
ఫిబ్రవరి చివరికి చేరిక
11 నెలల్లో రూ.13,46,852 కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) ఫిబ్రవరి చివరికి ద్రవ్యలోటు రూ.13,46,852 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో నిర్దేశించుకున్న మొత్తం ద్రవ్యలోటు లక్ష్యంలో 11 నెలల్లో 85.8 శాతానికి చేరుకుంది. వ్యయాలు–ఆదాయాల మధ్య అంతరాన్ని ద్రవ్యలోటుగా చెబుతారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు రూ.15.69 లక్షల కోట్లుగా ఉంటుందని బడ్జెట్ అంచనా. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) ఈ గణాంకాలను శుక్రవారం విడుదల చేసింది. ఫిబ్రవరి చివరికి నికర పన్నుల ఆదాయం రూ.20 లక్షల కోట్లుగా ఉంది. 2024–25 సవరించిన అంచనాల్లో ఇది 78.8 శాతానికి సమానం.
అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది 79.6 శాతంగా ఉండడం గమనార్హం. మొత్తం వ్యయాలు రూ.38.93 లక్షల కోట్లుగా ఉన్నాయి. సవరించిన బడ్జెట్ అంచనాల్లో ఇది 82.5 శాతానికి సమానం. జీడీపీలో ద్రవ్యలోటు 4.8 శాతంగా 2024–25 బడ్జెట్‌లో ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. 2025–26 సంవత్సరానికి దీన్ని 4.4 శాతంగా ప్రభుత్వం నిర్దేశించుకుంది. మొత్తం రెవెన్యూ వ్యయాల్లో 9.52 లక్షల కోట్లు వడ్డీ చెల్లింపులు కాగా, 3.63 లక్షల కోట్లు సబ్సిడీలకు ఖర్చు అయింది. 11.80 లక్షల కోట్లను రాష్ట్ర ప్రభుత్వాలకు బదిలీ చేసినట్టు సీజీఏ తెలిపింది. గతేడాది ఇదే కాలంతో పోలి్చతే రాష్ట్రాలకు బదిలీ చేసిన మొత్తం రూ.1.47 లక్షల కోట్ల మేర పెరిగింది.