Liz Truss In Danger Of Becoming Shortest Serving UK Prime Minister, Details Inside - Sakshi
Sakshi News home page

ఆర్థిక విధానంపై అప్పుడే యూ టర్న్‌.. చిక్కుల్లో బ్రిటన్‌ ప్రధాని

Published Sun, Oct 16 2022 4:27 AM | Last Updated on Sun, Oct 16 2022 11:57 AM

Liz Truss in danger of becoming shortest-serving UK Prime Minister - Sakshi

దాదాపు నెలన్నర క్రితం సంగతి. సెప్టెంబర్‌ 5న భారత సంతతికి చెందిన మాజీ మంత్రి రిషి సునాక్‌ను ఓడించి లిజ్‌ ట్రస్‌ బ్రిటన్‌ ప్రధాని పీఠమెక్కారు. అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోయిన జీవన వ్యయాన్ని తగ్గిస్తానని, చుక్కలనంటుతున్న ఇంధన ధరలకు ముకుతాడు వేస్తానని, కట్టు తప్పుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతానని ప్రకటించారు. ‘చేసి చూపిస్తా’మంటూ ప్రతిజ్ఞ చేశారు. కానీ నెల రోజుల్లోనే అన్నివైపుల నుంచీ ఆమెకు గట్టిగా సెగ తగులుతోంది.

ఆర్థిక వ్యవస్థను పట్టాలకెక్కించేందుకు ఆమె ప్రతిపాదించిన విధానాలన్నీ ద్రవ్యోల్బణ కట్టడిలో ఒక్కొక్కటిగా విఫలమవుతున్నాయి. ట్రస్‌ తొలి మినీ బడ్జెట్‌ అన్ని వర్గాల్లోనూ తీవ్ర విమర్శల పాలైంది. ప్రధానంగా కార్పొరేషన్‌ ట్యాక్స్‌ను 19 శాతానికి తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని దాన్ని ఎప్పట్లా 25 శాతంగానే కొనసాగిస్తామంటూ యూ టర్న్‌ తీసుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామాలన్నీ కన్జర్వేటివ్‌ నేతలు, ఎంపీలను బాగా కలవరపెడుతున్నాయి.

వారిలో ట్రస్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని బ్రిటిష్‌ మీడియా పేర్కొంటోంది. ఆర్థిక మంత్రిపై ఇప్పటికే వేటు పడింది. ప్రధాని మార్పు కూడా అనివార్యమని ఎంపీల్లో అత్యధికులు భావిస్తున్నారని చెబుతోంది. సమస్యలను చక్కదిద్దడంలో, సొంత పార్టీ నేతల విశ్వాసాన్ని నిలుపుకోవడంలో విఫలమవుతున్న ట్రస్‌ ఏ క్షణమైనా తప్పుకోవాల్సి రావచ్చంటున్నారు! ఆమె రాజీనామాకు టోరీ ఎంపీలు త్వరలో బహిరంగ పిలుపు ఇచ్చే అవకాశముందని బ్రిటిష్‌ మీడియాలో వార్తలొస్తున్నాయి!!

ఆరేళ్లు, నలుగురు ప్రధానులు
ఆరేళ్లుగా అధికార కన్జర్వేటివ్‌ పార్టీకి అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగడంపై 2016లో బ్రెగ్జిట్‌ రిఫరెండం నిర్వహించినప్పటి నుంచి ఏకంగా నలుగురు ప్రధానులు మారారు! 2016లో డేవిడ్‌ కామెరాన్‌ తప్పుకుని థెరెసా మే ప్రధాని అయ్యారు. కానీ బ్రెగ్జిట్‌ ఒప్పందంపై ప్రతిష్టంభన ఆమె పీఠానికి ఎసరు పెట్టింది. 2019లో బోరిస్‌ జాన్సన్‌ పగ్గాలు చేపట్టారు. మూడేళ్లయినా నిండకుండానే ఆయనా అనేకానేక వివాదాల్లో చిక్కుకున్నారు. దాంతో అయిష్టంగానే గత జూలైలో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడిక ట్రస్‌ వంతు కూడా వచ్చినట్టేనంటూ ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఆర్థిక విధానాలపై యూ టర్న్‌ తీసుకోవడం ఆమెకు అప్రతిష్ట తెచ్చిపెట్టిందంటున్నారు.    

ఇవీ ‘తప్పు’టడుగులు...
► ఆర్థిక మంత్రిగా తొలిసారిగా నల్ల జాతీయుడైన క్వాసీ క్వార్టెంగ్‌ను ట్రస్‌ ఎంచుకున్నారు. పౌరుల నివాస పన్నులు, ఇంధన ఖర్చులను తగ్గించడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రతిష్టంభనను వదిలించేందుకు ఆయన ప్రకటించిన మినీ బడ్జెట్‌ పూర్తిగా బెడిసికొట్టింది. ఏకంగా 4,500 కోట్ల పౌండ్ల మేరకు పన్ను తగ్గింపులను ప్రకటించారు. ద్రవ్యోల్బణం చుక్కలనంటుతున్న వేళ ఇది ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేస్తుందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. బ్రిటన్‌ కరెన్సీ పౌండ్‌ విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది.

► తొలుత ఆర్థిక మంత్రి నిర్ణయాన్ని సమర్థించిన ట్రస్, కొద్ది రోజులకే యూ టర్న్‌ తీసుకుంటూ అత్యధిక స్థాయి ఆదాయ పన్ను రేటు తగ్గింపును రద్దు చేయడం వివాదానికి దారితీసింది. పైగా ఇది సొంత పార్టీలోనూ ఆమెపై తీవ్ర అసంతృప్తికి దారి తీయడంతో ఎటూ పాలుపోక క్వాసీని తప్పించి జెరెమీ హంట్‌కు ఆర్థిక శాఖ అప్పగించారు. రిషి పన్నుల పెంపు ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించిన ఆమె, ఇప్పుడు ఆయన బాటలోనే నడవడాన్ని అసమర్థతగానే అంతా భావిస్తున్నారు.


రిషివైపే టోరీ ఎంపీల మొగ్గు?
ట్రస్‌ తప్పుకుంటే తదుపరి ప్రధానిగా రిషి పేరే ప్రముఖంగా విన్పిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనే సమర్థ ప్రత్యామ్నాయమని కన్జర్వేటివ్‌ ఎంపీలు భావిస్తున్నట్టు బ్రిటిష్‌ మీడియా చెబుతోంది. రిషీని ప్రధానిగా, పెన్నీ మోర్డంట్‌ను ఆయనకు డిప్యూటీగా నియమించే ఆలోచన సాగుతోందంటున్నారు. లేదంటే మోర్డంట్‌ ప్రధానిగా, రిషి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టొచ్చని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. చివరికి మళ్లీ బోరిస్‌ జాన్సనే తిరిగొచ్చినా ఆశ్చర్యం లేదంటున్న వాళ్లూ ఉన్నారు!

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement