![Europe Population in 2100 set profound transformation shift in trends influenced by birth rates aging migration](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/population01.jpg.webp?itok=qTxMvpUI)
2100 నాటికి యూరప్‌లో భారీగా జనాభా తగ్గుదల
ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నిరుద్యోగం పెచ్చురిల్లుతోంది. సరైన సంపాదన అవకాశాలులేక ప్రజలు పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు. దానికితోడు కొన్నిదేశాల్లో పెరుగుతున్న జనాభా ఆయా ప్రాంతాల అభివృద్ధికి సవాలుగా మారుతుంటే.. యూరప్‌లాంటి ఇంకొన్ని ప్రాంతాల్లో తగ్గుతున్న జనాభా భవిష్యత్తులో శ్రామికశక్తి లోటును సూచిస్తోంది. జనన రేటు, వృద్ధాప్యం, వలసలు, ఆర్థిక మార్పులు వంటి వివిధ అంశాలతో 2100 నాటికి యూరప్ జనాభా భారీగా తగ్గిపోతుందని కొన్ని సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి జనాభాను ఆకర్షించేందుకు, స్థానికులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేసేందుకు యూరప్ దేశాలు కొన్ని ప్రత్యేక వెసులుబాట్లు కల్పిస్తున్నాయి. అసలు యూరప్‌లో ఈ పరిస్థితులు నెలకొనేందుకుగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వృద్ధులు అధికమవుతుండడం
యూరప్ 2100 నాటికి ప్రపంచంలోనే అత్యధిక వృద్ధాప్య జనాభా ఉన్న ప్రాంతాల్లో ఒకటిగా ఉంటుందని అంచనా. ఆరోగ్య సంరక్షణలో పురోగతి వల్ల వృద్ధుల నిష్పత్తి గణనీయంగా పెరుగుతుంది. ఇప్పటికే జర్మనీ, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో భారీగా వృద్ధులు పెరుగుతున్నారు. దేశ ఉత్పాదకతలో పెద్దగా పాలుపంచుకోని ఈ జనాభా వల్ల సామాజిక సంక్షేమ వ్యవస్థలు, ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు, పెన్షన్ పథకాలపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు, వృద్ధాప్య సమాజానికి మద్దతు ఇవ్వడానికి సమగ్ర విధాన సంస్కరణలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/09_37.jpg)
తగ్గుతున్న జననాల రేటు
అనేక యూరప్ దేశాల్లో జననాల రేటు క్షీణిస్తోంది. ఈ ధోరణి రాబోయే దశాబ్దాల్లో అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. మారుతున్న సామాజిక నిబంధనలు, ఆర్థిక ఒత్తిళ్లు, జీవనశైలి వంటి అంశాలు ఈ తగ్గుదలకు దోహదం చేస్తాయి. దాంతో భవిష్యత్తులో గ్రీస్, పోర్చుగల్, హంగేరి వంటి దేశాలు స్థిరమైన శ్రామిక శక్తిని నిర్వహించడంలో సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఇది కార్మికుల కొరతకు, ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది. దీన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు అధిక జనన రేటుకు అవసరమయ్యే విధానాలను అమలు చేయాలి. యువతకు, పనిచేసే తల్లిదండ్రులకు మద్దతుగా నిలిచేందుకు వినూత్న పరిష్కారాలను అన్వేషించాలి.
వలసలే శరణ్యం?
2100 నాటికి యూరప్ జనాభాపై వలసలు కీలక పాత్ర పోషిస్తాయని అంచనా వేస్తున్నారు. శ్రామిక కొరత, జనాభా అసమతుల్యతలను పరిష్కరించడానికి వలస విధానాలు మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. ఫ్రాన్స్, యునైటెడ్ కింగడమ్, స్వీడన్ వంటి దేశాలు గణనీయమైన సంఖ్యలో వలసదారులను ఆకర్షించే ప్రయత్నాలు చేయాల్సి ఉంది. ఇది జనాభా పెరుగుదలకు, వైవిధ్యానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలు ఈ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి.
స్పెయిన్: గ్రామీణ ప్రాంతాల్లో జనాభా తగ్గుదలను పరిష్కరించేందుకు ఆయా ప్రాంతాల్లో నివసించాలనుకునేవారికి ప్రత్యేకంగా 3,000 యూరోలు(రూ.2.7 లక్షలు) అందిస్తుంది. పిల్లలతో ఉన్న కుటుంబాలు అదనపు బోనన్‌ను పొందవచ్చు.
ఇటలీ: ఇటలీ తన ప్రాంతాల్లో తిరిగి జనావాసాన్ని పెంచే కార్యక్రమాలను ప్రారంభించింది. మోలిస్, కాలాబ్రియా, సిసిలీ వంటి ప్రాంతాల్లో నివసించాలనుకునే కొత్తవారికి మూడు సంవత్సరాలకుగాను 28,000 యూరోలు(రూ.25.44 లక్షలు) అందిస్తుంది. దాంతోపాటు స్థానిక వ్యాపారాన్ని ప్రారంభించడానికి గ్రాంట్లు కూడా పొందవచ్చు. ఒక యూరో(సుమారు రూ.91) కంటే తక్కువకు గృహాలను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తుంది.
గ్రీస్: మారుమూల ద్వీపం అంటికైథెరాలో నివసించడానికి గ్రీస్ కొత్త నివాసితులను ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభించింది. అక్కడ నివసించాలనుకునే వారికి గృహ సహాయంతో పాటు ఏటా 3,000 యూరోలు(రూ.2.7 లక్షలు) వరకు గ్రాంట్లను అందిస్తుంది. ఈ చొరవ వల్ల ఆ ద్వీపం సంస్కృతిని పరిరక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఐర్లాండ్: ఐర్లాండ్ ద్వీపాల్లో నివసించడానికి ఇష్టపడేవారికి గృహ పునరుద్ధరణ, పునరావాస గ్రాంట్ల కోసం ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/10_39.jpg)
పట్టణీకరణ, ప్రాంతీయ అసమానతలు
పట్టణీకరణ పెరుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఉపాధికోసం, ఇతర కారణాల వల్ల లండన్, పారిస్, బెర్లిన్ వంటి ప్రధాన నగరాల్లో నివసిస్తున్నారు. ఇవి ఆర్థిక కార్యకలాపాలు, సాంస్కృతిక వైవిధ్యానికి కేంద్రాలుగా ఉన్నప్పటికీ ప్రాంతీయ అసమానతలకు దారితీస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలు జనాభా, ఆర్థిక క్షీణతను ఎదుర్కొంటున్నాయి. ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టడం, తక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో అవకాశాలను పెంపొందించడం ద్వారా ఈ అసమతుల్యతలను పరిష్కరించాలి.
సాంకేతిక పురోగతి, భవిష్యత్తు అవకాశాలు
యూరప్ భవిష్యత్తు జనాభాను పెంపొందించడంలో సాంకేతిక పురోగతి కీలక పాత్ర పోషిస్తుంది. ఆటోమేషన్, కృత్రిమ మేధస్సు, ఆరోగ్య సంరక్షణలో పురోగతి శ్రామిక శక్తిని ప్రభావితం చేస్తాయి. ప్రభుత్వాలు, వ్యాపారాలు నూతన మార్పులకు అనుగుణంగా మారాలి. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో అవసరమైన నైపుణ్యాలు, వనరులను పౌరులు కలిగి ఉన్నారో లేదో నిర్ధారించుకుని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి.
ఇదీ చదవండి: కుమారుడి పెళ్లి ఖర్చుపై విమర్శలు.. నీతా అంబానీ రిప్లై
2100 నాటికి యూరప్ దేశాల్లో జనాభా క్షీణత ఇలా..
దేశం జనాభా క్షీణత తగ్గుదల
పోలాండ్ 1.88 కోట్లు 49%
జర్మనీ 1.31 కోట్లు 16%
ఇటలీ 2.38 కోట్లు 40%
ఉక్రెయిన్ 2.38 కోట్లు 61%
బల్గేరియా 32 లక్షలు 47%
లిథువేనియా 16 లక్షలు 57%
లాట్వియా 9.28 లక్షలు 50%
సెర్బియా 30 లక్షలు 45%
హంగేరీ 22 లక్షలు 23%
Comments
Please login to add a commentAdd a comment