పావురాలు, ఉడుతలు.. ప్రకృతికి, మనిషికి ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయనే సంగతి మీకు తెలుసా? అమెరికన్, యూరోపియన్ శాస్త్రవేత్తలు ఈ చిన్ని ప్రాణులు మనకు ఎంతో హాని చేస్తున్నాయనే విషయాన్ని గుర్తించారు. దీంతో ఈ జంతువుల సంఖ్యను తగ్గించడంపై దృష్టి సారించారు. దీనిలో భాగంగా పావురాలకు, కుందేళ్లకు గర్భనిరోధక మాత్రలు ఇవ్వాలని శాస్త్రవేత్తలు యోచిస్తున్నారు.
పావురాలు, ఉడుతలేకాదు అడవి పందులు, చిలుకలు, జింకలు మొదలైనవి అటు ప్రకృతికి ఇటు మనుషులకు ముప్పుగా మారుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోజురోజుకు వీటి సంఖ్య పెరగడమే ఇందుకు కారణమని వారు అంటున్నారు. ఉడుతలలోని గ్రే స్క్విరెల్ జాతిని 1800లో అమెరికా నుండి ఇంగ్లండ్‌కు తీసుకువచ్చారు. ఇప్పుడు ఇక్కడ వాటి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇవి చెట్ల బెరడును తొలిచి కలపనునాశనం చేస్తున్నాయి. ఈ ఉడుతల వల్ల ఏటా దాదాపు రూ.40 కోట్ల మేర నష్టం వాటిల్లుతున్నట్లు రాయల్ ఫారెస్ట్రీ సొసైటీ ఆఫ్ ఇంగ్లండ్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
ఇక పావురాల విషయానికొస్తే అవి మనుషులకు శ్వాసకోశ సమస్యలను కలిగిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదేవిధంగా మరికొన్ని జంతువులు మనుషులకు హాని కలిగిస్తున్నాయి. అందుకే వాటి సంఖ్యను నియంత్రించేందుకు వాటికి గర్భనిరోధక మాత్రలు ఇచ్చే ప్రయోగాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. కాంటినెంటల్ యూరప్, స్కాండినేవియాలో గతంలో అడవి పందుల సంఖ్య దాదాపు 5 లక్షలు ఉండగా, 2020 నాటికి వాటి సంఖ్య 10 లక్షలకు పెరిగిందని ఇటలీ రైతు సంఘాలు చెబుతున్నాయి. వీటి కారణంగా పంటలు దెబ్బతినడమే కాకుండా, రోడ్డు ప్రమాదాలు కూడా గణనీయంగా పెరిగాయి.
ఈ జంతువుల సంఖ్యను తగ్గించడానికి, వాటిని చంపడం కంటే పునరుత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించడం ఉత్తమమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ది గార్డియన్‌లో ప్రచురితమైన కథనం ప్రకారం ఈ జంతువులు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, పర్యావరణ నష్టాలను కలిగిస్తున్నాయని న్యూయార్క్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ జియోవన్నా మాస్సే తెలిపారు. ఈ జంతువుల సంఖ్యను నియంత్రించేందుకు, వాటి ఆహార గింజల్లో గర్భనిరోధక మాత్రలు కలపాలని యోచిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
బ్రిటన్‌లో ఉడుతలకు హాజెల్‌నట్ అనే పండులో గర్భనిరోధక మాత్రలు ఉంచి వాటికి ఇస్తున్నారు. ఈ ప్రయోగ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పావురాలు, ఇతర పక్షుల సంఖ్యను నియంత్రించడానికి వాటికి అవి తినే గింజలలో గర్భనిరోధక మాత్రలు కలిపి ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment