News Survey
-
UK PM Race: ఎవరెంత దూరం? బ్రిటన్ తదుపరి ప్రధానిపై ఉత్కంఠ
బ్రిటన్ తదుపరి ప్రధాని పీఠం కోసం కన్జర్వేటివ్ పార్టీలో పోటీ మొదలైనప్పుడు హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారతీయ మూలాలున్న రిషి సునాక్ రేసులో వెనుకబడిపోతున్నారు. విదేశాంగ శాఖ మంత్రి లిజ్ ట్రస్ క్రమంగా ప్రధాని పీఠానికి దగ్గరవుతున్నట్టుగా సర్వేలు తేటతెల్లం చేస్తున్నాయి. తాజా సర్వేలో 58% మంది ట్రస్‌కు మద్దతుగా ఉంటే, సునాక్‌కు కేవలం 26% మంది సభ్యుల మద్దతు లభించింది. 12% మంది ఎటూ తేల్చుకోలేదని వెల్లడించారు. ఇలాంటి సమయంలో స్కై న్యూస్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో రిషి సునాక్ అనూహ్యంగా విజయం సాధించడం ఆయనకి నైతికంగా బలం చేకూరింది. అయినప్పటికీ ప్రధాని పీఠం అంత సులభంగా దక్కేలా లేదు. ఇరువురు నేతలు వచ్చే నెలరోజుల్లో కనీసం మరో 10 సార్లు చర్చల్లో పాల్గొనాలి. ప్రధాని పదవికి తాము ఎందుకు అర్హులమో ఆకట్టుకునేలా చెప్పగలగాలి. దాదాపుగా లక్షా 80 వేల మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల్ని మెప్పించగలగాలి. కోవిడ్ –19, రష్యా–ఉక్రెయిన్ యుద్ధాలతో బ్రిటన్ ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్బణం 9.4శాతానికి చేరుకుంది. ఇంధనం ధరలు ఆకాశాన్నంటడం, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయి ప్రజలు తీవ్ర అసహనంలో బతుకుతున్నారు. ఈ నేపథ్యంలో పన్నుల తగ్గింపు ఎన్నికల ప్రధాన అంశంగా మారింది. ఇన్నాళ్లూ బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా నెంబర్ టూ స్థానంలో కొనసాగడంతో పాలనాపరంగానూ, ఆర్థిక వ్యవహారాల్లోనూ రిషికి మంచి పట్టు ఉంది. దీంతో ఎంపీలంతా ఆయన వైపే ఉన్నప్పటికీ, టోరీ సభ్యులు ట్రస్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. సెప్టెంబర్ 1న ఎన్నికల బ్యాలెట్ పత్రాలను పార్టీ సభ్యులకు పంపిణీ చేస్తారు. 2న ఓటింగ్ జరుగుతుంది. 5న ఫలితాలు వెల్లడిస్తారు. రిషి ఎందుకు వెనుకబడ్డారు ? పన్నుల్లో రాయితీ ఇచ్చి ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడతానని లిజ్ ట్రస్ ఇచ్చిన హామీతో ఒక్కసారిగా ఆమె హవా పెరిగింది. ఆదాయ పన్నులో కూడా రాయితీ ఇస్తానని ప్రకటించడం, రిషి ఆర్థిక విధానాలకు పూర్తి వ్యతిరేకంగా ఆమె మాట్లాడడంతో వారి మధ్య పోటీ పెరిగింది. రిషితో పోల్చి చూస్తే ఎంపీల మద్దతు తక్కువగా ఉన్నప్పటికీ తర్వాత చేస్తున్న ప్రచారంలో వివిధ అంశాలపై ఆమె ఇస్తున్న హామీలు సభ్యుల్ని ఆకర్షిస్తున్నాయి. రిషిపై ఆగ్రహంతో ఉన్న బోరిస్ జాన్సన్ తెర వెనుక నుంచి లిజ్ ట్రస్‌కు మద్దతునిస్తున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది. చర్చా కార్యక్రమాల్లో లిజ్ ట్రస్ మాజీ ప్రధాని థాచర్‌ను తలపించే ఆహార్యంతో ఉండడం, ఆదాయ పన్ను రాయితీ వంటి ఆకర్షణీయ పథకాలు ప్రకటిస్తున్నారు. ట్రస్ స్థానికురాలు కావడం, రిషి తాను హిందూ మతాన్నే ఆచరిస్తానని బహిరంగంగా చెబుతూ ఉండడం కూడా ఆయనకు మైనస్‌గా మారింది. రిషి జీవన విధానం చాలా లావిష్‌గా ఉంటుంది. దేశం ద్రవ్యోల్బణంతో అతలాకుతలమవుతున్న సమయంలో ఆయన 500 పౌండ్ల షూ వేసుకోవడం, కోట్ల ఖర్చుతో ఆధునిక వసతులతో ఇల్లు నిర్మించడం, భార్య అక్షతా మూర్తి విదేశీ కార్డుని అడ్డం పెట్టుకొని పన్నులు ఎగ్గొట్టడం వంటివి రిషిపై వ్యతిరేకతను పెంచాయి. అయితే కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక మంత్రిగా ఆయన తీసుకున్న చర్యల్ని ప్రశంసిస్తున్న వారూ ఉన్నారు. వివిధ అంశాలపై వీరిద్దరి వైఖరి.. – నేషనల్ డెస్క్, సాక్షి -
రిపోర్టర్‌పై దాడి ఘటనలో ముగ్గురి అరెసు
