బడ్జెట్ పై 'సభ'భగలు | Harish Rao vs Bhatti Vikramarka Budget Discussion Speech In Assembly | Sakshi
Sakshi News home page

బడ్జెట్ పై 'సభ'భగలు

Published Sat, Mar 22 2025 5:27 AM | Last Updated on Sat, Mar 22 2025 5:27 AM

Harish Rao vs  Bhatti Vikramarka Budget Discussion Speech In Assembly

శాసనసభలో బడ్జెట్‌పై హరీశ్‌రావు, భట్టి మధ్య మాటల యుద్ధం

ఆర్థిక మాంద్యం కాదు.. మీ బుద్ధి మాంద్యం: మాజీ మంత్రి హరీశ్‌రావు

ఆర్థిక విధ్వంసం చేసిన మీరా విమర్శించేది?: భట్టి విక్రమార్క

⇒ ఆర్థిక మాంద్యం కాదు.. మీ బుద్ధి మాంద్యం: మాజీ మంత్రి హరీశ్‌రావు   
⇒ అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చలో మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం
⇒ అంతా తనకే తెలుసనుకునే సీఎం 
⇒అజ్ఞానంతో ఆదాయం దిగజారింది
⇒పాలన చేతకాక నెగెటివ్‌ రిజల్ట్‌.. బడ్జెట్‌ అంకెలు, లెక్కలన్నీ ఉత్తవే 
⇒ఆరు గ్యారంటీలకు దిక్కులేదు గానీ.. అందాల పోటీలా? 
⇒అబద్ధాలకు ఆస్కార్‌ ఇస్తే..    సీఎం రేవంత్‌రెడ్డికే వస్తుంది

సాక్షి, హైదరాబాద్‌: ఆర్థిక మాంద్యంతో ఆదాయం తగ్గిందని ప్రభుత్వం చెబుతోందని.. కానీ ఇది పాలకుల బుద్ధి మాంద్యమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సభ్యుడు టి.హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ‘‘ఇచ్చిన హామీలను అమలు చేసే దిక్కులేదు, వాటికి సరిపడా ఆదాయం లేదని ప్రభుత్వమే చెప్తోంది. ఆదాయం ఎందుకు లేదంటే ఆర్థిక మాంద్యం అంటోంది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ సహా దేశంలో ఎక్కడా కనిపించని ఆర్థిక మాంద్యం తెలంగాణలోనే ఎందుకు ఉంటుంది? ఇది ఆర్థిక మాంద్యం కాదు..

పాలకుల బుద్ధిమాంద్యం. అంతా తనకే తెలుసు అనుకునే సీఎం అజ్ఞానం, అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆదాయం దిగజారింది. ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆర్థిక మాంద్యం మాటెత్తుకున్నారు..’’అని పేర్కొన్నారు. బడ్జెట్‌పై చర్చలో భాగంగా శుక్రవారం ఆయన బీఆర్‌ఎస్‌ పక్షాన శాసనసభలో సుదీర్ఘంగా మాట్లాడారు. వివరాలు హరీశ్‌రావు మాటల్లోనే... 

ఇది దిగజారుడు రాజకీయం 
రాష్ట్ర ఆదాయం తగ్గిపోవటంతో భూములను తెగనమ్మి నిధులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో కొన్ని భూములమ్మితేనే గగ్గోలు పెట్టిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు రూ.50 వేల కోట్లు లక్ష్యంగా ప్రభుత్వ భూములు అమ్మేస్తున్నారు. ఇది దిగజారుడు రాజకీయం కాదా? పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే రైజింగ్‌ తెలంగాణ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆరు గ్యారంటీలకు దిక్కు లేదు గానీ, అందాల పోటీలు నిర్వహిస్తారట.  

రాష్ట్రంలో అన్ని వ్యవస్థల విధ్వంసం.. 
రాష్ట్రంలో వ్యవసాయ విధ్వంసం వల్ల రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. హైడ్రా విధ్వంసం వల్ల పేద, మధ్య తరగతి జనం గుండె ఆగి చనిపోతున్నారు. రియల్‌ ఎస్టేట్‌ కుప్పకూలి రియల్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సరైన తిండి లేక హాస్టళ్లలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మా హయాంలో గురుకులాల సంఖ్యను 289 నుంచి 1,020కి పెంచి బలోపేతం చేస్తే.. ఇప్పుడు వాటి లో విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే దుస్థితికి తెచ్చారు. దీనితో క్రమంగా విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. 

అన్ని వర్గాలను మోసం చేశారు 
గతేడాది రూ.2,91,159 కోట్లుగా గొప్పగా చెప్పుకున్న బడ్జెట్‌ వాస్తవిక బడ్జెట్‌ కాదని నేను అప్పుడే చెప్పాను. రివైజ్డ్‌ బడ్జెట్‌ అంకెల్లో రూ.27 వేల కోట్లు తక్కువ చేసి చూపటం ద్వారా అదే నిజమని తేలింది. ఎన్నికలకు ముందు నో ఎల్‌ఆర్‌ఎస్, నో బీఆర్‌ఎస్‌ అన్నారు. ఇప్పుడు పేదల రక్తమాంసాలు పిండి ఎల్‌ఆర్‌ఎస్‌ వసూలుకు సిద్ధమయ్యారు. ఫార్మాసిటీకి మేం భూములు సేకరిస్తుంటే తప్పుపట్టారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆ భూములను తిరిగి రైతులకు ఇస్తామని చెప్పి.. ఇప్పుడేమో ఫ్యూచర్‌ సిటీ పేరుతో అదనంగా మరో 14 వేల ఎకరాలు లాక్కుంటున్నారు. గత బడ్జెట్‌ ప్రసంగంలో రైతులతోపాటు కౌలు రైతులకు కూడా రైతు భరోసా, రైతు బీమా ఇస్తామని చెప్పి.. ఇప్పుడు కౌలు రైతుల ప్రస్తావనే లేదు. 

సభకు క్షమాపణ చెప్పండి.. 
గత బడ్జెజ్‌లో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు అని చెప్పి ఈ 16 నెలల్లో నాలుగు ఇళ్లు కూడా నిర్మించలేదు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎస్సీ, ఎస్టీలకు రూ.లక్ష అదనంగా ఇస్తామని.. ఇప్పుడు ఆ మాటే ఎత్తలేదు. ఇది దళిత, గిరిజనులను మోసం చేయడం కాదా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు జాబ్‌ కేలండర్‌ అమలుచేస్తామని చెప్పి జాబ్‌లెస్‌ కేలండర్‌గా మార్చారు. దాని సంగతేమిటని నిరుద్యోగులు ప్రశ్నిస్తే అశోక్‌నగర్‌లో వారి వీపులు పగలగొడుతున్నారు. తుదిదశలో ఉన్న ఆరు సాగునీటి ప్రాజెక్టులని బడ్జెట్‌లో ప్రస్తావించారు కదా.. ఆ ప్రాజెక్టుల పేర్లేమిటో చెప్పండి.

లేదా సభను తప్పుదోవ పట్టించినందుకు క్షమాపణ చెప్పండి. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి న మొదటి సంవత్సరంలో 1,913 ప్రభుత్వ పాఠశాలలు మూసేశారు. ఎన్నికల ముందు 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ అని ప్రకటనలు చేసి.. ఇప్పుడు మేమిచ్చి న నోటిఫికేషన్‌కు 5 వేల పోస్టులు మాత్రమే పెంచి దగా డీఎస్సీ చేశారు. 

ఉద్యోగాలపై తప్పుడు లెక్కలు.. 
కేసీఆర్‌ ముల్కీ రూల్స్‌ నుంచి 610 జీవో కోసం పోరాడి స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా చేసి.. తొమ్మిదిన్నరేళ్లలో 1.62 లక్షల ఉద్యోగాలిచ్చారు. మా హయాంలో ఇచ్చి న నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక పత్రాలు పంచటం తప్ప కొత్త ఉ ద్యోగాల కల్పన ఏది? కాంగ్రెస్‌ ప్రభుత్వం చెప్తున్న 57 వేల ఉద్యోగాల్లో 50 వేలు మా హయాంలోనివే. ఈ ప్రభుత్వం ఆరు వేలు కూడా భర్తీ చేయలేదు. రాహుల్‌ గాంధీ దేశమంతా తిరుగుతూ మొహబ్బత్‌ కా దుకాణ్‌ (ప్రేమ దుకాణం) అంటుంటే.. రేవంత్‌ మాత్రం నఫ్రత్‌ కా మాకాన్‌ (విద్వేషాల ఇల్లు) అంటున్నారు..’’అని హరీశ్‌రావు మండిపడ్డారు. 

వాటిని వడ్డీలేని రుణాలుగా పరిగణిస్తారా? 
‘‘ఐదేళ్లలో వడ్డీ లేని రుణాల కింద రూ.లక్ష కోట్లు అందజేస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఉంటే ఆ ఉత్తర్వులు సభ ముందుంచాలి. లేని పక్షంలో సభను తప్పుదోవ పట్టించినందుకు సభకు క్షమాపణ చెప్పాలి. ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ లేని రుణాలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. మహిళా సంఘాలకు ఏటా రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలు ఇప్పిస్తామంటున్నారు. వాటిని వడ్డీ లేని రుణాలుగా పరిగణిస్తారా 
చెప్పాలి?’’  

పాలనా వైఫల్యాలతో దెబ్బతిన్న పురోగతి
‘‘జీఎస్టీ వృద్ధిరేటులో తగ్గుదల, స్టాంప్స్‌ అండ్‌ రిజి్రస్టేషన్‌ ఆదాయం తగ్గడం, వాహనాల అమ్మకాల్లో తగ్గుదల.. ఇలా రాష్ట్ర ఆదాయం తగ్గింది. కేసీఆర్‌ హయాంలో దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా, దివాలా అని దిక్కుమాలిన ప్రచారం చేయడం వల్ల పెట్టుబడులు తగ్గాయి. ఫార్మా సిటీ రద్దు, ఎయిర్‌ పోర్టుకు మెట్రో రద్దు, హైæడ్రా పేరిట సాగించిన విధ్వంస కాండ, మూసీ ప్రక్షాళన పేరిట, బఫర్‌ జోన్ల పేరిట చేసిన హంగామా, ఆర్‌ఆర్‌ టాక్స్‌లు, సంక్షేమ పథకాల అమలు సరిగా లేక గ్రామాలకు ద్రవ్య ప్రవాహం తగ్గడం, ఉద్యోగులకు పీఆర్సీ, డీఏలు చెల్లించకపోవడం, రియల్‌ ఎస్టేట్‌ కుప్పకూలడం.. ఇలాంటి కారణాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గి, వృద్ధి రేటు మందగించింది. పరిస్థితి ఇలా ఉంటే, బడ్జెట్‌లో మాత్రం ఘనమైన అంకెలు చూపి ప్రజలను మోసం చేస్తున్నారు.

ఆర్థిక విధ్వంసం చేసిన మీరా విమర్శించేది?: భట్టి విక్రమార్క
⇒ బడ్జెట్‌పై చర్చకు సమాధానంలో బీఆర్‌ఎస్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్‌ 
⇒ ఆదాయం లేకున్నా పెంచుతూ పోయింది మీరే... మీరు చేసిన అప్పులు తీర్చలేక చస్తున్నాం 
⇒ పదేళ్లు ఎంతో అవమానించారు.. మౌనంగా భరించాం 
⇒ అన్నీ అనుభవించే ఇక్కడకొచ్చాం.. మీరెన్ని మాట్లాడినా బాధపడం

సాక్షి, హైదరాబాద్‌: ‘‘గత పదేళ్ల పాలనలో రూ.16.70 లక్షల కోట్ల బడ్జెట్‌ పెట్టి ఏం సాధించారు? నాగార్జునసాగర్‌ నిర్మించారా? ఎస్సారెస్పీ, ఓఆర్‌ఆర్, ఎయిర్‌పోర్టు వంటివేమైనా నిర్మించారా? హైటెక్‌ సిటీ కట్టారా? ఏం చేశారయ్యా అంటే కాళేశ్వరం అంటారు. ఆ కాళేశ్వరం ఏమైందో రాష్ట్ర ప్రజలంతా చూశారు. ఇక మీరు చెప్పడానికేముంది? సింగరేణికి రూ.77 వేల కోట్లు బకాయిలు పెట్టిపోయారు. పదేళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసం చేసి, వ్యవస్థలను నాశనం చేసిన మీరు.. వాస్తవిక బడ్జెట్‌ను పెట్టిన మమ్మల్ని విమర్శిస్తారా?’’ అని బీఆర్‌ఎస్‌పై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు.

బడ్జెట్‌పై చర్చ సందర్భంగా విపక్షాల ప్రశ్నలకు శుక్రవారం రాత్రి శాసనసభలో, శాసన మండలిలో భట్టి విక్రమార్క సమాధానమిచ్చారు. బడ్జెట్‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు, ఇతర నేతలు చేసిన విమర్శలను ఘాటుగా తిప్పికొట్టారు. భట్టి ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చూపినా నిధులను పూర్తిగా ఖర్చు చేయలేదు. 2016–17లో రూ.8వేల కోట్లు, 2018–19లో రూ.40 వేల కోట్లు, 2021–22లో రూ.48 వేల కోట్లు, 2022–23లో రూ.52 వేల కోట్లకుపైగా, 2023–24లో రూ.58,571 కోట్లు ఖర్చు చేయలేదు.

మేం మీలాగా బడ్జెట్‌ను ప్రతీసారి 20 శాతానికిపైగా పెంచుకుంటూ పోలేదు. అలా పెంచితే ఈసారి బడ్జెట్‌ రూ.4 లక్షల 18 వేల కోట్లు అయ్యేది. మేం అలా చేయకుండా.. వాస్తవాల మీద బడ్జెట్‌ పెట్టాం. మీరు ఆదాయం ఉన్నా, లేకున్నా పెంచుతూ పోయారు. ఔటర్‌ రింగ్‌రోడ్డును రూ.7 వేల కోట్లకే 30 ఏళ్ల కాలానికి అమ్ముకున్నారు. దొడ్డిదారిన ప్రభుత్వ భూములను అమ్ముకున్నారు. తర్వాత వచ్చే ప్రభుత్వానికి దక్కాల్సిన ఆదాయాన్ని కూడా ముందే తీసుకున్నారు. 

ఇసుక మాఫియాను కట్టడి చేశాం 
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా ఇసుక అమ్మకాల ద్వారా రోజుకు కోటిన్నర ఆదాయం వచ్చేది. 30 వేల టన్నులు అమ్మేవారు. ఆరేడు నెలలుగా సీరియస్‌గా దృష్టి పెట్టాం. ఇసుక మాఫియాను కట్టడి చేశాం. రోజుకు 70 వేల టన్నులు అమ్ముతున్నాం. ఆదాయం రోజుకు రూ.3 కోట్లకు పెరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఇసుక అమ్మకాల ద్వారా ఏటా రూ.600 కోట్ల ఆదాయం కోల్పోయాం. పదేళ్లలో రూ.6 వేల కోట్ల ప్రభుత్వ ధనం ఎక్కడికి పోయిందో బీఆర్‌ఎస్‌ వాళ్లే చెప్పాలి. ఇకపై రాష్ట్రంలోని అన్ని మాఫియాలను కట్టడి చేస్తాం. ఆదాయం పెంచుతాం. 

అవమానాలను పదేళ్లు మౌనంగా భరించాం 
రైతు రుణమాఫీ కింద పదేళ్లలో మీరు రూ.28,053 కోట్లు ఇస్తే.. మేం నాలుగు నెలల్లోనే రూ.20,617 కోట్లు ఇచ్చాం. మీరు జాప్యం చేయడంతో రైతు రుణమాఫీ కంటే వడ్డీల కింద రూ.13 వేల కోట్లు జమ చేసుకున్నారు. నిర్బంధం, స్వేచ్ఛ, నిరంకుశత్వం గురించి మీరా మాట్లాడేది? ఏ ఒక్కరోజైనా సభను ప్రజాస్వామికంగా నడిపారా? నేను పదేళ్లు ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడిగా, సీఎల్పీ నేతగా అక్కడ కూర్చుని ఉంటే ఎంత అవమానించారో తెలియదా?తలవంచుకుని భరిస్తూ, మీకు సహకరించామే తప్ప అడ్డగోలుగా ఏదంటే అది మాట్లాడలేదు. సభాపతి, సభా నాయకుడు, ప్రభుత్వం గురించి తూలనాడలేదు. మేం పడిన అనుమానాలు ఈ సభలో ఎవరూ పడి ఉండరు. అయినా సభ ఔన్నత్యాన్ని కాపాడాం. 

అన్నీ చూసే ఇక్కడికి వచ్చాం.. 
మీరెన్ని మాట్లాడినా, రన్నింగ్‌ కామెంట్రీలు చేసినా బాధపడేది లేదు. అవన్నీ చూసి చూసి, అనుభవించి ఇక్కడకు వచ్చాం. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలోని మహిళలందరికీ లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు బరాబర్‌ ఇస్తాం. రాష్ట్రంలోని మహిళలందరూ ఆత్మగౌరవంతో తలెత్తుకుని బతికేట్టు చేయాలన్నదే మా ప్రభుత్వం. సీఎం ఆలోచన. మేం ఉద్యోగాలు రాని పిల్లలకు రాజీవ్‌ యువ వికాసంతో రూ.6 వేల కోట్లు ఇవ్వబోతున్నాం. బ్రాహ్మణ పరిషత్‌కు రూ.50 కోట్లు ఉండే.. ఇంకో 50 కోట్లు కలిపి ఇచ్చాం. వైశ్యులు కార్పొరేషన్‌ కావాలని అడిగితే మీరు ఇవ్వలేదు. మేం రాగానే కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రూ.25 కోట్లు ఇచ్చాం..’’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.  

అన్నీ ఉత్త మాటలే.. 
పదేళ్లలో కృష్ణానది, గోదావరి నదుల మీద నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా ఒక్క ఎకరానికైనా నీళ్లందించారా? కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసిందే మీరు. పదేళ్లలో దళితుల అభివృద్ధి కోసం రూ.1,81,877 కోట్లు కేటాయించారు. కానీ ఖర్చు చేయలేదు. దళితబంధు గురించి బడ్జెట్‌లో రూ.17,700 కోట్లు పెట్టి ఒక్క రూపా యి అయినా విడుదల చేశారా? అమాయకులైన గిరిజనులను ఆడవాళ్లని కూడా చూడకుండా చెట్టుకు కట్టేసి కొట్టించారు. మేం సబ్‌ప్లాన్‌ నిధులను తు.చ. తప్పకుండా ఖర్చు చేస్తాం. ఇది మా ప్రభుత్వ నిబద్ధత అని పేర్కొన్నారు.

మీ అప్పులే కడుతున్నాం స్వామీ.. 
కేసీఆర్‌ నెరవేర్చని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారు. ఈ ఏడాది రూ.1,58,041 కోట్ల అప్పులు తెచ్చి .. రూ.1,53,359 కోట్ల మేర గత ప్రభుత్వ అప్పులు, వడ్డీల కింద చెల్లించాం. మీరు చేసిన అప్పులు తీర్చలేక, తప్పులు సరిదిద్దలేక, నిద్రలేక చస్తున్నాం. మీ అప్పులే కడుతున్నాం స్వామీ. తెచ్చి న అప్పుల్లో కట్టిన అప్పులు పోను ఈ సంవత్సరానికి మా ప్రభుత్వం అవసరాల కోసం వాడుకున్నది రూ.4,682 కోట్లు మాత్రమే. మీలాగా నాలుగు గోడల మధ్య బంధించుకుని ఎవరికీ ఏమీ చెప్పకుండా, ఎవరినీ కలవకుండా మూసేసి పాలన చేయదల్చుకోలేదు. మా ప్రభుత్వం 24/7 తలుపులు తెరిచి ఉంటాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement