
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయ–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు తీవ్ర ఆందోళనకరమైన స్థాయికి చేరింది. డిసెంబర్ ముగిసే నాటికే రూ.11,58,469 కోట్లకు ఎగసింది. 2020–21 వార్షిక బడ్జెట్ లక్ష్యాలను దాటి ఏకంగా 145.5 శాతానికి చేరింది. రెవెన్యూ భారీగా తగ్గిపోవడం దీనికి నేపథ్యం. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. నిజానికి ద్రవ్యలోటును రూ.7.96 లక్షల కోట్లకు (స్థూల దేశీయోత్పత్తిలో 3.5 శాతం) పరిమితం చేయాలని 2020 ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ నిర్దేశించింది. అయితే జూలైలోనే ఈ పరిమితిని దాటి ద్రవ్యలోటు పెరిగిపోయింది.
గణాంకాలు ఇలా...
గణాంకాల ప్రకారం డిసెంబర్ 2020 వరకూ భారత్ ప్రభుత్వం రూ.11.21 లక్షల కోట్ల ఆదాయాన్ని పొందింది. దీనిలో రూ.9,62,399 కోట్లు పన్ను వసూళ్లు. రూ.1,26,181 కోట్లు పన్ను యేతర వసూళ్లు. రూ.33,098 కోట్లు నాన్–డెట్ క్యాపిటలర్ రిసిట్స్. నాన్–డెట్ క్యాపిటలర్ రిసిట్స్‌లో రుణ రికవరీలు (రూ.14,202 కోట్లు), పెట్టుబడుల ఉపసంహరణల ద్వారా వచ్చిన నిధులు (రూ.18,896 కోట్లు) ఉన్నాయి. అయితే కేంద్ర వ్యయాలు ఇదే సమయంలో రూ.22.80 లక్షల కోట్లుగా ఉన్నాయి.
7 శాతం పెరిగే అవకాశాలు...: 2019–20లో ద్రవ్యలోటు 4.6 శాతంగా నమోదయ్యింది. ఆదాయ వనరుల తగ్గుదల కారణం. కరోనా మహమ్మారితో రెవెన్యూ వసూళ్లు 2020–21లో మరింత పడిపోయాయి. దీనితో ద్రవ్యలోటు 7 శాతం దాటిపోతుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. తొలి 3.5 శాతం (జీడీపీ) అంచనాలు... తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏ స్థాయికి చేరతాయన్న అంశాన్ని తెలుసుకోడానికి ఫిబ్రవరి 1వ తేదీ ఆర్థికమంత్రి బడ్జెట్ సమర్పణ వరకూ ఆగాల్సి ఉంటుంది.