Nitrogen
-
Wageningen University: 2050 నాటికి...నీటికి కటకటే!
నీటి కొరతతో ఇప్పటికే ప్రపంచం అల్లాడుతోంది. పలు దేశాల్లో ఈ సమస్య ఉగ్ర రూపు దాలుస్తోంది. తాగునీటి సమస్య యూరప్, ఆఫ్రికాల్లో పలు దేశాల మధ్య వివాదాలకు కూడా దారి తీస్తోంది. కొరతకు నీటి కాలుష్యమూ తోడవడంతో కొన్నేళ్లుగా పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారింది. అయితే ఇదంతా ట్రైలర్ మాత్రమేనని, సమీప భవిష్యత్తులో ఈ సమస్య పెను ఊపు దాల్చవచ్చని తాజా అధ్యయనం తేలి్చంది. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా మూడో వంతు నదీ పరీవాహక ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటికి తీవ్ర కొరత నెలకొనడం ఖాయమని పేర్కొంది! ఇది కనీసం 300 కోట్ల జనాభాను తీవ్రంగా ప్రభావితం చేయబోతోందని అంచనా వేయడం గుబులు రేపుతోంది... నదీ పరివాహక ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటి లభ్యతపై నెదర్లాండ్స్‌లోని వాగెనింగెన్ యూనివర్సిటీ సారథ్యంలోని బృందం అధ్యయనం నిర్వహించింది. చైనా, మధ్య యూరప్, ఉత్తర అమెరికా, ఆఫ్రికాతో పాటు భారత్‌లోని మొత్తం 10 వేల పై చిలుకు సదీ బేసిన్లు, సబ్ బేసిన్లలో నీటి నాణ్యత తదితరాలపై సుదీర్ఘ కాలం లోతుగా పరిశోధన చేసింది. వాటిలో ఏకంగా మూడో వంతు, అంటే 3,061 నదీ బేసిన్ల పరిధిలో నీరు తాగేందుకు దాదాపుగా పనికిరాకుండా పోనుందని హెచ్చరించింది. ఆయా బేసిన్ల పరిధిలోని జల వనరుల్లో నైట్రోజన్ వచ్చి కలుస్తుండటం ఇందుకు ప్రధాన కారణమని వెల్లడించింది. వాటిలో నైట్రోజన్ పరిమాణం కొంతకాలంగా మరీ ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతోందని తేలి్చంది. దీనికి నీటి కొరత తోడై పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోవచ్చని స్పష్టం చేసింది. జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురించిన ఈ పరిశోధన ఫలితాలు కలకలం రేపుతున్నాయి... అధ్యయనం ఇలా... ► ఆయా నదీ బేసిన్లు, సబ్ బేసిన్లలో నీటి ప్రవాహం, పరిమాణాన్ని లెక్కలోకి తీసుకున్నారు. ► వాటిలో కలుస్తున్న నైట్రోజన్ పరిమాణాన్ని నీటి పరిమాణంతో పోల్చి కాలుష్య స్థాయిని లెక్కించారు. ► 2010 నుంచి చూస్తే గత 13 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని నదీ బేసిన్లు, సబ్ బేసిన్లలోనూ నైట్రోజన్ పరిమాణం క్రమంగా పెరుగుతూ వస్తున్నట్టు తేలింది. ► 2010లో నాలుగో వంతు బేసిన్లలో కనిపించిన ఈ సమస్య ఇప్పుడు మూడో వంతుకు విస్తరించింది. పైగా వాటి కాలుష్య కారకాల్లో నైట్రోజన్ పాత్ర ఏకంగా 88 శాతానికి పెరిగింది! ఏం జరుగుతోంది... నదీ బేసిన్లు, సబ్ బేసిన్లు కేవలం నీటి వనరులు మాత్రమే కాదు. భారీ స్థాయి పట్టణీకరణకు, ఆర్థిక కార్యకలాపాలకు కూడా కేంద్ర బిందువులు కూడా. ► ఫలితంగా భారీగా ఉత్పత్తయ్యే మురుగునీరు చాలామటుకు వాటిలోనే కలుస్తోంది. ► మురుగులోని నైట్రోజన్ కారణంగా నీటి వనరులు బాగా కలుషితమవుతున్నాయి. ► ఇది కూడా జల వనరుల కాలుష్యంలో పెద్ద కారకంగా మారుతోంది. ► దీనికితోడు బేసిన్ల పరిధిలో వ్యవసాయ కార్యకలాపాలు భారీగా సాగుతాయి. అది విచ్చలవిడి ఎరువుల వాడకానికి దారి తీస్తోంది. పెను సమస్యే... ► అధ్యయనం జరిపిన 10 వేల పై చిలుకు నదీ బేసిన్లు ప్రధానంగా సాగుకు ఆటపట్టులు. ► ప్రపంచ జనాభాలో ఏకంగా 80 శాతం దాకా వాటి పరిధిలోనే నివసిస్తోంది! ► 2050కల్లా మూడో వంతు, అంటే కనీసం 300 కోట్ల పై చిలుకు జనం తాగునీటి సమస్యతో అల్లాడిపోతారు. ► ఈ నీటి వనరులు పూర్తిస్థాయిలో తాగటానికి పనికిరాకుండా పోతే సమస్య ఊహాతీతంగా ఉంటుందని అధ్యయనం హెచ్చరించింది. ► ఉత్తర అమెరికా, యూరప్, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, మధ్య ఆసియా, చైనాతో పాటు భారత్‌లోనూ పలు ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి! – సాక్షి, నేషనల్ డెస్క్ -
రచ్చ రేపిన కొత్త మరణ దండన
ప్రపంచదేశాల్లో ఇప్పటి వరకూ మరణ శిక్ష... ఉరి, విద్యుత్ కుర్చీ, విషపు ఇంజెక్షన్స్, తుపాకీ కాల్పులు వంటి పద్ధతుల ద్వారా ఎక్కువగా అమలవుతూ వస్తోంది. కానీ ప్రపంచంలోనే తొలి సారిగా అమెరికాలో ఓ 58 ఏళ్ల హంతకుడికి నైట్రోజన్ గ్యాస్ ద్వారా మరణ శిక్ష విధించారు. దీనిపై ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. ఐక్యరాజ్య సమితి, ఐరోపా సమాఖ్య సహా పలు సంస్థలు, వ్యక్తుల నుంచి ఈ తరహా మరణశిక్ష అమలు అనాగరికమంటూ తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలోని దక్షిణాది రాష్ట్రమైన అల బామాలో ఇటీవలే ప్రయోగాత్మకంగా స్మిత్ అనే ఖైదీకి మాస్క్ తగిలించి అందులో నైట్రోజన్ గ్యాస్ పంపడం ద్వారా అతన్ని అపస్మారక స్థితి లోకి తీసుకెళ్లి మరణశిక్షను విజయవంతంగా అమలు చేశారు. అంతే కాదు ఈ మరణశిక్ష అమ లును వీక్షించేందుకు కెన్నెత్ స్మిత్ కుటుంబీకులు, బాధిత కుటుంబ సభ్యులు, లాయర్లను కూడా పరిమిత సంఖ్యలో అనుమతించారు. చాలా సులువుగా కేవలం 22 నిమిషాల వ్యవధిలో కెన్నెత్ స్మిత్ ప్రాణాలు కోల్పోయాడు. కానీ ఇప్పుడు దీన్ని అమలు చేసిన అమెరికా మాత్రం ప్రపంచం దృష్టిలో దోషిగా నిలబడింది. స్వదేశంలోనే ఈ మరణదండనపై తీవ్ర నిరస నలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఐక్యరాజ్య సమితి, ఐరోపా దేశాల సమాఖ్య (ఈయూ)లు అమెరికా తీరును ఖండించాయి. ఈ ఖండనలు, నిరసనలు ఏ స్థాయిలో ఉన్నా యంటే స్వయంగా వైట్ హౌస్ ఈ నైట్రోజన్ గ్యాస్ మరణ శిక్ష తమను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందనీ, ఇది క్రూరంగానే ఉందనీ అంగీకరించింది. అమెరికాలో తాజాగా రెండు మరణశిక్షలు ఇంజెక్షన్ ద్వారా అమలు చేశారు. ప్రస్తుతం నైట్రోజన్ మరణశిక్షను అమలు చేసిన అల బా మాతో పాటు మరో రెండు రాష్ట్రాలు ఓక్లహోమా, మిస్సిసిపీలు ఈ తరహా మరణ శిక్ష అమలును ఆమోదించాయి. తాజాగా జరిగిన నైట్రోజన్ మరణశిక్ష అమలును అలబామా అటార్నీ జన రల్ స్టీవ్ మార్షల్ సమర్థించుకున్నారు. ఇది పూర్తిగా ప్రొఫెషనల్ పద్ధతిలో జరిగిందన్నారు. కెన్నెత్ యూజీన్ స్మిత్‌కు ప్రాణాంతకమైన మందులతో మరణశిక్ష అమలు చేయాలని 2022 నవంబర్‌లో నిర్ణయించారు. జైలు సిబ్బంది ఒక ఇంట్రావీనస్ లైన్‌ను చొప్పించారు. అయితే ప్రాణాంతక ఇంజెక్షన్‌ను ఇవ్వడానికి రెండు లైన్లు అవసరం. రెండవ లైను చొప్పించడానికి వారు ఒక గంట పాటు పోరాడిన తర్వాత, ఉరిశిక్ష రద్దు చేశారు. కానీ స్మిత్ 1988లో ఒక బోధకుని భార్యను కిరాయికి చంపిన కేసులో ఇటీవల దోషిగా తేలడంతో మరణ శిక్ష విధించింది కోర్టు. ఈ శిక్షను నైట్రోజన్ వాయువును ఉపయోగించి అమలు చేశారు. అమెరికా రాష్ట్రాలు కొన్ని ఇప్పటికీ ఉరి, ఫైరింగ్ స్క్వాడ్ లేదా ఎలక్ట్రిక్ కుర్చీ ద్వారా మరణ దండన విధానాన్ని అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్ర న్యాయస్థానాలు మాత్రం పలు రకాల మరణశిక్ష పద్ధతులను నిషేధించాయి. అయితే, గత కొన్ని దశాబ్దాల కాలంలో చాలా రాష్ట్రాలు ప్రాణాంతకమైన ఇంజెక్షన్ ద్వారా మరణ శిక్షను అమలు చేయడానికి అంగీకరించాయి. స్మిత్‌కు మునుపటి ఉరిశిక్ష అమలుకు చాలా నెలల ముందు, అలబామా అధికారులు మరో ఖైదీ అలాన్ మిల్లర్‌కు ఐవీ సూదిని చొప్పించడంలో ఇబ్బందుల కారణంగా మరణశిక్ష అమలు చేయడంలో విఫలమయ్యారు. అలాగే ఇతర ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా కూడా మరణశిక్ష అమలు కాలేదు. అగ్రరాజ్యంలోని పలు రాష్ట్రాలు ఇటీవల ప్రాణాంతక ఇంజెక్షన్ మందులను పొందడంలో పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఔషధ తయారీదారులు యునైటెడ్ కింగ్డమ్, యూరోపియన్ యూనియన్లు 2011లో ఇటువంటి ప్రాణాంతక ఇంజె క్షన్ల ఎగుమతులను నిషేధించాయి. దీంతో ఔషధ తయారీ కంపెనీలు వాటి తయారీని నిలిపివేశాయి. ఈ కారణంగా మరణ శిక్షను అమలు చేయడానికి రాష్ట్రాలుఇతర మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. అందులో ఒకటి నైట్రోజన్ వాయువును అందించి ప్రాణాలు తీయడం. దోషి కెన్నెత్ స్మిత్ ముఖానికి మాస్క్ కట్టి, స్వచ్ఛమైన నైట్రోజన్ వాయువును జైలు అధికారులు అందించారు. వాయువు విషపూరితమైనది కాదు. భూ వాతావరణంలో మూడు వంతుల కంటే ఎక్కువ నైట్రోజన్ ఉంటుంది. కానీ స్వచ్ఛమైన సాంద్రీకృత రూపంలో ఉన్న ఈ గ్యాస్‌ను పీల్చడం వల్ల మెదడుకు ప్రసారం అయ్యే ఆక్సిజన్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అల బామా స్టేట్ అటార్నీ జనరల్ స్టీవ్ మార్షల్ మాట్లాడుతూ... నైట్రోజన్ వాయువును ఉప యోగించి, మరణశిక్షను అమలు చేయడం అత్యంత మానవీయమైన పద్ధతి’ అని పేర్కొ నడం గమనార్హం. – వి.వి. వెంకటేశ్వరరావు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ‘ 63008 66637 -
నైట్రోజన్ గ్యాస్‌తో మరణ శిక్ష అమలు
అట్మోర్(అమెరికా): మూడు దశాబ్దాల క్రితం వేయి డాలర్ల సుపారీ తీసుకుని ఒక మహిళను హత్యచేసిన కేసులో దోషికి అమెరికా నూతన పద్ధతిలో మరణశిక్షను అమలుచేసింది. 58 ఏళ్ల కెన్నెత్ ఎజీన్ స్మిత్ స్వచ్ఛమైన నైట్రోజన్ వాయువును పీల్చేలాచేసి మరణశిక్షను అమలుచేసింది. ఇలా నైట్రోజన్గ్యాస్ను వాడి దోషికి మరణశిక్షను అమలుచేయడం ప్రపంచంలోనే తొలిసారి కావడం గమనార్హం. అమెరికాలోని అలబామా రాష్ట్రంలో ఈ శిక్షను స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి అమలుచేశారు. అమెరికాలో 1982 ఏడాది నుంచి విషం ఇంజెక్షన్‌తో దోషులకు మరణశిక్షను అమలుచేయం మొదలెట్టాక మరో నూతన శిక్షా విధానాన్ని అమల్లోకి తేవడం ఇదే తొలిసారి. ఎలా అమలుచేశారు?: అట్మోర్ నగరంలోని హోల్మ్యాన్ కరెక్షన్ ఫెసిలిటీలో నైట్రోజన్ హైపోక్సియా శిక్ష అమలు ప్రక్రియను ఐదుగురు మీడియా ప్రతినిధులను తీసుకెళ్లి చూపించారు. నైట్రోజన్ గ్యాస్ నింపిన సిలిండర్ పైపును దోషి స్మిత్ ముక్కుకు బిగించిన మాస్క్ ద్వారా శరీరంలోకి పంపించారు. స్వచ్ఛమైన నైట్రోజన్ గ్యాస్ అనేది ప్రాణాధారమైన ఆక్సీజన్‌ను శరీరకణాలకు అందకుండా చేస్తుంది. దీంతో కణాలు ఆక్సీజన్ లేక క్షణాల్లోని మృతిచెందుతాయి. దీంతో మరణం సంభవిస్తుంది. రాత్రి 7.53 గంటలకు గ్యాస్‌ను పంపించారు. 8.25 గంటలలోపు అతను మరణించినట్లు ప్రకటించారు. ఏమిటీ కేసు?: చార్లెస్ సెన్సెట్ అనే మతాధికారి 1980లలో భారీగా అప్పులుచేశాడు. భార్యను చంపేస్తే బీమా సొమ్ము వస్తుందని ఆమె హత్యకు పథకం వేశాడు. చార్లెస్ నుంచి సుపారీ తీçసుకుని జాన్ ఫారెస్ట్ పార్కర్, స్మిత్ ఆయన భార్య ఎలిజబెత్‌ను చంపేశారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చాత్తాపంతో చార్లెస్ ఆత్మహత్య చేసుకున్నాడు. 2010లో పార్కర్‌కు అమలు శిక్షను అమలుచేయగా తాను నిర్దోషినంటూ ఇన్నాళ్లూ స్మిత్ కోర్టుల చుట్టూ తిరిగారు. జ్యూరీ జీవితఖైదు సిఫార్సుచేయగా జడ్జి ఏకంగా మరణశిక్ష విధించారు. ఇంతవరకూ లేని కొత్త విధానంలో శిక్ష అమలు చేయాలని ఆదేశాలిచ్చారు. దీనిపై గురువారం అమెరికా సుప్రీంకోర్టులో వాదనలు నడిచాయి. ఇంతవరకు వాడని, క్రూరమైన, అసాధారణ శిక్షా విధానాన్ని ఎలా అమలుచేస్తారని స్మిత్ లాయర్లు వాదించినా శిక్ష అమలుకే కోర్టు పచ్చజెండా ఊపింది. -
Alabama: తొలిసారి నైట్రోజన్ గ్యాస్‌తో మరణ శిక్ష అమలు
అలబామా: మరణ శిక్షల్లో అమెరికా కొత్త రికార్డు సృష్టించింది. అమెరికా చరిత్రలోనే అలబామా రాష్ట్రంలో తొలిసారిగా నైట్రోజన్ గ్యాస్ వాడి ఊపిరాడకుండా చేసి ఒక వ్యక్తికి మరణ శిక్ష అమలు చేశారు. హత్య కేసులో దోషి అయిన కెన్నెత్ యూజెన్ స్మిత్(58) ఊపిరితిత్తుల్లోకి ఫేస్ మాస్క్ ద్వారా స్వచ్ఛమైన నైట్రోజన్‌ను పంపి శిక్ష అమలు చేశారు. గురువారం రాత్రి 8.25 గంటలకు అలబామా జైలులో స్మిత్ చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. నైట్రోజన్ గ్యాస్‌తో మరణ శిక్ష అమలు చేసే విధానంపై అమెరికాలో వివాదం నడుస్తోంది. ఇది పూర్తి మానవీయతతో కూడిన శిక్ష అని ప్రభుత్వం చెబుతుండగా విమర్శకులు మాత్రం నైట్రోజన్ గ్యాస్‌తో మనిషిని చంపడం క్రూరమైన ప్రయోగం అని మండిపడుతున్నారు. అమెరికాలో సాధారణ మరణశిక్ష అమలు విధానం అయిన విషపు ఇంజెక్షన్‌తో స్మిత్‌కు ఇంతకుముందే శిక్ష అమలు చేయడానికి ప్రయత్నించారు. అయితే అతడి ఐవీ లైన్ కనెక్ట్ కాకపోవడంతో శిక్ష అమలును చివరి నిమిషంలో నిలిపివేశారు. నైట్రోజన్ గ్యాస్‌తో తనను చంపడంపై స్మిత్ వేసిన అప్పీల్‌పై యూఎస్ అప్పీల్ సుప్రీం కోర్టు జోక్యం చేసుకోకపోవడంతో శిక్ష అమలు ఖాయమైంది. ఇదీచదవండి.. విక్టోరియా బీచ్‌లో ప్రమాదం... నలుగురు భారతీయులు మృతి -
ప్రపంచంలో తొలిసారి ఇలాంటి మరణశిక్ష
అతనో కాంట్రాక్ట్ కిల్లర్. ఓ వ్యక్తి ఇచ్చిన సుపారీతో.. అతని భార్యను హత్య చేశాడు. ఆపై సుపారీ ఇచ్చిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యవర్తి జీవితఖైదుతో జైల్లోనే చచ్చాడు. హత్యలో సహకరించిన వ్యక్తికి మరణశిక్ష అమలయ్యింది. కానీ, ఇతగాడికి మరణశిక్ష పడి దశాబ్దాలు గడుస్తున్నా.. అది అమలు కావడంలో జాప్యం అవుతూ వస్తోంది. చివరికి.. పోయినేడు ఏడాది శిక్షను అమలు చేయాలని చూస్తే అది విఫలం అయ్యింది.. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చదివేయండి.. ప్రపంచంలోనే తొలిసారి నైట్రోజన్ గ్యాస్‌నుNitrogen Hypoxia Execution ఉపయోగించి ఓ వ్యక్తికి మరణశిక్ష అమలు చేయబోతున్నారు. అమెరికా సంయుక్తం రాష్ట్రం అలబామాలో ఈ శిక్ష గురువారం అమలు కాబోతోంది. ఘోరంగా.. ఊహకందని రీతిలో అమలు కాబోయే ఈ మరణశిక్ష తప్పించుకునేందుకు చివరిదాకా యత్నం చేసిన కెన్నెత్ యూజీన్ స్మిత్(58) చివరికి నిరాశే ఎదురైంది. బుధవారం యూఎస్ సుప్రీం కోర్టు సైతం శిక్ష అమలు నిలుపుదలకు నిరాకరించింది. అలబామా కోర్టులు ఇచ్చిన తీర్పును సమర్థించింది. దీంతో.. ఈ శతాబ్దంలో ఒక వ్యక్తిని ఈ తరహాలో శిక్షించి చంపడం ఇదే తొలిసారి కానుంది. కేసు ఏంటంటే.. 1988లో కోల్బర్ట్ కౌంటీలో చార్లెస్ సెన్నెట్ అనే మతాధిపతి తన భార్య ఎలిజబెత్ సెన్నెట్‌ను చంపడానికి బిల్లీ గ్రే విలియమ్స్ అనే వ్యక్తికి సుపారీ ఇచ్చాడు. వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించిన ఆయన ఆ విషయం భార్యకు తెలియడం.. ఆమె నిలదీయడంతో తట్టుకోలేకపోయాడు. అలాగే.. భార్య పేరిట ఉన్న ఇన్సూరెన్స్ సొమ్ము కోసమే ఆయన ఆమెను అడ్డు తొలగించుకునే పని చేశాడు. కెన్నెత్ స్మిత్, జాన్ పార్కర్ అనే ఇద్దరు అనే ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్లకు 1000 డాలర్ల చొప్పున ఇస్తూ.. ఆ పని అప్పగించాడు బెల్లీ. ఇంట్లోనే మార్చి 18వ తేదీన ఆమెను దారుణంగా హతమార్చారు ఆ ఇద్దరు. ఇది దొపిడీ దొంగల పనేనని నమ్మించే యత్నం చేశారు. వారం తర్వాత.. దర్యాప్తులో అసలు విషయం బయటపడుతుందన్న భయంతో ఛార్లెస్ ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు తన కుటుంబ సభ్యుల ముందు ఆయన నిజం ఒప్పుకున్నారు. ఇక ఈ కేసులో బిల్లీ గ్రే విలియమ్స్‌కు కఠిన యావజ్జీవ శిక్షపడగా.. 2020లో జైల్లోనే అనారోగ్యంతో మరణించాడు. స్మిత్, పార్కర్ ఇద్దరికీ మరణశిక్ష విధించింది కోర్టు. 2010 జూన్‌లో పార్కర్‌కు లెథల్(ప్రాణాంతక) ఇంజెక్షన్ ఇచ్చి మరణశిక్ష అమలు చేశారు. కానీ, స్మిత్ విషయంలోనే ఆ శిక్ష జాప్యం అవుతూ వస్తోంది. కిందటి ఏడాది.. నవంబర్ 17వ తేదీన స్మిత్‌కు లెథల్ ఇంజెక్షన్ ఇచ్చి మరణశిక్ష అమలు చేయాలని ప్రయత్నించారు. అయితే.. ఇంజెక్షన్లు ఎక్కించేందుకు నరాలు దొరక్కపోవడంతో ఆ శిక్ష నిలిపేశారు అధికారులు. ఈలోపు అలబామా సుప్రీంకోర్టు ఇచ్చిన డెత్ వారెంట్ గడువు ముగిసిపోయింది. దీంతో.. అతని మరణశిక్ష అమలుపై సమీక్ష జరపాలని అలబామా గవర్నర్ కెయ్ ఇవెయ్ ఆదేశించారు. చివరకు.. నైట్రోజన్ హైపోక్సియా పద్ధతితో శిక్ష అమలు చేయాలని అధికారులు నిర్ణయించగా.. అసలు వ్యవహారం మొదలైంది. ఐరాసతో సహా అభ్యంతరాలు.. అయితే.. ఈ తరహా మరణశిక్ష అమలుపై ప్రపంచవ్యాప్తంగా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. తొలి ప్రయత్నం విఫలమయ్యాక.. స్మిత్ శారీరక మానసిక స్థితి స్థితి ఘోరంగా దెబ్బతిందని అతని తరఫు న్యాయవాదులు వాదిస్తూ వచ్చారు. స్మిత్ కుటుంబ సభ్యులు కూడా ఈ తరహా శిక్షను అమలుచేయడానికి వీల్లేదని.. ఆయన అనుభవించిన శిక్షా కాలం పరిగణనలోకి తీసుకుని విడుదల చేయాలని క్షమాభిక్ష కోరారు. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల సంఘాలు సైతం ఇది అత్యంత మానవీయమైన చర్యగా పేర్కొంటూ వస్తున్నాయి. మరోవైపు ఐక్యరాజ్య సమితి మాన హక్కుల సంఘ కార్యాలయం సైతం ఈ శిక్షను నిలిపివేయాలంటూ అలబామాను కోరుతూ వస్తోంది. అయితే ఎలిజబెత్ కుటుంబ సభ్యులు మాత్రం శిక్ష అమలు చేయాల్సిందేనని కోరుతూ వస్తున్నారు. ఈలోపు అమెరికా రాజ్యాంగంలోని ఎనిమిదో సవరణ ప్రకారం(నేర, అసాధారణ శిక్షల నుంచి రక్షణ) శిక్షను నిలిపివేయాలని కోర్టును ఆశ్రయించారు స్మిత్ తరఫు లాయర్లు. ఈలోపు బుధవారం.. యూఎస్ సుప్రీం కోర్టు ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. తొమ్మిది మంది న్యాయమూర్తుల్లో ముగ్గురు మాత్రమే స్మిత్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోగా.. మిగతా మెజార్టీ న్యాయమూర్తులు పిటిషన్‌ను తిరస్కరించారు. ఎలా ఉంటుందంటే.. నైట్రోజన్ హైపోక్సియా అంటే.. నైట్రోజన్ సిలిండర్‌కు బిగించిన పైప్‌ను మాస్క్ ద్వారా నిందితుడి ముక్కుకు బిగిస్తారు. గ్యాస్‌ను విడుదల చేయగానే.. ఆక్సిజన్ అందక నైట్రోజన్ మోతాదుతో ఆ వ్యక్తి గిలగిల కొట్టుకుంటూ మరణిస్తారు. ఐసీయూలో ఆక్సిజన్ సిలిండర్ ద్వారా ఒక వ్యక్తి ప్రాణాల్ని ఎలా రక్షిస్తారో.. అదే విధంగా నైట్రోజన్‌తో ఆ ప్రాణాల్ని హరిస్తారన్నమాట. అదీ చట్టబద్ధంగా!. బుధవారం అర్ధరాత్రి దాటాక(గురువారం 12గం. నుంచి.. ఆ మరుసటి రోజు ఉదయం 6గం. లోపు ఈ శిక్షను అమలు చేస్తారు). ఇప్పటిదాకా అమెరికాలో ప్రాణాంతక ఇంజెక్షన్ల ద్వారానే మరణశిక్షలు అమలు చేస్తూ వచ్చారు. అయితే.. ఆ ఇంజెక్షన్లలో ఉపయోగించే మందు దొరకడం కష్టతరం అవుతుండడంతో(ఐరోపా దేశాలు వాటిని నిషేధించాయి).. ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అలబామాతో పాటు మిసిసిప్పీ, ఓక్లహోమా నైట్రోజన్ గ్యాస్‌తో చంపడం లాంటి శిక్షలను పరిశీలనలోకి తెచ్చుకున్నాయి. :::సాక్షి వెబ్‌డెస్క్ -
Pudami Sakshiga : భూమ్మీద ఆక్సిజన్ శాశ్వతం కాదా? ఆ తర్వాత అంతమేనా?
ఆక్సిజన్..ప్రాణాలు నిలబెట్టే వాయువు. ఐ–కొలి లాంటి కొన్ని రకాల బ్యాక్టీరియాలు మినహా భూమ్మీద సమస్త జీవజాలాల మనుగడకు ఈ ఆక్సిజన్ అవసరం. అయితే ఈ ప్రాణవాయువుకు జన్మనిచ్చింది ఓ బ్యాక్టీరియా అంటే వింతగా అన్పించినా వాస్తవం. కోటాది కోట్ల సంవత్సరాల క్రితం భూ వాతావరణంలో ఆక్సిజన్ అనేది లేదు. సుమారు 450 కోట్ల సంవత్సరాల క్రితం వాయువులు, దుమ్ము, ధూళి ఒకచోట స్థిరపడి భూగోళం ఏర్పడింది. ఆ తరువాత మరో వంద కోట్ల సంవత్సరాలకు భూమిపై ఏకకణ జీవితో జీవం ఆవిర్భవించింది. అప్పటికి ఇంకా భూమి మీద ఉన్న అనేక రకాల వాయువుల్లో ఆక్సిజన్ లేదు. ఆ కాలంలో ప్రోక్లొరోకాకస్ అనే బ్యాక్టీరియా తన మనుగడ కోసం నీరు, సూర్యరశ్మి, కార్బన్ డైఆక్సైడ్‌ల ద్వారా కిరణజన్య సంయోగ క్రియను జరిగించి అవసరమైన శక్తిని పొందడం మొదలుపెట్టింది. సముద్రంలో ఉండే ఈ బ్యాక్టీరియా నిర్వహించిన కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి అవుతూ వాతావరణంలో కలవడం మొదలయ్యింది. సుమారు 300 కోట్ల సంవత్సరాల క్రితం భూ వాతావరణంలో ఓ మోస్తరు ఆక్సిజన్ లభించడం మొదలయ్యింది. దీన్నే శాస్త్రవేత్తలు గ్రేట్ ఆక్సిడేషన్ ఈవెంట్‌గా అభివర్ణించారు. అలా మొదలైన ఆక్సిజన్ ఇప్పటికి భూమిపై ఉన్న వాతావరణంలో 21 శాతానికి పెరిగింది. కోటాను కోట్ల జీవరాశుల జన్మకు, మనుగడకు కారణమయ్యింది. నైట్రోజన్దే రాజ్యం భూ వాతావరణంలో అత్యధికంగా నైట్రోజన్ 78 శాతం ఉంది. అంటే ఆక్సిజన్, నైట్రోజన్ కలిసి గాలిలో 99 శాతం ఉన్నాయన్నమాట. ఇక ఆగాన్, కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులన్నీ కలిపి ఒక్క శాతం ఉన్నాయి. సౌర కుటుంబంలోని మిగతా గ్రహాల్లో స్వచ్ఛమైన ఆక్సిజన్ దాదాపుగా లేదు. ఒకవేళ ఉన్నా ఇతర వాయువుల సంయోగంలో మాత్రమే ఉంది. ఉదాహరణకు వీనస్ (శుక్రుడు), మార్స్ (అంగారకుడు) గ్రహాల వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ కలిసి 98 శాతం ఆక్రమిస్తున్నాయి. ఈ కారణంగానే ఇతర గ్రహాలతో పాటు వీటిల్లోనూ జీవావిర్భావానికి అనుకూలమైన వాతావరణం లేదు. కిరణాలే జన్మదాతలు భూమ్మీద లభించే ఆక్సిజన్ దాదాపుగా కిరణజన్య సంయోగక్రియ (ఫొటోసింథసిస్) సృష్టించిందే. అయితే కేవలం భూమ్మీది వృక్ష జాతుల్లో జరిగే ఫొటోసింథసిస్ వల్లే మొత్తం ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోందనుకుంటే పొరపాటే. సగం సముద్రంలో కూడా పుడుతోంది. సముద్రంలో ఉండే మొక్కలు, నాచు వంటి వృక్ష సంబంధమైనవి కూడా తమకు కావలసిన శక్తి కోసం కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. వీటి మాదిరిగానే ప్రోక్లోరొకాకస్ బ్యాక్టీరియా కూడా ఫొటోసిం«థసిస్ ద్వారా ఆక్సిజన్‌ను సృష్టిస్తోంది. అయితే సముద్రంలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్‌లో భూ వాతావరణంలో కలిసేది అత్యల్పమనే చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ ఉత్పత్తి అయిన ఆక్సిజన్ చాలావరకు సముద్ర జీవజాలాల మనుగడకే సరిపోతుంది. కాబట్టి భూమ్మీద మనకు లభ్యమయ్యే ఆక్సిజన్ దాదాపుగా వృక్ష జాతుల పుణ్యమే. ఎంత చెట్టుకు అంత.. ఎదిగిన చెట్టుకు ఆకులు, కొమ్మలు, కాండం, వేర్లు ఉంటాయి. అయితే చెట్టులో ఐదు శాతంగా ఉండే ఆకులు మాత్రమే ఆక్సిజన్‌ను తయారు చేస్తాయి. వేర్ల నుంచి వచ్చే నీరు, సూర్యరశ్మి, వాతావరణంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్‌ను ఆకులు గ్రహించి కిరణ జన్య సంయోగక్రియ ద్వారా చెట్టు ఎదుగుదలకు కావలసిన గ్లూకోజ్‌ను తయారుచేస్తాయి. ఈ ప్రక్రియలో ఆక్సిజన్‌ను వాతావరణంలోకి వదిలేస్తాయి. చెట్లు కూడా కొంత ఆక్సిజన్‌ను ఉపయోగించుకుంటాయి కానీ విడుదల చేసే ఆక్సిజన్‌తో పోల్చుకుంటే అది అతిస్వల్పం. ఇలా వాతావరణంలో ఆక్సిజన్ చేరుతూ ఈ రోజు మొత్తం గాలిలో 21 శాతాన్ని ఆక్రమించింది. సమయం, కాలం ఇతర వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఒక చెట్టు ఉత్పత్తి చేసే ఆక్సిజన్‌లో హెచ్చు తగ్గులు ఉంటాయి. అలాగే చెట్టు లేదా మొక్క రకాన్ని బట్టి ఆక్సిజన్ ఉత్పత్తి పరిమాణం మారుతూ ఉంటుంది. చాలావరకు మొక్కలు, చెట్లు పగలు మాత్రమే ఆక్సిజన్‌ను విడుదల చేస్తా యి. కొన్ని అరుదైన వృక్ష జాతులే 24 గంటలు ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఉదాహరణకు చాలామంది ఇంట్లో పెంచుకునే తులసి చెట్టు రోజులో 20 గంటల వరకు ఆక్సిజన్‌ను విడుదల చేస్తూనే ఉంటుంది. అలాగే అరెకాపామ్గా పిలిచే పోకచెట్టు 24 గంటల పాటూ ఆక్సిజన్‌ను వాతావరణంలోకి వదులుతూనే ఉంటుంది. ఆరేడు చెట్లు = ఓ మనిషి మనుగడ ఒక అంచనా ప్రకారం ఒక ఆకు గంటకు ఐదు మిల్లీలీటర్ల ఆక్సిజన్‌ను తయారుచేస్తుంది. వంద అడుగుల భారీ వృక్షం ఏడాదికి 6,000 పౌండ్ల ఆక్సిజన్‌ను ఉత్తత్తి చేయగలదు. చిన్నా పెద్ద చెట్లు సగటున 260 పౌండ్లు అంటే సుమారు 120 కిలోల ఆక్సిజన్ని ఏడాదికి సృష్టిస్తాయి. మనిషి సగటున ఏడాదికి 9.5 టన్నుల గాలిని పీల్చుకుంటాడు. అయితే ఇందులో ఆక్సిజన్ 21 శాతమే ఉంటుంది. మనిషి పీల్చుకునే ఆక్సిజన్‌లో కూడా మూడోవంతు మాత్రమే దేహం ఉపయోగించుకుని మిగతాది గాలిలోకి వదిలేస్తుంది. ఈ లెక్కన మనిషి ఏడాదికి 740 కిలోల ఆక్సిజన్‌ను వాడుకుంటాడు. అంటే సగటున ఆరు నుంచి ఏడు చెట్లు ఉత్పత్తి చేసే ఆక్సిజన్ ఓ మనిషి మనుగడకు సరిపోతుందన్నమాట. భూమ్మీద శాశ్వతం కాదా? ఆక్సిజన్ భూమ్మీద శాశ్వతంగా ఉంటుందా అన్నది సందేహాస్పదమేనంటున్నారు సైంటిస్టులు. ఒకప్పుడు భూమిపై ఆక్సిజన్ లేదు కాబట్టి భవిష్యత్తులో మళ్లీ అలాంటి పరిస్థితి ఏర్పడవచ్చునన్నది వారి అభిప్రాయం. నాసాకు చెందిన కజుమి ఒజాకి, క్రిస్టఫర్ రైన్హర్ట్ అనే శాస్త్రవేత్తలు.. ఓ ప్రయోగం ద్వారా ఇంకో వంద కోట్ల సంవత్సరాల తరువాత భూమ్మీద ఆక్సిజన్ శాతం గణనీయంగా పడిపోతుందనే అంచనాకు వచ్చారు. వంద కోట్ల సంవత్సరాల తర్వాత సూర్యుడు మరింత వేడిగా మారడం వల్ల భూమిపై కార్బన్ డైఆక్సైడ్ స్థాయి విపరీతంగా పెరిగి, ఆక్సిజన్ వెళ్లిపోయేలా చేస్తుందనేది వారి అంచనా. 20 వేల టన్నుల సామర్థ్యం కోవిడ్ సమయంలో ఆక్సిజన్ లేక రోగులు పడిన అవస్థలు గుర్తుండే ఉంటాయి. భారతదేశం కోవిడ్ కాలానికి ముందు రోజుకి 6,900 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసేది. అందులో 1,000 టన్నులు మాత్రమే వైద్య అవసరాలకు అందుబాటులో ఉండేది. మొదటి విడత కోవిడ్ సమయంలో దీని అవసరం 3,095 టన్నులకు, రెండో విడత అంటే 2021లో 5,500 టన్నులకు పెరిగిపోయింది. ప్రభుత్వ, ప్రైవేటుపరంగా ప్రస్తుతం మనదేశంలో రోజుకు 20,000 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. కానీ వైద్య పరంగా ఇప్పుడు మనకు సగటున రోజుకు 1,250 టన్నుల ఆక్సిజన్ సరిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక, వైద్య అవసరాల కోసం ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ ద్వారా 7,054 కోట్ల డాలర్ల వ్యాపారం జరుగుతోంది. -దొడ్డ శ్రీనివాసరెడ్డి -
కారులో నైట్రోజన్ వాయువు పీల్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
సాక్షి, బెంగళూరు: కారులో నైట్రోజన్ వాయువును పీల్చి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్యమే ఆయన ఆత్మహత్యకు దారి తీసింది. ఈ ఘటన బెంగళరురు మహాలక్ష్మి లేఅవుట్ కురుబరహళ్లి జంక్షన్ వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగింది. టెక్కీ విజయ్‌కుమార్ (51) మహాలక్ష్మి లేఅవుట్లో ఉంటూ నగరంలోని ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆయనను దీర్ఘకాలంగా గుండెజబ్బు పీడిస్తోంది. దీంతో జీవితం మీద విరక్తి చెంది ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడు. ఇందుకోసం నైట్రోజన్ సిలిండర్ కొనుగోలు చేసి తెల్లవారుజామునే సొంత కారులో బయటకు వచ్చాడు. కారు లోపల జరిగేది బయటకు కనిపించరాదని కారు పైన రగ్గును కప్పాడు. వాయువు లీక్ కాకూడదని కారు డోర్లకు ప్లాస్టిక్ కవర్ కప్పి ఉంచాడు. తరువాత డోర్లు వేసుకుని వెనుక సీట్లో కూర్చొని ఆ సిలిండర్ నుంచి వాయువును లీక్ చేసి పీల్చాడు. ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరవుతూ పెనుగులాడడంతో కారు కదలసాగింది. అది గమనించి స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు కారు తెరిచి చూడగా విజయ్‌కుమార్ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అతడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ కారు డోర్లను పోలీసులు మాత్రమే తెరవాలి, ఇందులో విషపూరితమైన వాయువు ఉంది అని రాసి ఉన్న ఒక నోట్, మరో డెత్ నోట్ లభ్యమయ్యాయి. తనకున్న అనారోగ్యంపై ఇంటర్నెట్లో శోధించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ జబ్బు వల్ల ఏమవుతుందోనని తరచూ ఆందోళన చెందుతూ ఇంట్లో వాళ్లతో కూడా చర్చించేవాడని తెలిసింది. ఆత్మహత్య మార్గాలనూ ఇంటర్నెట్లో గాలించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (షాకింగ్ వివరాలు.. దేశంలో క్యాన్సర్ విజృంభణ.. 2022లో 8 లక్షల మంది మృతి) -
‘నైట్రోజన్’ పైప్ నోట్లో పెట్టుకుని..
సాక్షి, ఖైరతాబాద్ (హైదరాబాద్): మానసిక సమస్యలతో బాధపడుతున్న ఓ యువకుడు లాడ్జిలో నైట్రోజన్ సిలిండర్ పైప్ నోట్లో పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మద్దునూరి శివరామవర్మ(25) బీటెక్ పూర్తి చేశాడు. గత కొంతకాలంగా తనను ఎవరో వెంటాడుతున్నారని, ఆత్మహత్య చేసుకుంటానంటూ మాట్లాడుతు న్నాడు. దీంతో శివరామవర్శకు కుటుంబీకులు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే గత నెల 26న హైదరాబాద్‌లో స్నేహితుడిని కలిసేందుకు వచ్చిన అతడు.. మాసబ్‌ట్యాంక్‌లోని హైదరాబాద్ హైట్స్ హోటల్లో ఓ గది తీసుకున్నాడు. సోమవారం ఉదయం నుంచి ఆ గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. సాయంత్రం 3 గంటలకు పోలీసులు గది తలుపులు తెరిచి చూడగా శివరామవర్మ అప్పటికే చనిపోయి ఉన్నాడు. అతడి శరీరం మొత్తం ఉబ్బి ఉంది. గదిలో దిగిన మరుసటి రోజే లంగర్‌హౌస్‌లో ఏసీ కోసం 5 కేజీల నైట్రోజన్ సిలిండర్ కొనుగోలు చేశాడని పోలీసులు తెలిపారు. హోటల్‌కు వచ్చిన అనంతరం ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని పైప్ కనెక్ట్ చేసుకొని సిలిండర్ ఆన్ చేసుకోవడంతో మృతి చెందినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కృష్ణయ్య చెప్పారు. -
కెనడాలో తెలుగు యువకుడు ఆత్మహత్య
అనంతపురం: కెనాడాలో ‘అనంత’ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సహజీవనం చేస్తోన్న యువతి తనను నయవంచన చేయడంతో తట్టుకోలేక ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వివరాల్లోకెళ్తే... నార్పల మండలం గడ్డంనాగేపల్లికి చెందిన పి.నారాయణస్వామి, పి.వాణి దంపతులు అనంతపురంలోని కోవూరునగర్‌లో నివాసముంటున్నారు. వీరి కుమారుడు పుచ్చకాయల ప్రణయ్ (29) కెనాడలోని విక్టోరియాలో డిజిటల్ విభాగంలో పని చేస్తున్నాడు. కృష్ణా జిల్లా ఘంటసాల ప్రాంతానికి చెందిన దేవిప్రసాద్ ముప్పాల, వాణి ముప్పాల దంపతుల కూతురు సాయి అఖిల ముప్పాల. వీరు హైదరాబాద్ హఫ్సీగూడలో నివాసముంటున్నారు. ఈ ఏడాది జనవరిలో అఖిల ముప్పాలతో ప్రణయ్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా, ఆ తర్వాత డేటింగ్ (సహజీవనం) వరకు వెళ్లింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని కెనాడాలో మ్యారేజ్ లైసెన్స్ తీసుకుని ఈ ఏడాది మార్చి నుంచి అక్టోబర్ 7 వరకు విక్టోరియాలోని అవేబరీ అవే ప్రాంతంలో సహజీవనం చేశారు. యూఎస్‌లో హెచ్1 వీసా రాగానే అఖిల ముప్పాల ప్రణయ్‌ను నయవంచన చేసి వెళ్లిపోయింది. చదవండి: (కెనడాలో హైదరాబాదీ విద్యార్థి మృతి) మరికొందరితో ప్రేమాయణం అఖిల హైదరాబాద్ మల్లారెడ్డి కళాశాలలో ఫార్మసీ పూర్తి చేసి 2013–14లో యూఎస్‌కు వెళ్లింది. 2018లో అనిరుధ్ తెటాలి అనే వ్యక్తితో కలిసి ఒకటే చోట ఉంది. యూఎస్‌లో ఉన్నప్పుడు మహే‹Ù, ఆశిక్, తదితరులతో కూడా అఖిలకు పరిచయం ఉంది. మూడేళ్లు గడిచినా హెచ్1 వీసా రాకపోవడంతో 2020 జనవరి ప్రారంభంలో ప్రణయ్ ఉంటున్న విక్టోరియాకు వచ్చింది. సిగరెట్, బాయ్‌ఫ్రెండ్ వద్దన్నందుకు.. సిగరెట్ తాగితే ఆరోగ్యం చెడిపోతుందని, పాత బాయ్ఫ్రెండ్లతో చాట్ చేయకూడదని అఖిలపై ప్రణయ్ కోప్పడ్డాడు. ఇదే విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఇద్దరూ కలసిమెలసి ఉన్నారు. ఈ క్రమంలో హెచ్1 వీసా ప్రీమియం కన్ఫర్మేషన్ వచ్చింది. అదే ఛాన్స్‌గా తీసుకున్న అఖిల ఈ ఏడాది అక్టోబర్ 7న ప్రణయ్‌కు చెప్పకుండా వెళ్లిపోయింది. వీరిద్దరి సహజీవనం ఇరు కుటుంబాలకు తెలుసు. అఖిల చేసిన నయవంచనను తల్లి వాణి(అఖిల తల్లి)కి చెప్పినా ప్రయోజనం లేకుండాపోయింది. చివరకు ప్రణయ్‌పై కేసు పెడతామని అఖిల తల్లి బెదిరించింది. ఈ క్రమంలో అఖిల, ఆమె తల్లి ప్రణయ్ ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేశారు. 14న ఆత్మహత్య: అఖిల చేసిన మోసాన్ని తట్టుకోలేకపోయిన ప్రణయ్ ఈ నెల 14న విక్టోరియాలో నైట్రోజన్ గ్యాస్ పీల్చి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోవడానికి ముందు తన బాధను వ్యక్తం చేస్తూ వీడియో తీశాడు. ప్రణయ్ మరణవార్త తెలియగానే అనంతపురం నాల్గవ పట్టణ సీఐ కత్తి శ్రీనివాసులు కోవూర్‌నగర్‌లోని ఇంటికి వెళ్లి అతడి కుటుంబీకులతో మాట్లాడారు. -
రూ.10వేలకే ఆక్సిజన్ యంత్రం!
సాక్షి, బెంగళూరు: కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనే లక్ష్యంతో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ) శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన యంత్రాన్ని తయారు చేశారు. పరిసరాల్లోని గాల్లోంచి శుద్ధమైన ఆక్సిజన్‌ను తయారుచేసే ఈ యంత్రం గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత కీలకం కానుంది. ప్రస్తుతం మార్కెట్లో ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే యంత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఒక్కొక్కటి రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు ఖరీదు చేస్తాయి. అయితే అందుబాటులో ఉన్న పదార్థాలతోనే చౌకైన ఆక్సిజన్ ఉత్పత్తి యంత్రాన్ని తయారుచేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందని ఐఐఎస్సీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ప్రవీణ్ రామమూర్తి గుర్తించారు. ఇందుకు తగ్గట్టుగా డాక్టర్ అరుణ్‌రావు, కె.భాస్కర్‌తో కలిసి పదివేల రూపాయలు ఖరీదుచేసే ఆక్సిజన్ తయారీ యంత్రాన్ని సిద్ధం చేశారు. మనం పీల్చే గాలిలో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుందని మనకు తెలుసు. కచ్చితంగా చెప్పాలంటే దాదాపు 78 శాతం నైట్రోజన్ ఉంటే 21 శాతం ఆక్సిజన్ ఉంటుంది. మిగిలిన ఒక శాతంలో కొన్ని ఇతర వాయువులు ఉంటాయి. ఈ గాలి ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన యంత్రంలోకి ప్రవేశించినప్పుడు అవి జియోలైట్ అనే పదార్థం గుండా ప్రయాణిస్తాయి. చౌకగా లభించే ఈ జియోలైట్ గాల్లోని నైట్రోజన్‌ను పీల్చుకునే లక్షణం కలది. అంటే.. యంత్రం నుంచి బయటకు వచ్చే గాలిలో ఆక్సిజన్ మోతాదు చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ యంత్రాన్ని తయారు చేసిన తరువాత మార్కెట్లో లభించే వాటర్ ఫిల్టర్లను ఉపయోగించి దాన్ని జియోలైట్‌తో నింపారు. ప్రస్తుతం ఈ యంత్రం ద్వారా 70 శాతం స్వచ్ఛతతో కూడిన ఆక్సిజన్ వెలువడుతుండగా.. దీన్ని 90 శాతానికి పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యంత్రం నిర్వహణకు తాము అర్డినో కంప్యూటర్ బోర్డులను వాడామని ప్రొఫెసర్ రామమూర్తి తెలిపారు. -
వాహనాలకు ‘నైట్రోజన్’ టైర్లు
న్యూఢిల్లీ: టైర్ల నాణ్యతను పెంచేందుకు టైర్ల తయారీలో రబ్బర్‌తో సిలికాన్ కలపడాన్ని తప్పనిసరి చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఈ విషయాన్ని ఓ ప్రశ్నకు సమాధానంగా రాజ్యసభలో కేంద్ర రవాణా మంత్రి గడ్కరీ చెప్పారు. సిలికాన్ కలసిన రబ్బర్ టైర్లలో సాధారణ గాలికి బదులు నైట్రోజన్ వాయువు నింపడాన్ని తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది. దీంతో టైర్లు పేలే అవకాశాలు తగ్గుతాయని, ఆగ్రాలో రోడ్డుప్రమాదం వంటి ఘటనలు తగ్గుతాయని గడ్కరీ అన్నారు. నోయిడా–ఆగ్రా హైవేలో సోమవారం జరిగిన ప్రమాదం బాధాకరమన్నారు. యమునా ఎక్స్‌ప్రెస్‌వేను యూపీ ప్రభుత్వమే నిర్మించిందని దాంతో కేంద్రానికి ఏ సంబంధం లేదని అన్నారు. పార్లమెంట్లో రోడ్డు భద్రత బిల్లు గత సంవత్సర కాలంగా పెండింగ్‌లో ఉందని దాన్ని ఆమోదించాలని సభ్యులను కోరారు. అది పాసైతే 30 శాతం బోగస్ లైసెన్స్‌లు రద్దవుతాయన్నారు. దేశంలో 25 లక్షల మంది అనుభవజ్ఞులైన డ్రైవర్ల అవసరం ఉందన్నారు. ప్రతి జిల్లాలోనూ ఓ లోక్‌సభ సభ్యుడు చైర్మన్‌గా ఓ కమిటి ప్రారంభిస్తామన్నారు. ఈ కమిటీ ద్వారా రోడ్డు భద్రతా సూచనలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. -
భూమిపై జీవం.. చెరువులే మూలం
బోస్టన్: విశాల విశ్వం.. నక్షత్రాలు.. గ్రహాలు.. కోటానుకోట్ల జీవరాశులు. కంటికి కనిపించేవి కొన్నే.. కనిపించనివి అనంతం. విశ్వం ఎప్పుడు ఆవిర్భవించిందో తెలియదు.. జీవరాశి పుట్టుక వివరాలు తెలియవు. వీటికి సంబంధించిన అన్ని విషయాలూ రహస్యాలే. ఈ రహస్యాలన్నింటిని ఛేదించేందుకు ఏళ్లుగా శాస్త్రవేత్తల పరిశోధనలు.. అయినా అంతంత మాత్రమే ఫలితాలు. తాజాగా జీవ రాశి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఓ అధ్యయనంలో వెలువడ్డాయి. భూమిపై జీవరాశి పుట్టుకకు చెరువులు ముఖ్యపాత్ర పోషించాయని అమెరికాలోకి మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(మిట్) నిర్వహించిన ఈ అధ్యయనంలో తేలింది. పెద్ద పెద్ద సముద్రాల కంటే కూడా చెరువులే జీవరాశికి అనువైన వాతావరణాన్ని భూమిపై సృష్టించాయని తెలిపింది. అది కూడా 10 సెంటీమీటర్లకు అటూఇటుగా ఉండే చెరువులే జీవానికి ఊపిరి పోశాయని పేర్కొంది. చెరువులే ఎందుకు.. భూమిపై జీవం పుట్టుకకు అవసరమైన వాటిల్లో అధిక సాంద్రత గల నైట్రోజన్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఎక్కువ మంది శాస్త్రవేత్తలు భావిస్తారు. నైట్రోజన్ ఆక్సైడ్లు సముద్రాలు, చెరువుల్లో నిక్షిప్తమై ఉంటాయి. ఇవి వాతావరణంలోని ఇతర మిశ్రమాలతో కలసి జీవం పుట్టుకకు బాటలు వేస్తుందని చెబుతారు. అయితే ఈ పరిశోధనలో పాలుపంచుకున్న మిట్కు చెందిన పరిధకులు సుక్రిత్ రంజన్ మాట్లాడుతూ..‘లోతైన సముద్రాల్లో ఉండే నైట్రోజన్ వల్లే జీవం ఉద్భవించి ఉంటుందని అనుకోవడం సరికాదు. ఎందుకంటే లోతైన సముద్రాల్లోని నైట్రోజన్.. వాతావరణంలోని ఇతర మిశ్రమాలతో ప్రతిచర్య జరిపే అవకాశాలు చాలా తక్కువ. అలాగే అతి నీలలోహిత కిరణాలు, సముద్రాల్లోని ఐరన్ ధాతువులు నైట్రోజన్ మిశ్రమాన్ని అధిక శాతంలో నాశనం చేసే అవకాశం ఉంది. అనంతరం మిగిలిన కొద్ది మొత్తంలోని నైట్రోజన్‌ను వాయువు రూపంలో తిరిగి వాతావరణంలోకి పంపించేస్తాయి. దీంతో సముద్రాల్లో నైట్రోజన్ జీవం పుట్టుకకు ఎంతమాత్రం దోహదపడే అవకాశం లేదు. మరోవైపు చెరువుల్లోని నైట్రోజన్ ఆక్సైడ్ల వల్లే భూమిపై జీవం ఆవిర్భవించే అవకాశాలు అత్యధికం. చెరువుల్లో నైట్రోజన్ ఆక్సైడ్ల రూపంలో నిక్షిప్తమైన నైట్రోజన్ మిశ్రమం వాతావరణంలోని ఇతర మిశ్రమాలతో ప్రతిచర్య జరిపే అవకాశాలు అధికంగా ఉంటాయి. అలాగే చెరువుల్లో మిశ్రమాలు కరిగే అవకాశాలు చాలా తక్కువ. మొత్తంగా చూస్తే.. శాస్త్రవేత్తలు భావిస్తున్నట్లుగా జీవం పుట్టుకకు నైట్రోజన్ అవసరమై.. అదీ సముద్రాల్లోనిదే అయ్యిండాలంటే మాత్రం భూమిపై జీవం పుట్టుక అనేది దాదాపు అసాధ్యం. చెరువుల్లో ఉండే నైట్రోజన్‌తో మాత్రమే భూమిపై జీవం ఆవిర్భవించి ఉండేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి’అని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
నైట్రోజన్ గ్యాస్‌తో మరణశిక్ష
ఒక్లహామా, అమెరికా : నైట్రోజన్ గ్యాస్‌తో మరణ దండనను అమలు చేసే పద్దతిని పునరుద్దరిస్తున్నట్లు అమెరికాలోని ఒక్లహామా రాష్ట్ర అధికారులు ప్రకటించారు. అయితే, నైట్రోజన్ వాయువును మరణ శిక్షకు ఏ విధంగా వినియోగించాలనే దానిపై చర్చలు ఇంకా కొనసాగుతున్నట్లు తెలిపారు. దీంతో దాదాపు మూడేళ్ల అనంతరం ఒక్లహామాలో మరణ శిక్షలు అమలు కాబోతున్నాయి. 2015 నుంచి ఒక్లహామాలో ఒక్క మరణశిక్ష కూడా అమలు కాలేదు. అంతకుముందు ఓ దోషికి మరణదండన అమలు చేసేందుకు అధికారులు ఇంజెక్షన్‌ను ఎక్కించారు. అయితే, ఆ ఇంజక్షన్ వల్ల దోషి మరణించే ముందు తీవ్రంగా హింసకు గురయ్యాడు. దీంతో లెథల్ ఇంజెక్షన్‌ను తయారు చేస్తున్న ఫార్మా కంపెనీలు తమ మందులను మరణశిక్షకు వినియోగచడంపై అభ్యంతరం తెలిపాయి. దీంతో 2015 నుంచి ఒక్లహామా రాష్ట్రంలో మరణశిక్షలు అమలు కావడం లేదు. ఒక్క ఒక్లహామాలోనే కాదు. అమెరికాలోని పలు రాష్ట్రాల పరిస్థితి కూడా ఇదే. మరణశిక్షను అమలు చేయడానికి ఇంజెక్షన్లు అందుబాటులో లేక శిక్ష అమలును వాయిదా వేస్తూ వస్తున్నాయి. తాజాగా ఇంజెక్షన్ అమలు లేకపోతే నైట్రోజన్ గ్యాస్‌ను వినియోగించి శిక్షను అమలు చేయాలని ఒక్లహామా తీసుకున్న నిర్ణయం మిగిలిన రాష్ట్రాలను సైతం అదే బాటలో నడపించొచ్చు. వాతావరణంలో అత్యధికంగా లభ్యమయ్యే వాయువు నైట్రోజన్. ఆక్సిజన్ లేకుండా నైట్రోజన్ వాయువును పీల్చడం వలన వ్యక్తికి మరణం సంభవిస్తుంది. -
సౌరశక్తితో ఎరువులు
వాషింగ్టన్: సౌరశక్తితో ఎరువులను తయారు చేసే వినూత్న పద్ధతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని ద్వారా సూర్య కాంతిని వాడుకుని నైట్రోజన్ అణువును అమ్మోనియాగా మార్పు చేస్తారు. అమ్మోనియాను ఎరువుల్లో విరివిగా వాడుతారు. ప్రస్తుతం ఈ రసాయన పద్ధతి పూర్తిగా వినియోగంలోకి వస్తే.. రైతులు శిలాజ ఇంధనాలపై ఆధారపడే పరిస్థితి తప్పుతుంది. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ నేషనల్ రెన్యూవబుల్ లేబొరేటరీ(ఎన్ఆర్ఈఎల్), కొలరాడో బౌల్డర్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ విధానాన్ని రూపొదించారు. ఇప్పటికే అమ్మోనియాను జీవ సంబంధిత పద్ధతిలో, హేబర్ పద్ధతిలోనూ తయారు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం సూర్యకాంతితో వినియోగించుకుని నైట్రోజన్‌లో అణువులోని రెండు పరమాణువులను విడగొట్టి అమ్మోనియాను తయారు చేయడం సులభం, చౌకయిన పద్ధతని చెబుతున్నారు. -
వేపసాయం!
వేప పిండిలో 2-3శాతం నత్రజని, 1శాతం భాస్వరం, 1.4 పొటాష్ పోషకాలుంటాయి. బాగా మాగి నేల రాలిన పండ్లను సేకరించి గింజల్ని వేరుచేసి ఎండబెట్టి నిల్వ చేసుకుని కషాయం తీసిన తర్వాత, శుద్ధి చేసిన వేప నూనె, బూజులేని వేప పిండిని సస్యరక్షణలో వాడుకోవచ్చు. వర్షాధార ప్రాంతాల్లోని వేప గింజల్లో అజాడిరాక్టిన్ ఎక్కువగా ఉండటం వల్ల చీడపీడల నివారణకు సమర్థవంతంగా పనిచేస్తుంది. గింజలతో కషాయం తయారీ మంచి వేపకాయలను సేకరించి, కాయలపై పొట్టు, తీసి, గింజలను ఎండబెట్టి దాచుకోవాలి. అవసరమైనప్పుడు వీటిని నలగగొట్టి నీటిలో 1,2 రో జులు నానబెట్టి వడబోసి పైర్లపై స్ప్రే చేసుకోవాలి. ఉదాహరణకు 10కిలోల వేప గింజలను నలగ గొట్టి లేదా గ్రైండర్లో రుబ్బి 5, 6 లీటర్ల నీటిలో 1, 2రోజులు నానబెట్టి గుడ్డతో వడబోసి 200లీటర్ల నీటిలో కలిపి ద్రావకాన్ని తయారుచేసుకుని ఎకరం చేనుపై స్ప్రే చేస్తే చీడపీడలను నివారించవచ్చు. ఒకవేళ కాయల నుంచి గింజలను తీయడం కుదరనపుడు 20కిలోల వేప వేపకాయలను వాడుకొని పైన పేర్కొన్న విధంగా ద్రావణాన్ని తయారు చేసుకుని వాడుకోవచ్చు. లాభాలు... సాగులో వేప పిండిని వాడటం వల్ల వేరు పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు. 150 నుంచి 200కిలోల వేప పిండిని ఎకరం విస్తీర్ణంలో దమ్ములో వేస్తే వరిలో కాండం తొలిచే పురుగు, ఉల్లికోడును అరికట్టవచ్చు. వేప మందును చల్లితే పురుగులు ఆహారాన్ని తీసుకోలేవు. ఆకలితో శుష్కించి మరణిస్తాయి. వేప మందులు వికర్షకాలుగా పనిచేస్తాయి. పురుగుల్లో గుడ్లు పెట్టే శక్తి సన్నగిల్లుతుంది. గుడ్లు పొదగవు. లార్వా దశ ఎదుగుదలలో వచ్చే మార్పులకు అవరోధం కలుగుతుంది. పురుగు సంతతి పెరగదు. మేలు చేసే సహజక్రిమి శత్రువులు, పరాన్న జీవులకు ఎలాంటి హానీ ఉండదు. ఇతర పురుగు మందులతో కలిపి వీటిని చల్లుకోవచ్చు. వేప ఉత్పత్తులను ఎప్పుడు చల్లాలి..? పైరు విత్తిన 15, 30, 40 రోజుల్లో చల్లుకోవాలి. రెక్కల పురుగు దశ, గుడ్డు దశ, మొదటి లార్వా దశల్లో చల్లితేనే వేప నూనె సమర్థవంతంగా పురుగులను నివారిస్తుంది. పెరిగిన పురుగులపై వేప నూనె ప్రభావం అంతంత మాత్రంగానే ఉంటుంది. సాయంత్రం పూట పొలంలో ఎగిరే రెక్కల పురుగులు కనిపించినపుడు, ఆకులపై గుడ్ల సముదాయాన్ని గమనించినపుడు మరోసారి, పిల్ల లార్వా దశలో ఉన్నపుడు ఇంకోసారి.. ఇలా మూడుసార్లు వేప నూనె చల్లితే పురుగులను నివారించవచ్చు. వేప నూనెను చల్లితే పురుగు చావదు కానీ పైరును ఆశించదు. ఇతర ప్రయోజనాలు... వేప పిండిని యూరియాలో కలిపి వాడితే 50శాతం యూరియాను ఆదా చేయవచ్చు. 2-3 కిలోల వేప నూనెను 50కిలోల యూరియాలో బాగా కలిపి 12గంటల తర్వాత పైరుపై చల్లితే యూరియా త్వరగా కరిగిపోకుండా చాలా రోజులపాటు చేనుకు అందుతుంది. చేపలు, రొయ్యల చెరువుల్లో వేపపిండి, వేపనూనె వాడితే వాటికి వచ్చే వ్యాధులు తగ్గుతాయి. నాచు పెరగదు. వారానికోసారి వేపనూనె చల్లి ఇంట్లో, దొడ్డిలో, కోళ్లఫారాల్లో దోమలు, గోమార్లు, నల్లుల బెడదలను నివారించుకోవచ్చు. నకిలీలపై దృష్టి పెట్టండి... ఎంపిక చేసిన చెట్టు నుంచి నాణ్యమైన వేప కాయలను సేకరించుకొని, గింజలు తీసేసి ఎండబెట్టి రైతులే నిల్వ చేసుకొని అవసరమున్నప్పుడు పైర్లపై వాడుకోవడం ఉత్తమం. ఇప్పటికే వాణిజ్యపరంగా ఎన్నో రకాల వేప సంబంధ ఉత్పత్తులు అనేక పేర్లతో మార్కెట్లోకి వచ్చాయి. నకిలీలపై దృష్టిసారించి నాణ్యతను గమనించి వాడుకోవాలి. -
నువ్వుల సాగు ఇలా..
విత్తన మోతాదు, శుద్ధి చేసే విధానం.. ఎకరానికి 1.5 నుంచి 2 కిలోల విత్తనం అవసరం. విత్తన పరిమాణం చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి విత్తనానికి ఐదింతల ఇసుక కలిపి గొర్రుతో వరుసల్లో విత్తుకోవాలి. విత్తనాన్ని 2 నుంచి 3 సెం.మీ. లోతు మించకుండా వేయాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల థైరమ్ లేదా మాంకోజెబ్ లేదా కార్బండిజమ్‌తో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. వరుసల మధ్య 30 సెం.మీ., మొక్కల మధ్య 10-15 సెం.మీ. దూరం ఉండేలా విత్తుకోవాలి. ఎరువుల యాజమాన్యం.. రబీలో ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువు, 24 కిలోల నత్రజని, 8 కిలోల పొటాష్, 8 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు వేసుకోవాలి. నత్రజని సగభాగం, భాస్వరం, పొటాష్ ఇచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేసి బాగా కలియ దున్నాలి. మిగిలిన సగభాగం నత్రజని ఎరువును విత్తిన నెలరోజులకు కలుపుతీసి వేయాలి. భాస్వరం ఎరువు సింగిల్ సూపర్ పాస్ఫేట్ రూపంలో పడినపుడు అదనంగా క్యాల్షియం, గంధకం లభించి దిగుబడి పెరుగుతుంది. నీటి యాజమాన్యం.. విత్తిన వెంటనే మొదటి త డి ఇవ్వాలి. పూత, కాయ, అభివృద్ధి, గింజ కట్టు దిగేట్లు తడులు ఇవ్వాలి. విత్తిన తర్వాత 35-40 రోజుల నుంచి 65-70 రోజుల వరకు నీటి ఎద్దడి లేకుండా చూడాలి. కలుపు నివారణ.... విత్తే ముందు పుక్లొరాలిన్ 45 శాతం ఎకరాకు లీటరు చొప్పున పిచికారీ చేసి కలియదున్నాలి. పెండి మిథాలిన్ 30శాతం లేదా అలాక్లోర్ 50శాతం ఎకరాకు లీటరు చొప్పున విత్తిన వెంటనే గానీ, మరుసటి రోజున గానీ పిచికారీ చేయాలి. చీడపీడల నివారణ.. సస్యరక్షణ చర్యలు.. ఈ పంటకు ఎక్కువగా కాయ తొలిచే పురుగు ఆశిస్తుంది. దీని లార్వా లేత ఆకుపచ్చ రంగులో ఉండి నల్లటి మచ్చలు కలిగి ఉంటుంది. తొలి దశలో చిన్న లార్వాలు కలిసి గూడు కట్టి లోపలి నుంచి ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని కొరుక్కు తింటాయి. తద్వారా ఆకులు ఎండిపోతాయి. ఈ పురుగు ఉద్ధృతి అంతగా ఉండదు. పురుగు ఆశించిన ఆకులను లార్వాలతో సహా ఏరి నాశనం చేయాలి. మోనోక్రోటోపాస్ 1.6 మి.లీ. లేదా క్లోరోపైరిపాస్ 2.5 మి.లీ. నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. -
పంట దిగుబడిని శాసించే జింక్
పంటలో జింక్ లోపం ఉంటే నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను మొక్కలు సమర్థవంతంగా ఉపయోగించుకోలేవు. దీనివల్ల ఎరువుల ఖర్చు భారంగా మారుతుందే తప్ప దిగుబడి పెరగదు. మొక్క పెరుగుదలలో జింక్ వివిధ క్రియలను నిర్వర్తిస్తుంది. మొక్కల పెరుగుదల కోసం వివిధ రసాయనిక క్రియల్లో అవసరమయ్యే ఎంజైముల చురుకుదనాన్ని పెంచడానికి, ఉత్తేజపరచడానికి, రసాయనిక క్రియల్లో కావాల్సిన హార్మోన్ల ఉత్పత్తికి అవసరమైన రసాయన పదార్థాల తయారీకి జింక్ ఉపయోగపడుతుంది. పంటపై జింక్ లోపం కనిపిస్తే.. జింక్ లోప లక్షణాలు పంటపై కనిపిస్తే.. 10 లీటర్ల నీటికి 20 గ్రాముల జింక్‌ను కలిపి పిచికారీ చేయాలి. ఎకరానికి 200 లీటర్ల ద్రావణం సరిపోతుంది. ఇలా వారం రోజుల వ్యవధిలో రెండు లేదా మూడు సార్లు పిచికారీ చేస్తే ఫలితం ఉంటుంది. రెండు క్వింటాళ్ల పశువుల ఎరువు, కంపోస్టు, కోళ్ల వ్యర్థాలు, ఫిల్టర్ మడ్డి లాంటి సేంద్రియ ఎరువులతో 15 కిలోల జింక్‌ను కలిపి ఒక నెల మగ్గబెట్టాలి. ఈ మిశ్రమాన్ని పైరు వేసే ముందు దుక్కిలో చల్లితే అధిక దిగుబడిలో మార్పు కనిపిస్తుంది. వరిలో జింక్ లోపం జింక్ లోపం వరి పైరుకు ఇబ్బందిగా మారింది. నారుమడిలోనూ.. నారు నాటిన తర్వాత కూడా జింక్ లోపం కనిపిస్తోంది. సాధారణంగా నాట్లు వేసిన తర్వాత రెండు నుంచి నాలుగు వారాల మధ్య, నాలుగు నుంచి ఆరో వారం వరకు జింక్ లోపం లక్షణాలు బయటపడతాయి. గుర్తించడం ఇలా.. జింక్ లోపం ఉన్నప్పుడు ప్రధాన పోషకాలు తగినంత వేసినా పంట సరిగా పెరగదు. పిలకలు పెట్టదు. పంట గుంపులు గుంపులుగా చనిపోయి ఖాళీగా కనిపిస్తుంది. పొలమంతా పసుపు పచ్చగా కనిపిస్తుంది. దగ్గరగా చూస్తే మొక్కల్లో పైనుంచి మూడు లేదా నాలుగు ఆకుల మధ్య ఈనె మొదలు భాగం ఆకుపచ్చ రంగు కోల్పోయి పసుపు లేక పసుపుతో కూడిన తెలుపు రంగులోకి మారుతుంది. ఆకులోని మిగతా భాగమంతా ఆకుపచ్చగానే ఉంటుంది. ఇటుక రంగు మచ్చలు కనిపిస్తాయి. నివారణ చర్యలు పంట వేసే ముందు మట్టి పరీక్ష చేయించుకోవాలి. జింక్ తగినంత ఉందో లేదో తెలుసుకోవాలి. జింక్ లోపమున్నట్లు తేలితే తప్పని సరిగా ముందుగానే సరైన మోతాదులో జింక్ సల్ఫేట్‌ను వేసుకోవాలి. వరి పంటకైతే ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్‌ను దుక్కిలో నాటే ముందు వేసుకోవాలి. మూడు పంటలకు ఒకసారి గానీ, రెండేళ్లకోసారి గానీ ఇలా చేయాలి. ఏటా వరి వేసుకోవాలనుకుంటే మాత్రం రబీలోనే జింక్ వేసుకోవాలి. సమస్యాత్మక నేలలు అంటే క్షార, చవుడు, సున్నపు, నేలలైతే జింక్ సల్ఫేట్‌ను ఎకరానికి 40 కిలోల చొప్పున వేసుకోవాలి. -
సమగ్రపోషణ ముఖ్యం..
ఖమ్మం వ్యవసాయం: వరిలో అధిక, సుస్థిర దిగుబడులు పొందాలంటే సమగ్ర పోషక యాజమాన్యం ముఖ్య పాత్ర పోషిస్తుందని ఖమ్మం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ హేమంత్‌కుమార్, డాక్టర్ ఎం. వెంకట్రాములు అంటున్నారు. భూసార పరీక్ష చేయించి నేల సారాన్ని బట్టి సిఫార్సు చేసిన నత్రజని, భాస్వరం, పొటాష్, ఇతర సూక్ష్మ పోషకాలు అందించాలని అన్నారు. రసాయనిక ఎరువుల మోతాదు తగ్గించుకుని సేంద్రియ, జీవన, పచ్చిరొట్ట ఎరువుల వాడి పైరుకు సమతుల్యంగా అందించాలని అంటున్నారు. రసాయనిక ఎరువులు మాత్రమే వాడడం వల్ల పురుగులు, తెగుళ్లు, అధికమవడమే కాక ఖర్చు పెరిగి రాబడి కూడా తగ్గుతుందని, వీటితో అనేక మార్పులు చోటు చేసుకుంటాయని, వాతావరణం, భూమి, మనుషులకు అనర్థాలు కలుగుతాయని అంటున్నారు. ఈ సందర్భంగా రైతులకు వారు పలు సూచనలు చేశారు.. సమగ్ర పోషక యాజమాన్యం: వరి మాగాణుల్లో అపరాలు, జీలుగ, జనుము, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట పైరును పెంచి కలిపి దున్నడం ద్వారా భూసారం పెరుగుతుంది. దీని వల్ల సుమారు 20 నుంచి 25 శాతం వరకు నత్రజని, భాస్వరం, పొటాష్లను ఆదా చేయవచ్చు. సజీవ ఎరువులైన అజోల్లా, అజోస్పైరిల్లమ్, ఫా స్పోబాక్టీరియా తదితర జీవన ఎరువులను వా డడం వల్ల నత్రజని, భాస్వరం మోతాతులను 10 నుంచి 20 శాతం వరకు తగ్గించవచ్చు. అజోల్లా : వరిసాగుకు ముందు దమ్ములో ఎకరాకు 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ను వేసి పలుచగా నీరు నిల్వ చేయాలి. అందులో 100 - 150 కిలోల అజోల్లా వేసి రెండు నుంచి మూడు వారాలు పెరుగనిచ్చి కలియదున్నాలి. ఇలా చేయడం వల్ల ఎకరాకు 3 టన్నుల పచ్చిరొట్ట, 12 కిలోల నత్రజని నేలకు చేరుతుంది. అజటోబాక్టర్ : ఒక కిలో కల్చరును 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఎకరం పొలంలో చల్లాలి. లేదా ఎకరాకు 300 మి.లీ నుంచి 500 మి.లీ ద్రవరూప జీవన ఎరువును 25 - 30 లీటర్ల నీటిలో కలిపి, ఆ ద్రావణాన్ని 200 కిలోల వర్మి కంపోస్టుకు లేదా బాగా చివికిన పశువుల ఎరువుకు పట్టించాలి. ఈ మిశ్రమాన్ని నీడలో ఒక రోజు ఉంచి మరుసటి రోజు ఒక ఎకరా పొలంలో సమానంగా వెదజల్లాలి. ఈ జీవన ఎరువును వరి నాటిన వారం రోజుల్లో వేయాలి. ఫాస్పోబ్యాక్టీరియా: ఫాస్పోబ్యాక్టీరియా ద్రవరూప జీవన ఎరువును 25 - 30 లీటర్ల నీటిలో కలిపిన ద్రావణాన్ని 200 కిలోల వర్మి కంపోస్టుకు లేదా బాగా చివికిన పశువుల ఎరువుకు పట్టించాలి. ఈ మిశ్రమాన్ని నీడలో ఒక రోజు ఉంచి మరుసటి రోజు ఒక ఎకరా పొలంలో సమానంగా వెదజల్లాలి. ఈ జీవన ఎరువును వరి నాటిన వారం రోజుల్లో వేయాలి. (ఈ జీవన ఎరువులు వ్యవసాయ పరిశోధనా సంస్థ అమరావతి (ఫోన్ నంబర్ 08654-288245)లో లభ్యమవుతాయి). భూసారాన్ని బట్టి రసాయనిక ఎరువుల మోతాదు నిర్ణయించి నత్రజని, భాస్వరం, పొటాష్, జింక్ నిచ్చే ఎరువులను సమతుల్యంగా వాడాలి. సిఫారసు చేసిన ఎరువుల మోతాదు ప్రకారం ఒక ఎకరాకు 40 కిలోల నత్రజనిని, 20 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులను వాడాలి. నత్రజనిని మూడు సమ భాగాలుగా చేసి నాటుకు ముందు దమ్ములోనూ, దుబ్బు చేసే దశలోనూ, అంకురం దశలోనూ, బురద పదునులో మాత్రమే సమానంగా వెదజల్లి 36 - 48 గంటల తర్వాత పలుచగా నీరు పెట్టాలి. 50 కిలోల యూరియాకు 10 కిలోల వేపపిండి లేదా 250 కిలోల తేమ కలిగిన మట్టిగాని కలిపి, 2 రోజులు నిల్వ ఉంచి వెదజల్లితే నత్రజని వినియోగం పెరుగుతుంది. మొత్తం భాస్వరం ఎరువును దమ్ములోనే వేయాలి. పొటాష్ ఎరువులను రేగడి నేలల్లో ఆఖరి దమ్ములో పూర్తిగా ఒకేసారి వేయాలి. చలక(తేలిక) భూముల్లో ఆఖరి దమ్ముల్లో సగం, అం కురం ఏర్పడే దశలో మిగతా సగాన్ని వేయాలి. కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా దుబ్బు చేసే సమయంలోగాని అంకురం ఏర్పడే దశలోగాని వేయకూడదు. దమ్ములోనే వేయటం మంచిది. ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి. లేదా పైరుపై జింకు లోపం కనిపించగానే లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ చొప్పున కలిపి 5 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి. భాస్వరం ఎరువుతో పాటు జింక్ సల్ఫేట్‌ను కలి పి వేయకూడదు. కనీసం మూడు రోజుల వ్య వధి ఉండాలి. జింక్ సల్ఫేట్ ద్రావణంలో పురు గు లేదా తెగుళ్ల మందులను కలుపకూడదు. ఇనుము లోప లక్షణాలు కనిపించినప్పుడు లీటరు నీటికి 20 గ్రాముల అన్నభేది, 2 గ్రాముల నిమ్మ ఉప్పు, కలిపి పిచికారీ చేయాలి. పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ గాఢత కల్గిన ద్రావణాన్ని (0.5 నుంచి 1 శాతం) వాడాలి. -
ఎరువు.. కాకూడదు బరువు
ఇలా చేయండి లోతు దక్కుల వల్ల నేల గుల్లబారి, తేమను బాగా నిల్వ ఉంచుకుంటుంది. ఇలా చేస్తే వేసిన ఎరువు ఎక్కువ శాతం మొక్క తీసుకునే అవకాశం ఉంటుంది. ఎరువులు వేసే ముందు తప్పనిసరిగా కలుపును నిర్మూలించాలి. అంతేగాక పొలంలో తగినంత తేమ ఉన్నప్పుడే ఎరువులు వేయాలి. అన్ని పోషకాల్లో నత్రజని వృథా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి యూరియాను వేపపిండితో లేక పలకలపై వేప నూనెతో కలిపి వాడితే నత్రజని నెమ్మదిగా విడుదలై వృథా తగ్గుతుంది. యూరియాను కోల్తార్తో కలిపి వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. ఒక కిలో కోల్తార్ను 2 లీటర్ల కిరోసిన్‌లో కలిపి.. దానిని రెండు బస్తాల యూరియాకు పట్టించి వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. అర బస్తా యూరియాను ఒక బస్తా తడిపొడి మట్టితో కలిపి 24 గంటలు నీడలో ఉంచి, ఆ తర్వాత పొలంలో చల్లితే వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ఎరువు వేసే పద్ధతులు సిఫార్సు మేరకు ఎరువులు వాడటమే కాదు.. సరైన పద్ధతిలో పొలానికి వేయాలి. సాధారణంగా ఎరువులు రెండు పద్ధతుల్లో వేస్తారు. వెదజల్లే పద్ధతి : మొక్కలు పొలం నిండా దగ్గర.. దగ్గరగా ఉండి వరుసల్లో సక్రమంగా లేని మొక్కలకు, వేళ్లు భూమిలో అల్లుకుని ఉండే పైర్లకు ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. మాగాణి వరికి ఇది చాలా అనువైన పద్ధతి. మొదళ్ల దగ్గర ఎరువు వేసే పద్ధతి మొదళ్ల వద్ద ఎరువు వేయడం వల్ల పోషక వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. వృథా చాలా వరకు తగ్గుతుంది. నిర్ణీత వరుసల్లో మొక్కలు ఉండి, నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు.. గొర్రు, గుంటక లేదంటే చేతితో 2 అంగుళాల లోతులో పడేలా మొక్కల మొదళ్ల దగ్గర ఎరువు వేయాలి. చేతితో చిన్నచిన్న గుంటలు తీసి వేసుకునేటప్పుడు ఎరువు వేసిన వెంటనే గుంటను మట్టితో కప్పేయాలి. పైరుపై పోషకాల పిచికారీ ఎరువు వేసిన తర్వాత నీరు పెట్టడానికి వసతి లేనప్పుడు నేలలో తగినంత తేమ లేనప్పుడు, సమస్యాత్మక నేలలకు పోషకాలు అందించడానికి, పోషక లోపం కనిపించిన పైర్లకు ఈ పద్ధతి ద్వారా పోషకాలు అందించవచ్చు. ధరలపై అవగాహన ఉండాలి ఎరువులు వేసే పద్ధతులు, వేయాల్సిన మోతాదు తెలుసుకోవడం ఎంత ముఖ్యమో.. పోషకాల ధరలను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు చేయడం అంతే అవసరం. ప్రతి ఎరువు బస్తా మీద ఆ ఎరువులో ఉన్న పోషక విలువ శాతం స్పష్టంగా రాసి ఉంటుంది. అయితే బస్తా మీద సూచించిన పోషక విలువల్లో సగం మాత్రమే ఆ బస్తా ఎరువులో ఉందని గమనించాలి. ఎందుకంటే సూచించిన పోషక శాతం 100 కిలోల రసాయన ఎరువుకు సంబంధించినది. -
పంటల శత్రువు ‘వయ్యారి భామ’
* జగమొండి కలుపుతో 40% దిగుబడి నష్టం * నత్రజనిని స్థిరీకరించే సూక్ష్మజీవులకు హాని ‘వాడు నడచిన చోట గడ్డి కూడా మొలవదురా..’ అంటూ ఉంటారు. నిలువెల్లా జీవన వ్యతిరేకతతో కూడిన నడవడిక గల వారి గురించి ఇలా అంటూ ఉంటారు. వినాశకరమైన కలుపు మొక్క వయ్యారి భామ కూడా ఇటువంటిదే. పార్ధీనియం, కాంగ్రెస్ గడ్డి, మాచర్ల కలుపు, ముక్కుపుడక, నక్షత్ర గడ్డి, క్యారట్ ఘాస్ వంటి అనేక పేర్లతో దీన్ని పిలుస్తారు. ఎటువంటి ప్రతికూల వాతావరణాన్నయినా తట్టుకొని.. మొలకెత్తిన తర్వాత 4 వారాల్లో 10 వేల నుంచి 50 వేల విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ విత్తనం రెండేళ్ల వరకు నిద్రావస్థలో ఉండి, అనుకూల పరిస్థితులు వచ్చిన వెంటనే మొలకెత్తుతుంది. 1950లో అమెరికా నుంచి గోధుమ గింజలతో పాటు దిగుమతైంది మొదలు.. ఇబ్బడి ముబ్బడిగా విస్తరిస్తూ మన దేశానికి గుదిబండగా మారింది. ఆస్ట్రేలియా వంటి అనేక ఇతర దేశాలకూ తలనొప్పిగా మారింది. దీని వల్ల జీవవైవిధ్యానికి, మనుషులు, పశువుల ఆరోగ్యానికే కాకుండా పంటలకూ తీరని నష్టం వాటిల్లుతోంది. పంటలకు నష్టం జరిగేదిలా: పార్థీనియం మొక్కలున్న పొలంలో దిగుబడి 40% వరకు తగ్గిపోయినట్లు శాస్త్రవేత్తల అధ్యయనాల్లో తేలింది. పశుగ్రాస పంటల్లో అయితే ఏకంగా 90% దిగుబడి తగ్గింది. ఈ మొక్క వేళ్ల నుంచి స్రవించే రసాయనాలు పక్కనే ఉన్న పంట మొక్కలను పెరగనీయవు. ఇతర మొక్కలను కూడా మొలవ నీయవు. పచ్చిక బయళ్లలో గడ్డినీ పెరగనీయవు. దీని పుప్పొడి టమాటా, వంగ, చిక్కుడు, మిరప వంటి పెరటి కాయగూరల పుప్పొడి పైన పడి.. కాయలు ఏర్పడకుండా అడ్డుకుంటుంది. గాలి నుంచి నత్రజనిని గ్రహించి అపరాల పంట మొక్కల వేళ్లకు అందించే సూక్ష్మజీవులను నిరోధిస్తుంది. వివిధ రకాల వైరస్ తెగుళ్లు, పిండినల్లి వ్యాప్తికి దోహదపడుతుంది. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోగలిగే అంతర్గత వ్యవస్థ పార్థీనియం సొంతం. పైర్లతో పోటీపడి పెరిగి పంటల దిగుబడిని తగ్గిస్తుంది. నిర్మూలన ఎలా? పూత రాకముందే పార్థీనియం మొక్కను పీకి పచ్చిరొట్ట ఎరువుగా వినియోగించుకోవడం మేలు. జైగోగ్రామా బైకొలరేటా అనే పెంకు పురుగులు మాత్రమే దీని ఆకులను తింటాయి. కసవిందా(కేస్సియం సెరిషియా) మొక్కల వేళ్లు స్రవించే కొన్ని రసాయనాలు పార్థీనియం పెరుగుదలను, బీజోత్పత్తి శక్తిని తగ్గిస్తాయి. వెంపలి, స్టైలో, గాలివాన మొక్క, పిచ్చితులసి, తోటకూర, పసర కంప కూడా దీన్ని అణచివేస్తాయి. దీని నిర్మూలనకు వ్యవసాయ వర్సిటీ ఆగస్టు 16 నుంచి ప్రచార వారోత్సవాలు నిర్వహిస్తోంది. వివరాలకు: కలుపు మొక్కల పరిశోధన కేంద్రం (రాజేంద్రనగర్) అధిపతి, ముఖ్య శాస్త్రవేత్త డా. ఎం. ఏకాద్రి(98664 58165)ని సంప్రదించవచ్చు. - సాగుబడి డెస్క్