Britains royal family
-
Rishi Sunak: రిచ్ రిషి.. బ్రిటన్‌లో అత్యంత ధనిక ఎంపీగా రికార్డు
రిషి సునాక్ కోట్లకు పడగలెత్తారు. బ్రిటన్‌లో అత్యంత ధనిక ఎంపీగా రికార్డు సృష్టించారు. రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తిల ఆస్తుల విలువ 73 కోట్ల పౌండ్లకు పైగా ఉంటుందని టైమ్స్ ఆఫ్ లండన్ అంచనా వేసింది. బ్రిటన్‌లో అత్యంత సంపన్నులైన 250 మందిలో రిషి కూడా ఉన్నారు. వీరికి ఉన్న ఆస్తుల విలువ బ్రిటన్ రాచకుటుంబానికి ఉన్న ఆస్తుల కంటే ఎక్కువని అంటారు. బ్రిటన్ రాజు చార్లెస్–3, కెమిల్లా ఆస్తుల విలువ 300–350 మిలియన్ పౌండ్లు ఉంటే, దానికి రెట్టింపు ఆస్తుల్ని రిషి కలిగి ఉన్నారు. దీంతో అత్యంత ధనికుడైన ప్రధానిగా కూడా రిషి రికార్డు సృష్టించారు. అయితే తన ఆస్తిపాస్తుల గురించి రిషి ఎప్పుడూ బాహాటంగా వెల్లడించలేదు. రిషి లైఫ్‌స్టైల్ కూడా కాస్ట్లీగా ఉంటుంది. 3,500 పౌండ్లు ఖరీదు చేసే సూట్లు, 490 పౌండ్లు ఖరీదైన షూస్ వేసుకుంటారు. 180 పౌండ్ల విలువ చేసే మగ్గులో కాఫీ తాగుతారు. చిన్నప్పట్నుంచి రిషి కుటుంబానికి డబ్బుకి లోటు లేదు. తండ్రి డాక్టర్, తల్లి మందుల దుకాణాన్ని నడిపేవారు. చదువుకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే ఆ కుటుంబం బ్రిటన్‌లో ధనికులు మాత్రమే చదివే వించెస్టర్ కాలేజీలో చేర్పించారు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తిని వివాహం చేసుకున్నాక ఆయన సంపద మరింత పెరిగింది. ఈ దంపతులకి లండన్, యార్క్‌షైర్, ఇంగ్లండ్, శాంటామోనికా, కాలిఫ్లో సొంత ఇళ్లు ఉన్నాయి. రిషి కుటుంబంలో పశ్చిమ లండన్‌లోని కెన్సింగ్టన్లో అయిదు బెడ్రూమ్లున్న నివాసంలో ఎక్కువ కాలం గడుపుతారు. ఆ ఇంటి ఖరీదు 70 లక్షల పౌండ్లు ఉంటుంది. ఆయన సొంత నియోజకవర్గమైన రిచ్మండ్లో 2015లో ఎంపీగా ఎన్నిక కాక ముందు 15 లక్షల పౌండ్లతో ఇల్లు కొన్నారు. ఇప్పుడు మరో 20 లక్షల పౌండ్లతో దానికి హంగులు చేకూరుస్తున్నారు. ఇంటిలోపలే స్విమ్మింగ్ పూల్, జిమ్, యోగా స్టూడియో, హాట్ టబ్, టెన్నిస్ కోర్టు వంటివి ఏర్పాటు చేయడానికి ఏకంగా 4 లక్షల పౌండ్లు ఖర్చు పెట్టారు. అందులో నీళ్లు వేడి చేయడానికే ఏడాదికి 14వేల పౌండ్లు ఖర్చుపెట్టాలి. ఇది ఒక సగటు కుటుంబం విద్యుత్ బిల్లు కంటే ఆరు రెట్లు ఎక్కువ. అక్షతా మూర్తి భారతీయ పౌరురాలిగా కొనసాగుతూ పన్నులు ఎగ్గొట్టారని విమర్శలొచ్చాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బ్రిటన్ రాజకుటుంబాన్నీ వదల్లేదు
లలిత్ మోదీ ట్రావెల్ డాక్యుమెంట్లకోసం ఆండ్రూ పేరు వాడుకున్నట్లు కథనాలు లండన్/ వాషింగ్టన్/ భోపాల్ : ఆర్థిక నేరాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ బ్రిటన్ హోంశాఖనుంచి ట్రావెల్ డాక్యుమెంట్లు పొందడానికి బ్రిటన్ యువరాజు చార్లెస్, ఆయన సోదరుడు ఆండ్రూతోపాటు ఇతర రాజ కుటుంబీకుల పేర్లను కూడా వాడుకున్న సంగతి వెలుగులోకి వచ్చింది. ఆదివారం సండేటైమ్స్ అనే పత్రిక ఈ విషయాన్ని బయటపెట్టింది. ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్-2 రెండో కుమారుడు, డ్యూక్ ఆఫ్ యార్క్ ఆండ్రూకు లలిత్ మోదీ చాలా ఏళ్లనుంచి తెలుసునని, మోదీకి ట్రావెల్ డాక్యుమెంట్లు మంజూరు కావడానికి కొద్దిరోజుల ముందు గత ఏడాది జూలైలో లండన్‌లో ఆండ్రూ, మోదీని కలిశారని ఆ పత్రిక వెల్లడించింది. ఇదిలా ఉంటే వీరిద్దరిమధ్య జరిగిన సంభాషణలను వెల్లడించడానికి బకింగ్‌హామ్ ప్యాలెస్ వర్గాలు నిరాకరించాయి. అయితే లలిత్ మోదీకి ట్రావెల్ డాక్యుమెంట్లు ఇప్పించడానికి ఆండ్రూ ఎలాంటి సిఫారసులు చేయలేదని ఆ వర్గాలు స్పష్టంచేశాయి. కాగా, మోదీకి ట్రావెల్ డాక్యుమెంట్లు ఇప్పించడంలో భారత విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ సాయం చేశారన్న విషయం బయటకు రావడం భారత్‌లో తీవ్ర దుమారం సృష్టించిన సంగతి తెలిసిందే. మానవతా దృక్పథంతో మాటసాయం చేశానని సుష్మా చెబుతున్నప్పటికీ ఆమె రాజీనామా చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. స్పందించని జైట్లీ లలిత్ మోదీ వ్యవహారంపై వ్యాఖ్యానించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిరాకరించారు. శనివారం వాషింగ్టన్లో మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం దాటవేశారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు?, లలిత్‌కు సహకరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్తాన్ సీఎం వసుంధర రాజే ఎప్పుడు రాజీనామా చేస్తారు.. అని మీడియా ప్రశ్నలు సంధించగా జైట్లీ సమాధానాలు చెప్పలేదు. అయితే వసుంధర రాజే కుమారుడు, బీజేపీ నేత దుశ్యంత్ సింగ్‌కు లలిత్ మోదీకి మధ్య జరిగిన రూ.11 కోట్ల వాణిజ్య లావాదేవీలు వ్యక్తిగతంగా వారిద్దరికి సంబంధించినవని జైట్లీ పేర్కొన్నారు. చాలా ఏళ్లకిందట వీరిమధ్య బ్యాంకుల ద్వారా చెక్కుల రూపంలో జరిగిన రుణ లావాదేవీలకు ప్రభుత్వానికి ఏం సంబంధం ఉందని జైట్లీ అన్నారు. సుష్మకు మరో తలనొప్పి ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీకి సాయం చేశారన్న అంశంపై ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు ఇప్పుడు మరో తలనొప్పి వచ్చిపడింది. సుష్మ భర్త, ఆమె కూతురిని ప్రభుత్వ లాయర్లుగా మధ్యప్రదేశ్ సర్కారు నియమించడం ఇప్పుడు తాజా వివాదంగా మారింది. అయితే ఇందులో ఎలాంటి తప్పు జరగలేదని, నిబంధనల ప్రకారమే వారి నియామకం జరిగిందని బీజేపీ విపక్షాల విమర్శలను ఖండిస్తోంది.