Controller General of Accounts
-
నవంబరు చివరకు ద్రవ్యలోటు రూ.9.06 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు నవంబర్ ముగిసే నాటికి 2023–24 వార్షిక బడ్జెట్ లక్ష్యంలో 50.7 శాతానికి చేరింది. విలువలో రూ.9,06,584 కోట్లకు చేరిందని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) వెల్లడించింది. 2023–24లో ద్రవ్యలోటు రూ.17.86 లక్షల కోట్లుగా బడ్జెట్ అంచనా వేసింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువ అంచనాల్లో పోల్చి చూస్తే ఇది 5.9 శాతం. ఆహార రాయితీకి అదనపు నిధుల కేటాయించాల్సిన అవసరం ఏర్పడుతున్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.9 శాతం ద్రవ్యలోటు లక్ష్య సాధన సాధ్యమేనని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ ఇటీవలే అన్నారు. గత ఆర్థిక సంవత్సరం ఈ రేటు 6.4 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. 2025–26 నాటికి భారత్ ద్రవ్యలోటు లక్ష్యాన్ని 4.5 శాతంగా కేంద్రం నిర్దేశించుకుంది. నవంబర్ ముగిసే నాటికి ప్రభుత్వ ఆదాయాలు రూ.17.40 లక్షల కోట్లు (బడ్జెట్ లక్ష్యంలో 64.3 శాతం). వ్యయాలు రూ.26.46 లక్షల కోట్లు (బడ్జెట్ లక్ష్యంలో 58.9 శాతం). వెరసి ద్రవ్యలోటు రూ.9.06 లక్షల కోట్లకు చేరింది. కాగా, మొత్తం వ్యయాల్లో రూ.20.66 లక్షల కోట్లు రెవెన్యూ అకౌంట్కు సంబంధించినదికాగా, మిగిలినది మూలధన వ్యయాలపై జరిగింది. -
లక్ష్యంలో 37.3 శాతానికి ద్రవ్యలోటు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) మొదటి ఆరు నెలలూ ముగిసే నాటికి (సెప్టెంబర్) లక్ష్యంలో 37.3 శాతానికి చేరింది. మరిన్ని వివరాల్లో వెళితే, 2022–23లో ద్రవ్యలోటు రూ.16.61 లక్షల కోట్లుగా 2022 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్దేశించింది. ఇదే ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాల్లో ఇది 6.4 శాతం. అయితే సెప్టెంబర్ ముగిసే నాటికి ద్రవ్యలోటు రూ.6,19,849 కోట్లకు చేరినట్లు సోమవారం వెలువడిన అధికారిక గణాంకాలు వెల్లడించాయి. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) విడుదల చేసిన గణాంకాలు ప్రకారం.. ► సెప్టెంబర్ నాటికి పన్నులుసహా ప్రభుత్వ మొత్తం ఆదాయాలు రూ.12.03 లక్షల కోట్లు. 2022–23 బడ్జెట్ అంచనాల్లో ఇది 52.7 శాతం. ఇందులో ఒక్క పన్ను వసూళ్లు రూ.10.11 లక్షల కోట్లు. బడ్జెట్ అంచనాల్లో ఈ మొత్తం 52.3 శాతం. ► ఇక ఇదే కాలంలో ప్రభుత్వ వ్యయాలు రూ.18.23 లక్షల కోట్లు. ఆర్థిక సంవత్సరం మొత్తం బడ్జెట్ అంచనాల్లో 46.2 శాతం. ► వెరసి ద్రవ్యలోటు 6.20 లక్షల కోట్లుగా నమోదయ్యింది. -
ద్రవ్యలోటు రూ.5.26 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) సెప్టెంబర్ ముగిసే నాటికి రూ.5.26 లక్షల కోట్లకు చేరింది. బడ్జెట్లో నిర్దేశించుకున్న లక్ష్యంతో పోల్చితే ఈ పరిమాణం 35 శాతానికి చేరింది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) శుక్రవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. 2021–22లో రూ.15,06,812 కోట్ల వద్ద ద్రవ్యలోటు ఉంటుందని ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనావేసింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలతో పోల్చితే ఇది 6.8 శాతం. అంచనాలతో పోల్చితే సెప్టెంబర్ నాటికి ద్రవ్యలోటు రూ.5,26,851 కోట్లకు (35 శాతం) చేరిందన్నమాట. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ప్రస్తుత ద్రవ్యలోటు పరిస్థితి అదుపులో ఉండడం గమనార్హం. కరోనా కష్టాల నేపథ్యంలో పడిపోయిన ఆదాయాలు– పెరిగిన వ్యయాల నేపథ్యంలో గత ఏడాది ఇదే కాలానికి ద్రవ్యలోటు అప్పటి బడ్జెట్ అంచనాలను దాటి ఏకంగా 114.8 శాతానికి ఎగసింది. 2020–21లో 3.5 శాతం తొలి (బడ్జెట్) అంచనాలను మించి ద్రవ్యలోటు 9.3 శాతానికి ఎగసింది. తాజా సమీక్షా కాలానికి సంబంధించి ముఖ్య గణాంకాలను పరిశీలిస్తే... 2020–21తో పోల్చితే పురోగతి ► 2021 సెప్టెంబర్ నాటికి ప్రభుత్వ ఆదాయాలు రూ.10.99 లక్షల కోట్లు. బడ్జెట్ మొత్తం ఆదాయ అంచానల్లో ఈ పరిమాణం 55.5 శాతానికి చేరింది. గత ఆర్థిక సంవత్సరం (2020–21) ఇదే కాలంలో బడ్జెట్ మొత్తం ఆదాయ అంచనాల్లో సెప్టెంబర్ నాటికి ఒనగూరింది కేవలం 25.2 శాతమే కావడం గమనార్హం. మొత్తం ఆదాయాల్లో పన్నుల విభాగం నుంచి తాజా సమీక్షా కాలానికి (2021 సెప్టెంబర్ నాటికి) వచ్చింది రూ.9.2 లక్షల కోట్లు. బడ్జెట్ అంచనాల్లో ఇది 59.6 శాతం. అయితే గత ఆర్థిక సంవత్సరం (2020–21) ఇదే కాలానికి బడ్జెట్ మొత్తం పన్ను వసూళ్ల అంచనాల్లో సెప్టెంబర్ నాటికి ఒనగూరింది కేవలం 28 శాతమే కావడం గమనార్హం. ► ఇక సమీక్షా కాలంలో ప్రభుత్వ వ్యయాలు రూ.16.26 లక్షల కోట్లు. 2021–22 బడ్జెట్ మొత్తం వ్యయ అంచనాల్లో ఇది 46.7 శాతం. వెరసి ద్రవ్యలోటు సెప్టెంబర్ నాటికి రూ.5.26 లక్షల కోట్లకు చేరిందన్నమాట. సెప్టెంబర్లో మౌలిక రంగం స్పీడ్ 4.4 శాతం ఎనిమిది మౌలిక పారిశ్రామిక రంగాల గ్రూప్ ఉత్పత్తి సెప్టెంబర్లో 4.4 శాతం పెరిగింది. వాణిజ్య, పరిశ్రమల శాఖ శుక్రవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. ఈ ఎనిమిది రంగాల వృద్ధితీరు 2020లో కేవలం 0.6 శాతం. అప్పటి అతి తక్కువ లో బేస్ పరిస్థితిలో కూడా మౌలిక రంగం కేవలం 4.4 శాతం పురోగమించడం గమనార్హం. లో బేస్ కారణంతోనే 2021 ఆగస్టులో వృద్ధిరేటు భారీగా 11.5 శాతంగా ఉంది. మౌలిక రంగాల తీరు సమీక్షా నెల్లో వేర్వేరుగా చూస్తే... సహజవాయువు ఉత్పత్తి 27.5 శాతం పురోగతి సాధిస్తే, రిఫైనరీ ప్రొడక్టుల ఉత్పత్తి 6 శాతం ఎగసింది. ఇక సిమెంట్ ఉత్పత్తి 10.8 శాతం పెరిగింది. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి 1.7 శాతం క్షీణించింది. ఎరువుల రంగం స్వల్పంగా 0.02 శాతం పురోగమించింది. విద్యుత్ ఉత్పత్తి కూడా ఇదే విధంగా 0.3 శాతం పెరిగింది. స్టీల్ రంగం పనితీరు కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఇక బొగ్గు ఉత్పత్తి వృద్ధి రేటు 8.1 శాతం. -
ద్రవ్యలోటు ఆందోళన
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయ–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు తీవ్ర ఆందోళనకరమైన స్థాయికి చేరింది. డిసెంబర్ ముగిసే నాటికే రూ.11,58,469 కోట్లకు ఎగసింది. 2020–21 వార్షిక బడ్జెట్ లక్ష్యాలను దాటి ఏకంగా 145.5 శాతానికి చేరింది. రెవెన్యూ భారీగా తగ్గిపోవడం దీనికి నేపథ్యం. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. నిజానికి ద్రవ్యలోటును రూ.7.96 లక్షల కోట్లకు (స్థూల దేశీయోత్పత్తిలో 3.5 శాతం) పరిమితం చేయాలని 2020 ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ నిర్దేశించింది. అయితే జూలైలోనే ఈ పరిమితిని దాటి ద్రవ్యలోటు పెరిగిపోయింది. గణాంకాలు ఇలా... గణాంకాల ప్రకారం డిసెంబర్ 2020 వరకూ భారత్ ప్రభుత్వం రూ.11.21 లక్షల కోట్ల ఆదాయాన్ని పొందింది. దీనిలో రూ.9,62,399 కోట్లు పన్ను వసూళ్లు. రూ.1,26,181 కోట్లు పన్ను యేతర వసూళ్లు. రూ.33,098 కోట్లు నాన్–డెట్ క్యాపిటలర్ రిసిట్స్. నాన్–డెట్ క్యాపిటలర్ రిసిట్స్లో రుణ రికవరీలు (రూ.14,202 కోట్లు), పెట్టుబడుల ఉపసంహరణల ద్వారా వచ్చిన నిధులు (రూ.18,896 కోట్లు) ఉన్నాయి. అయితే కేంద్ర వ్యయాలు ఇదే సమయంలో రూ.22.80 లక్షల కోట్లుగా ఉన్నాయి. 7 శాతం పెరిగే అవకాశాలు...: 2019–20లో ద్రవ్యలోటు 4.6 శాతంగా నమోదయ్యింది. ఆదాయ వనరుల తగ్గుదల కారణం. కరోనా మహమ్మారితో రెవెన్యూ వసూళ్లు 2020–21లో మరింత పడిపోయాయి. దీనితో ద్రవ్యలోటు 7 శాతం దాటిపోతుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. తొలి 3.5 శాతం (జీడీపీ) అంచనాలు... తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏ స్థాయికి చేరతాయన్న అంశాన్ని తెలుసుకోడానికి ఫిబ్రవరి 1వ తేదీ ఆర్థికమంత్రి బడ్జెట్ సమర్పణ వరకూ ఆగాల్సి ఉంటుంది. -
కట్టుతప్పిన ఆదాయ–వ్యయాల వ్యత్యాసం!
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయ–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు అదుపులోనికి రాని పరిస్థితి నెలకొంది. వరుసగా రెండవ నెల ఆగస్టులోనూ బడ్జెట్ లక్ష్యాన్ని దాటిపోయి 109.3 శాతంగా నమోదయ్యింది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) బుధవారం వెల్లడించిన గణాంకాలకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► 2020–21లో ద్రవ్యలోటు రూ.7.96 లక్షల కోట్లు ఉండాలని ఫిబ్రవరిలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్దేశించింది. ఇది 2020–21 భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలతో పోల్చితే 3.5 శాతం. ► అయితే ఏప్రిల్ నుంచి ఆగస్టు నాటికే ద్రవ్యోలోటు 109.3 శాతానికి అంటే రూ.8,70,347 కోట్లకు ఎగసింది. ► సీజీఏ తాజా గణాంకాల ప్రకారం, ఏప్రిల్–ఆగస్టు మధ్య ప్రభుత్వ మొత్తం ఆదాయాలు రూ.3,77,306 కోట్లుగా నమోదయ్యాయి. బడ్జెట్ అంచనాల్లో ఇది 16.8 శాతం మాత్రమే. ఆర్థిక సంవత్సరం మొత్తంగా రూ.22.45 లక్షల కోట్ల ఆదాయాలు బడ్జెట్ లక్ష్యం. ► ఇక వ్యయాలు రూ.12,47,653 కోట్లుగా ఉంది. 2020–21 బడ్జెట్ అంచనాల్లో ఇది 41 శాతం. ► 2019–20లో ద్రవ్యలోటు జీడీపీలో 4.6 శాతం. ఏడేళ్ల గరిష్ట స్థాయి ఇది. అయితే కరోనా పరిణామాలు, పేలవ ఆదాయాలు వంటి సవాళ్ల నేపథ్యంలో ద్రవ్యలోటు శాతం జీడీపీలో 2020–21లో భారీగా పెరిగిపోయే అవకాశం ఉందని అంచనా ఉంది. అక్టోబర్–మార్చి మధ్య రూ.4.34 లక్షల కోట్ల రుణ ప్రణాళిక 2020–21 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో (అక్టోబర్–మార్చి) మధ్య రూ.4.43 లక్షల కోట్ల రుణ సమీకరణలు జరపనున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ బుధవారం వెల్లడించింది. కరోనా ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయడం, దీనితో ప్రభుత్వ ఆదాయాల అంచనాలకు గండి పడ్డం వంటి అంశాలు దీనికి నేపథ్యం. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్ బజాజ్ చేసిన ప్రకటన ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంలో రూ.12 లక్షల కోట్ల రుణ సమీకరణ లక్ష్యానికి కేంద్రం కట్టుబడి ఉంది. సెప్టెంబర్ వరకూ రూ.7.66 లక్షల కోట్ల రుణ సమీకరణలు జరిపింది. మిగిలిన రూ.4.34 లక్షల కోట్లను ద్వితీయార్థంలో సమీకరిస్తుంది. తన ద్రవ్యలోటును పూడ్చుకోడానికి కేంద్రం డేటెడ్ సెక్యూరిటీలు (నిర్దిష్ట కాల వ్యవధితో కూడిన బాండ్లు) ట్రెజరీ బాండ్లపై ఆధారపడుతుంది. నిజానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7.80 లక్షల కోట్ల నికర మార్కెట్ రుణ సమీకరణలు జరపాలని 2020–21 బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిర్దేశించారు. అయితే కరోనా ప్రభావంతో ఈ మొత్తాన్ని రూ.12 లక్షల కోట్లకు పెంచాలని కేంద్రం మేలో నిర్ణయించింది. 2019–20లో కేంద్ర రుణ సమీకరణల మొత్తం రూ.7.1 లక్షల కోట్లు. -
బడ్జెట్ అంచనాల్లో 37.5%కి చేరిన ద్రవ్యలోటు
న్యూఢిల్లీ: దవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనా మొత్తంలో ఏప్రిల్-మే నెలల్లోనే 37.5 శాతానికి పరిమితమయ్యింది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం- చేసే వ్యయం మధ్య వ్యత్యాసమే ద్రవ్యలోటు. పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఈ లోటు రూ.5.55 లక్షల కోట్లు ఉండాలని బడ్జెట్ నిర్దేశించింది. ఈ లక్ష్యంలో ఏప్రిల్-మే నెలల్లో లోటు 2.08 లక్షల కోట్లకు చేరిందని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ విడుదల చేసిన తాజా గణాంకాలు తెలిపాయి. గడచిన ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల్లో ఈ రెండు నెలల్లోనే ద్రవ్యలోటు 45.3 శాతానికి చేరింది. -
అంచనాలు మించనున్న ద్రవ్యలోటు
⇒ఇప్పటికే బడ్జెట్ లక్ష్యంలో 99% చేరిక ⇒నవంబర్ వరకూ పరిస్థితిపై గణాంకాలు న్యూఢిల్లీ: కేంద్ర ద్రవ్య పరిస్థితి క్లిష్టతను సూచిస్తూ ‘లోటు’ గణాంకాలు బుధవారం వెలువడ్డాయి. ఏప్రిల్-నవంబర్ మధ్య ద్రవ్యలోటు రూ.5.25 లక్షల కోట్లుగా నమోదయ్యింది. 2014-15 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లక్ష్యంలో (రూ.5.31 లక్షల కోట్లు) ఈ పరిమాణం ఇప్పటికే దాదాపు 99 శాతానికి చేరినట్లయ్యింది. ఆర్థిక సంవత్సరంలో ఇంకా నాలుగు నెలలు మిగిలి ఉండగానే ద్రవ్యలోటు 99 శాతానికి చేరిపోవడం స్థూల ఆర్థిక రంగానికి సంబంధించి చర్చనీయాంశం. గత ఏడాది ఇదే నెలకు ద్రవ్యలోటు 93.9 శాతంగా ఉంది. కేంద్రానికి ఒక నిర్దిష్ట ఏడాదిలో వచ్చే మొత్తం ఆదాయం-చేసే వ్యయం మధ్య వ్యత్యాసాన్ని ద్రవ్యలోటుగా పేర్కొంటాం. రెవెన్యూ భారీగా తగ్గడమే తాజా పరిస్థితికి కారణమని సంబంధిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం మొత్తంగా రూ.9.77 లక్షల కోట్ల నికర పన్ను వసూళ్లను బడ్జెట్ అంచనా వేసింది. అయితే నవంబర్ నాటికి ఈ మొత్తం రూ.4.13 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ తాజాగా ఈ గణాంకాలను విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ద్రవ్యలోటును 4.1 శాతం (రూ.5.31 లక్షల కోట్లు) వద్ద కట్టడి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పటికే ఈ పరిమాణం 98.9 శాతానికి చేరడంతో లక్ష్యసాధన కష్టమేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2013-14లో జీడీపీలో ద్రవ్యలోటు 4.5 శాతం (రూ.5.08 లక్షల కోట్లు). 2012-13లో ఇది 4.9 శాతంగా ఉంది.