భారత సంతతికి చెందిన మహిళ లండన్‌లో అనుమానాస్పద స్థితిలో శవమై తేలింది. లండన్‌లోని కారు ట్రంక్‌లో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ప్రాథమిక విచారణ అనంతరం హత్యగా అనుమానిస్తున్న నార్తాంప్టన్‌షైర్ పోలీసులు హర్షిత భర్త పంకజ్ లాంబా కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం అతగాడు దేశం విడిచి పారిపోయినట్లు భావిస్తున్నారు.
హర్షిత బ్రెల్లా (24) మృతదేహాన్ని తూర్పు లండన్‌లోని ఇల్‌ఫోర్డ్‌లోని బ్రిస్బేన్ రోడ్‌లో గురువారం తెల్లవారు జామున వాలెంటైన్స్ పార్క్ ప్రవేశానికి సమీపంలో, ఒక కారు డిక్కీలో గుర్తించారు. ఆమెను భర్తే హత్య చేశాడని అనుమానిస్తున్నారు. రెండు నెలల క్రితం హర్షిత గృహ హింస చట్టం కింద కేసు ఫైల్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఇరుగుపొరుగువారు అందించిన సమాచారం ప్రకారం గత రెండు రోజులుగా హర్షిత ఆందోళనగా కనిపించింది. చనిపోవడానికి ముందు ఇద్దరి మద్యా వాగ్వాదం జరిగిందని, అయితే భార్యాభర్తల వ్యవహారం కాబట్టి తాను పట్టించుకోలేదని ఒక మహిళ వెల్లడించింది. వరుసగా ఇలాంటి ఘర్షణలను తాను గమనించినా కల్పించుకోలేదని, ఇపుడు ఆ బిడ్డ ప్రాణాలే కోల్పోవడం తనకు చాలా బాధగా ఉందని, అసలు దీన్ని నమ్మలేకపోతున్నాను అంటూ హర్షితకు పొరుగున ఉండే కెల్లీ ఫిలిప్ ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు శుక్రవారం నాడు జరిగిన ఫోరెన్సిక్ పోస్టుమార్టం అనంతరం హత్యకు గురైనట్టు నార్త్‌మ్ప్టన్‌షైర్ పోలీస్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ పాల్ క్యాష్ ఆదివారం ధృవీకరించారు. హర్షిత మృతదేహాన్ని నార్తాంప్టన్‌షైర్ నుండి ఇల్‌ఫోర్డ్‌కు కారులో తరలించినట్లు అనుమానిస్తున్నామన్నారు. నిందితుడు దేశం విడిచి పారిపోయాడని భావిస్తున్నాం. అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment