సరాసరి ఉష్ణోగ్రతల్లో రికార్డులు బద్ధలు
ఎల్‌నినో, మానవ తప్పిదాలే వాతావరణ మార్పులకు కారణం
వెల్లడించిన ఐరోపా వాతావరణ సంస్థ కోపర్నికస్ క్లైమెట్ ఛేంజ్ సర్వీసెస్
పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే 1.52 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు
1991-2020 మధ్యనాటి ఉష్ణోగ్రతలతో పోలిస్తే 0.75 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు
పారిశ్రామికీకరణకు ముందునాటి కంటే ఇది 1.63 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ
భూతాపంలో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్ దాటడానికి 80 శాతం ఛాన్స్
గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకావడానికి 86 శాతం అవకాశం
2024-28లో ప్రపంచ ఉష్ణోగ్రతల్లో 1.5 డిగ్రీ సెల్సియస్ పెరగడానికి 47 శాతం ఛాన్స్
2023-27 మధ్య కాలంలో ఇందుకు ఒక శాతం మేర అవకాశం
1850-1900నాటితో పోలిస్తే 2024-28 మధ్యకాలంలో 1.1 - 1.9 డిగ్రీలు అధికం
ఉష్ణోగ్రతలు రికార్డులు బద్ధలుకొడుతున్నాయి. ప్రతి ఏడాది రికార్డు స్థాయిలో పెరుగుతూ ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. ఒకవైపు పెరుగుతున్న టెంపరేచర్లు, మరోవైపు ముంచెత్తుతున్న భారీ వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. అయితే.. ఇది స్వీయ తప్పిదమే అంటున్నారు నిపుణులు. మానవ తప్పిదాల వల్లే వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని హెచ్చరిస్తున్నారు.
పెను ఉష్ణోగ్రతలు రికార్డులు సృష్టిస్తున్నాయి. గత మే నెల అత్యంత వేడి నెలగా రికార్డు క్రియేట్ చేసింది. అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఎండల తీవ్రత దాదాపు సంవత్సరమంతా కొనసాగింది. ఆయా నెలలకు సంబంధించిన సరాసరి ఉష్ణోగ్రతల్లో రికార్డులు బద్ధలయ్యాయి. ఈ ఏడాది మేలో ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మాగ్జిమమ్ టెంపరేచర్స్ నమోదయ్యాయి. వాతావరణంలో విపరీతమై మార్పుల వల్ల వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఎల్‌నినోతో పాటు.. మానవ తప్పిదాలే వాతావరణ మార్పులకు కారణమంటూ ఐరోపా వాతావరణ సంస్థ కోపర్నికస్ క్లైమెట్ ఛేంజ్ సర్వీసెస్ వెల్లడించింది.
ఈ ఏడాది మే నెలలో సరాసరి ఉష్ణోగ్రతలు.. పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే 1.52 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా ఉన్నట్లు ఐరోపా వాతావరణ సంస్థ వివరించింది. అయితే ఇది దీర్ఘకాలం పాటు కొనసాగితేనే పారిస్ ఒప్పందంలో పేర్కొన్న 1.5 డిగ్రీల సెల్సియస్ పరిమితిని మించిపోయినట్లు భావిస్తారు. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది మే మధ్య 12 నెలల సరాసరి భూ ఉష్ణోగ్రతల్లోనూ రికార్డు నమోదైంది. 1991 నుంచి 2020 మధ్యనాటి ఉష్ణోగ్రతలతో పోలిస్తే 0.75 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యింది. అంటే.. పారిశ్రామికీకరణకు ముందునాటి కంటే ఇది 1.63 డిగ్రీల సెల్సియస్ మేర ఎక్కువ.
రాబోయే ఐదేళ్లలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయనే వార్తలు ప్రజలను భయపెడుతున్నాయి. పారిశ్రామికీకరణకు ముందునాటితో పోలిస్తే వచ్చే ఐదేళ్లలో ఏదో ఒక ఏడాది.. 2023లో నమోదైన ఉష్ణోగ్రతల రికార్డులు బద్ధలవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూతాపంలో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్ దాటడానికి 80 శాతం మేర అవకాశముందని ఐరోపా వాతావరణ సంస్థ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకావడానికి 86 శాతం అవకాశముందని వివరించింది.
2024-28 మధ్యకాలంలో ప్రపంచ సరాసరి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్ కొనసాగడానికి 47 శాతం అవకాశం ఉందని తెలిపింది. 2023-27 మధ్య కాలంలో ఇందుకు ఒక శాతం మేర అవకాశం ఉందని గత ఏడాది డబ్ల్యూఎంవో ఇచ్చిన నివేదిక వెల్లడించింది. తాజా నివేదిక ప్రకారం.. 1850 నుంచి 1900 మధ్యనాటితో పోలిస్తే 2024 నుంచి 2028 మధ్యకాలంలో భూ ఉపరితలానికి చేరువలోని వాతావరణం సరాసరి ఉష్ణోగ్రత 1.1 నుంచి 1.9 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా ఉండొచ్చని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment