దీర్ఘకాలిక వృద్ధిని పెంచగలదా? | India is one of the fastest growing economies | Sakshi
Sakshi News home page

దీర్ఘకాలిక వృద్ధిని పెంచగలదా?

Published Wed, Jul 31 2024 4:27 AM | Last Updated on Wed, Jul 31 2024 4:27 AM

India is one of the fastest growing economies

2023–24 ఆర్థిక సంవత్సరంలో, ఆర్థిక వ్యవస్థ 8.2 శాతం వృద్ధి చెందింది. తద్వారా పెద్ద ఆర్థిక వ్యవస్థలలో భారత్‌ అత్యంత వేగంగా ముందుకు సాగు తున్న దేశంగా నిలబడింది. దీన్నిబట్టి, గత పదేళ్లలో సాధించినదాని పట్ల కేంద్ర ప్రభుత్వం సంతృప్తిగా ఉన్నట్టుంది! కానీ అధిక వృద్ధి ఫలాలను పెద్ద సంఖ్యలో ప్రజలు పొందుతున్నారా? 

బడ్జెట్‌ రూపకల్పన వారికి అనుగుణంగా జరిగిందా? వృద్ధి ఊపందుకున్నప్పటికీ, పేదరికం కారణంగా వినియోగ డిమాండ్‌ తక్కువగానే ఉంది. ఈ వృద్ధి నిలకడగా ఉండాలంటే, కార్మికులు మెరుగైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. హ్రస్వ దృష్టితో చూస్తే బడ్జెట్‌ వాస్తవికంగానే కనబడుతుంది. కానీ దీర్ఘకాలిక వృద్ధిని నిర్ధారించే అంశాలను అది పరిష్కరించకుండా వదిలేసింది.

ప్రతి సంవత్సరం, ఆర్థిక సర్వే, బడ్జెట్‌లను ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటి సమ ర్పిస్తుంది. ఈ సర్వే ద్వారా ఆర్థిక వ్యవస్థ ఎలా దూసుకు పోతోందో వివరించేందుకు ప్రయత్నిస్తుంది. బడ్జెట్‌ ద్వారా, తన మనస్సులో ఏ కార్యాచరణ ప్రణాళిక ఉందో వివరించడానికి ప్రయ త్నిస్తుంది. రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ రెండు ఉండాలి: ప్రస్తుత పరిస్థితిలో ఏమి చేయాలి? విషయాలు సరైన దిశలో వెళ్ళే అవకాశం ఉందా?  

చూస్తుంటే గత పదేళ్లలో సాధించినదానిపట్ల ప్రభుత్వం సంతృప్తిగా ఉన్నట్టుంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో, ఆర్థిక వ్యవస్థ 8.2 శాతం వృద్ధి చెందింది. తద్వారా అన్ని పెద్ద ఆర్థిక వ్యవస్థలలో భారతదేశాన్ని అత్యంత వేగంగా ముందుకు కదలిపోయేదేశంగా నిలబెట్టింది. 2023లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.2 శాతమే పెరిగింది. 2024–25లో ప్రధాన ద్రవ్యోల్బణాన్ని 4.5 శాతానికికట్టడి చేయగలమనే విశ్వాసంతో ప్రభుత్వం ఉంది. కానీ ఈ కథ పూర్తిగా ఆశాజనకంగా లేదు. 2023–24లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం 7.5 శాతం వరకు ఉంటూ, మరింత ఆందోళనకరంగా మారింది. 

మొత్తంమీద, ఈ విషయంలో బాగా పనిచేసినందున, కింది వృద్ధి వ్యూహాన్ని  ఆర్థిక సర్వే సూచించింది; తద్వారా 2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని చేరుకోవచ్చని చెప్పింది: స్థిరంగావృద్ధి చెందడానికి ప్రైవేట్‌ రంగం దాని సొంత మూలధనాన్ని ఏర్పాటుచేసుకోవాల్సి ఉంది. దేశంలో హరిత పరివర్తన జరగడా నికి ప్రభుత్వ–ప్రైవేట్‌ భాగస్వామ్యాలను ప్రోత్సహించాలి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తమ వృద్ధిని కొనసాగించేలా ప్రభుత్వం ఖాళీలను పూడ్చాలి. దేశం అభివృద్ధి చెందడానికి వీలుగా నైపుణ్యాల అంతరాన్ని పూరించడానికి ఒక విధానం అవసరం. ఈ విధానాన్ని రూపొందించాలంటే, రాష్ట్ర యంత్రాంగ సమర్థత, వ్యవస్థ ఒకేలా ఉండాలి.

ఇది పావు శతాబ్దానికి దీర్ఘకాలిక లక్ష్యం అయితే, మనం ఇప్పుడు ఎక్కడ నుండి ప్రారంభించాలి? ముందుగా, పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. నిర్ణీత తగ్గింపు (స్టాండర్డ్‌ డిడక్షన్‌) రూ.50,000 నుంచి రూ.75,000కు పెంచుతున్నారు. రూ.17,000 వరకు ఉద్యోగులకు ఆదా అయ్యేలా శ్లాబుల్ని మెలితిప్పారు. ఉద్యోగాల్లో చేరేందుకు ప్రొఫెషనల్స్‌ ప్రోత్సా హకాలు పొందబోతున్నారు. దీని వల్ల రెండు లక్షల మంది యువ కులు ప్రయోజనం పొందనున్నారు. కేవలం జీతం ఆదాయం మాత్రమే కాదు, పెట్టుబడిపై లాభాలు ఆర్జించే వారికి మూలధన లాభాలకు మినహాయింపు కూడా పెరుగుతోంది.

ఈ లెక్కన తక్కువ పన్నులు చెల్లించాల్సిన మధ్యతరగతి ప్రజలకు బడ్జెట్‌ తోడ్పడుతుంది. తమాషా ఏమిటంటే, ఆదాయపు పన్ను చెల్లించే అవసరం లేని పేదలు, వారు తప్పనిసరిగా వినియోగించుకోవాల్సిన వస్తువులు అన్నింటికీ వాస్తవ చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. ఇది జీఎస్టీ పరిధిలోకి వస్తుంది. ఏకాభిప్రాయం సాధించడం ఎల్లప్పుడూ కష్టమైనప్పటికీ, మరిన్ని జీఎస్టీ–అనుబంధ సంస్కరణలను కేంద్రం, రాష్ట్రాలు చేపట్టవచ్చు. అంతేకాకుండా, రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం లేని సెస్‌ నుండి కేంద్రం ప్రయోజనం పొందడం అన్యాయం. పేద పిల్లలు చదువుకునేలా చేయడం వంటి అభివృద్ధి లక్ష్యాలను చేరుకునే ప్రాజెక్ట్‌ల కోసం సేకరించగలిగే మొత్తం ఆదాయం రాష్ట్రాలకు అవసరం.

నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూనీ, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీనీ సంతోషపెట్టడానికి అనేక భారీ ప్రాజెక్టులకు కూడా బడ్జెట్‌ ఆమోదం తెలిపింది. ప్రధాన ప్రాజెక్టులలో పట్నా–పూర్నియా, బక్సర్‌–భాగల్పూర్‌ ఎక్స్‌ప్రెస్‌వేలు ఉన్నాయి. అంతేకాకుండా, బిహార్‌లోని బక్సర్‌ జిల్లాలో గంగా నదిపై రెండు లేన్ల వంతెనను నిర్మించనున్నారు. అదనంగా, భాగల్‌పూర్‌లోని పీర్‌పైంతిలో 2,400–మెగావాట్ల పవర్‌ ప్లాంట్‌ రానుంది. ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే, రోడ్డు మార్గాల ప్రాజెక్టులను ప్రకటించారు. కొత్త రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15,000 కోట్లు ప్రకటించారు.

బడ్జెట్‌ అనేది రాజకీయ చర్య. దానికి స్పష్టమైన లక్ష్యంఉంది. బీజేపీ సంకీర్ణ భాగస్వాములు, మధ్యతరగతి సంతృప్తిచెందేలా చూసుకోవడమే దాని లక్ష్యం. ప్రధాన పార్టీపై ఆధిపత్యం చలాయించే రాజకీయ వ్యాపారుల వెరపులేని ధీమా కారణంగానేసంకీర్ణ భాగస్వాములను సంతోషపెట్టాలనే లక్ష్యం నడుస్తుంటుంది. పూర్తిగా సంఖ్యల పరంగానే, చిన్న మధ్యతరగతి ఎన్నికల ఫలితాలను నిర్ణయించలేదు. పాలకవర్గం అంతిమ ఉద్దేశ్యం జనబాహు ళ్యాన్ని
సంతోషపెట్టడమే.