నిజామాబాద్‌అర్బన్: ‘సాక్షి’దినపత్రిక మాక్లూర్ విలేకరి కమలాపురం పోశెట్టిపై జరిగిన దాడి ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. వార్తల సేకరణ కోసం వెళ్తుండగా మాక్లూర్ మండల రిపోర్టర్ పోశెట్టిపై ఈ నెల 13న వల్లభాపూర్ వద్ద ముగ్గురు దుండగులు ఇనుప రాడ్లతో దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను నిరసిస్తూ, పోలీసుల వ్యవహార శైలికి నిరసనగా జర్నలిస్టులు వరుస ఆందోళనలు చేపట్టారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసి విన్నవించడంతో పాటు చలో మాక్లూర్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తులో వేగం పెంచారు. రిపోర్టర్‌పై దాడి ఘటనలో మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేశామని, ఇందులో ముగ్గురిని ఇప్పటికే అరెస్టు చేసినట్లు నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రిపోర్టర్ పోశెట్టి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి, బ్రిలియంట్ స్కూల్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించినట్లు వివరించారు. దాడికి పాల్పడిన కె.సురేశ్, మహమ్మద్మోసిన్, ప్రసాద్‌లపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు చెప్పారు. అలాగే, బాధితుడి ఫిర్యాదు మేరకు దాడికి ప్రేరేపించిన మహేందర్, రంజిత్లపైనా కేసు పెట్టినట్లు పేర్కొన్నారు. అలాగే, అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశామని, కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు. -
3 వారాల కనిష్టస్థాయికి బంగారం ధర
ముంబై: పుత్తడికి పెట్టుబడుల డిమాండ్ లేకపోవడంతో అటు అంతర్జాతీయ మార్కెట్లోనూ, ఇటు దేశీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు వరుసగా మూడు వారాల కనిష్టస్థాయికి పడిపోయాయి. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలతో బంగారు కొనుగోళ్లు క్షీణించాయి. సాధారణంగా తక్కువ వడ్డీ రేట్ల ఉంటే బంగారు కొనుగోలు చేసేవారి సంఖ్య పెరుగుతుంది. దీంతో బంగారు డిమాండ్ పెరుగుతుంది. మే 29తో ముగిసిన వారంలో అంతక్రితం వారంతో పోలిస్తే దేశీయంగా 22 క్యారెట్ల బంగారంపై 10 గ్రాములకు రూ. 105 తగ్గి రూ.27,225 కు చేరింది. వెండి ధర కిలోకి రూ.175 తగ్గి రూ.38,400 గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 1 శాతం క్షీణించి ఔన్సుకు 1189 డాలర్ల వద్ద క్లోజయ్యింది. -
ఈ వారంలో...బంగారం పెరగొచ్చు!
అమెరికా డాలరు పటిష్టంగా వున్నప్పటికీ, ఈ వారం బంగారం ధరలు పెరగొచ్చని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ప్రసిద్ధ కమోడిటీ వెబ్సైట్ కిట్కో న్యూస్ సర్వేలో పాల్గొన్న 20 మంది నిపుణుల్లో 13 మంది ఈ వారం పుత్తడి ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు. జూన్ 3న యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ల నిర్ణయం, 4న బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్ల నిర్ణయం, 5న అమెరికా ఉద్యోగ గణాంకాలు బంగారం రేట్లను ప్రభావితం చేస్తాయని వారు అంటున్నారు. అలాగే పుత్తడి కొనుగోళ్ల నుంచి షేర్మార్కెట్వైపు మళ్లిన చైనా పరిణామాలను బులియన్ ట్రేడర్లు గమనిస్తున్నారు. గతవారం ఒకేరోజున చైనా మార్కెట్ 6.5 శాతం పతనమైనందున, బంగారం పెట్టుబడులకు చైనా ఇన్వెస్టర్లు తిరిగి వస్తారా లేక ఈక్విటీల్లోనే వారు పెట్టుబడుల్ని కొనసాగిస్తారా అనే అంశం ప్రపంచ బులియన్ మార్కెట్లో నలుగుతోంది. మరోవైపు కిట్కో ఆన్లైన్ సర్వే నిర్వహించగా 45 శాతంమంది ఈ వారం బంగారం ధరలు అధికంగా వుంటాయని పేర్కొన్నారు. 35 శాతం మంది తగ్గుతాయని, 20 శాతంమంది మార్పేమీ వుండదని పేర్కొన్నారు. వరుసగా రెండోవారం తగ్గిన పుత్తడి.. పుత్తడికి పెట్టుబడుల డిమాండ్ లేకపోవడంతో అటు అంతర్జాతీయ మార్కెట్లోనూ, ఇటు దేశీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు వరుసగా రెండో వారంలోనూ తగ్గాయి. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలతో బంగారు కొనుగోళ్లు క్షీణించాయి. సాధారణంగా తక్కువ వడ్డీ రేట్ల ఉంటే బంగారు కొనుగోలు చేసేవారి సంఖ్య పెరుగుతుంది. దీంతో బంగారు డిమాండ్ పెరుగుతుంది. మే 29తో ముగిసిన వారంలో అంతక్రితం వారంతో పోలిస్తే దేశీయంగా బంగారం ధర 10 గ్రాములకు (99.5 ప్యూరిటి) రూ.205 తగ్గి రూ.26,900కు చేరింది. 99.9 ప్యూరిటి పుత్తడి రూ.205 తగ్గి రూ.27,050గా ఉంది. వెండి ధర కిలోకి రూ.550 తగ్గి రూ.38,765గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 1 శాతం క్షీణించి ఔన్సుకు 1189 డాలర్ల వద్ద క్లోజయ్యింది.