న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) సెప్టెంబర్ ముగిసే నాటికి రూ.5.26 లక్షల కోట్లకు చేరింది. బడ్జెట్‌లో నిర్దేశించుకున్న లక్ష్యంతో పోల్చితే ఈ పరిమాణం 35 శాతానికి చేరింది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) శుక్రవారం తాజా గణాంకాలను విడుదల చేసింది.
2021–22లో రూ.15,06,812 కోట్ల వద్ద ద్రవ్యలోటు ఉంటుందని ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనావేసింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలతో పోల్చితే ఇది 6.8 శాతం. అంచనాలతో పోల్చితే సెప్టెంబర్ నాటికి ద్రవ్యలోటు రూ.5,26,851 కోట్లకు (35 శాతం) చేరిందన్నమాట. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ప్రస్తుత ద్రవ్యలోటు పరిస్థితి అదుపులో ఉండడం గమనార్హం.
కరోనా కష్టాల నేపథ్యంలో పడిపోయిన ఆదాయాలు– పెరిగిన వ్యయాల నేపథ్యంలో గత ఏడాది ఇదే కాలానికి ద్రవ్యలోటు అప్పటి బడ్జెట్ అంచనాలను దాటి ఏకంగా 114.8 శాతానికి ఎగసింది. 2020–21లో 3.5 శాతం తొలి (బడ్జెట్) అంచనాలను మించి ద్రవ్యలోటు 9.3 శాతానికి ఎగసింది. తాజా సమీక్షా కాలానికి సంబంధించి ముఖ్య గణాంకాలను పరిశీలిస్తే...
2020–21తో పోల్చితే పురోగతి
► 2021 సెప్టెంబర్ నాటికి ప్రభుత్వ ఆదాయాలు రూ.10.99 లక్షల కోట్లు. బడ్జెట్ మొత్తం ఆదాయ అంచానల్లో ఈ పరిమాణం 55.5 శాతానికి చేరింది. గత ఆర్థిక సంవత్సరం (2020–21) ఇదే కాలంలో బడ్జెట్ మొత్తం ఆదాయ అంచనాల్లో సెప్టెంబర్ నాటికి ఒనగూరింది కేవలం 25.2 శాతమే కావడం గమనార్హం. మొత్తం ఆదాయాల్లో పన్నుల విభాగం నుంచి తాజా సమీక్షా కాలానికి (2021 సెప్టెంబర్ నాటికి) వచ్చింది రూ.9.2 లక్షల కోట్లు. బడ్జెట్ అంచనాల్లో ఇది 59.6 శాతం. అయితే గత ఆర్థిక సంవత్సరం (2020–21) ఇదే కాలానికి బడ్జెట్ మొత్తం పన్ను వసూళ్ల అంచనాల్లో సెప్టెంబర్ నాటికి ఒనగూరింది కేవలం 28 శాతమే కావడం గమనార్హం.
► ఇక సమీక్షా కాలంలో ప్రభుత్వ వ్యయాలు రూ.16.26 లక్షల కోట్లు. 2021–22 బడ్జెట్ మొత్తం వ్యయ అంచనాల్లో ఇది 46.7 శాతం. వెరసి ద్రవ్యలోటు సెప్టెంబర్ నాటికి రూ.5.26 లక్షల కోట్లకు చేరిందన్నమాట.
సెప్టెంబర్‌లో మౌలిక రంగం స్పీడ్ 4.4 శాతం
ఎనిమిది మౌలిక పారిశ్రామిక రంగాల గ్రూప్ ఉత్పత్తి సెప్టెంబర్‌లో 4.4 శాతం పెరిగింది. వాణిజ్య, పరిశ్రమల శాఖ శుక్రవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. ఈ ఎనిమిది రంగాల వృద్ధితీరు 2020లో కేవలం 0.6 శాతం. అప్పటి అతి తక్కువ లో బేస్ పరిస్థితిలో కూడా మౌలిక రంగం కేవలం 4.4 శాతం పురోగమించడం గమనార్హం. లో బేస్ కారణంతోనే 2021 ఆగస్టులో వృద్ధిరేటు భారీగా 11.5 శాతంగా ఉంది. మౌలిక రంగాల తీరు సమీక్షా నెల్లో వేర్వేరుగా చూస్తే... సహజవాయువు ఉత్పత్తి 27.5 శాతం పురోగతి సాధిస్తే, రిఫైనరీ ప్రొడక్టుల ఉత్పత్తి 6 శాతం ఎగసింది. ఇక సిమెంట్ ఉత్పత్తి 10.8 శాతం పెరిగింది. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి 1.7 శాతం క్షీణించింది. ఎరువుల రంగం స్వల్పంగా 0.02 శాతం పురోగమించింది. విద్యుత్ ఉత్పత్తి కూడా ఇదే విధంగా 0.3 శాతం పెరిగింది. స్టీల్ రంగం పనితీరు కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఇక బొగ్గు ఉత్పత్తి వృద్ధి రేటు 8.1 శాతం.
Comments
Please login to add a commentAdd a comment