గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద తొలి త్రైమాసికంలో ఏమీ ఇవ్వని కేంద్రం
గత ఆర్థిక సంవత్సరంలో జూన్ నాటికి వచ్చిన గ్రాంట్లు రూ.2,317 కోట్లు
రూ.50 వేల కోట్లకు చేరిన మూడు నెలల రాష్ట్ర పద్దు
మొత్తం రాబడుల్లో 80శాతానికి పైగా పన్ను ఆదాయమే..
అప్పులు తెచ్చింది రూ.13 వేల కోట్లు... అప్పుల కింద కట్టింది రూ.6 వేల కోట్లు
ఒక్క జూన్ నెలలోనే రూ.6వేల కోట్లు అప్పు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ముగిసిపోయింది. కానీ కేంద్రం నుంచి రాష్ట్రానికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో ఒక్క రూపాయి కూడా రాలేదు. ఇప్పుడేకాదు చాలా ఏళ్లుగా రాష్ట్రానికి గ్రాంట్లు ఇచ్చే విషయంలో కేంద్రం శీతకన్ను వేస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించిన దాంట్లో సగం కూడా నిధులను మంజూరు చేయడం లేదని అధికార వర్గాలు చెప్తున్నాయి.
గత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో రూ.2,317 కోట్లు అయినా ఇవ్వగా.. ఈసారి అయితే ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం గమనార్హం. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం 2024–25 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రూ.21 వేలకోట్లకుపైగా వస్తాయని బడ్జెట్‌లో అంచనా వేసుకుంది.
పన్నుల వసూళ్లతోనే..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్ 30వ తేదీ వరకు ఆదాయ, వ్యయాలపై రాష్ట్ర ప్రభుత్వం కాగ్‌కు ఇచ్చిన నివేదికలోని గణాంకాల ప్రకారం పన్ను రాబడులు ఆశించిన మేర వస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో పన్ను రాబడులు రూ.11,464 కోట్లు వచ్చాయి. మే నెలలో కొంత తగ్గి రూ.10,954 కోట్లు వచ్చినా, జూన్‌లో మళ్లీ పుంజుకుని రూ.12,190 కోట్లు వచ్చాయి.
మొత్తంగా మూడు నెలల్లో కలిపి అన్నిరకాల రాబడులు, పన్నుల్లో వాటా, అప్పులు కలిపి రూ.48,790.66 కోట్లు ఖజానాకు సమకూరగా.. అందులో రూ.34,609 కోట్లు పన్ను ఆదాయం కిందే అందాయి. అంటే మొత్తం రాబడిలో 80శాతానికిపైగా పన్నుల రూపంలోనే ఖజానాకు వచ్చినట్టు అర్థమవుతోంది.
మూడు నెలల్లో రూ.13,171 కోట్ల అప్పులు
ఇక ఈ మూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.13,171 కోట్లు అప్పుల రూపంలో సమకూర్చుకుంది. ఏప్రిల్‌లో రూ.2,246 కోట్లు, మేలో రూ.5,133 కోట్లు, జూన్‌లో రూ.5,790 కోట్లు రుణాలు తీసుకుంది. ఈ మొత్తంలో సగం వరకు గతంలోని అప్పుల అసలు, వడ్డీలకు చెల్లించినట్టు కాగ్‌కు సమర్పించిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఏప్రిల్‌లో రూ.1,865 కోట్లు, మేలో రూ.1,864 కోట్లు, జూన్‌లో రూ.2,203 కోట్లు అప్పుల కింద చెల్లించారు. ఇక ఇతర ఖర్చుల విషయానికి వస్తే జీతాలకు రూ.11,026.69 కోట్లు చెల్లించారు. గత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో చెల్లించిన దానికంటే ఇది రూ.1,300 కోట్లు అధికం. పింఛన్ల కోసం రూ.4,311.62 కోట్లు, సబ్సిడీల కింద రూ.3,354 కోట్లు చెల్లించారు. మొత్తం రాబడిలో రూ.45,320.12 కోట్లు ఖర్చయిందని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment