తగ్గిస్తాననీ, ప్రజా వ్యయాన్ని పెంచుతాననీ బాస చేశారు. దేశం ఇప్పుడున్న ఇక్కట్లలో ఇచ్చిన హామీలు నెరవేర్చా లంటే, ఆమె ఇంట్లో కల్పవృక్షమో, కామధేనువో ఉంటే కానీ సాధ్యం కాదని ఓ జోక్. బ్రిటన్ తాజా మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ లానే లిజ్కూ మాటల్లో ఘనత చాటుకొనే లక్షణం ఉంది. కానీ, ఆయనకున్న జనాకర్షణ, అవతలివారి అంగీకారం పొందే నేర్పు ఆమెకు లేవని విమర్శకుల మాట. ఒకప్పటి మార్గరెట్ థాచర్‌ను లిజ్లో ఆశించలేమని వారి విశ్లేషణ. అయితే ఎదగాలనే ఆకాంక్ష బలంగా ఉన్న ఈ దృఢచిత్తురాలికి స్వతఃసిద్ధ పోరాటగుణమే పెట్టనికోట. సమయానికి తగ్గట్టు అభిప్రాయాలు మార్చుకొనే దృక్పథం కలిసొచ్చే అంశం. 2016లో బ్రెగ్జిట్ విధానానికి తీవ్ర వ్యతిరేకిగా ఉన్న లిజ్, ఆపై బ్రెగ్జిట్‌కు పూర్తి అనుకూలంగా మారడం, 2019 నాటికి జాన్సన్ హయాంలో బ్రెగ్జిట్ అనంతరకాల వాణిజ్య మంత్రిగా వ్యవహరించడమే అందుకు ఉదాహరణ. మాటల గారడీ జాన్సన్ హయాంలో వెనుకబడ్డ బ్రిటన్‌కు ఇప్పుడు చిత్తశుద్ధితో కూడిన స్థిర మైన, బలమైన నాయకత్వం అవసరం. రిషిని వెన్నుపోటుదారుగా భావిస్తూ, అతనికి తప్ప ఎవరి కైనా ఓటేయమన్న జాన్సన్ మాటలతో ఆయన అనుకూలుర మద్దతు లిజ్‌ను గెలిపించింది. అలా జాన్సన్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న లిజ్ పాత ప్రభుత్వ తప్పుడు విధానాల నుంచి ఎంత త్వరగా బయటకొస్తే, బ్రిటన్‌కు అంత మంచిది. ఇక, ఆప్తురాలైన లిజ్ ఎన్నిక భారత్‌కు శుభవార్తే. విదేశాంగ మంత్రిగా చైనాతో కయ్యానికి కాలుదువ్వుతూ, రష్యాపై కఠినవైఖరిని అనుసరించిన ఆమె ఇప్పటికి 3 సార్లు క్యాబినెట్ మంత్రిగా భారత్‌లో పర్యటించారు. ఇరుదేశాల పాత అనుబంధంతో మెతకగానే ఉన్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల చర్చలూ అక్టోబర్‌లో కొలిక్కిరానున్నాయి. ఏప్రిల్‌లో కుదుర్చుకున్న రక్షణ సహకార ఒప్పందం సహా అన్నీ సజావుగా సాగుతాయని అంచనా. అయితే, బ్రిటన్ సమస్యల సుడిగుండంలోకి ప్రయాణిస్తోందన్న ఆలోచననే ఇన్నాళ్ళూ ‘క్షీణ వాద ప్రసంగం’గా కొట్టిపారేస్తూ వచ్చిన లిజ్ వాస్తవంలోకి రాక తప్పదు. సమస్యల పరిష్కారంలో జయాపజయాలను బట్టే చరిత్రలో ప్రధానిగా ఆమె అధ్యాయం లిఖితమవుతుంది. మరోపక్క దీర్ఘ కాలంగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ అంతర్గత సమస్యలు, పరస్పర విరుద్ధ ఆలోచనల వర్గా లతో సతమతమవుతోంది. ఆ పార్టీ, దాని సారథిగా ఈ ఇద్దరు టీనేజ్ కుమార్తెల తల్లి కొద్దిగా తడ బడినా, కొన్నేళ్ళుగా అధికారానికి దూరమైన ప్రతిపక్ష లేబర్పార్టీకి 2024 ఎన్నికల్లో సందు చిక్కినట్టే! ఇదీ చదవండి: Indian Economy: త్వరపడితేనే... నిలబడతాం! -
UK PM Election Results 2022: బ్రిటన్ పీఠం ట్రస్‌దే
లండన్/న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధాని పీఠం కోసం జరిగిన పోరులో విదేశాంగ మంత్రి మేరీ ఎలిజబెత్ (లిజ్) ట్రస్ (47)దే పై చేయి అయింది. హోరాహోరి పోరులో భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ (42)పై ఆమె విజయం సాధించి కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఎన్నికయ్యారు. తద్వారా బోరిస్ జాన్సన్ వారసురాలిగా ప్రధాని పదవి చేపట్టనున్నారు. సోమవారం వెల్లడైన ఫలితాల్లో ట్రస్ 81,326 ఓట్లు సాధించారు. రిషికి 60,399 ఓట్లు పోలయ్యాయి. ఫలితాల అనంతరం ట్రస్ మాట్లాడారు. పార్టీ నేతగా ఎన్నికవడం గొప్ప గౌరవమన్నారు. తనపై నమ్మకముంచినందుకు పార్టీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘మేం చేసి చూపిస్తాం’ అంటూ ముమ్మారు ప్రతిజ్ఞ చేశారు. ‘‘పన్నులకు కోత విధించి ప్రజలపై భారం తగ్గించి చూపిస్తాం. ఇంధన సంక్షోభాన్ని అధిగమిస్తాం. ఈ కష్టకాలం నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి సాహసోపేతమైన చర్యలు చేపడతా. యునైటెడ్ కింగ్డమ్ సామర్థ్యం ఏమిటో ప్రపంచానికి మరోసారి చూపిద్దాం’’ అంటూ అనంతరం ట్వీట్ చేశారు. రిషి చివరిదాకా తనకు పోటీ ఇచ్చారంటూ అభినందించారు. ప్రధానిగా బోరిస్ ఘన విజయాలు సాధించారంటూ ఆకాశానికెత్తారు. మార్గరెట్ థాచర్, థెరిసా మే తర్వాత బ్రిటన్ ప్రధాని కానున్న మూడో మహిళ ట్రస్. పన్నుల తగ్గింపు హామీలు, రిషిపై కోపంతో జాన్సన్ లోపాయికారీ మద్దతు తదితరాలు ట్రస్ గెలుపుకు ప్రధానంగా పని చేశాయని చెబుతున్నారు. తాత్కాలిక ప్రధాని జాన్సన్ లాంఛనంగా రాజీనామా సమర్పించిన అనంతరం మంగళవారం ట్రస్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఆమె నిర్ణయాత్మక విజయం సాధించారంటూ జాన్సన్ అభినందించారు. ‘‘నానాటికీ పెరిగిపోతున్న జీవన వ్యయం వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు, పార్టీని, దేశాన్ని ముందుకు నడిపేందుకు ట్రస్ వద్ద సరైన ప్రణాళికలున్నాయి. పార్టీ నేతలంతా ఆమె వెనక నిలవాల్సిన సమయమిది’’ అంటూ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ట్రస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె నాయకత్వంలో ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాలు మరింత పటిష్టమవుతాయని ఆశాభావం వెలిబుచ్చారు. రిషి సంచలనం పార్టీ గేట్, విశ్వసనీయతకు సంబంధించిన ఆరోపణలతో ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేయాల్సి రావడం తెలిసిందే. నైతికత లేని జాన్సన్ సారథ్యంలో పని చేయలేనంటూ ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేయడం ద్వారా రిషి సంచలనం సృష్టించారు. మంత్రులంతా ఆయన బాటే పట్టి వరుసగా రాజీనామా చేయడంతో జాన్సన్ అయిష్టంగానే తప్పుకోవాల్సి వచ్చింది. తద్వారా వచ్చి పడ్డ కన్జర్వేటివ్ పార్టీ నేత ఎన్నికలో మెజారిటీ ఎంపీల మద్దతు కూడగట్టడం ద్వారా తొలుత రిషియే ముందంజలో ఉన్నారు. తర్వాత ట్రస్ అనూహ్యంగా దూసుకెళ్లారు. 1,72,437 లక్షల కన్జర్వేటివ్ ఓటర్లను ఎక్కువ మందిని ఆకర్షించడంలో సఫలమయ్యారు. ఆమెకు 57.4 శాతం ఓట్లు పోలవగా రిషికి 42.6 శాతం వచ్చాయి. ఆయన ఓటమి చవిచూసినా బ్రిటన్ ప్రధాని పదవి కోసం తలపడ్డ తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. తనకు ఓటేసిన అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ‘‘కన్జర్వేటివ్ సభ్యులమంతా ఒకే కుటుంబం. ఈ కష్టకాలం నుంచి గట్టెక్కించే ప్రయత్నాల్లో మనమంతా కొత్త ప్రధాని ట్రస్‌కు దన్నుగా నిలుద్దాం’’ అంటూ ట్వీట్ చేశారు. పన్నుల విషయంలో ట్రస్‌తో విధానపరమైన వైరుధ్యం కారణంగా రిషి ఆమె కేబినెట్లో చేరడం అనుమానమేనంటున్నారు. అంచెలంచెలుగా ఎదిగి... బ్రిటన్ నూతన ప్రధాని లిజ్ ట్రస్ కరడుగట్టిన కమ్యూనిస్టుల కుటుంబం నుంచి వచ్చారు. ఆమె 1975లో ఆక్స్‌ఫర్డ్‌లో జన్మించారు. తండ్రి మ్యాథ్స్ ప్రొఫెసర్ కాగా తల్లి నర్స్ టీచర్. యూకేలో పలు ప్రాంతాల్లో విద్యాభ్యాసం సాగింది. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ వచ్చారు. 2001, 2005ల్లో ఓటమి పాలైనా 2010లో నార్ఫోక్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2014లో కేమరూన్ కేబినెట్లో పర్యావరణ మంత్రిగా, 2016లో థెరిసా మే ప్రభుత్వంలో న్యాయ శాఖ మంత్రిగా చేశారు. 2019లో బోరిస్ జాన్సన్ ప్రధాని అయ్యాక ట్రస్‌కు ప్రాధాన్యం పెరిగింది. తొలుత ఇంటర్నేషనల్ ట్రేడ్ సెక్రెటరీగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో భారత్‌లో పటిష్టమైన ఆర్థిక బంధం కోసం కృషి చేశారు. భారత్–ఇంగ్లండ్ వర్తక భాగస్వామ్యం (ఈటీపీ)లో కీలక పాత్ర పోషించారు. రెండేళ్లకు కీలకమైన విదేశాంగ శాఖ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు జాన్సన్ వారసురాలిగా ఎన్నికయ్యారు. అకౌంటెంట్ హ్యూ ఓ లియరీని ట్రస్ పెళ్లాడారు. వారికి ఇద్దరమ్మాయిలు. పరిస్థితిని బట్టి విధానాలు మార్చుకునే నేతగా కూడా ట్రస్ పేరుబడ్డారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడాన్ని (బ్రెగ్జిట్) తొలుత తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ అది అనివార్యమని తేలాక బ్రెగ్జిట్‌కు జైకొట్టారు. కన్జర్వేటివ్ సభ్యుల మద్దతు సాధించే ప్రయత్నాల్లో భాగంగా మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ వస్త్రధారణను అనుకరించారు. -
ఎన్నికలవేళ బ్రిటన్‌పై ఉగ్రపంజా
-
ఎన్నికలవేళ బ్రిటన్‌పై ఉగ్రపంజా
- వరుస ఉగ్రదాడులతో బ్రిటిషర్లు ఉక్కిరిబిక్కిరి - నేడు లండన్‌లో ఆరుగురు.. మొన్న మాంచెస్టర్‌లో 22 మంది బలి - చాంపియన్స్ ట్రోఫీపైనా ఉగ్రనీడలు.. జూన్ 8న పోలింగ్ లండన్: మాంచెస్టర్ మారణకాండ నుంచి తేరుకోకముందే బ్రిటన్‌పై ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. సెంట్రల్ లండన్‌లో థేమ్స్ నదిపై ఉన్న ‘లండన్ బ్రిడ్జి’పై ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. వ్యాన్‌ను వేగంగా నడుపుతూ పాదచారులను తొక్కిచంపేశారు. అదే సమయంలో సమీప బారో మార్కెట్ వద్ద కత్తులతో పలువురిని పొడిచి చంపారు. ఈ రెండు ఘటనల్లో కనీసం ఆరుగురు చనిపోగా, పదుల సంఖ్యలో జనం గాయపడినట్లు తెలిసింది. దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను లండన్ పోలీసులు కాల్చిచంపినట్లు సమాచారం. ఎప్పుడు జరిగింది? శనివారం రాత్రి 10 గంటల సమయంలో వ్యాన్‌ను నడుపుకుంటూ లండన్ బ్రిడ్జిపైకి వచ్చిన ఉగ్రవాదులు.. పాదచారులపైకి వాహనాన్ని ఎక్కించారు. ఆ తర్వాత కొద్ది సేపటికే బ్రిడ్జిని ఆనుకుని ఉన్న బరో మార్కెట్లో ఉగ్రవాదులు.. పౌరులను కత్తులతో పొడిచినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఇది ఉగ్రదాడేనని బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే అనుమానం వ్యక్తంచేశారు. మరికొద్ది గంటల్లో ఎన్నికలు: బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ దేశంలో వరుసగా ఉగ్రదాడులు చోటుచేసుకుంటుండటం బ్రిటిషర్లను కలవరపెడుతోంది. 650 స్థానాలున్న బ్రిటన్ పార్లమెంటుకు జూన్ 8న పోలింగ్ జరగనుంది. ఈ మేరకు పోలీసులు, అధికారగణం ఏర్పాట్లలో తలమునకలైఉన్నారు. ఇదే అదనుగా భావించి ముష్కరులు తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. మే 22న బ్రిటన్ పారిశ్రామిక నగరం మాంచెస్టర్‌లో ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతిదాడిలో 22 మంది చనిపోయారు. ఆ సంఘటనతో ఎన్నికల ప్రచారం నిలిచిపోయింది. అయితే పోలింగ్ దగ్గర పడుతుండటంతో ఆయా పార్టీలు మళ్లీ కార్యకలాపాలు ముమ్మరం చేశాయి. చాంపియన్స్ ట్రోఫీపై ఉగ్రనీడలు: లండన్, వేల్స్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స ట్రోఫీపై ఉగ్రనీడలు కమ్ముకున్నాయి. టోర్నీ ప్రారంభానికి ముందే మాంచెస్టర్ ఘటన జరగడంతో ఆయా దేశాల క్రికెట్ బోర్డులు భయాందోళనలను వ్యక్తం చేశాయి. అయితే ‘భద్రతకు మాదీ గ్యారెంటీ’ అని ఇంగ్లాండ్ క్రికెట్‌బోర్డు హామీ ఇవ్వడంతో సిరీస్ సజావుగా మొదలైంది. కానీ నేటి ఉగ్రదాడితో పరిస్థితి తారుమారయ్యే అవకాశాలు లేకపోలేదు. కీలకమైన ‘పాకిస్థాన్- ఇండియా’ మ్యాచ్‌కు కొద్ది గంటల ముందే ఉగ్రదాడి చోటుచేసుకోవడం క్రీడాభిమానులను కలవరపాటుకు గురిచేసింది. తాజా ఉగ్రదాడి జరిగిన లండన్ నగరానికి.. ఇండో-పాక్ మ్యాచ్ జరిగే బర్మింగ్‌హోమ్ నగరానికి మధ్య దూరం 200 కిలోమీటర్ల పైమాటే అయినా ఏక్షణం ఏంజరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠనెలకొంది. (మాంచెస్టర్ మారణకాండ: భారీ మూల్యం!)