ఆక్సిజన్..ప్రాణాలు నిలబెట్టే వాయువు. ఐ–కొలి లాంటి కొన్ని రకాల బ్యాక్టీరియాలు మినహా భూమ్మీద సమస్త జీవజాలాల మనుగడకు ఈ ఆక్సిజన్ అవసరం. అయితే ఈ ప్రాణవాయువుకు జన్మనిచ్చింది ఓ బ్యాక్టీరియా అంటే వింతగా అన్పించినా వాస్తవం. కోటాది కోట్ల సంవత్సరాల క్రితం భూ వాతావరణంలో ఆక్సిజన్ అనేది లేదు. సుమారు 450 కోట్ల సంవత్సరాల క్రితం వాయువులు, దుమ్ము, ధూళి ఒకచోట స్థిరపడి భూగోళం ఏర్పడింది.
ఆ తరువాత మరో వంద కోట్ల సంవత్సరాలకు భూమిపై ఏకకణ జీవితో జీవం ఆవిర్భవించింది. అప్పటికి ఇంకా భూమి మీద ఉన్న అనేక రకాల వాయువుల్లో ఆక్సిజన్ లేదు. ఆ కాలంలో ప్రోక్లొరోకాకస్ అనే బ్యాక్టీరియా తన మనుగడ కోసం నీరు, సూర్యరశ్మి, కార్బన్ డైఆక్సైడ్‌ల ద్వారా కిరణజన్య సంయోగ క్రియను జరిగించి అవసరమైన శక్తిని పొందడం మొదలుపెట్టింది. సముద్రంలో ఉండే ఈ బ్యాక్టీరియా నిర్వహించిన కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి అవుతూ వాతావరణంలో కలవడం మొదలయ్యింది.
సుమారు 300 కోట్ల సంవత్సరాల క్రితం భూ వాతావరణంలో ఓ మోస్తరు ఆక్సిజన్ లభించడం మొదలయ్యింది. దీన్నే శాస్త్రవేత్తలు గ్రేట్ ఆక్సిడేషన్ ఈవెంట్‌గా అభివర్ణించారు. అలా మొదలైన ఆక్సిజన్ ఇప్పటికి భూమిపై ఉన్న వాతావరణంలో 21 శాతానికి పెరిగింది. కోటాను కోట్ల జీవరాశుల జన్మకు, మనుగడకు కారణమయ్యింది.
నైట్రోజన్‌దే రాజ్యం
భూ వాతావరణంలో అత్యధికంగా నైట్రోజన్ 78 శాతం ఉంది. అంటే ఆక్సిజన్, నైట్రోజన్ కలిసి గాలిలో 99 శాతం ఉన్నాయన్నమాట. ఇక ఆగాన్, కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులన్నీ కలిపి ఒక్క శాతం ఉన్నాయి. సౌర కుటుంబంలోని మిగతా గ్రహాల్లో స్వచ్ఛమైన ఆక్సిజన్ దాదాపుగా లేదు.
ఒకవేళ ఉన్నా ఇతర వాయువుల సంయోగంలో మాత్రమే ఉంది. ఉదాహరణకు వీనస్ (శుక్రుడు), మార్స్ (అంగారకుడు) గ్రహాల వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ కలిసి 98 శాతం ఆక్రమిస్తున్నాయి. ఈ కారణంగానే ఇతర గ్రహాలతో పాటు వీటిల్లోనూ జీవావిర్భావానికి అనుకూలమైన వాతావరణం లేదు.
కిరణాలే జన్మదాతలు
భూమ్మీద లభించే ఆక్సిజన్ దాదాపుగా కిరణజన్య సంయోగక్రియ (ఫొటోసింథసిస్) సృష్టించిందే. అయితే కేవలం భూమ్మీది వృక్ష జాతుల్లో జరిగే ఫొటోసింథసిస్ వల్లే మొత్తం ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోందనుకుంటే పొరపాటే. సగం సముద్రంలో కూడా పుడుతోంది. సముద్రంలో ఉండే మొక్కలు, నాచు వంటి వృక్ష సంబంధమైనవి కూడా తమకు కావలసిన శక్తి కోసం కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి.
వీటి మాదిరిగానే ప్రోక్లోరొకాకస్ బ్యాక్టీరియా కూడా ఫొటోసిం«థసిస్ ద్వారా ఆక్సిజన్‌ను సృష్టిస్తోంది. అయితే సముద్రంలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్‌లో భూ వాతావరణంలో కలిసేది అత్యల్పమనే చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ ఉత్పత్తి అయిన ఆక్సిజన్ చాలావరకు సముద్ర జీవజాలాల మనుగడకే సరిపోతుంది. కాబట్టి భూమ్మీద మనకు లభ్యమయ్యే ఆక్సిజన్ దాదాపుగా వృక్ష జాతుల పుణ్యమే.
ఎంత చెట్టుకు అంత..
ఎదిగిన చెట్టుకు ఆకులు, కొమ్మలు, కాండం, వేర్లు ఉంటాయి. అయితే చెట్టులో ఐదు శాతంగా ఉండే ఆకులు మాత్రమే ఆక్సిజన్‌ను తయారు చేస్తాయి. వేర్ల నుంచి వచ్చే నీరు, సూర్యరశ్మి, వాతావరణంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్‌ను ఆకులు గ్రహించి కిరణ జన్య సంయోగక్రియ ద్వారా చెట్టు ఎదుగుదలకు కావలసిన గ్లూకోజ్‌ను తయారుచేస్తాయి.
ఈ ప్రక్రియలో ఆక్సిజన్‌ను వాతావరణంలోకి వదిలేస్తాయి. చెట్లు కూడా కొంత ఆక్సిజన్‌ను ఉపయోగించుకుంటాయి కానీ విడుదల చేసే ఆక్సిజన్‌తో పోల్చుకుంటే అది అతిస్వల్పం. ఇలా వాతావరణంలో ఆక్సిజన్ చేరుతూ ఈ రోజు మొత్తం గాలిలో 21 శాతాన్ని ఆక్రమించింది. సమయం, కాలం ఇతర వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఒక చెట్టు ఉత్పత్తి చేసే ఆక్సిజన్‌లో హెచ్చు తగ్గులు ఉంటాయి. అలాగే చెట్టు లేదా మొక్క రకాన్ని బట్టి ఆక్సిజన్ ఉత్పత్తి పరిమాణం మారుతూ ఉంటుంది.
చాలావరకు మొక్కలు, చెట్లు పగలు మాత్రమే ఆక్సిజన్‌ను విడుదల చేస్తా యి. కొన్ని అరుదైన వృక్ష జాతులే 24 గంటలు ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఉదాహరణకు చాలామంది ఇంట్లో పెంచుకునే తులసి చెట్టు రోజులో 20 గంటల వరకు ఆక్సిజన్‌ను విడుదల చేస్తూనే ఉంటుంది. అలాగే అరెకాపామ్‌గా పిలిచే పోకచెట్టు 24 గంటల పాటూ ఆక్సిజన్‌ను వాతావరణంలోకి వదులుతూనే ఉంటుంది.
ఆరేడు చెట్లు = ఓ మనిషి మనుగడ
ఒక అంచనా ప్రకారం ఒక ఆకు గంటకు ఐదు మిల్లీలీటర్ల ఆక్సిజన్‌ను తయారుచేస్తుంది. వంద అడుగుల భారీ వృక్షం ఏడాదికి 6,000 పౌండ్ల ఆక్సిజన్‌ను ఉత్తత్తి చేయగలదు. చిన్నా పెద్ద చెట్లు సగటున 260 పౌండ్లు అంటే సుమారు 120 కిలోల ఆక్సిజన్‌ని ఏడాదికి సృష్టిస్తాయి. మనిషి సగటున ఏడాదికి 9.5 టన్నుల గాలిని పీల్చుకుంటాడు.
అయితే ఇందులో ఆక్సిజన్ 21 శాతమే ఉంటుంది. మనిషి పీల్చుకునే ఆక్సిజన్‌లో కూడా మూడోవంతు మాత్రమే దేహం ఉపయోగించుకుని మిగతాది గాలిలోకి వదిలేస్తుంది. ఈ లెక్కన మనిషి ఏడాదికి 740 కిలోల ఆక్సిజన్‌ను వాడుకుంటాడు. అంటే సగటున ఆరు నుంచి ఏడు చెట్లు ఉత్పత్తి చేసే ఆక్సిజన్ ఓ మనిషి మనుగడకు సరిపోతుందన్నమాట.
భూమ్మీద శాశ్వతం కాదా?
ఆక్సిజన్ భూమ్మీద శాశ్వతంగా ఉంటుందా అన్నది సందేహాస్పదమేనంటున్నారు సైంటిస్టులు. ఒకప్పుడు భూమిపై ఆక్సిజన్ లేదు కాబట్టి భవిష్యత్తులో మళ్లీ అలాంటి పరిస్థితి ఏర్పడవచ్చునన్నది వారి అభిప్రాయం.
నాసాకు చెందిన కజుమి ఒజాకి, క్రిస్టఫర్ రైన్‌హర్ట్ అనే శాస్త్రవేత్తలు.. ఓ ప్రయోగం ద్వారా ఇంకో వంద కోట్ల సంవత్సరాల తరువాత భూమ్మీద ఆక్సిజన్ శాతం గణనీయంగా పడిపోతుందనే అంచనాకు వచ్చారు. వంద కోట్ల సంవత్సరాల తర్వాత సూర్యుడు మరింత వేడిగా మారడం వల్ల భూమిపై కార్బన్ డైఆక్సైడ్ స్థాయి విపరీతంగా పెరిగి, ఆక్సిజన్ వెళ్లిపోయేలా చేస్తుందనేది వారి అంచనా.
20 వేల టన్నుల సామర్థ్యం
కోవిడ్ సమయంలో ఆక్సిజన్ లేక రోగులు పడిన అవస్థలు గుర్తుండే ఉంటాయి. భారతదేశం కోవిడ్ కాలానికి ముందు రోజుకి 6,900 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసేది. అందులో 1,000 టన్నులు మాత్రమే వైద్య అవసరాలకు అందుబాటులో ఉండేది. మొదటి విడత కోవిడ్ సమయంలో దీని అవసరం 3,095 టన్నులకు, రెండో విడత అంటే 2021లో 5,500 టన్నులకు పెరిగిపోయింది.
ప్రభుత్వ, ప్రైవేటుపరంగా ప్రస్తుతం మనదేశంలో రోజుకు 20,000 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. కానీ వైద్య పరంగా ఇప్పుడు మనకు సగటున రోజుకు 1,250 టన్నుల ఆక్సిజన్ సరిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక, వైద్య అవసరాల కోసం ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ ద్వారా 7,054 కోట్ల డాలర్ల వ్యాపారం జరుగుతోంది.
-దొడ్డ శ్రీనివాసరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment