11 శాతం పెరిగిన సూక్ష్మ రుణాలు | Microfinance loans grow 11percent to Rs 71916 crore in Q2 FY23 | Sakshi
Sakshi News home page

11 శాతం పెరిగిన సూక్ష్మ రుణాలు

Dec 19 2022 6:19 AM | Updated on Dec 19 2022 6:19 AM

Microfinance loans grow 11percent to Rs 71916 crore in Q2 FY23 - Sakshi

న్యూఢిల్లీ: సూక్ష్మ రుణ పరిశ్రమ (మైక్రోఫైనాన్స్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో 11 శాతం అధికంగా రూ.71,916 కోట్ల రుణాలను పంపిణీ చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రుణాల పంపిణీ రూ.64,899 కోట్లుగా ఉంది. మొత్తం రుణాల సంఖ్య 1.81 కోట్లుగా కాగా, క్రితం ఏడాది ఇదే కాలంలో మొత్తం పంపిణీ చేసిన రుణాల సంఖ్య 1.85 కోట్లుగా ఉంది. ద్వితీయ త్రైమాసికానికి సంబంధించి గణంకాలను మైక్రో ఫైనాన్స్‌ ఇనిస్టిట్యూషన్స్‌ నెట్‌వర్క్‌ (ఎంఫిన్‌) విడుదల చేసింది.

పరిశ్రమ మొత్తం రుణ పోర్ట్‌ఫోలియో విలువ రూ.3 లక్షల కోట్లకు చేరింది. మొత్తం 12 కోట్ల రుణ ఖాతాలకు సేవలు అందిస్తోంది. ‘‘మైక్రోఫైనాన్స్‌ పరిశ్రమ స్థూల రుణ పోర్ట్‌ఫోలియో (జీఎల్‌పీ) రూ.3,00,974 కోట్లకు చేరింది. 2021 సెప్టెంబర్‌ చివరికి ఉన్న రూ.2,43,737 కోట్లతో పోలిస్తే 23.5 శాతం వృద్ధి చెందింది’’ అని ఈ నివేదిక వెల్లడించింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో పంపిణీ చేసిన ఒక్కో రుణం సగటున రూ.40,571గా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 12 శాతం పెరిగింది.  

ఒక వంతు వాటా పీఎస్‌బీలదే
ఈ మొత్తం రుణాల్లో 13 ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) సంయుక్తంగా 37.7 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఎన్‌బీఎఫ్‌సీ మైక్రోఫైనాన్స్‌ ఇనిస్టిట్యూషన్స్‌ (ఎన్‌బీఎఫ్‌సీ–ఎంఎఫ్‌ఐ) 36.7 శాతం వాటా (రూ.1,10,418 కోట్లు) కలిగి ఉన్నాయి. స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు సూక్ష్మ రుణాల్లో 16.6 శాతం వాటా (రూ.50,029) ఆక్రమించాయి. ఇక ఎన్‌బీఎఫ్‌సీలు 7.9 శాతం, ఇతర సూక్ష్మ రుణ సంస్థలు 1.1 శాతం మేర రుణాలను పంపిణీ చేసి ఉన్నాయి. మైక్రోఫైనాన్స్‌ యాక్టివ్‌ (సకాలంలో చెల్లింపులు చేసే) రుణ ఖాతాలు గత 12 నెలల్లో (సెప్టెంబర్‌తో అంతమైన చివరి) 14.2 శాతం పెరిగి 12 కోట్లకు చేరాయి. తూర్పు, ఈశాన్యం, దక్షిణాది ప్రాంతాలు మొత్తం సూక్ష్మ రుణాల్లో 63.9 శాతం వాటా కలిగి ఉన్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే తమిళనాడు ఎక్కువ వాటా ఆక్రమిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement