బీరట్: లండన్ భూగర్భ మెట్రోరైలులో జరిగిన బాంబు దాడికి తమదే బాధ్యత అని ఇస్టామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన ఓ అనుబంధ సంస్థ మెట్రో రైలులో బాంబు దాడి నిర్వహించిందని పేర్కొంది. ఈ మేరకు తన 'అమాక్' ప్రొపగండ ఏజెన్సీ ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, ఈ బాంబు దాడి కేసులో అనుమానితుడిగా భావిస్తున్న 18 ఏళ్ల యువకుడిని లండన్ పోలీసులు అరెస్టు చేశారు. తాజా ఉగ్రవాద దాడి నేపథ్యంలో లండన్ నగరానికి తీవ్ర ముప్పు పొంచి ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. నగరంలో హై అలర్ట్ ప్రకటించారు.
శుక్రవారం పశ్చిమ లండన్‌లోని పార్సన్స్ గ్రీన్ అండర్‌గ్రౌండ్ రైల్వే స్టేషన్ వద్ద డిస్ట్రిక్ లైన్ ట్రైన్‌లో భారీ పేలుడు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 22 మందికి గాయాలయ్యాయి. మొదట్లో దీన్ని ప్రమాదంగా భావించినప్పటికీ.. అనంతరం లండన్, స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు దీన్ని ఉగ్రవాదుల బకెట్ బాంబు విస్ఫోటనంగా తేల్చా రు. బకెట్‌లో ఐఈడీ (ఇంప్రువైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్)ను ఉపయోగించి ఈ పేలుళ్లకు పాల్పడ్డారని స్పష్టం చేశారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఘటనాస్థలాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ రూటు గుండా వెళ్లే రైలు సర్వీసులను రద్దుచేశారు. లండన్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.