బ్రిటన్ తదుపరి ప్రధాని పీఠం కోసం కన్జర్వేటివ్ పార్టీలో పోటీ మొదలైనప్పుడు హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారతీయ మూలాలున్న రిషి సునాక్ రేసులో వెనుకబడిపోతున్నారు. విదేశాంగ శాఖ మంత్రి లిజ్ ట్రస్ క్రమంగా ప్రధాని పీఠానికి దగ్గరవుతున్నట్టుగా సర్వేలు తేటతెల్లం చేస్తున్నాయి. తాజా సర్వేలో 58% మంది ట్రస్‌కు మద్దతుగా ఉంటే, సునాక్‌కు కేవలం 26% మంది సభ్యుల మద్దతు లభించింది.
12% మంది ఎటూ తేల్చుకోలేదని వెల్లడించారు. ఇలాంటి సమయంలో స్కై న్యూస్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో రిషి సునాక్ అనూహ్యంగా విజయం సాధించడం ఆయనకి నైతికంగా బలం చేకూరింది. అయినప్పటికీ ప్రధాని పీఠం అంత సులభంగా దక్కేలా లేదు. ఇరువురు నేతలు వచ్చే నెలరోజుల్లో కనీసం మరో 10 సార్లు చర్చల్లో పాల్గొనాలి. ప్రధాని పదవికి తాము ఎందుకు అర్హులమో ఆకట్టుకునేలా చెప్పగలగాలి.
దాదాపుగా లక్షా 80 వేల మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల్ని మెప్పించగలగాలి. కోవిడ్ –19, రష్యా–ఉక్రెయిన్ యుద్ధాలతో బ్రిటన్ ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్బణం 9.4శాతానికి చేరుకుంది. ఇంధనం ధరలు ఆకాశాన్నంటడం, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయి ప్రజలు తీవ్ర అసహనంలో బతుకుతున్నారు. ఈ నేపథ్యంలో పన్నుల తగ్గింపు ఎన్నికల ప్రధాన అంశంగా మారింది.
ఇన్నాళ్లూ బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా నెంబర్ టూ స్థానంలో కొనసాగడంతో పాలనాపరంగానూ, ఆర్థిక వ్యవహారాల్లోనూ రిషికి మంచి పట్టు ఉంది. దీంతో ఎంపీలంతా ఆయన వైపే ఉన్నప్పటికీ, టోరీ సభ్యులు ట్రస్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. సెప్టెంబర్ 1న ఎన్నికల బ్యాలెట్ పత్రాలను పార్టీ సభ్యులకు పంపిణీ చేస్తారు. 2న ఓటింగ్ జరుగుతుంది. 5న ఫలితాలు వెల్లడిస్తారు.
రిషి ఎందుకు వెనుకబడ్డారు ?
పన్నుల్లో రాయితీ ఇచ్చి ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడతానని లిజ్ ట్రస్ ఇచ్చిన హామీతో ఒక్కసారిగా ఆమె హవా పెరిగింది. ఆదాయ పన్నులో కూడా రాయితీ ఇస్తానని ప్రకటించడం, రిషి ఆర్థిక విధానాలకు పూర్తి వ్యతిరేకంగా ఆమె మాట్లాడడంతో వారి మధ్య పోటీ పెరిగింది. రిషితో పోల్చి చూస్తే ఎంపీల మద్దతు తక్కువగా ఉన్నప్పటికీ తర్వాత చేస్తున్న ప్రచారంలో వివిధ అంశాలపై ఆమె ఇస్తున్న హామీలు సభ్యుల్ని ఆకర్షిస్తున్నాయి.
రిషిపై ఆగ్రహంతో ఉన్న బోరిస్ జాన్సన్ తెర వెనుక నుంచి లిజ్ ట్రస్‌కు మద్దతునిస్తున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది. చర్చా కార్యక్రమాల్లో లిజ్ ట్రస్ మాజీ ప్రధాని థాచర్‌ను తలపించే ఆహార్యంతో ఉండడం, ఆదాయ పన్ను రాయితీ వంటి ఆకర్షణీయ పథకాలు ప్రకటిస్తున్నారు. ట్రస్ స్థానికురాలు కావడం, రిషి తాను హిందూ మతాన్నే ఆచరిస్తానని బహిరంగంగా చెబుతూ ఉండడం కూడా ఆయనకు మైనస్‌గా మారింది.
రిషి జీవన విధానం చాలా లావిష్‌గా ఉంటుంది. దేశం ద్రవ్యోల్బణంతో అతలాకుతలమవుతున్న సమయంలో ఆయన 500 పౌండ్ల షూ వేసుకోవడం, కోట్ల ఖర్చుతో ఆధునిక వసతులతో ఇల్లు నిర్మించడం, భార్య అక్షతా మూర్తి విదేశీ కార్డుని అడ్డం పెట్టుకొని పన్నులు ఎగ్గొట్టడం వంటివి రిషిపై వ్యతిరేకతను పెంచాయి. అయితే కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక మంత్రిగా ఆయన తీసుకున్న చర్యల్ని ప్రశంసిస్తున్న వారూ ఉన్నారు. వివిధ అంశాలపై వీరిద్దరి వైఖరి..
– నేషనల్ డెస్క్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment