ప్రతీకాత్మక చిత్రం
ప్రపంచదేశాల్లో ఇప్పటి వరకూ మరణ శిక్ష... ఉరి, విద్యుత్ కుర్చీ, విషపు ఇంజెక్షన్స్, తుపాకీ కాల్పులు వంటి పద్ధతుల ద్వారా ఎక్కువగా అమలవుతూ వస్తోంది. కానీ ప్రపంచంలోనే తొలి సారిగా అమెరికాలో ఓ 58 ఏళ్ల హంతకుడికి నైట్రోజన్ గ్యాస్ ద్వారా మరణ శిక్ష విధించారు. దీనిపై ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. ఐక్యరాజ్య సమితి, ఐరోపా సమాఖ్య సహా పలు సంస్థలు, వ్యక్తుల నుంచి ఈ తరహా మరణశిక్ష అమలు అనాగరికమంటూ తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికాలోని దక్షిణాది రాష్ట్రమైన అల బామాలో ఇటీవలే ప్రయోగాత్మకంగా స్మిత్ అనే ఖైదీకి మాస్క్ తగిలించి అందులో నైట్రోజన్ గ్యాస్ పంపడం ద్వారా అతన్ని అపస్మారక స్థితి లోకి తీసుకెళ్లి మరణశిక్షను విజయవంతంగా అమలు చేశారు. అంతే కాదు ఈ మరణశిక్ష అమ లును వీక్షించేందుకు కెన్నెత్ స్మిత్ కుటుంబీకులు, బాధిత కుటుంబ సభ్యులు, లాయర్లను కూడా పరిమిత సంఖ్యలో అనుమతించారు. చాలా సులువుగా కేవలం 22 నిమిషాల వ్యవధిలో కెన్నెత్ స్మిత్ ప్రాణాలు కోల్పోయాడు.
కానీ ఇప్పుడు దీన్ని అమలు చేసిన అమెరికా మాత్రం ప్రపంచం దృష్టిలో దోషిగా నిలబడింది. స్వదేశంలోనే ఈ మరణదండనపై తీవ్ర నిరస నలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఐక్యరాజ్య సమితి, ఐరోపా దేశాల సమాఖ్య (ఈయూ)లు అమెరికా తీరును ఖండించాయి. ఈ ఖండనలు, నిరసనలు ఏ స్థాయిలో ఉన్నా యంటే స్వయంగా వైట్ హౌస్ ఈ నైట్రోజన్ గ్యాస్ మరణ శిక్ష తమను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందనీ, ఇది క్రూరంగానే ఉందనీ అంగీకరించింది.
అమెరికాలో తాజాగా రెండు మరణశిక్షలు ఇంజెక్షన్ ద్వారా అమలు చేశారు. ప్రస్తుతం నైట్రోజన్ మరణశిక్షను అమలు చేసిన అల బా మాతో పాటు మరో రెండు రాష్ట్రాలు ఓక్లహోమా, మిస్సిసిపీలు ఈ తరహా మరణ శిక్ష అమలును ఆమోదించాయి. తాజాగా జరిగిన నైట్రోజన్ మరణశిక్ష అమలును అలబామా అటార్నీ జన రల్ స్టీవ్ మార్షల్ సమర్థించుకున్నారు. ఇది పూర్తిగా ప్రొఫెషనల్ పద్ధతిలో జరిగిందన్నారు.
కెన్నెత్ యూజీన్ స్మిత్‌కు ప్రాణాంతకమైన మందులతో మరణశిక్ష అమలు చేయాలని 2022 నవంబర్‌లో నిర్ణయించారు. జైలు సిబ్బంది ఒక ఇంట్రావీనస్ లైన్‌ను చొప్పించారు. అయితే ప్రాణాంతక ఇంజెక్షన్‌ను ఇవ్వడానికి రెండు లైన్లు అవసరం. రెండవ లైను చొప్పించడానికి వారు ఒక గంట పాటు పోరాడిన తర్వాత, ఉరిశిక్ష రద్దు చేశారు. కానీ స్మిత్ 1988లో ఒక బోధకుని భార్యను కిరాయికి చంపిన కేసులో ఇటీవల దోషిగా తేలడంతో మరణ శిక్ష విధించింది కోర్టు. ఈ శిక్షను నైట్రోజన్ వాయువును ఉపయోగించి అమలు చేశారు.
అమెరికా రాష్ట్రాలు కొన్ని ఇప్పటికీ ఉరి, ఫైరింగ్ స్క్వాడ్ లేదా ఎలక్ట్రిక్ కుర్చీ ద్వారా మరణ దండన విధానాన్ని అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్ర న్యాయస్థానాలు మాత్రం పలు రకాల మరణశిక్ష పద్ధతులను నిషేధించాయి. అయితే, గత కొన్ని దశాబ్దాల కాలంలో చాలా రాష్ట్రాలు ప్రాణాంతకమైన ఇంజెక్షన్ ద్వారా మరణ శిక్షను అమలు చేయడానికి అంగీకరించాయి.
స్మిత్‌కు మునుపటి ఉరిశిక్ష అమలుకు చాలా నెలల ముందు, అలబామా అధికారులు మరో ఖైదీ అలాన్ మిల్లర్‌కు ఐవీ సూదిని చొప్పించడంలో ఇబ్బందుల కారణంగా మరణశిక్ష అమలు చేయడంలో విఫలమయ్యారు. అలాగే ఇతర ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా కూడా మరణశిక్ష అమలు కాలేదు. అగ్రరాజ్యంలోని పలు రాష్ట్రాలు ఇటీవల ప్రాణాంతక ఇంజెక్షన్ మందులను పొందడంలో పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ఔషధ తయారీదారులు యునైటెడ్ కింగ్‌డమ్, యూరోపియన్ యూనియన్‌లు 2011లో ఇటువంటి ప్రాణాంతక ఇంజె క్షన్‌ల ఎగుమతులను నిషేధించాయి. దీంతో ఔషధ తయారీ కంపెనీలు వాటి తయారీని నిలిపివేశాయి. ఈ కారణంగా మరణ శిక్షను అమలు చేయడానికి రాష్ట్రాలుఇతర మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. అందులో ఒకటి నైట్రోజన్ వాయువును అందించి ప్రాణాలు తీయడం.
దోషి కెన్నెత్ స్మిత్ ముఖానికి మాస్క్ కట్టి, స్వచ్ఛమైన నైట్రోజన్ వాయువును జైలు అధికారులు అందించారు. వాయువు విషపూరితమైనది కాదు. భూ వాతావరణంలో మూడు వంతుల కంటే ఎక్కువ నైట్రోజన్ ఉంటుంది. కానీ స్వచ్ఛమైన సాంద్రీకృత రూపంలో ఉన్న ఈ గ్యాస్‌ను పీల్చడం వల్ల మెదడుకు ప్రసారం అయ్యే ఆక్సిజన్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అల బామా స్టేట్ అటార్నీ జనరల్ స్టీవ్ మార్షల్ మాట్లాడుతూ... నైట్రోజన్ వాయువును ఉప యోగించి, మరణశిక్షను అమలు చేయడం అత్యంత మానవీయమైన పద్ధతి’ అని పేర్కొ నడం గమనార్హం.
– వి.వి. వెంకటేశ్వరరావు
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ‘ 63008 66637
Comments
Please login to add a commentAdd a comment