ఐస్‌ల్యాండ్‌లో గాల్లోంచి కార్బన్ డయాక్సైడ్‌ను తొలగించే భారీ ప్లాంట్
ఏటేటా పెరిగిపోతున్న వాహనాలు, పరిశ్రమలు.. వాటి నుంచి వెలువడే కాలుష్యం గ్లోబల్ వార్మింగ్‌కు కారణమవుతోంది. వాతావరణంలో నిరంతరం పెరిగిపోతున్న కార్బన్‌డయాక్సైడ్ భూమి వేడెక్కిపోయేందుకు కారణమ వుతోంది. దీనికి పరిష్కారంగానే.. ప్రపంచ దేశాలన్నీ కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడంపై ఫోకస్ పెట్టాయి. ప్రతి దేశానికి టార్గెట్లు పెట్టాయి.
ఈ క్రమంలోనే ఐస్ ల్యాండ్‌కు చెందిన ‘క్లైమ్ వర్క్స్’ కంపెనీ సరికొత్త ఐడియాతో ముందుకొచ్చింది. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి బదులు.. నేరుగా వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్‌ను తొలగించే సరికొత్త సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆ విశేషాలు ఏమిటో చూద్దామా..
ఏటా 36 వేల టన్నుల మేర..
గాలిలోంచి కార్బన్ డయాక్సైడ్ ను వేరు చేసి.. దానిని నీటితో కలిపి, భూమిలోపలి పొరల్లోకి పంపేలా క్లైమ్ వర్క్స్ కంపెనీ ఓ భారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. దీని సాయంతో ఏటా 36 వేల టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ను గాలిలోంచి తొలగించి.. భూమి పొరల్లోకి పంపేలా నిర్మించింది.
ఇది సుమారు 8 వేల డీజిల్ కార్లు ఏడాదంతా తిరిగితే వెలువడేంత కార్బన్‌డయాక్సైడ్‌తో సమానం కావడం గమనార్హం. చూడటానికి ఇది తక్కువే అనిపించినా.. ఇలాంటి ప్లాంట్లు భారీ సంఖ్యలో పెడితే.. గ్లోబల్ వార్మింగ్ సమస్యకు ఒక పరిష్కారంగా పనికొస్తుందని ‘క్లైమ్ వర్క్స్’ సంస్థ చెప్తోంది.
దీనిలో నిలువునా గోడల్లా ఏర్పాటు చేసే ప్రత్యేక నిర్మాణాలు ఉంటాయి. వాటిలో ఒకవైపు భారీ ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. వాటి వెనకాల చిన్న చాంబర్ ఉంటుంది. అందులో కార్బన్ డయాక్సైడ్‌ను సంగ్రహించే ఫిల్టర్లు ఉంటాయి.ఫ్యాన్‌లను ఆన్ చేసినప్పుడు.. అవి వెనకాల చాంబర్ నుంచి గాలిని లాగి.. ముందు వైపునకు వదులుతాయి. ఈ క్రమంలో చాంబర్‌లోని ఫిల్టర్లు కార్బన్ డయాక్సైడ్‌ను సంగ్రహిస్తాయి.
ఫిల్టర్లు కార్బన్ డయాక్సైడ్‌తో నిండిపోతే.. ఆటోమేటిగ్గా చాంబర్ సీల్ అయిపోతుంది. అందులో చేసిన ప్రత్యేక ఏర్పాట్లతో 100 సెంటిగ్రేడ్‌ల మేరకు వేడెక్కుతుంది. దాంతో ఫిల్టర్లలోని కార్బన్ డయాక్సైడ్ ఆవిరి అవుతుంది.
ఎలా పనిచేస్తుంది?
ఈ ఆవిరిని ప్రత్యేక పైపుల ద్వారా భూగర్భంలోకి తరలిస్తారు. ఆ పైపుల్లోకి నీటిని పంపే ఏర్పాట్లు చేస్తారు. దీనితో కార్బన్ డయాక్సైడ్ నీటిలో కరిగి కార్బన్ వాటర్‌గా మారిపోతుంది. భూగర్భంలోకి ఆ కార్బన్ వాటర్ మెల్లగా గడ్డకట్టి రాళ్లుగా తయారవుతుంది.ఈ ప్రక్రియలో ఫ్యాన్ల కోసం, పైపుల ద్వారా కార్బన్ డయాక్సైడ్, నీరు పంపింగ్ చేయడం కోసం వాడే విద్యుత్‌ను ఆ ప్రాంతంలోని జియోథర్మల్ పవర్ ప్లాంట్ నుంచి తీసుకుంటున్నారు.
ఇది వేడినీటి బుగ్గల నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్ కాబట్టి.. దాని వినియోగంతో పర్యావరణానికి సమస్యేమీ లేదని ‘క్లైమ్ వర్క్స్’ కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు.అమెరికాలోని లూసియానాలో 2030 నాటికి ఏటా 10 లక్షల టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ను సంగ్రహించగలిగే ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
– సాక్షి సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment