లెక్కల్లో ఎంత పండితుడైనా ఓడిపోయే చిక్కులెక్కలు ఉంటూనే ఉంటాయి; లెక్క తప్పే సందర్భాలు మనిషికి ఎదురవుతూనే ఉంటాయి. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి ‘వడ్లగింజలు’ కథే చూడండి; అందులో శంకరప్ప అనే చదరంగ నిపుణుడు అంతే ప్రవీణుడైన ‘శ్రీ వత్సవాయి చతుర్భుజ తిమ్మజగపతి మహారాజులుంగారి’ ఆట కట్టిస్తాడు. అప్పుడా మహారాజు, తన పెద్దాపురం రాజ్యంలో ఉన్నదేదైనా సమర్పించుకుంటాను, సెలవివ్వండని అడుగుతాడు.
ఒక వడ్లగింజతో మొదలుపెట్టి చదరంగంలోని అరవై నాలుగు గడుల్లోనూ గింజల్ని రెట్టింపు చేస్తూపోతే ఎన్ని గింజలవుతాయో అన్ని ఇప్పించండని శంకరప్ప అడుగుతాడు. ఓస్, అంతేకదా అనుకున్న రాజుగారు లెక్క కట్టమని షరాబును ఆదేశిస్తాడు. పెద్దాపురం రాజ్యంలోనే కాదు, త్రిలింగదేశం మొత్తంలో నూరేళ్లపాటు పండించిన ధాన్యం కూడా ఆయనకు ఇవ్వడానికి సరిపోదని అతను సెలవిస్తాడు.
మన లెక్కలనూ, అంచనాలనూ చిత్తు చేస్తున్నవాటిలో జనాభా సమస్య ఒకటి. ఆ లెక్క కూడా దాదాపు ఇలాగే మనల్ని చిక్కుల కీకారణ్యంలోకి తీసుకెళ్ళి విడిచిపెడుతుంది. ప్రపంచం మహాజనసాగరంగా మారుతున్న వైనాన్ని గమనించి దానిని ఎలా ఈదాలో ప్రణాళికలు వేయడం డెబ్బై ఏళ్లక్రితం మొదలుపెట్టాం. ఏవో కొండ గుర్తులు పెట్టుకుని, సంకల్పాలు చెప్పుకుని ఈదడమైతే ప్రారంభించాం కానీ, జనసముద్రం విస్తరిస్తూనే ఉంది. ఒక జంటకు ఇద్దరనే నినాదంతో ప్రారంభించి చివరికి ఒక్కరే చాలనుకోవడానికి అలవాటుపడ్డాం.
ఇంతలోనే ఈ లెక్క మారిపోతోంది; ఒకరూ, ఇద్దరితో సరిపెడితే ప్రమాదంలో పడతాం, ముగ్గురు, నలుగురిని కని తీరాలన్న నినాదం మన దగ్గర ఇప్పుడిప్పుడే శ్రుతి పెంచుకుంటోంది. దీనికి ఎవరి కారణాలు వారికే ఉన్నాయి. ఉదాహరణకు, ఒకరూ, ఇద్దరితో సరిపెడితే క్రమంగా వృద్ధుల సంఖ్య పెరిగి, యువకుల సంఖ్య తగ్గి అభివృద్ధికి తోడ్పడే విలువైన మానవ వనరుకు కొరత వస్తుందన్నది ఒక కారణం.
పెరిగిన జనాభాను బట్టి లోక్ సభ, శాసన సభల్లోని స్థానాల సంఖ్యను పెంచుకోవలసి ఉంటుంది కనుక, అందువల్ల జననాలను నియంత్రించని ఉత్తరాది రాష్ట్రాలలో స్థానాల సంఖ్య పెరిగి, అన్నింటిలోనూ వారిదే పై చేయిగా మారుతుందనీ; దానితో జననాలను నియంత్రించిన రాష్ట్రాలకు అన్యాయం జరిగి, ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలుగుతుందన్నది మరో కారణం. నియంత్రణను పాటించిన అధిక సంఖ్యాక మతస్థులను మించి నియంత్రణను పాటించని అల్పసంఖ్యాక మతస్థుల సంఖ్య పెరిగిపోతుందన్నది మరికొందరు ముందుకు తెచ్చే కారణం. కారణమేదైనా నినాదం మారుతుండడం నిజం.
రెండు లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో ‘హోమో సేపియన్స్’ అనే ఆధునిక మానవుడు అవతరించడంతో మొదలుపెట్టి ఇప్పటివరకూ వస్తే జనాభా గణాంకాలు చిక్కులెక్కలుగానే కాదు చిత్రవిచిత్రాలుగానూ రూపుకడతాయి. హోమోసేపియన్స్ తొలి వృద్ధి రేటు కేవలం 0. 011 శాతం అయితే, ఆ శాతం ఏ కొంచెమైనా పెరుగుతూ 19వ శతాబ్ది ప్రారంభానికి వందకోట్లకు చేరడానికి వేల సంవత్సరాలు పట్టింది. అప్పటి నుంచి అది పెరుగుతూనే ఉండి, అతి స్వల్ప కాలంలోనే ఏడువందల కోట్లకు చేరింది.
మరో ఇరవయ్యేళ్లలో తొమ్మిది వందల కోట్లకు చేరుతుందని అంచనా. సమస్యను ఐక్యరాజ్యసమితి తన చేతుల్లోకి తీసుకుని పరిష్కరించడానికి ఎన్ని ప్రణాళికలు వేసి, ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా సమస్య ఎందుకు విషమిస్తూనే ఉందంటే, అభివృద్ధిలో దేశాల మధ్య తేడాలు, పేద, ధనిక వ్యత్యాసాలు మొదలైనవి కారణం.
పారిశ్రామిక విప్లవానికి లానే జనాభావృద్ధికీ, క్షీణతకూ కూడా యూరప్ తొలి ప్రయోగశాల అయింది. శాస్త్ర, సాంకేతిక అభివృద్ధీ, దానితోపాటే ఆహార పుష్కలత్వం, చదువూ సంధ్యా పెరగడంతోనే యూరప్ లో జనాభా పెరిగి క్రమంగా క్షీణిస్తూనూ వచ్చింది. సరిగ్గా ఇవే కారణాలతో వర్ధమానదేశాలలో కూడా జనాభా పెరగడం, ఆ తర్వాత క్షీణించడం మొదలైంది కానీ వృద్ధి రేటుకు ఆ క్షీణత రేటు తులతూగడం లేదు.
యూరప్ తర్వాత ఆసియాదేశాలు జనాభావృద్ధిలో అగ్రస్థానానికి వస్తే, ఇప్పుడా ఘనతను ఆఫ్రికా దేశాలు చేజిక్కించుకోబోతున్నాయి. ఇక్కడొక ఆసక్తికర వివరం ఏమిటంటే, 1950లలో మొత్తం ఆసియా దేశాల జనాభా 140 కోట్లు అయితే ఇప్పుడు దానిని కూడా మించిన జనాభా ఒక్క మన దేశంలోనే ఉంది.
అభివృద్ధికీ, ఆహార పుష్కలత్వానికీ, జనాభా వృద్ధికీ ఉన్న పీటముడిని మన ప్రాచీనులు సైతం గుర్తించారనడానికి మహాభారతమే సాక్ష్యం. పెరిగిన జనాభా భారాన్ని మోయలేకపోతున్నానని భూదేవి మొరపెట్టుకున్నప్పుడు, ఆహార లభ్యత వల్ల జనాభా పెరిగిందని, త్వరలోనే కురుపాండవుల మధ్య యుద్ధమొచ్చి పెద్ద ఎత్తున జననష్టం జరిగి నీ భారం తగ్గుతుందని చెప్పి బ్రహ్మ ఆమెను ఊరడిస్తాడు.
విశేషమేమిటంటే, 18వ శతాబ్ది చివరినాటికి యూరప్ అనుభవాన్ని గమనించిన థామస్ రాబర్ట్ మాల్తస్ అనే ఆర్థికవేత్త కూడా ఆహార లభ్యతకూ జనాభావృద్ధికీ ఉన్న సంబంధాన్ని నొక్కి చెప్పి, రోగాలు, కరవు కాటకాలు, యుద్ధాలే దానిని నియంత్రిస్తాయంటాడు. అలాంటి విధ్వంసక మార్గంలో కాకుండా విద్యా, విజ్ఞానాల ఊతతో జనమహాసాగరాన్ని ఈదడానికి మనం ఉపక్రమించి ఇంకా అందులోనే మునిగితేలుతున్నాం. ఇంతలోనే నినాదం మారిపోయి సమస్యను మళ్ళీ మొదటికి తెస్తోంది; అదీ సంగతి!
Comments
Please login to add a commentAdd a comment