కన్జర్వేటివ్ పార్టీ ఓటమి ఖాయం
బ్రిటన్ ఎన్నికల సర్వేలో వెల్లడి
లండన్: బ్రిటన్‌లో ఇప్పటికిప్పుడు సాధారణ ఎన్నికలు జరిగితే భారత సంతతికి చెందిన రిషి సునాక్‌తోపాటు ఆయన కేబినెట్‌లోని సగానికి పైగా మంత్రులకు పరాజయం తప్పదని ముందస్తు సర్వేలో తేలింది. అధికార కన్జర్వేటివ్ పార్టీకి 100 పార్లమెంట్ స్థానాలు కూడా దక్కడం గగనమేనని, అదే సమయంలో ప్రతిపక్ష లేబర్ పార్టీ 468 సీట్లు గెలుచుకుని, 286 సీట్ల మెజారిటీ సాధిస్తుందని కూడా అంచనా వేసింది.
బెస్ట్ ఫర్ బ్రిటన్ తరఫున సర్వేషన్ సంస్థ 15,029 మందితో తాజాగా సర్వే జరిపింది. ఇందులో పాల్గొన్న వారిలో 45 శాతం మంది ప్రతిపక్ష లేబర్ పార్టీకే ఓటేశారు.పాయింట్ల వారీగా చూస్తే అధికార కన్జర్వేటివ్ పార్టీ కంటే లేబర్ పార్టీ 19 పాయింట్లు ముందంజలో ఉంది. గత ఏడాది డిసెంబర్‌లో చేపట్టిన పోలింగ్‌తో పోలిస్తే ఇది మూడు పాయింట్లు ఎక్కువ. కన్జర్వేటివ్ పార్టీ 100 లోపే సీట్లు గెలుచుకోవడం, అంటే 250 ఎంపీ స్థానాలను కోల్పోవడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారవుతుందని నిర్వాహకులు విశ్లేషిస్తున్నారు.
సొంత సీటు రిచ్‌మండ్ అండ్ నార్త్‌అల్లెర్టన్‌లో ప్రధాని రిషి సునాక్‌కు లేబర్ పార్టీ కంటే 2.4 శాతం మాత్రమే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి.ఈ పోలింగ్‌లో ఎటు వైపూ మొగ్గు చూపని 15 శాతం మంది ఓట్లను పరిగణనలోకి తీసుకోలేదని ‘సర్వేషన్’తెలిపింది. కన్జర్వేటివ్ పార్టీ పరిస్థితి మున్ముందు మరింత దారుణంగా ఉంటుందని ఓ విశ్లేషకుడు అన్నారు. ఇలా ఉండగా, మే 2వ తేదీన స్థానిక కౌన్సిళ్లు, మేయర్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ పేలవమైన ఫలితాలను సాధించిన పక్షంలో ప్రధాని రిషి సునాక్‌పై సొంత పారీ్టలోనే తిరుగుబాటు రావడం ఖాయమని కూడా అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment