చెట్లు అంటే.. పెద్ద కాండం, కొమ్మలు, ఆకులు ఉంటాయి. గాలిలోంచి కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుని, మనకు ఆక్సిజన్‌ను అందిస్తాయి. కానీ ఈ చెట్లకు కాండం, కొమ్మలు, ఆకులు వంటివేవీ ఉండవు. అయినా కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకుంటాయి, ఆక్సిజన్ ఇస్తాయి. వీటిని ఎక్కడ కావాలన్నా పెట్టేసుకోవచ్చు. ఎన్ని అయినా రెడీ చేసుకోవచ్చు. మరి ఏమిటా చెట్లు? వాటి ప్రత్యేకతలేంటో తెలుసుకుందామా..
కాలుష్యానికి పరిష్కారంగా..
బొగ్గును కలపను మండించడం నుంచి వాహనాల పొగ దాకా వాతావరణం కాలుష్యం ఏటేటా పెరిగిపోతోంది. కార్బన్ డయాక్సైడ్ శాతం పెరగడం వల్ల గ్లోబల్ వార్మింగ్ పరిస్థితి ఏర్పడుతోంది. భారీగా చెట్లను పెంచడం దీనికి పరిష్కారమైతే.. అందుకు విరుద్ధంగా అడవుల నరికివేత విచ్చలవిడిగా కొనసాగుతోంది. ఈ క్రమంలో యూరప్‌లో అత్యంత కాలుష్య దేశాల్లో ఒకటిగా నిలిచిన సెర్బియా శాస్త్రవేత్తలు.. వాతావరణ కాలుష్యానికి పరిష్కారం చూపేలా ‘లిక్విడ్ ట్రీస్’ను రూపొందించారు.
ఏమిటీ ‘లిక్విడ్ ట్రీస్’?
నీళ్లు, ఒక రకం నాచు (మైక్రో ఆల్గే) నింపి, ప్రత్యేకమైన కాంతి వెలువర్చే విద్యుత్ దీపాలను అమర్చిన ట్యాంకులే ‘నీటి చెట్లు (లిక్విడ్ ట్రీస్)’. సాంకేతికంగా వీటిని బయో రియాక్టర్లు అని పిలుస్తారు.నీటిలోని నాచు కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుని.. విద్యుత్ బల్బు నుంచి వెలువడే కాంతి సాయంతో ఫొటో సింథసిస్ (కిరణజన్య సంయోగ క్రియ) జరుపుతుంది. ఈ క్రమంలో స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ఈ నీటి చెట్ల ట్యాంకులకు ‘లిక్విడ్3’ అని పేరు పెట్టారు.
పదేళ్ల వయసున్న రెండు పెద్ద చెట్లతో, లేదా 200 చదరపు మీటర్ల స్థలంలోని గడ్డి, మొక్కలతో సమానమైన స్థాయిలో కార్బన్ డయాక్సైడ్‌ను ‘లిక్విడ్ 3’ పీల్చుకుంటుందని దీనిని అభివృద్ధి చేసిన బెల్‌గ్రేడ్ యూనివర్సిటీ మల్టీడిసిప్లీనరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్త ఇవాన్ స్పాసోజెవిక్ చెప్తున్నారు.
గాలిలో కార్బన్ డయాక్సైడ్ ఎలా తగ్గుతుంది?
సాధారణంగా నీటిలో కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ వివిధ శాతాల్లో కరిగి ఉంటాయి. ఏదైనా కారణంతో నీటిలో వాటి శాతం తగ్గిన ప్పుడు.. చుట్టూ ఉన్న గాలిలోంచి నీటిలోకి చేరుతాయి. ‘లిక్విడ్ 3’లోని కార్బన్ డయాక్సైడ్‌ను నాచు పీల్చుకున్నప్పుడు.. చుట్టూ ఉన్న గాలిలోంచి తిరిగి కార్బన్ డయాక్సైడ్ ఆ నీటిలోకి చేరుతుంది. అంటే చుట్టూ ఉన్న గాలిలో కాలుష్యం తగ్గుతుంది.
ఉదాహరణకు అక్వేరియంలలోని నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్‌ను చేప పిల్లలు పీల్చుకుంటాయి. ఇలా నీటిలో తగ్గిపోయే ఆక్సిజన్ శాతాన్ని తిరిగి పెంచేందుకే గాలి బుడగలను వెలువర్చే పంపులను అమర్చుతుంటారు. అయితే ‘లిక్విడ్ 3’లో ఇలా కార్బన్ డయాక్సైడ్ తగ్గుతుంటుంది.
బెంచ్‌గా.. చార్జర్‌గా..
సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌లో మున్సిపాలిటీ ఆఫీసు ముందు మొట్టమొదటి ‘లిక్విడ్ 3’ ట్యాంక్‌ను ఏర్పాటు చేశారు. దీనిని భూమి నుంచి కాస్త లోతుగా ఏర్పాటు చేయడం వల్ల కూర్చునే బెంచ్‌లా ఉపయోగపడుతుంది. పైన సోలార్ ప్యానల్‌తో నీడ అమర్చారు. ఆ ప్యానెల్ నుంచి వచ్చే విద్యుత్‌తోనే ట్యాంకులో బల్బు వెలుగుతుంది. మొబైల్ ఫోన్లు వంటివి చార్జింగ్ చేసుకునే సాకెట్ కూడా ఉంటుంది.
‘ఐక్యరాజ్యసమితి అభివృద్ధి ప్రోగ్రాం (యూఎన్‌డీపీ)’ కింద ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 11 ఉత్తమ వినూత్న ఆవిష్కరణల్లో ‘లిక్విడ్ 3’ కూడా చోటు సాధించడం గమనార్హం.
– సాక్షి సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment