ఉగ్రవాద భయంతో స్కూల్ పేరు మార్పు
లండన్: ఉగ్రవాద భయంతో లండన్లో మూడేళ్లుగా కొనసాగుతున్న ఓ ప్రత్యేక అవసరాల పిల్లల పాఠశాల పేరును మార్చారు. ఆక్స్ఫర్డ్లోని ది ఐసిస్ అకాడమీ అని పేరుతో ఉన్న పాఠశాలకు కొత్తగా ది ఇఫ్లీ అకాడమీ అని నామకరణం చేశారు. మూడేళ్ల కింద ఆక్స్ ఫర్డ్ నగరంలో ది ఐసిస్ అకాడమీ అనే పాఠశాలను స్థాపించారు. అయితే, ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ను కూడా ఐసిస్ పేరుతో పిలుస్తుండటం ఈ పాఠశాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది.
ఐసిస్ అకాడమీ పేరుతో కొనసాగుతున్న ఈ పాఠశాలలో ఉగ్రవాద శిక్షణ ఇస్తారని కుప్పలుగా రూమర్లు వస్తున్నాయి. అంతేకాకుండా, ఇటీవల పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా ఐసిస్ దాడులకు తెగబడుతుండటం కూడా ఈ ఐసిస్ అకాడమీపై ప్రభావాన్ని చూపెట్టింది. దీంతో తమపై వస్తున్న వదంతుల నుంచి బయటపడేందుకు పాఠశాల యాజమాన్యం తమ పాఠశాల పేరును మార్చుకుంది. ఆటిజం, మానసిక వైకల్యంతోపాటు తదితర ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఈ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఇందులో 132మంది విద్యార్థులు ఉన్నారు. తమ పాఠశాల వాతావరణం గురించి ఒకసారి తెలిస్తే ఇంకెవరు ఉగ్రవాదంలాంటి కామెంట్లు చేయరని స్కూల్ యాజమాన్యం అంటోంది.