
అంతర్జాతీయంగా బంగారం ధరలు అంతే లేకుండా పెరిగిపోతున్నాయి. ఇటీవల కొన్ని నెలలుగా రికార్డు గరిష్టాలకు చేరుకున్న బంగారం ధర ఇన్వెస్టర్లకు వరంగా ఉన్నా, ఆభరణాలు కొనుగోలు చేసే వినియోగదారులకు మాత్రం భారంగా మారింది. అయితే ఇది ఎంతో కాలం ఉండదని, త్వరలోనే బంగారం ధరలు భారీగా పడిపోయే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. బంగారం ధరలు దాదాపు 40 శాతం తగ్గుతాయని కొన్ని అంచనాలు వెలువడ్డాయి.
అమెరికాకు చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ మార్నింగ్‌స్టార్‌లో మార్కెట్ స్ట్రాటజిస్ట్ జాన్ మిల్స్ బంగారం ధర ఔన్స్‌కు 1,820 డాలర్లకు పడిపోవచ్చని అంచనా వేశారు. ప్రస్తుతం (ఏప్రిల్ 2) ఒక ఔన్స్ పసిడి ధర 3,123 డాలర్ల వద్ద ఉంది. భారత్‌లో (ఢిల్లీ) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.92,990 వద్ద, 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.85,250 వద్ద ఉంది. ఇదే అంచనా నిజమైతే బంగారం ధరలు భారీగా దిగొస్తాయి.
భౌగోళిక రాజకీయ అనిశ్చితి, ఆర్థిక అస్థిరత, ద్రవ్యోల్బణ ఆందోళనల కలయికతో బంగారం ఇటీవల పుంజుకుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ మార్కెట్లలో ఒడిదుడుకులకు భయపడి ఇన్వెస్టర్లు సురక్షిత స్వర్గధామంగా బంగారం వైపు మొగ్గు చూపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాలనలో కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు ఈ ఆందోళనలను మరింత తీవ్రతరం చేశాయి. బంగారానికి డిమాండును మరింత పెంచాయి.
తగ్గేందుకు చెబుతున్న కారణాలు
బంగారానికి ప్రస్తుత బుల్లిష్ ట్రెండ్ కొనసాగుతోంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా, గోల్డ్ మన్ శాక్స్ వంటి ప్రధాన ఆర్థిక సంస్థలు బంగారంపై బుల్లిష్ గా ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో బంగారం ధర ఔన్స్‌కు 3,500 డాలర్లకు చేరుకోవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా వేయగా, గోల్డ్‌మన్ శాక్స్ ఈ ఏడాది చివరి నాటికి ఔన్స్ ధర 3,300 డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. అయితే ఇందుకు భిన్నంగా మిల్స్‌తోపాటు మరికొందరు విశ్లేషకులు బంగారం ధరలలో గణనీయమైన తగ్గుదల వస్తుందని భావిస్తున్నారు. అందుకు కొన్ని కారణాలను పేర్కొంటున్నారు.
పెరిగిన సరఫరా: ప్రపంచవ్యాప్తంగా బంగారం సరఫరా వేగంగా పెరుగుతోంది. 2024 రెండో త్రైమాసికంలో గోల్డ్ మైనింగ్ లాభాలు ఔన్స్‌కు 950 డాలర్లకు చేరుకున్నాయి. ఇది ఉత్పత్తిని పెంచింది. ప్రపంచ బంగారు నిల్వలు 9% పెరిగి 2,16,265 టన్నులకు చేరుకున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా తన బంగారం ఉత్పత్తిని పెంచగా, పాత బంగారం రీసైక్లింగ్ కూడా పెరిగింది. ఇది మరింత సరఫరాను జోడించింది.
డిమాండ్ తగ్గే సంకేతాలు: సెంట్రల్ బ్యాంకులు, ఇన్వెస్టర్లు దూకుడుగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నప్పటికీ, ఈ ధోరణి కొనసాగకపోవచ్చని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. గత ఏడాది సెంట్రల్ బ్యాంకులు 1,045 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయగా, వరుసగా మూడో ఏడాది 1,000 టన్నులకు పైగా కొనుగోళ్లు జరిగాయి. అయితే 71% కేంద్ర బ్యాంకులు తమ బంగారు నిల్వలను పెంచుకోకూడదని భావిస్తున్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సర్వే కనుగొంది.
మార్కెట్ సంతృప్తత: పసిడి పరిశ్రమలో విలీనాలు, కొనుగోళ్లు పెరగడం తరచుగా మార్కెట్ గరిష్టాలను సూచిస్తుంది. 2024 లో, బంగారం రంగంలో డీల్ మేకింగ్ 32% పెరిగింది. ఇది మార్కెట్ వేడెక్కవచ్చని సూచిస్తుంది. అంతేకాకుండా, బంగారం ఆధారిత ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) పెట్టుబడులలో ఇటీవలి పెరుగుదల బంగారం ధరలు పుంజుకోకముందుటి పరిస్థితులకు దగ్గర ఉండటం ధరల పతనం తక్షణమే ఉండవచ్చనే వాదనలను బలపరుస్తోంది.