ఎన్నికలవేళ బ్రిటన్‌పై ఉగ్రపంజా
- వరుస ఉగ్రదాడులతో బ్రిటిషర్లు ఉక్కిరిబిక్కిరి
- నేడు లండన్‌లో ఆరుగురు.. మొన్న మాంచెస్టర్‌లో 22 మంది బలి
- చాంపియన్స్ ట్రోఫీపైనా ఉగ్రనీడలు.. జూన్ 8న పోలింగ్
లండన్: మాంచెస్టర్ మారణకాండ నుంచి తేరుకోకముందే బ్రిటన్‌పై ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. సెంట్రల్ లండన్‌లో థేమ్స్ నదిపై ఉన్న ‘లండన్ బ్రిడ్జి’పై ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. వ్యాన్‌ను వేగంగా నడుపుతూ పాదచారులను తొక్కిచంపేశారు. అదే సమయంలో సమీప బారో మార్కెట్ వద్ద కత్తులతో పలువురిని పొడిచి చంపారు. ఈ రెండు ఘటనల్లో కనీసం ఆరుగురు చనిపోగా, పదుల సంఖ్యలో జనం గాయపడినట్లు తెలిసింది. దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను లండన్ పోలీసులు కాల్చిచంపినట్లు సమాచారం.
ఎప్పుడు జరిగింది? శనివారం రాత్రి 10 గంటల సమయంలో వ్యాన్‌ను నడుపుకుంటూ లండన్ బ్రిడ్జిపైకి వచ్చిన ఉగ్రవాదులు.. పాదచారులపైకి వాహనాన్ని ఎక్కించారు. ఆ తర్వాత కొద్ది సేపటికే బ్రిడ్జిని ఆనుకుని ఉన్న బరో మార్కెట్‌లో ఉగ్రవాదులు.. పౌరులను కత్తులతో పొడిచినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఇది ఉగ్రదాడేనని బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే అనుమానం వ్యక్తంచేశారు.
మరికొద్ది గంటల్లో ఎన్నికలు: బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ దేశంలో వరుసగా ఉగ్రదాడులు చోటుచేసుకుంటుండటం బ్రిటిషర్లను కలవరపెడుతోంది. 650 స్థానాలున్న బ్రిటన్ పార్లమెంటుకు జూన్ 8న పోలింగ్ జరగనుంది. ఈ మేరకు పోలీసులు, అధికారగణం ఏర్పాట్లలో తలమునకలైఉన్నారు. ఇదే అదనుగా భావించి ముష్కరులు తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. మే 22న బ్రిటన్ పారిశ్రామిక నగరం మాంచెస్టర్‌లో ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతిదాడిలో 22 మంది చనిపోయారు. ఆ సంఘటనతో ఎన్నికల ప్రచారం నిలిచిపోయింది. అయితే పోలింగ్ దగ్గర పడుతుండటంతో ఆయా పార్టీలు మళ్లీ కార్యకలాపాలు ముమ్మరం చేశాయి.
చాంపియన్స్ ట్రోఫీపై ఉగ్రనీడలు: లండన్, వేల్స్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స ట్రోఫీపై ఉగ్రనీడలు కమ్ముకున్నాయి. టోర్నీ ప్రారంభానికి ముందే మాంచెస్టర్ ఘటన జరగడంతో ఆయా దేశాల క్రికెట్ బోర్డులు భయాందోళనలను వ్యక్తం చేశాయి. అయితే ‘భద్రతకు మాదీ గ్యారెంటీ’ అని ఇంగ్లాండ్ క్రికెట్‌బోర్డు హామీ ఇవ్వడంతో సిరీస్ సజావుగా మొదలైంది. కానీ నేటి ఉగ్రదాడితో పరిస్థితి తారుమారయ్యే అవకాశాలు లేకపోలేదు. కీలకమైన ‘పాకిస్థాన్- ఇండియా’ మ్యాచ్‌కు కొద్ది గంటల ముందే ఉగ్రదాడి చోటుచేసుకోవడం క్రీడాభిమానులను కలవరపాటుకు గురిచేసింది. తాజా ఉగ్రదాడి జరిగిన లండన్ నగరానికి.. ఇండో-పాక్ మ్యాచ్ జరిగే బర్మింగ్‌హోమ్ నగరానికి మధ్య దూరం 200 కిలోమీటర్ల పైమాటే అయినా ఏక్షణం ఏంజరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠనెలకొంది.