లండన్: బ్రిటన్ ప్రధాన మంత్రి లిజ్ ట్రస్‌ను గద్దె దించేందుకు ప్రయత్నాలు వేగవంతం అయ్యాయి!. ఈ మేరకు వందకు పైగా కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు.. పార్టీ కమిటీ హెడ్ గ్రాహం బ్రాడీని కలిసి ట్రస్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి లేఖలు సమర్పించనున్నట్లు డెయిలీ మెయిల్ ఒక కథనం ప్రచురించింది.
ప్రధాని లిజ్ ట్రస్‌ను తొలగించే ప్రయత్నాలు మంచివి కాదని.. దాని వల్ల ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుందని డౌనింగ్ స్ట్రీట్(ప్రధాని కార్యాలయం) చేసిన హెచ్చరికలను కన్జర్వేటివ్ చట్టసభ్యులు బేఖాతరు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ డెయిలీ మెయిల్ తన కథనంలో పేర్కొంది. ఈ వారంలోనే ట్రస్‌ను గద్దె దించే ప్రయత్నాలు ఊపందుకోనున్నట్లు తెలిపిన ఆ కథనం.. దానికి ఆధారం ఏంటన్న విషయం మాత్రం వెల్లడించలేదు.
ఆమె సమయం ముగిసింది అని ట్రస్‌కు చెప్పాలని, లేదంటే.. ఆమె నాయకత్వంపై విశ్వాస పరీక్షను తక్షణమే నిర్వహించాలని, ఇందుకోసం రాజకీయ పార్టీ నియమాలను మార్చమని బ్రాడీని ఒత్తిడి తెచ్చేందుకు కన్జర్వేటివ్ ఎంపీలు ప్రయత్నించబోతున్నట్లు డెయిలీ మెయిల్ కథనం పేర్కొంది. యూకే చట్టాల ప్రకారం.. సాంకేతికపరంగా లిజ్ ట్రస్ ప్రధాని పదవికి ఏడాదిపాటు ఎలాంటి ఢోకా ఉండదు. అయితే.. 1922 బ్యాక్‌బెంచ్ ఎంపీల కమిటీ తన రూల్స్ మారిస్తే గనుక ట్రస్‌కు సవాల్ ఎదురుకావొచ్చు. ఒకవేళ తిరుగుబాటు-అవిశ్వాస ప్రయత్నాలే జరిగితే గనుక.. అక్టోబర్ 31వ తేదీన ప్రవేశపెట్టబోయే బడ్జెట్, తదనంతర పరిణామాల దాకా ఓపిక పట్టాలని గ్రాహం బ్రాడీ, ఎంపీలను కోరే అవకాశం కనిపిస్తోంది.
2016లో యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చాక.. బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఈ గ్యాప్‌లో ఏకంగా ముగ్గురు ప్రధానులు గద్దె దిగాల్సి వచ్చింది. ఈ మధ్యే ప్రధాని పగ్గాలు చేపట్టిన లిజ్ ట్రస్.. కిందటి నెలలో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలై గందరగోళానికి దారి తీసింది. ఈ బడ్జెట్‌తో దేశంలో ఆర్థిక మాంద్యం తలెత్తుతుందన్న ఆందోళనలు అధికమయ్యాయి.
ఊహించని ఈ పరిణామాలతో ఏకంగా తన మద్దతుదారు, ఆర్థిక మంత్రి అయిన క్వాసీని పదవి నుంచి తప్పించి.. ఆ స్థానంలో జెరెమీ హంట్‌ను కొత్త ఆర్థిక మంత్రిగా నియమించారామె. ఈ తరుణంలో ట్రస్-జెరెమీ హంట్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ దాకా ఆగాలని గ్రాహం బ్రాడీ కోరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు ది టైమ్స్ సైతం కన్జర్వేటివ్ రెబల్స్.. ట్రస్‌ను తప్పించి ఆ స్థానే మరో నేతను ఎన్నుకునే ప్రయత్నంలో ఉన్నట్లు ఓ కథనం ప్రచురించింది.
ఇదీ చదవండి: బైడెన్ వ్యాఖ్యలతో పాక్ గుస్సా!
Comments
Please login to add a commentAdd a comment