లండన్‌లో ఉగ్రదాడులు
లండన్: బ్రిటన్ రాజధాని లండన్‌పై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున బరౌ మార్కెట్‌కు చేరువలోని బ్రిడ్జిపై నడుస్తున్న వారిపైకి వ్యాన్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొద్ది సేపటికే ఆయుధాలతో మార్కెట్‌లోకి వచ్చిన ఉగ్రవాదులు కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిపై కత్తులతో దాడి చేశారు.
ఓ బాలికను 15 నుంచి 20 సార్లు కత్తితో పొడుస్తూ అల్లా కోసం ఈ దాడి అంటూ అరిచారు. ఆ తర్వాత మరో ముగ్గరి గొంతు కోసి రక్తపాతం సృష్టించారు. ఉగ్రదాడుల నేపథ్యంలో బ్రిడ్జిని పోలీసులు మూసేశారు. దాడికి పాల్పడిన వారి కోసం వెంటనే ఆపరేషన్ నిర్వహించిన లండన్ పోలీసులు ముగ్గురు ఉగ్ర అనుమానితులను కాల్చి చంపారు.
రెండు ఘటనల్లో మొత్తం ఆరుగురు బ్రిటన్ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. 30 మందికిపైగా తీవ్రగాయాపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై బ్రిటన్ ప్రధాని థెరిసా మే అధికారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. వ్యాన్‌ను వేగంగా పాదచారులపైకి పోనివ్వడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారని, ఆ తర్వాత కొందరు ఉగ్రవాదులు అల్లా కోసం అని అరుస్తు పౌరుల గొంతులు కోశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
లండన్‌లో ఉగ్రదాడులను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఖండించారు. బ్రిటన్‌కు తగిన సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ముస్లిం దేశాలపై బ్యాన్ విధించింది ఇందుకేనంటూ తనను తాను సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. పలువురు ప్రపంచ నాయకులు కూడా లండన్ ఉగ్రదాడులను ఖండించారు. మాంచెస్టర్‌లోని మ్యూజిక్ కన్సర్ట్‌లో మానవ బాంబు దాడి జరిగి రెండు వారాలు కూడా గడవక ముందే మళ్లీ ఉగ్రవాదులు విరుచుకుపడటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కాగా, కన్సర్ట్ దాడి తర్వాత బ్రిటన్‌లో వందల సంఖ్యలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని పోలీసుల రిపోర్టులు వెల్లడించిన విషయం తెలిసిందే.