లండన్‌లో ఉగ్రదాడి
అండర్‌గ్రౌండ్ రైల్లో ఐఈడీతో భారీ పేలుడు
►రైలు పార్సన్స్ గ్రీన్ స్టేషన్‌కు చేరుకున్న సమయంలో ఘటన
► 22 మందికి గాయాలు.. అప్రమత్తమైన బ్రిటన్
► వివిధ దేశాధినేతల దిగ్భ్రాంతి
లండన్: బ్రిటన్‌పై మళ్లీ ఉగ్రదాడి జరిగింది. శుక్రవారం డిస్ట్రిక్ లైన్ ట్రైన్.. పశ్చిమ లండన్‌లోని పార్సన్స్ గ్రీన్ అండర్‌గ్రౌండ్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న సమయంలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో 22 మందికి గాయాలయ్యాయి. మొదట్లో దీన్ని ప్రమాదంగా భావించినప్పటికీ.. అనంతరం లండన్, స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు దీన్ని ఉగ్రవాదుల బకెట్ బాంబు విస్ఫోటనంగా తేల్చా రు. బకెట్‌లో ఐఈడీ (ఇంప్రువైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్)ను ఉపయోగించి ఈ పేలుళ్లకు పాల్పడ్డారని స్పష్టం చేశారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఘటనాస్థలాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ రూటు గుండా వెళ్లే రైలు సర్వీసులను రద్దుచేశారు. లండన్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇతర దేశాధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఎలా జరిగింది?
లండన్ శివార్లలోని పార్సన్స్ గ్రీన్ అండర్‌గ్రౌండ్ స్టేషన్లో ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం కూడా రద్దీగా ఉంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో డిస్ట్రిక్ లైన్ ట్రైన్ స్టేషన్‌కు వచ్చింది. రద్దీగా ఉండే రైల్లో.. ఎక్కే దిగేవాళ్లతో కోలాహలంగా ఉంది. ఇంతలో.. రైల్లో ఓ మూలన ఉంచిన బకెట్‌లో ఓ కవర్లో పెట్టిన బాంబు భారీశబ్దంతో పేలింది. పేలుడులో ఐఈడీ వినియోగించటంతో బకెట్‌కు సమీపంలో ఉన్న వారికి తీవ్రమైన గాయాలయ్యాయి. వారి ముఖంతోపాటుగా శరీరం కాలిపోయింది. స్టేషన్ నుంచి బయటకు వచ్చిన వారి ముఖాలు, దుస్తులు రక్తంతో తడిసిపోయాయి. ప్రయాణికులు భయంతో బయటకు వెళ్లేందుకు పరుగులు తీశారు. పేలుడుకు కొద్ది సేపటికిముందే.. ఈ బకెట్‌ను చూశామని అందులోనుంచి ఏవో వైర్లు బయటకొచ్చి కనిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
క్షణాల్లోనే అప్రమత్తం
ఘటనా సమాచారం అందుకున్న వెంటనే బ్రిటీష్ ట్రాన్స్‌పోర్టు పోలీస్, లండన్ ఫైర్ బ్రిగేడ్, లండన్ అంబులెన్స్ సర్వీసులు పార్సన్స్ గ్రీన్ స్టేషన్‌కు చేరుకున్నాయి. ఘటనాస్థలం నుంచి 18 మందిని అంబులెన్సుల్లో సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. బ్రిటిష్ ట్రాన్స్‌పోర్టు పోలీస్ విచారణ ప్రారంభించినా.. కాసేపటికే స్కాట్లాండ్ యార్డు ఉగ్రవాద వ్యతిరేక బృందం రంగంలోకి దిగి స్టేషన్‌ను తమ అధీనంలోకి తీసుకుంది.
ఫ్రాన్స్ సైనికుడిపై కత్తితో దాడి
పారిస్: ఫ్రాన్స్‌లో ఉగ్రవాదులను ఏరివేసేందుకు అక్కడి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలతో ఉగ్రవాదులు, ఉగ్ర సానుభూతిపరుల్లో అసహనం మొదలైనట్లు కనబడుతోంది. శుక్రవారం ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో పారిస్‌లోని సెంట్రల్ చాట్‌లెట్ మెట్రో స్టేషన్ సమీపంలో గస్తీలో ఉన్న సైనికుడిపై ఓ వ్యక్తి అల్లా పేరు స్మరిస్తూ.. కత్తితో మెరుపుదాడి చేశాడు. ఆ సైనికుడు వెంటనే అప్రమత్తమై ఆ వ్యక్తిని పట్టుకున్నప్పటికీ.. సైనికుడి చేతికి గాయాలయ్యాయి.
లండన్ అప్రమత్తం
ఉగ్రదాడి ఘటనతో లండన్ అప్రమత్తమైంది. బ్రిటన్ ప్రధాని థెరిసా మే ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి భద్రతా పరిస్థితులను సమీక్షించారు. ఉగ్రదాడి బాధితులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పేలుడుకు ముందు.. బకెట్ నుంచి తక్కువ తీవ్రతతో మంటలు రావటం గమనించినట్లు ప్రత్యక్షసాక్షి ఒకరు తెలిపారు. అటు లండన్ ఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. ఇది ఉగ్రవాదుల పిరికిపంద చర్య అని దుయ్యబట్టారు. ఉగ్రవాదులపై మరింత కఠినంగా వ్యవహరించాలన్నారు.