న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే నెల 1వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెడతారని భావిస్తున్న 2023–24 వార్షిక బడ్జెట్ ద్రవ్య స్థిరత్వానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. 2022–23లో ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) రూ.16.61 లక్షల కోట్లు ఉండాలని 2022 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్దేశించింది.
ఇదే ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాల్లో ఇది 6.4 శాతం. చక్కటి పన్ను వసూళ్ల వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు అంచనాలకు అనుగుణంగా 6.4 శాతంలోపునకే (జీడీపీ విలువలో) పరిమితం అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. 2025–26 నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇక రానున్న (2023–24) ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 5.8 శాతంగా ఉంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), జపాన్ బ్రోకరేజ్ దిగ్గజం– నోమురా వంటి సంస్థలు అంచనావేస్తున్నాయి.
వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) దన్నుతో భారత్ పన్ను వసూళ్లు 2023 మార్చితో ముగిసే 2022–23 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనాలకన్నా రూ.4 లక్షల కోట్ల అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని స్వయంగా ప్రభుత్వ వర్గాలే పేర్కొంటున్నాయి. 2022–23లో రూ.27.50 లక్షల కోట్ల ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లు జరగాలన్నది లక్ష్యం. ఈ లక్ష్యంలో ప్రత్యక్ష పన్నుల వాటా రూ.14.20 లక్షల కోట్లయితే, పరోక్ష పన్ను వసూళ్ల వాటా రూ.13.30 లక్షల కోట్లు.
అయితే లక్ష్యాలకు మించి పరోక్ష పన్ను వసూళ్లు రూ.17.50 లక్షల కోట్లు, పరోక్ష పన్ను (కస్టమ్స్, ఎక్సైజ్, జీఎస్‌టీ) వసూళ్లు రూ.14 లక్షల కోట్లకు చేరవచ్చు. అంటే వసూళ్లు రూ.31.50 లక్షల వరకూ వసూళ్లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్ అంచనాలకన్నా ఇది రూ.4 లక్షల కోట్ల అధికం. 2022–23లో రూ.16.61 లక్షల కోట్ల ద్రవ్యలోటు కట్టడికి (జీడీపీలో 6.4 శాతం వద్ద) దోహదపడే అంశం ఇది.
వ్యయ ప్రతిపాదనలకు సూచన
పార్లమెంట్ (రెండు భాగాల) బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమవుతున్న నేపథ్యంలో వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల నుండి ఆర్థికశాఖ 2022–23కు సంబంధించి తుది వ్యయ ప్రతిపాదనలను కోరింది. గ్రాంట్లకుగాను రెండవ, తుది సప్లిమెంటరీ డిమాండ్‌ల ప్రతిపాదనలను ఆర్థికశాఖ కోరినట్లు ఒక అధికారిక మెమోరాండం పేర్కొంది. గ్రాంట్ల కోసం తుది సప్లిమెంటరీ డిమాండ్‌లను సమావేశాల్లోని రెండవ విడతలో సమర్పించే అవకాశం ఉందని సమాచారం. గత నెలలో, ప్రభుత్వం రూ. 3.25 లక్షల కోట్లకు పైగా నికర అదనపు వ్యయాన్ని అనుమతించే గ్రాంట్‌ల కోసం అనుబంధ డిమాండ్‌ల మొదటి బ్యాచ్‌ను ఆమోదించింది. ఇందులో ఎరువుల సబ్సిడీ చెల్లింపునకు ఉద్దేశించిన రూ. 1.09 లక్షల కోట్లు కూడా ఉన్నాయి. ఈ అదనపు వ్యయం 2022–23 బడ్జెట్‌లో ప్రతిపాదించిన మొత్తం కంటే అధికం. 2021–22లో బడ్జెట్ వ్యయం రూ.37.70 లక్షల కోట్లు. 2022–23లో బడ్జెట్ ప్రతిపానల్లో దీనిని రూ.37.70 లక్షల కోట్లకు పెంచడం జరిగింది.
నియంత్రణలు సడలించాలి...
ఫార్మా, హెల్త్‌కేర్ పరిశ్రమ విజ్ఞప్తి ∙ ప్రోత్సాహకాల కోసం వినతి
రాబోయే కేంద్ర బడ్జెట్‌లో ఫార్మా, హెల్త్‌కేర్ రంగానికి సంబంధించిన నిబంధనలను సరళీకృతం చేయాలని సంబంధిత వర్గాలు విజ్ఞప్తి చేశాయి. పలు ప్రోత్సాహకాలతో పాటు, ప్రభుత్వం నూతన ఆవిష్కరణలు, పరిశోధనా అభివృద్దిని ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. దేశీయ ఫార్మా పరిశ్రమ ప్రస్తుతం 50 బిలియన్ డాలర్ల పరిమాణంలో ఉందని, 2030 నాటికి 130 బిలియన్ డాలర్లు, 2047 నాటికి 450 బిలియన్ డాలర్లకు ఎదగాలన్నది పరిశ్రమ ఆంకాంక్షని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపీఏ) సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్ తెలిపారు. ఈ దిశలో బడ్జెట్‌లో చర్యలు ఉంటాయని భావిస్తున్నామని అన్నారు.
ఔషధ పరిశ్రమ అభివృద్ధికి సహాయపడే సహాయక విధానాలు, సరళీకృత నిబంధనలు, జీఎస్‌టీ నిబంధనల సరళీకరణ ప్రతిపాదనలు బడ్జెట్ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, అరబిందో ఫార్మా, సిప్లా, లుపిన్, గ్లెన్‌మార్క్‌లతో సహా 24 ప్రముఖ దేశీయ ఫార్మా కంపెనీల కూటమే ఐపీఏ.
ఆర్గనైజేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఇండియా (ఓపీపీఐ) డైరెక్టర్ జనరల్ వివేక్ సెహగల్ మాట్లాడుతూ, భారతదేశ పురోగతి బాటలో ’ఆత్మనిర్భర్ భారత్’ విజన్‌కు లైఫ్ సైన్సెస్ రంగం వాస్తవికంగా దోహదపడేలా ప్రభుత్వం విధానాలు అవసరమని అన్నారు. ప్రొడక్షన్ ఆధారిత ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) పథకం మాదిరిగానే, పరిశోధన ఆధారిత ఇన్సెంటివ్ స్కీమ్‌ను ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. హెల్త్‌కేర్ రంగం విషయానికొస్తే, ప్రజలు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలకు అధిక ప్రాధాన్యత ఇస్తారని పరిశ్రమల సంఘం నాథేల్త్ ప్రెసిడెంట్ శ్రవణ్ సుబ్రమణ్యం అన్నారు. ఈ దిశలో మౌలిక సదుపాయాల సామర్థ్యాలను పెంపొందించడం అత్యవసరమని పేర్కొన్నారు.
అల్యూమినియంపై దిగుమతి సుంకాలు పెంచాలి
అల్యూమినియం, అల్యూమినియం ఉత్పత్తులపై రాబోయే బడ్జెట్‌లో దిగుమతి సుంకాన్ని కనీసం 12.5 శాతానికి పెంచాలని ఇండస్ట్రీ సంస్థ– ఫిక్కీ కోరింది. ఈ చర్య అల్యూమినియం ఉత్పత్తుల డంపింగ్‌ను అరికట్టడానికి అలాగే దేశీయ తయారీ– రీసైక్లింగ్ వృద్ధిని ప్రోత్సహించడానికి సహాయపడుతుందని పేర్కొంది. ప్రస్తుతం అల్యూమినియం, అల్యూమినియం ఉత్పత్తులపై దిగుమతి సుంకం 10 శాతంగా ఉంది. ఇటీవలి సంవత్సరాల్లో అల్యూమినియం దిగుమతులు తీవ్రంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దిగువ స్థాయి అల్యూమినియం దిగుమతుల్లో 85 శాతానికి పైగా చైనా వాటా ఉంటోందని ఒక ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment