సాక్షి, హైదరాబాద్: ‘జిల్లా పరిషత్ చైర్మన్‌లు ఏ చిన్న పని చేయాలన్నా నిధుల కొరత ఎదుర్కొంటున్నారు. కరోనా పరిస్థితుల కారణంగా కొంత వరకు నిధుల కేటాయింపులో అలసత్వం జరిగిన మాట వాస్తవమే. ఈ ఏడాది వార్షిక బడ్జెట్‌లో ఒక్కో జిల్లా పరిషత్‌కు రూ.10 కోట్ల చొప్పున రూ.320 కోట్లు కేటాయిస్తాం’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసిన తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్‌లు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
జిల్లా పరిషత్ చైర్మన్‌లకు ఎన్నో అధికారాలు ఉన్నా.. చిన్నా చితకా పనులను కూడా మంజూరు చేసే పరిస్థితి లేకపోవడాన్ని సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మతో పాటు పలువురు చైర్మన్లు సీఎం దృష్టికి తెచ్చారు. దీంతో జిల్లా పరిషత్‌లను బలోపేతం చేసేందుకు అవసరమైన నిధులను కేటాయిస్తానని సీఎం వారికి హామీ ఇచ్చారు. ‘జిల్లా పరిషత్ చైర్మన్‌లకు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ర్యాంకు ఉంటుంది. వారి కోసం ఇప్పటి వరకు లేని ప్రత్యేక కార్యక్రమాన్ని ఏదైనా ఆలోచిస్తాం. నాలుగు రోజుల్లో ప్రగతి భవన్‌లో జిల్లా పరి షత్ చైర్మన్‌లతో కలసి భోజనం చేసి.. ప్రత్యే కంగా సమావేశమవుతా. జెడ్పీ చైర్మన్‌లకు ప్రత్యేక క్వార్టర్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభిస్తాం’అని కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. చదవండి: (నిధులెట్లా.. 2021–22 బడ్జెట్ కూర్పుపై సీఎం కసరత్తు)
డీసీఎంఎస్‌లు వారధిగా పనిచేయాలి..
‘ప్రభుత్వానికి, రైతులకు మధ్య జిల్లా సహకార మార్కెటింగ్ (డీసీఎంఎస్) సొసైటీలు వారధిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. జవహర్‌లాల్ నెహ్రూ హయాంలో పురుడు పోసుకున్న ఈ వ్యవస్థను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే ప్రత్యేక గ్రాంటును కూడా ఇస్తుంది’అని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం మెదక్ డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్ నేతృత్వంలో ఉమ్మడి 9 జిల్లాల చైర్మన్లు తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. రైతులకు ట్రాక్టర్లు, ఎరువులు తదితరాలు అందజేయడంలో డీసీసీబీలతో కలసి డీసీఎంఎస్‌లు పనిచేయాలన్నారు. డీసీఎంఎస్‌ల ద్వారా రైతులకు సేవ చేయడంలో ఉన్నంత సంతృప్తి ఎందులోనూ లభించదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. చదవండి: (మరో పదేళ్లు నేనే ముఖ్యమంత్రి: సీఎం కేసీఆర్)
ఐదు గంటలకు పైగా..
పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ ఆదివారం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశం సందర్భంగా ఐదు గంటలకు పైగా గడిపారు. మధ్యాహ్నం 2.15కు తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేసీఆర్ 4.15 వరకు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీఎంఎస్ చైర్మన్లతో సుమారు గంటన్నర పాటు వేర్వేరుగా సమావేశమయ్యారు. జెడ్పీ చైర్మన్లతో పాటు పలువురు ఎమ్మెల్యేలు నిధులు, ఇతర సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను సీఎం కేసీఆర్‌కు అందజేశారు. కాగా, సమావేశం ప్రారంభానికి ముందు నాగార్జునసాగర్ దివంగత శాసన సభ్యుడు నోముల నర్సింహయ్య చిత్ర పటం వద్ద సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో కలసి నివాళి అర్పించారు. మొత్తం 299 మందిని ఆదివారం జరిగిన రాష్ట్ర సమావేశానికి ఆహ్వానించగా, ఒకరిద్దరు మినహా మంత్రులు, పార్టీ ప్రజా ప్రతినిధులు అందరూ హాజరైనట్లు తెలంగాణ భవన్ వర్గాలు వెల్లడించాయి.
ఆ నేతలతో ప్రత్యేక భేటీ?
ముఖ్యమంత్రి మార్పునకు సంబంధించి ఇటీవలి కాలంలో ప్రకటనలు చేసిన మంత్రులు, పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయినట్లు సమాచారం. మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్‌గౌడ్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసిన తర్వాత సీఎంను ప్రత్యేకంగా కలసినట్లు తెలిసింది. అయితే ఈ భేటీ వివరాలు వెల్లడికాలేదు.
Comments
Please login to add a commentAdd a comment