అమెరికా దేశ బడ్జెట్ లోటు గరిష్ఠాలను చేరుకుంది. సెప్టెంబర్ 30 నాటికి ఇది రూ.1,538 లక్షల కోట్లను చేరింది. కొవిడ్ మహమ్మారి కాలంతో పోల్చినా ఈ లోటు అధికంగా నమోదవ్వడం ఆందోళనలు కలిగిస్తుంది. రుణ వడ్డీ, విద్యార్థుల సంక్షేమానికి ఖర్చు..వంటివి ఇందుకు కారణమని యూఎస్ ట్రెజరీ విభాగం తెలిపింది. అయితే ఫెడ్ ఇటీవల వడ్డీరేట్లను తగ్గించిన నేపథ్యంతో రానున్న రోజుల్లో ఈ లోటు తగ్గే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
యూఎస్ అధికారిక ట్రెజరీ డేటా ప్రకారం..సెప్టెంబరు 30 నాటికి యూఎస్ ఆర్థిక లోటు 1.83 ట్రిలియన్ డాలర్ల(రూ.1,538 లక్షల కోట్లు)కు చేరుకుంది. ఇది అంతకుముందు 2020-21 కాలంలో గరిష్ఠంగా 1.7 ట్రిలియన్ డాలర్లు(రూ.14.2 లక్షల కోట్లు)గా ఉండేది. 2023 మధ్యలో బైడెన్ ప్రభుత్వ ప్రతిపాదనలతో యూఎస్ అత్యున్నత న్యాయస్థానం విద్యార్థుల రుణాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో ఆర్థిక లోటు మరింత పెరిగినట్లయింది. యూఎస్ ఆర్థిక లోటు స్థూల దేశీయోత్పత్తిలో 6 శాతానికి మించిపోయింది. ఆర్థిక మాంద్యం, అంతర్జాతీయ యుద్ధ భయాల కారణంగా 2023లో 6.2 శాతం, 2024 సెప్టెంబర్ 30 నాటికి 6.4 శాతానికి చేరింది. వడ్డీ చెల్లింపులు కూడా భారీగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి వడ్డీ ఖర్చులు 254 బిలియన్ డాలర్లు(రూ.21 లక్షల కోట్లు) పెరిగి 1.1 ట్రిలియన్ డాలర్లకు(రూ.92 లక్షల కోట్లు) చేరాయి. ఇది గతంలో కంటే 29 శాతం అధికం. జీడీపీలో ఈ వడ్డీ చెల్లింపులు 3.93 శాతంగా ఉన్నాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలు 11 శాతం పెరిగాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు ఇటీవల కీలక వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దాంతో రానున్న రోజుల్లో కొంత వడ్డీ ఖర్చులు తగ్గే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్..కంపెనీలకు నష్టం!
దేశీయంగా పెరుగుతున్న అప్పు ఆందోళనకరమే. అయితే ఆ అప్పు మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చిస్తే దాని ప్రతిఫలాలు సమీప భవిష్యత్తులో ఉంటాయి. కాబట్టి దాంతో కంగారు పడాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి వడ్డీతో సహా భవిష్యత్తులో అప్పు తీర్చే ప్రణాళికలు ఉంటాయి. కానీ సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వాలు ఒకవేళ అవినీతికి పాల్పడితే దానికోసం ఇతర సంస్థల నుంచి తీసుకొచ్చిన అప్పు భారంగా మారుతుంది. దానివల్ల భవిష్యత్తులో ఎలాంటి రాబడి సృష్టించకపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. పలితంగా దేశం ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment