
క్యూ3లో పుంజుకుంటుంది
కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి తగ్గుముఖం పట్టడం అన్నది.. వ్యవస్థీకృతం కాదని (ఆర్థిక వ్యవస్థ అంతటా) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి మెరుగైన మూలధన వ్యయాల మద్దతుతోతగ్గిన మేర డిసెంబర్ త్రైమాసికంలో (క్యూ3) భర్తీ అయ్యి మోస్తరు స్థాయికి వృద్ధి చేరుకుంటున్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 5.4 శాతానికి పడిపోవడం తెలిసిందే. ఇది ఏడు త్రైమాసికాల కనిష్ట రేటు కావడం గమనార్హం. జూన్ త్రైమాసికంలో వృద్ధి రేటు 6.7 శాతంగా ఉంది. ‘‘ఇది వ్యవస్థ అంతటా మందగమనం కాదు. ప్రభుత్వం వైపు నుంచి వ్యయాలు, మూలధన వ్యయాలు లోపించడం వల్లే. క్యూ3లో ఇవన్నీ సర్దుకుంటాయి.
భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా వచ్చే ఏడాది, తర్వాత కూడా కొనసాగుతుంది’’అని ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా ఆర్థిక మంత్రి చెప్పారు. అంతర్జాతీయ డిమాండ్ స్తబ్దుగా ఉండడం ఎగుమతుల వృద్ధిపై ప్రభావం చూపించినట్టు తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం వైపు నుంచి పెద్ద ఎత్తున మూలధన వ్యయాలు చేయకపోవడం, కొన్ని రంగాల్లో తగ్గిన కార్యకలాపాలు వృద్ధిపై ప్రభావం చూపించడం తెలిసిందే. 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.11.11 లక్షల కోట్ల మూలధన వ్యయాలను కేంద్రం లక్ష్యంగా నిర్ధేశించుకోగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 37.3 శాతమే ఖర్చు చేసింది.
చర్యలు తీసుకుంటున్నాం..
‘‘దేశ ప్రజల కొనుగోలు శక్తి మెరుగుపడుతోంది. అదే సమయంలో వేతనాల్లోనూ మందగమనం ఆందోళనలు నెలకొన్నాయి. ఈ అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇవి దేశ వినియోగంపై ప్రభావం చూపించగలవు. ప్రతి సవాలు నుంచి అవకాశాలను చూసే ప్రధాన మంత్రి మనకు ఉన్నారు. కరోనా సమయంలో ఎదురైన సవాళ్లను అవకాశాలుగా మలుచుకుని సంస్కరణలు తీసుకొచ్చాం. ఆ సమయంలో ఐదు మినీ బడ్జెట్లను ప్రవేశపెట్టాం. విడిగా ప్రతి ఒక్కటీ తనవంతు మద్దతునిచి్చంది’’అని మంత్రి సీతారామన్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment