సాక్షి, హైదరాబాద్: రానున్న ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాన్ని ప్రగతి బాట పట్టించేందుకు అవసరమైన నిధుల్ని సమకూర్చుకునే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. కరోనా దెబ్బకు కకావికలమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నుంచి వచ్చే ఏడాది అవసరాలకు తగినట్టు నిధుల సమీకరణ ఎలా అన్న దానిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఆర్థిక శాఖ వర్గాలు, సలహాదారులతో సమావేశమైన ఆయన ఈ వారంలో కీలక భేటీలు జరుపుతారని, వచ్చే నెలలోపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన వార్షిక బడ్జెట్ (2021–22)పై అధికారులకు దిశానిర్దేశం చేస్తారని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. ఈ భేటీల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలు, సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపు, కష్టకాలంలోనూ కేంద్ర సాయం అరకొరగా ఉన్న నేపథ్యంలో సొంత ఆదాయం పెంచుకునేందుకు గల ప్రత్యామ్నాయ మార్గాలు, వచ్చే ఏడాది కొత్త కార్యక్రమాల అమలుకు అవసరమయ్యే, అనివార్య ఖర్చుల కింద వెచ్చించాల్సిన మేరకు కావాల్సిన నిధులను సమకూర్చుకునే అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. చదవండి: (మరో పదేళ్లు నేనే ముఖ్యమంత్రి: సీఎం కేసీఆర్)
రూ.95 వేల కోట్లు కావాల్సిందే..
రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగించాల్సి ఉంది. దీంతో పాటు నిరుద్యోగ భృతి, ఉద్యోగులకు వేతన సవరణ లాంటి కచ్చితంగా అమలు చేయాల్సిన కార్యక్రమాలున్నాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతనాలు, పింఛన్లు, అప్పుల కింద కట్టాల్సిన మొత్తం, వడ్డీ చెల్లింపుల కింద రూ.45 వేల కోట్ల వరకు అవసరమవుతాయి. రైతు బంధు, ఆసరా పింఛన్లు, వ్యవసాయ రుణాల మాఫీ, గొర్రెల పంపిణీ లాంటి సంక్షేమ కార్యక్రమాలకు రూ.50 వేల కోట్లు తప్పనిసరిగా కావాల్సిందే. వీటికి తోడు నిరుద్యోగ భృతి అమలు చేస్తే రూ.5 వేల కోట్లు, ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత ఫిట్‌మెంట్ ఇస్తారన్న దాన్ని బట్టి కనీసం మరో రూ.5 వేల కోట్లు అవసరముంటాయి.
ఇటు ప్రభుత్వ నిర్వహణ, రెవెన్యూ ఖర్చు, అత్యవసర కార్యక్రమాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలకు మరిన్ని నిధులు అవసరం కానున్నాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిధులు కేటాయించడం ప్రభుత్వ ప్రాధాన్యంగా కనిపిస్తోంది. వీటన్నింటికీ కలిపి కనీసం రూ.1.50 లక్షల కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని, ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే మొత్తం ఆదాయం, అప్పుల అంచనాలను బట్టి ఈ మేరకు వచ్చే ఏడాది బడ్జెట్‌ను రూపొందించేందుకు సీఎం దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది.
విలువల సవరణ.. భూముల అమ్మకాలు
ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందు ప్రత్యామ్నాయ ఆర్థిక మార్గాలు ఏంటన్నవి ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ భూముల అమ్మకం ద్వారా పెద్ద ఎత్తున నిధులు రాబట్టుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన గత రెండేళ్లుగా అమలు కావడం లేదు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సవరించాల్సిన భూముల రిజిస్ట్రేషన్ల విలువలు ఇప్పటివరకు రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి సవరించలేదు. ఈ నేపథ్యంలోనే వీటిపై నిర్ణయాల విషయంలో ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తుందని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం రూ.80 వేల కోట్ల వరకు వచ్చే అవకాశముండటం, కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్‌ల కింద మరో రూ.25 వేల కోట్ల వరకు వచ్చినా, మిగిలిన నిధులను సమకూర్చుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి కత్తి మీద సాములాగానే మారనుంది. ఇక, అప్పులు చేసే వెసులుబాటు కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రాబడులకు తోడు భూముల అమ్మకాలు, రిజిస్ట్రేషన్ విలువల సవరణ ద్వారా మరో రూ.25 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల వరకు సమకూర్చుకునే ప్రతిపాదనలపై ఉన్నతాధికారులతో జరిగే భేటీల్లో సీఎం సమీక్షలో చర్చకు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. మరి, ప్రభుత్వం ఏ విధంగా ముందుకుపోతుందో వేచి చూడాల్సిందే..!
Comments
Please login to add a commentAdd a comment