రిషి సునాక్ కోట్లకు పడగలెత్తారు. బ్రిటన్‌లో అత్యంత ధనిక ఎంపీగా రికార్డు సృష్టించారు. రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తిల ఆస్తుల విలువ 73 కోట్ల పౌండ్లకు పైగా ఉంటుందని టైమ్స్ ఆఫ్ లండన్ అంచనా వేసింది. బ్రిటన్‌లో అత్యంత సంపన్నులైన 250 మందిలో రిషి కూడా ఉన్నారు. వీరికి ఉన్న ఆస్తుల విలువ బ్రిటన్ రాచకుటుంబానికి ఉన్న ఆస్తుల కంటే ఎక్కువని అంటారు.
బ్రిటన్ రాజు చార్లెస్–3, కెమిల్లా ఆస్తుల విలువ 300–350 మిలియన్ పౌండ్లు ఉంటే, దానికి రెట్టింపు ఆస్తుల్ని రిషి కలిగి ఉన్నారు. దీంతో అత్యంత ధనికుడైన ప్రధానిగా కూడా రిషి రికార్డు సృష్టించారు. అయితే తన ఆస్తిపాస్తుల గురించి రిషి ఎప్పుడూ బాహాటంగా వెల్లడించలేదు. రిషి లైఫ్‌స్టైల్ కూడా కాస్ట్లీగా ఉంటుంది. 3,500 పౌండ్లు ఖరీదు చేసే సూట్‌లు, 490 పౌండ్లు ఖరీదైన షూస్ వేసుకుంటారు. 180 పౌండ్ల విలువ చేసే మగ్గులో కాఫీ తాగుతారు.
చిన్నప్పట్నుంచి రిషి కుటుంబానికి డబ్బుకి లోటు లేదు. తండ్రి డాక్టర్, తల్లి మందుల దుకాణాన్ని నడిపేవారు. చదువుకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే ఆ కుటుంబం బ్రిటన్‌లో ధనికులు మాత్రమే చదివే వించెస్టర్ కాలేజీలో చేర్పించారు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తిని వివాహం చేసుకున్నాక ఆయన సంపద మరింత పెరిగింది. ఈ దంపతులకి లండన్, యార్క్‌షైర్, ఇంగ్లండ్, శాంటామోనికా, కాలిఫ్‌లో సొంత ఇళ్లు ఉన్నాయి.
రిషి కుటుంబంలో పశ్చిమ లండన్‌లోని కెన్సింగ్‌టన్‌లో అయిదు బెడ్‌రూమ్‌లున్న నివాసంలో ఎక్కువ కాలం గడుపుతారు. ఆ ఇంటి ఖరీదు 70 లక్షల పౌండ్లు ఉంటుంది. ఆయన సొంత నియోజకవర్గమైన రిచ్‌మండ్‌లో 2015లో ఎంపీగా ఎన్నిక కాక ముందు 15 లక్షల పౌండ్లతో ఇల్లు కొన్నారు. ఇప్పుడు మరో 20 లక్షల పౌండ్లతో దానికి హంగులు చేకూరుస్తున్నారు. ఇంటిలోపలే స్విమ్మింగ్ పూల్, జిమ్, యోగా స్టూడియో, హాట్ టబ్, టెన్నిస్ కోర్టు వంటివి ఏర్పాటు చేయడానికి ఏకంగా 4 లక్షల పౌండ్లు ఖర్చు పెట్టారు. అందులో నీళ్లు వేడి చేయడానికే ఏడాదికి 14వేల పౌండ్లు ఖర్చుపెట్టాలి. ఇది ఒక సగటు కుటుంబం విద్యుత్ బిల్లు కంటే ఆరు రెట్లు ఎక్కువ. అక్షతా మూర్తి భారతీయ పౌరురాలిగా కొనసాగుతూ పన్నులు ఎగ్గొట్టారని విమర్శలొచ్చాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment