Rishi Sunak Emotional Speech And Personal Note At Final Hustings, Details Inside - Sakshi
Sakshi News home page

చివరి ప్రచార ప్రసంగంలో భావోద్వేగం.. తల్లిదండ్రులు, భార్య గురించి రిషి సునాక్‌ ఏమన్నారంటే..

Published Thu, Sep 1 2022 4:10 PM | Last Updated on Thu, Sep 1 2022 5:04 PM

Rishi Sunak Speech And Personal Note At Final Hustings - Sakshi

లండన్‌: బ్రిటన్‌ ప్రధాని ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. అభ్యర్థుల భారీ ప్రచార కార్యక్రమం కూడా కోలాహలంగా ముగిసింది. బుధవారం రాత్రి లండన్‌ వెంబ్లే వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. లిజ్ ట్రస్- రిషి సునాక్‌లు పోటాపోటీగా తమ వాగ్దాటిని ప్రదర్శించి.. మెప్పించారు. ఫలితం ఎలా ఉండబోతుందో తెలియదుగానీ.. ఈ ప్రచార కార్యక్రమంలో రిషి సునాక్‌కు దక్కిన స్పందన మాత్రం అమోఘంగా ఉంది. ఇక ఈ వేదికగా బ్రిటన్‌ ప్రజలతో పాటు కుటుంబం కోసం కూడా ఓ భావోద్వేగ ప్రకటన చేశారు అభ్యర్థి రిషి సునాక్‌. 

ప్రధాని ఎన్నికల్లో ఉన్న తనకు మద్దతుగా నిలిచినందుకుగానూ తల్లిదండ్రులు, భార్య అక్షతా మూర్తికి కృతజ్ఞతలు తెలియజేశారు రిషి సునాక్‌. ‘‘ఈ ప్రసంగ వేదిక నాకెంతో ప్రత్యేకం. ప్రజా సేవలోకి రావడానికి నన్ను ప్రేరేపించిన నా తల్లిదండ్రులు కూడా ఇక్కడే ఉన్నారు. విలువలు, కఠోర శ్రమ నాకు నేర్పించి.. నాలో నమ్మకాన్ని నింపినందుకు అమ్మానాన్నలకు కృతజ్ఞతలు. కృషి, నమ్మకం మీ ప్రేమతో మన గొప్ప దేశంలో ఎవరైనా సాధించగలిగే వాటికి పరిమితి లేదన్న విషయాన్ని నాకు నేర్పించినందుకు ధన్యవాదాలు అని రిషి పేర్కొన్నారు.

అలాగే భార్య అక్షతను ఉద్దేశిస్తూ..  నా ఉద్దేశ్యం ఏమిటో మీకు తెలుసు. పద్దెనిమిదేళ్ల కిందట.. హైహీల్స్‌ను వదిలేసి.. తగిలించుకునే బ్యాగుతో పొట్టి పిల్లవాడిని ఎంచుకున్నందుకు చాలా కృతజ్ఞుడుని అంటూ సరదాగా మాట్లాడారాయన. ఇక ప్రసంగ సమయంలో ఎదురైన ఓ ప్రశ్నకు బదులిస్తూ.. నేను చేసిన గొప్ప త్యాగం ఏమిటంటే, నేను గత రెండు సంవత్సరాలుగా భయంకరమైన భర్త, తండ్రిగా బాధ్యతలు నిర్వహించాను అంటూ బదులిచ్చారు.

ఇదేం కష్టమైన విషయమా? అని అనిపించొచ్చు. కానీ, ఇది నాకు చాలా కష్టమైన విషయం. ఎందుకంటే నేను నా భార్యాపిల్లలకు ఎక్కువ ప్రేమను పంచలేకపోయాను. దురదృష్టవశాత్తు, గత కొన్ని సంవత్సరాలుగా నేను వాళ్ల జీవితాల్లో నేను ఇష్టపడేంతగా ఉండలేకపోయాను అని చెప్పుకొచ్చారు రిషి సునాక్‌. నేను ప్రజలు వినాలనుకునే విషయాలను చెప్పట్లేదు.. మన దేశం వినాలని నేను నమ్ముతున్న విషయాలను చెప్పాను అని ప్రసంగం చివర్లో రిషి సునాక్‌ పేర్కొన్నారు. ఈయన ప్రసంగం కొనసాగుతున్నంత సేపు అక్కడ కోలాహలం నెలకొనడం విశేషం.


రిషి సునాక్‌-లిజ్ ట్రస్

ఇంగ్లండ్‌లోని సౌతంప్టన్‌ భారత సంతతికి చెందిన డాక్టర్‌(జనరల్‌ ప్రాక్టీషనర్‌) యశ్వీర్‌, తల్లి ఉష ఫార్మసిస్ట్ దంపతులకు జన్మించారు రిషి సునాక్(42)‌. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చదివే సమయంలో ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి-సుధా మూర్తి కూతురైన అక్షతాతో పరిచయం ఏర్పడింది. 2009లో రిషి సునాక్‌-అక్షతా వివాహం జరిగింది.   

కన్జర్వేటివ్ పార్టీ తరపున ప్రధాని అభ్యర్థి ఎవరనేది సోమవారం(సెప్టెంబర్‌ 5న) తేలనుంది. రిషి సునాక్, లిజ్ ట్రస్ ల మధ్య మెరుగైన అభ్యర్థిని తేల్చడానికి 1.75 లక్షల మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఓటింగ్ ప్రక్రియలో శుక్రవారం పాల్గొంటారు. 

చిత్తశుద్ధితో చెబుతున్నా..
దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తానని, బ్రిటన్ ను ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా తీర్చిదిద్దుతానని ప్రతిజ్ఞ చేశారు. ఓ కుటుంబంలా మారదాం, వాణిజ్యాన్ని కొత్తపుంతలు తొక్కిద్దాం. మన భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనడంలో నాకెలాంటి సందేహంలేదు. అయితే, మనం నిజాయతీతో, విశ్వసనీయతతో కూడిన ప్రణాళికతో తాత్కాలిక సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే ఆశించిన అభివృద్ధి సాధ్యమవుతుంది. నా వద్ద కన్జర్వేటివ్ పార్టీ మూలాలు, విలువలతో కూడిన సరైన ప్రణాళిక ఉంది. నేను మొదటి నుంచి స్థిరంగా, చిత్తశుద్ధితో చెబుతున్నాను... మనం ముందు పరిష్కరించాల్సింది ద్రవ్యోల్బణం అంశాన్ని. ప్రజల మద్దతుతోనే ఇది సాధ్యమవుతుంది. తక్కువ పన్నులు, మెరుగైన ఆరోగ్య వ్యవస్థ, సవ్యమైన ఆర్థిక వ్యవస్థ, బ్రెగ్జిట్ ఫలాల సంపూర్ణ సద్వినియోగం, అభివృద్ధి, సమగ్రతల దిశగా పటిష్ఠ పునాది వేసుకోవడానికి ఇదే మార్గం అని ప్రకటించారు భారత సంతతికి చెందిన రిషి సునాక్‌.

ఇదీ చదవండి: గర్భిణి మృతితో ఆరోగ్యమంత్రి రాజీనామా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement