ఈ వారంలో...బంగారం పెరగొచ్చు!
అమెరికా డాలరు పటిష్టంగా వున్నప్పటికీ, ఈ వారం బంగారం ధరలు పెరగొచ్చని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ప్రసిద్ధ కమోడిటీ వెబ్‌సైట్ కిట్కో న్యూస్ సర్వేలో పాల్గొన్న 20 మంది నిపుణుల్లో 13 మంది ఈ వారం పుత్తడి ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు. జూన్ 3న యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ల నిర్ణయం, 4న బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్ల నిర్ణయం, 5న అమెరికా ఉద్యోగ గణాంకాలు బంగారం రేట్లను ప్రభావితం చేస్తాయని వారు అంటున్నారు.
అలాగే పుత్తడి కొనుగోళ్ల నుంచి షేర్‌మార్కెట్‌వైపు మళ్లిన చైనా పరిణామాలను బులియన్ ట్రేడర్లు గమనిస్తున్నారు. గతవారం ఒకేరోజున చైనా మార్కెట్ 6.5 శాతం పతనమైనందున, బంగారం పెట్టుబడులకు చైనా ఇన్వెస్టర్లు తిరిగి వస్తారా లేక ఈక్విటీల్లోనే వారు పెట్టుబడుల్ని కొనసాగిస్తారా అనే అంశం ప్రపంచ బులియన్ మార్కెట్లో నలుగుతోంది. మరోవైపు కిట్కో ఆన్‌లైన్ సర్వే నిర్వహించగా 45 శాతంమంది ఈ వారం బంగారం ధరలు అధికంగా వుంటాయని పేర్కొన్నారు. 35 శాతం మంది తగ్గుతాయని, 20 శాతంమంది మార్పేమీ వుండదని పేర్కొన్నారు.
వరుసగా రెండోవారం తగ్గిన పుత్తడి..
పుత్తడికి పెట్టుబడుల డిమాండ్ లేకపోవడంతో అటు అంతర్జాతీయ మార్కెట్లోనూ, ఇటు దేశీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు వరుసగా రెండో వారంలోనూ తగ్గాయి. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలతో బంగారు కొనుగోళ్లు క్షీణించాయి. సాధారణంగా తక్కువ వడ్డీ రేట్ల ఉంటే బంగారు కొనుగోలు చేసేవారి సంఖ్య పెరుగుతుంది. దీంతో బంగారు డిమాండ్ పెరుగుతుంది. మే 29తో ముగిసిన వారంలో అంతక్రితం వారంతో పోలిస్తే దేశీయంగా బంగారం ధర 10 గ్రాములకు (99.5 ప్యూరిటి) రూ.205 తగ్గి రూ.26,900కు చేరింది. 99.9 ప్యూరిటి పుత్తడి రూ.205 తగ్గి రూ.27,050గా ఉంది. వెండి ధర కిలోకి రూ.550 తగ్గి రూ.38,765గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 1 శాతం క్షీణించి ఔన్సుకు 1189 డాలర్ల వద్ద క్లోజయ్యింది.