అయితే రానున్న రోజుల్లో ప్రభుత్వానికి మంచి జరగనుంది. ప్రపంచ వ్యాఖ్యాతలు కూడా భారత్‌ అధిక వృద్ధి రేటును ప్రశంసించారు. కానీ వృద్ధి నిలకడగా ఉండాలంటే, కార్మికులు మెరుగైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలి, మంచిగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ కీలక సమస్యలను పరిష్కరించడానికి బడ్జెట్‌ సంకేత పథకాలను మాత్రమే ప్రవేశపెట్టింది. అందుకే, అధికార పార్టీ రాజకీయ ఒత్తిళ్లను బాగా అర్థం చేసుకున్నా, దూరదృష్టితో వ్యవహరించడం లేదనేది మొత్తం భావన.

ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతోందనే దానితోసంబంధం లేకుండా, బడ్జెట్‌ అంచనాలు కూడా పరిష్కరించాల్సిన మూడు సమస్యలను ఎత్తిపట్టాయి. వృద్ధి ఊపందు కున్నప్పటికీ, వినియోగ డిమాండ్‌ తక్కువగానే ఉంది. పైగా ఉపాధి చాలా వెనుకబడి ఉంది. అధిక ఆర్థిక వృద్ధి ఫలాలను పెద్దసంఖ్యలో ప్రజలు పొంద లేకపోతున్నారా? ఇది కొంచెం ఎక్కువగా సాంకేతికమైనది. తక్కువ స్థాయి ద్రవ్యోల్బణం అనేది ఛేదించగలిగే టంత దృఢంగా ఉందా?

నోట్ల రద్దు, కోవిడ్‌–19 మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో, వృద్ధి రేటు అనుకున్నంత ఎక్కువగా లేదని చాలా మంది వాదించారు. కాబట్టి, ఒక విధంగా, ఆర్థిక వ్యవస్థ కేవలం తేరుకోవడానికి ప్రయత్నిస్తోంది. ప్రజలు ఎక్కువ పొదుపు చేయడం వల్ల కాదు కానీ, రెండు ఎదురుదెబ్బల ఫలితంగా ఆదాయ వనరును కోల్పోయినప్పుడు వారు తీసుకున్న భారీ అప్పును తిరిగి చెల్లించ డానికి ప్రయత్నిస్తున్నందున వినియోగం కుంచించుకుపోయింది. రిటైల్‌ ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నది సమృద్ధిగా ఉన్న సరఫరాల వల్ల కాదు. ప్రజలు తాము కోరుకున్న వాటిని వినియోగించుకోలేక పోవడం వల్ల.

ఇక్కడ శక్తిమంతమైన వైరుధ్యం కూడా ఉంది. ఆర్థిక వ్యవస్థ, వ్యాపారాలు బాగా కొనసాగాలంటే, రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లను తక్కు వగా ఉంచాలి. అయితే, ఎక్కువ డిపాజిట్లను సంపాదించడానికి బ్యాంకులు అధిక వడ్డీ రేటును ఎలా చెల్లించగలవు? అందు వల్ల, బ్యాంకులు రుణాలు, పొదుపు మధ్య అసమతుల్యతను చూస్తున్నాయి. 

మొత్తంమీద, హ్రస్వ దృష్టితో చూస్తే బడ్జెట్‌ వాస్తవికంగానే కనబడుతుంది. కానీ ఇది మధ్యతరగతి ద్వారా, మధ్యతరగతి కోసం చేసే ఒక కసరత్తు. అది దీర్ఘకాలిక వృద్ధిని నిర్ధారించే అంశాలను పరిష్కరించకుండా వదిలివేసింది.

- వ్యాసకర్త సీనియర్‌ ఆర్థిక విశ్లేషకులు(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)
- సుబీర్‌ రాయ్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement