లండన్‌లో ఒక వేసవి సాయంత్రం | A summer evening in London | Sakshi
Sakshi News home page

లండన్‌లో ఒక వేసవి సాయంత్రం

Published Mon, Jul 29 2024 4:23 AM | Last Updated on Mon, Jul 29 2024 4:23 AM

A summer evening in London

వసంతంలో ఇంగ్లండ్‌లో ఉండాలన్నాడు కవి. నిజానికి వేసవి మంచి సమయం. బ్రిటన్‌లో ఒక మంచి వేసవి అరుదుగా ఉంటుంది. ఎండలు మండి పోయే వేసవి రోజున ఏ దేశం కూడా బ్రిటన్‌ను తలదన్నలేదు. పచ్చిక మైదానాలలో గొర్రెపిల్లలు ఉల్లాసంగా సంచరిస్తున్నట్లు స్థానికులు ఉద్యానాలకు చేరుకుంటారు. అక్కడ వారు ఆడతారు, సూర్యరశ్మి కింద హుషారుగా గెంతులేస్తారు. మీగడ, పంచదార అద్దిన స్ట్రాబెరీ పండ్లు బ్రిటిష్‌ వారి వేసవి ఆనందాల హరివిల్లులు. వారు ఎండలో ఆనందిస్తారు. అది మండించే ఎండైనా సరే. కానీ మనం దాని నుంచి దాక్కుంటాము. తాజా వేసవి గాలులకు బదులుగా ఎయిర్‌ కండిషనర్‌లకు మొగ్గు చూపుతాము. బ్రిటిషర్లకూ, మనకూ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అది సూక్ష్మంగా తెలియపరుస్తుంది.

ఎండలు మండిపోయే ఒక వేసవి రోజున ఏ దేశం కూడా బ్రిటన్‌ను తలదన్నలేదు. వాతావరణం మాత్రమే కాదు, ఆ ప్రాంతం కూడా దానికై అదే రూపాంతరం చెందుతుంది. నిజానికది రమణీయత. ఎలాగంటే, పచ్చిక మైదానాలలో గొర్రెపిల్లలు ఉల్లాసంగా సంచరిస్తున్నట్లు స్థానికులు ఉద్యానాలకు చేరుకుంటారు. అక్కడ వారు ఆడతారు, సూర్యరశ్మి కింద హుషారుగా గెంతులేస్తారు. మగవాళ్లు సాధారణంగా షార్ట్స్‌లో – తరచూ నడుము పైభాగాన ఒంటిపై బట్టలేమీ లేకుండా – ఉంటారు. ఆడవాళ్లు అంతకంటే తక్కువ దుస్తులతో కనిపించవచ్చు. ఆడా మగా ఇద్దరూ కూడా తమ చుట్టూ ఉన్న ప్రపంచం పట్టనట్లుగా మైమరచి ఉంటారు. 

ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం తర్వాత గత శుక్రవారం అచ్చు ఆ విధంగానే ఉంది. గూగుల్‌ చెబుతున్న దానిని బట్టి ఆ రోజు ఢిల్లీ కన్నా లండనే ఎక్కువగా వేడిగా ఉంది. సాయంత్రం 5 గంటలకు సెయింట్‌ జేమ్స్‌ పార్క్‌లో 32 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా, అదే సమయంలో సఫ్దర్‌జంగ్‌లో ఉన్న వేడి 29 డిగ్రీలు మాత్రమే. ఎప్పుడూ మూతి బిగించుకుని ఉండే అనేకమంది బ్రిటిషర్ల ముఖాలపైకి ఉత్సాహభరితమైన చిరునవ్వును తీసుకురాగల విషయం అది. 
వాస్తవ వైరుద్ధ్యం ఏమిటంటే లండన్‌లోనే వేడి చాలా ఎక్కువగా ఉన్నట్లు మీకనిపిస్తుంది. అందువల్లే నింగిలోని మబ్బులు, తెరిపివ్వని జల్లులు, తడిసిన కాలిబాటలు... అన్నీ జ్ఞాపకాల్లా నిమిషాల్లో మాయమైపోతుంటాయి. మీరు కనుక రీజెంట్‌ స్ట్రీట్‌ లేదా బాండ్‌ స్ట్రీట్‌లో షాపింగ్‌ చేస్తుంటే సూర్యుడి భగభగలు మండించేస్తాయి. రోడ్ల నుంచి, భారీ భవనాల నుంచి వెలువడే వేడి మిమ్మల్ని తన జ్వలించే ఆలింగనంతో చుట్టుముట్టేస్తుంది. 

ఇళ్లు ఉబ్బరిస్తూ ఉంటాయి. మీరెన్ని కిటికీలైనా తెరచి ఉంచండి. లోనికి వచ్చే గాలి మీకు చల్లగా అనిపించదు. ఒంటిపై మీరెంత తక్కువగానైనా దుస్తులు ధరించండి, అయినప్పటికీ ఒంటి నిండా దుస్తులు ఉన్నట్లు అనిపిస్తుంది. ఏదేమైనా, లేశమైనా మేఘఛాయ లేని ఆకాశం స్పష్టమైన నీలివర్ణంలో ప్రకాశిస్తూ (జాన్‌) కాన్‌స్టేబుల్‌ లేదా (జె.ఎం.డబ్లు్య.) టర్నర్‌ (18వ శతాబ్దపు ప్రసిద్ధ బ్రిటన్‌ చిత్రకారులు) గీసిన చిత్రం సజీవంగా కళ్లముందుకు వచ్చినట్లుగా ఉన్నప్పుడు ఎవరు మాత్రం ఇంట్లోనే ఉండిపోవాలనుకుంటారు?   

నేను బస చేసిన చోటు నుండి ఒక రాయి విసురుకు మరికాస్త దూరంలో ఉన్న హాలెండ్‌ పార్క్‌లో ఐస్‌క్రీమ్‌ వ్యాన్‌ చుట్టూ ఒక పెద్ద గుంపు మూగి ఉంది. బాదరబందీ లేని దంపతులు ఆ మైదానంలో నీడ పడుతున్న చోట్లలో విహారయాత్ర చేస్తున్నట్లుగా ఉన్నారు. ప్రతి చోటా పిల్లలు పరుగులు పెడుతూ, కేరింతలు కొడుతూ ఉంటే వారి నవ్వుల ఆనందం ఆ పచ్చిక బయలులో ప్రతిధ్వనిస్తూ ఉంది.  బ్రిటిష్‌ గ్రామీణ ప్రాంతాలలో అద్భుతమైన పుష్పించే ముళ్ల పొదలతో కనుచూపు మేరన ఇరువైపులా సస్యశ్యామలమైన పొలాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంకాస్త దగ్గరగా చూస్తే కనుక స్ట్రాబెర్రీలను తెంపుతున్న యువజనులను మీరు గుర్తించవచ్చు. ఆ పండ్ల బుట్టలు ప్రతిచోటా అమ్మకానికి ఉంటాయి. మీగడ, పంచదార అద్దిన స్ట్రాబెరీ పండ్లు బ్రిటిష్‌ వారి వేసవి ఆనందాల హరివిల్లులు. 

గ్రామీణ ప్రాంతాల్లోని మరొక ఆహ్లాదం – అక్కడొక విలేజ్‌ పబ్  ను సందర్శించటం! ఒక అర లీటరు బిట్టర్స్‌ని (ఒక రకం బీరు)  – బ్రిటిషర్లు పెద్దగా తాగే మనుషులు కారు – కొన్ని ఆలూ చిప్స్‌తో సేవిస్తూ చల్లటి గాలి మీ ముంగురులను కదిలిస్తుండగా ఆ ప్రాంగణంలో కూర్చొని ఉండటం ఒక మరపురాని అనుభూతి. ఇక ఎప్పటికీ అక్కడే ఉండిపోవాలనీ, అదెప్పటికీ ముగియకూడదనీ మీకు అనిపించే అవకాశం ఉంది.      ‘‘ఓహ్‌ టు బి ఇన్‌ ఇంగ్లండ్‌ నౌ దట్‌ స్ప్రింగ్‌ ఈజ్‌ హియర్‌’’ (ఓ! వసంతం వచ్చింది కాబట్టి ఇంగ్లండ్‌లో ఉండాలి) అని మొదట అన్నదెవరూ... కోల్‌రిడ్జా, లేక బ్రౌనింగా? గూగుల్‌ని అడిగితే వాళ్లిద్దరిలో ఎవరైనా కావొచ్చు అని సూచిస్తోంది. నిజానికి వేసవి కాలం మంచి సమయం. కానీ రెండిటినీ (వేసవిని, వసంతాన్ని) కలిపినందుకు బ్రిటిషర్లను మీరు క్షమించవచ్చు. బ్రిటన్‌లో ఒక మంచి వేసవి అరుదుగా ఉంటుంది. గత శుక్రవారం వరకు కూడా ఈ ఏడాది అలాంటి వేసవే లేనట్లుగా ఉండింది.

ఆ సాయంత్రం తాముంటున్న ఎన్నిస్‌మోర్‌ గార్డెన్స్‌ పచ్చికల్లో నాకు ఆతిథ్యం ఇచ్చినవారు తమ అతిథులను కాస్త షాంపేన్‌ను సేవించమని కోరారు. పగలు చల్లబడుతున్న కొద్దీ ఆ పసిడి వర్ణ సాయంకాలపు వెలుగులో ఆ తోటలో ఉండటం అన్నది స్వర్గంలా అనిపించింది. కానీ, పాపం అటువంటి ఆనందాలలో ఇమడలేని మాలోని కొందరు దేశీలు లోపలే ఉండిపోటానికి ఇష్టపడ్డారు. అది బ్రిటిషర్లకూ, మనకూ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని నాకు సూక్ష్మంగా తెలియపరిచింది. వారు ఎండలో ఆనందిస్తారు. తామెంత పొందగలరో అంతా వారు కోరుకుంటారు. అది మండించే ఎండైనా సరే. కానీ మనం దాని నుంచి దాక్కుంటాము. తాజా వేసవి గాలులకు బదులుగా మనం ఎయిర్‌ కండిషనర్‌లకు మొగ్గు చూపుతాము. 

మర్నాడు ఉదయానికి వేసవి ముగిసిపోయింది. మేఘాలు తిరిగి వచ్చాయి. వర్షం మొదలైంది. షార్ట్స్‌ స్థానంలోకి జెర్సీలు వచ్చేశాయి. రివర్స్‌ బేస్‌బాల్‌ క్యాప్‌లను గొడుగులు ఆక్రమించాయి. సందేహం లేదు, మరొక వెచ్చటి ఎండ రోజును బ్రిటన్‌ తిరిగి కొద్ది వారాల తర్వాత చూడవచ్చు. ఆలోపు శరదృతువు... కప్పి ఉంచని మెడలను తన చలి విస్ఫోటాల శ్వాసలతో చుట్టేయవచ్చు. అందుకే వేసవిలో ఒక రోజు నేనక్కడ ఉన్నందుకు సంతోషిస్తున్నాను.   

- వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌
- కరణ్‌ థాపర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement