రానున్నది బ్యాలెన్స్‌డ్‌ బడ్జెట్‌.. | Employment generation, inclusive growth to be budget focus | Sakshi
Sakshi News home page

రానున్నది బ్యాలెన్స్‌డ్‌ బడ్జెట్‌..

Jan 26 2023 4:44 AM | Updated on Jan 26 2023 4:44 AM

Employment generation, inclusive growth to be budget focus - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వచ్చే నెల 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ సమతుల్యంగా ఉంటుందని ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు. ఉపాధి కల్పనతోపాటు, మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయింపులు పెంచొచ్చని భావిస్తున్నారు. పన్నుల పరంగా సౌలభ్యం, ద్రవ్యోలోటును నియంత్రణలో ఉంచి, ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెడతారన్న అభిప్రాయాలు నిపుణులు, ఇన్వెస్టర్ల నుంచి వినిపించాయి.

‘‘ఎన్నికల ముందు బడ్జెట్‌ నుంచి ఇన్వెస్టర్లు మూడింటిని ఆశిస్తున్నారు. మూలధన లాభాల పన్నుకు సంబంధించి ఏకీకృత పన్ను నిర్మాణం ఇందులో ఒకటి. దీనివల్ల ఖర్చు చేసే ఆదాయం మరింత మిగులుతుంది. ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి కీలకమైన ద్రవ్య స్థిరీకరణ రెండోది. వృద్ధికి అవరోధాలుగా మారిన సబ్సిడీల స్థిరీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలు, పీఎస్‌యూల ప్రైవేటీకరణ లేదా స్థిరీకరణపై చర్య లు ఉంటాయని అంచనా వేస్తున్నారు’’అని ఆనంద్‌రాఠి షేర్స్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకర్స్‌ ఈక్విటీ రీసెర్చ్‌ హెడ్‌ నరేంద్ర సోలంకి తెలిపారు.

ఈ నెల ఇప్పటి వరకు మార్కెట్లు ఫ్లాట్‌గా ఒక శ్రేణి పరిధిలోనే ట్రేడ్‌ అవుతుండడం తెలిసిందే. కంపెనీల ఫలితాలు సైతం మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చేంత సానుకూలంగా లేవు. కనుక బడ్జెట్‌ ప్రతిపాదనలపైనే మర్కెట్‌ గమనం ఆధారపడి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటి వరకు రూ.16,500 కోట్ల అమ్మకాలు చేశారు. చౌక వ్యాల్యూషన్లలో ట్రేడ్‌ అవుతున్న చైనా తదితర వర్ధమాన మార్కెట్లకు తమ పెట్టుబడులు తరలిస్తున్నారు.

ద్రవ్యోల్బణం, అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం భయాలు కూడా ఇన్వెస్టర్ల మనుసుల్లో ఉన్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది. గడిచిన పదేళ్లలో బడ్జెట్‌కు ముందు ఆరు సందర్భాల్లో మార్కెట్లలో ర్యాలీ కనిపించింది. గత పదేళ్లలో బడ్జెట్‌ తర్వాత ఆరు సందర్భాల్లో మార్కెట్లు నష్టపోయాయి. బడ్జెట్‌ రోజు నిఫ్టీ–50 ఏడు సందర్భాల్లో నష్టాలను చవిచూసింది. వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థకు సానుకూలించే చర్యలు బడ్జెట్‌లో ఉంటే మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తుంటాయి. ప్రతికూల ప్రతిపాదనలు ఉంటే నష్టపోతుండడం సహజం. కానీ, ఇది తాత్కాలిక పరిణామంగానే ఉంటుంది.  

మూలధన లాభాల పన్ను పెంచితే ప్రతికూలం
‘‘వచ్చే బడ్జెట్‌ ప్రభావం అన్నది అందులోని ప్రతిపాదనలపైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా 2023–24 ద్రవ్యలోటును మార్కెట్లు జాగ్రత్తగా గమనిస్తాయి. 6 శాతానికి పైన అంచనాలు ఉంటే అది మార్కెట్లను నిరుత్సాహపరుస్తుంది. కానీ, ఇది జరగకపోవచ్చు’’అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ వీకే విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. మూలధన లాభాల పన్నును పెంచితే అది మార్కెట్‌కు ప్రతికూలంగా మారుతుందున్నారు. ఆర్థిక వ్యవస్థ లేదా ఖర్చు చేసే ఆదాయం మిగులుకు సంబంధించి ఎటువంటి ప్రతిపాదనలు ఉన్నా కానీ, అవి మార్కెట్‌పై చెప్పుకోతగ్గ ప్రభావం చూపిస్తాయని జార్విస్‌ ఇన్వెస్ట్‌ సీఈవో సుమీత్‌ చందా అభిప్రాయపడ్డారు.

వేతన జీవుల పన్ను శ్లాబుల్లో మార్పులు లేదా కంపెనీల మూలధన వ్యయాలకు ప్రోత్సాహకాలు లేదా పన్నుల తగ్గింపు చర్యలు ఉంటే మార్కెట్లలో ర్యాలీని చూస్తామన్నారు. పీఎల్‌ఐ పథకం విస్తరణ, పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదనలు, పన్ను శ్లాబుల్లో ఉపశమనం చర్యలు ఉంటే మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తాయని అన్మి ప్రెసిడెంట్‌ కమలేష్‌షా అభిప్రాయపడ్డారు. బడ్జెట్‌ ప్రభావం మార్కెట్లపై చాలా స్వల్పకాలమేనని, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో జరిగే పరిణామాలు తదుపరి మార్కెట్లను నడిపించే అంశాలుగా పేర్కొన్నారు. ఫిబ్రవరి 1 ఫెడ్‌ వ్యాఖ్యలు డోవిష్‌గా ఉండి, ద్రవ్యోల్బణం దిగొస్తే మార్కెట్లు ర్యాలీ చేస్తాయని జియోజిత్‌ విజయ్‌కుమార్‌ అంచనా వేస్తున్నారు. హెల్త్‌కేర్, ఫెర్టిలైజర్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్, ఇన్సూరెన్స్, తయారీ, డిజిటలైజేషన్, కమ్యూనికేషన్, విద్య, ఎస్‌ఎంఈ రంగాలకు బడ్జెట్‌లో ప్రయోజనాలు ఉండొచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

కాంటార్‌ సర్వే
అనలైటిక్స్‌ సంస్థ కాంటార్‌ బడ్జెట్‌కు ముందు నిర్వహించిన సర్వే అంశాలను పరిశీలించినట్టయితే..
► ప్రతి నలుగురిలో ఒకరు ఉద్యోగాల తొలగింపులపై ఆందోళనతో ఉన్నారు.
► ప్రతి నలుగురిలో ముగ్గురు పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఆందోళకరమని పేర్కొన్నారు. దీన్ని కట్టడి చేసేందుకు చర్యలు అవసరమని చెప్పారు.
► సగం మంది దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది వృద్ధి బాటలో కొనసాగుతుందని భావిస్తుంటే, 31 శాతం నిదానిస్తుందన్న అభిప్రాయంతో ఉన్నారు.
► మెట్రో జనాభాతో పోలిస్తే నాన్‌ మెట్రోల్లో 54 శాతం మంది ఆర్థిక వ్యవస్థ పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారు.  
► ఆదాయపన్ను మినహాయింపుగా ఉన్న బేసిక్‌ పరిమితి రూ.2.5 లక్షలను పెంచొచ్చన్న అభిప్రాయం ఎక్కువ మంది నుంచి వినిపించింది. అలాగే, గరిష్ట పన్ను 30 శాతం శ్లాబ్‌కు సంబంధించి ఆదాయ పరిమితిని పెంచొచ్చనే అంచనా వ్యక్తమైంది.
► సెక్షన్‌ 80సీ కింద పన్ను ఆదా రాయితీలు పెంచుతారని మూడింట ఒక వంతు మంది చెప్పారు.  
► కరోనా మహమ్మారి దాదాపు ముగిసినట్టేనని, అయినప్పటికీ ఆరోగ్య సంరక్షణకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వాలని 55 శాతం మంది కోరుతున్నారు.  
► హైదరాబాద్‌ సహా 12 పట్టణాల్లో గత డిసెంబర్‌ 15 నుంచి ఈ ఏడాది జనవరి 15 మధ్య కాంటార్‌ సర్వే జరిగింది. 21–55 సంవత్సరాల వయసులోని 1,892 మంది వినియోగదారులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement