సాక్షి, హైదరాబాద్: రానున్న ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మూలధన వ్యయానికి కేటాయింపులు బాగా తగ్గాయి. గత ఏడాది అంటే 2023–24 ఆర్థిక సంవత్సర ప్రతిపాదనల కంటే సుమారు సుమారు రూ.8వేల కోట్లను ఈసారి తక్కువగా చూపెట్టారు. 2023–24లో మూల ధన వ్యయం రూ.37,524 కోట్లు చూపెట్టగా, ఈసారి ప్రతిపాదించింది కేవలం రూ.29,669.14 కోట్లు మాత్రమే. 2023–24 సవరణ అంచనాలకు అనుగుణంగా ఈసారి మూలధన వ్యయ పద్దును ప్రతిపాదించినట్టు అర్థమవుతోంది.
2023–24 ప్రతిపాదనల్లో రూ.37వేల కోట్లకు పైగా చూపెట్టినా వాస్తవంగా ఖర్చు పెట్టింది రూ.24,178 కోట్లు మాత్రమే కావడంతో, ఆ మొత్తానికి రూ.5,500 కోట్లు పెంచి చూపెట్టడం గమనార్హం. అంటే 2023–24 కంటే 2024–25లో రూ.5,500 కోట్లు ఎక్కువగా ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. మరి సవరణల బడ్జెట్‌కు వచ్చేసరికి 2024–25లో ఎంత ఖర్చవుతుందో వేచి చూడాల్సిందే.
ద్రవ్యలోటు పెంపు రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదలకు అనుగుణంగా ఈసారి బడ్జెట్‌లో ద్రవ్యలోటు పెంచి చూపెట్టారు. 2023–24లో ద్రవ్యలోటు ప్రతిపాదన రూ.38,234 కోట్లు కాగా, వాస్తవిక ద్రవ్యలోటు రూ.33,785 కోట్లుగా నమోదైంది. అయితే, 2024–25లో ద్రవ్యలోటు అంచనాను ఏకంగా రూ.53,227.82 కోట్లుగా ప్రతిపాదించడం గమనార్హం. ఈ పెంపు జీఎస్‌డీపీకి అనుగుణంగానే జరిగిందని, జీఎస్‌డీపీలో 3.5శాతాన్ని ద్రవ్యలోటుగా చూపెట్టడంతోనే ఆ మేరకు పెరుగుదల కనిపించిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
రెవెన్యూ మిగులు ప్రతిపాదనలోనూ ఈసారి తక్కువగా చూపెట్టారు. రూపాయి రాక, పోక అనంతరం రూ.4,881 కోట్లు రెవెన్యూ మిగులు ఉంటుందని 2023–24 బడ్జెట్‌లో చూపెట్టినప్పటికీ సవరించిన అంచనాల్లో అది రూ.9,031 కోట్లకు పెరిగింది.అంటే అప్పటి ప్రభుత్వం అంచనాలో రూ.4,200 కోట్లకు పైగా ఖర్చు కాలేదని అర్థమవుతోంది. ఈసారి మాత్రం 2023–24 ప్రతిపాదిత అంచనాల కంటే తక్కువగా రూ.4,424 కోట్ల రెవెన్యూ మిగులును ప్రతిపాదించారు. దీన్నిబట్టి బడ్జెట్ అంచనాల మేరకు వ్యయం ఉంటుందనే ధీమాను ప్రభుత్వం బడ్జెట్‌లోవ్యక్తపరిచిందని అర్థమవుతోంది.
క్షీణించిన రాష్ట్ర వృద్ధిరేటు!
♦ 14.7 శాతం నుంచి 11.3 శాతానికి తగ్గుదల
♦ మైనస్‌లోకి పడిపోయిన వ్యవసాయరంగ వృద్ధిరేటు
♦ రూ. 49,059 కోట్ల నుంచి రూ. 45,723 కోట్లకు తగ్గిన వ్యవసాయ విలువ
♦ తలసరి ఆదాయ వృద్ధిరేటులో సైతం క్షీణత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వృద్ధిరేటు క్షీణించింది. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) విలువ 2022–23తో పోలిస్తే 2023–24లో ప్రస్తుత ధరల వద్ద రూ. 13,02,371 కోట్ల నుంచి రూ. 14,49,708 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో వృద్ధి రేటు మాత్రం 14.7 శాతం నుంచి 11.3 శాతానికి క్షీణించింది. దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు సైతం 16.1 శాతం నుంచి 8.9 శాతానికి పతనమైంది. అయితే దేశ వృద్ధిరేటుతో పోలిస్తే తెలంగాణ వృద్ధిరేటు 2.4 శాతం అధికం కావడం గమనార్హం.
అయితే స్థిర ధరల వద్ద తెలంగాణ వృద్ధిరేటు గతేడాదితో పోలిస్తే ప్రస్తుత ఏడాది 7.5 శాతం నుంచి 6.5 శాతానికి పడిపోయింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం శాసనసభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 2024–25 ప్రవేశపెట్టిన సందర్భంగా చేసిన ప్రసంగంలో ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వెల్లడించారు.
ద్రవ్యోల్బణంలో 5వ స్థానంలో రాష్ట్రం..
వినియోగదారుల ధరల సూచీ డిసెంబర్ 2023లో జాతీయ స్థాయిలో 5.69% ఉండగా తెలంగాణలో 6.65 శాతంగా నమోదైంది. ఈ లెక్కన దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం కలిగిన ఐదో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
క్షీణించిన తలసరి ఆదాయం...
తెలంగాణ తలసరి ఆదాయం ప్రస్తుత ధరల వద్ద 2023–24లో రూ. 3,43,297 ఉంటుందని అంచనా. గతేడాది తలసరి ఆదాయం రూ. 3,09,912గా నమోదైంది. తలసరి ఆదాయంలో పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ వృద్ధిరేటు మాత్రం క్షీణించింది.
ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క వెల్లడి
పడిపోయిన వ్యవసాయరంగ వృద్ధిరేటు..
వ్యవసాయ రంగంలో పంటల ద్వారా వచ్చే స్థూల విలువ (జీవీఏ) రూ. 49,059 కోట్లతో పోలిస్తే రూ. 45,723 కోట్లకు తగ్గిపోయింది. దీంతో వ్యవసాయరంగ వృద్ధిరేటు మైనస్ 6.8 శాతానికి పతనమైంది. నైరుతి రుతుపవనాల ఆలస్యం, వర్షాభావం, కృష్ణా బేసిన్‌లో నీటి లభ్యత లేకపోవడం, భూగర్భ జలాల్లో క్షీణతతో వరి, పత్తి, మొక్కజొన్న, కంది, శనగ పంటల విస్తీర్ణం భారీగా తగ్గింది.
తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో ఇతర రంగాలైన విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, వాణిజ్యం, మరమ్మతు సేవలు, హోటళ్లు, రెస్టారెంట్లు, రైల్వేలు, వాయు రవాణా వంటి రంగాల్లో సైతం క్షీణత కినిపించింది. తయారీ రంగంలో మాత్రం వృద్ధిరేటు 1.3 శాతం నుంచి 5.9 శాతానికి పెరిగింది. రియల్ ఎస్టేట్, నిర్మాణం, మైనింగ్, క్వారీయింగ్ వంటి రంగాలు గతంతో పోలిస్తే 2023–24లో అధిక వృద్ధిరేటును నమోదు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment