అతనో కాంట్రాక్ట్ కిల్లర్. ఓ వ్యక్తి ఇచ్చిన సుపారీతో.. అతని భార్యను హత్య చేశాడు. ఆపై సుపారీ ఇచ్చిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యవర్తి జీవితఖైదుతో జైల్లోనే చచ్చాడు. హత్యలో సహకరించిన వ్యక్తికి మరణశిక్ష అమలయ్యింది. కానీ, ఇతగాడికి మరణశిక్ష పడి దశాబ్దాలు గడుస్తున్నా.. అది అమలు కావడంలో జాప్యం అవుతూ వస్తోంది. చివరికి.. పోయినేడు ఏడాది శిక్షను అమలు చేయాలని చూస్తే అది విఫలం అయ్యింది.. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చదివేయండి..
ప్రపంచంలోనే తొలిసారి నైట్రోజన్ గ్యాస్‌నుNitrogen Hypoxia Execution ఉపయోగించి ఓ వ్యక్తికి మరణశిక్ష అమలు చేయబోతున్నారు. అమెరికా సంయుక్తం రాష్ట్రం అలబామాలో ఈ శిక్ష గురువారం అమలు కాబోతోంది. ఘోరంగా.. ఊహకందని రీతిలో అమలు కాబోయే ఈ మరణశిక్ష తప్పించుకునేందుకు చివరిదాకా యత్నం చేసిన కెన్నెత్ యూజీన్ స్మిత్(58) చివరికి నిరాశే ఎదురైంది. బుధవారం యూఎస్ సుప్రీం కోర్టు సైతం శిక్ష అమలు నిలుపుదలకు నిరాకరించింది. అలబామా కోర్టులు ఇచ్చిన తీర్పును సమర్థించింది. దీంతో.. ఈ శతాబ్దంలో ఒక వ్యక్తిని ఈ తరహాలో శిక్షించి చంపడం ఇదే తొలిసారి కానుంది.
కేసు ఏంటంటే..
1988లో కోల్‌బర్ట్ కౌంటీలో చార్లెస్ సెన్నెట్ అనే మతాధిపతి తన భార్య ఎలిజబెత్ సెన్నెట్‌ను చంపడానికి బిల్లీ గ్రే విలియమ్స్ అనే వ్యక్తికి సుపారీ ఇచ్చాడు. వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించిన ఆయన ఆ విషయం భార్యకు తెలియడం.. ఆమె నిలదీయడంతో తట్టుకోలేకపోయాడు. అలాగే.. భార్య పేరిట ఉన్న ఇన్సూరెన్స్ సొమ్ము కోసమే ఆయన ఆమెను అడ్డు తొలగించుకునే పని చేశాడు. కెన్నెత్ స్మిత్, జాన్ పార్కర్ అనే ఇద్దరు అనే ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్లకు 1000 డాలర్ల చొప్పున ఇస్తూ.. ఆ పని అప్పగించాడు బెల్లీ. ఇంట్లోనే మార్చి 18వ తేదీన ఆమెను దారుణంగా హతమార్చారు ఆ ఇద్దరు. ఇది దొపిడీ దొంగల పనేనని నమ్మించే యత్నం చేశారు.
వారం తర్వాత.. దర్యాప్తులో అసలు విషయం బయటపడుతుందన్న భయంతో ఛార్లెస్ ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు తన కుటుంబ సభ్యుల ముందు ఆయన నిజం ఒప్పుకున్నారు. ఇక ఈ కేసులో బిల్లీ గ్రే విలియమ్స్‌కు కఠిన యావజ్జీవ శిక్షపడగా.. 2020లో జైల్లోనే అనారోగ్యంతో మరణించాడు. స్మిత్, పార్కర్ ఇద్దరికీ మరణశిక్ష విధించింది కోర్టు. 2010 జూన్‌లో పార్కర్‌కు లెథల్(ప్రాణాంతక) ఇంజెక్షన్ ఇచ్చి మరణశిక్ష అమలు చేశారు. కానీ, స్మిత్ విషయంలోనే ఆ శిక్ష జాప్యం అవుతూ వస్తోంది.
కిందటి ఏడాది.. నవంబర్ 17వ తేదీన స్మిత్‌కు లెథల్ ఇంజెక్షన్ ఇచ్చి మరణశిక్ష అమలు చేయాలని ప్రయత్నించారు. అయితే.. ఇంజెక్షన్లు ఎక్కించేందుకు నరాలు దొరక్కపోవడంతో ఆ శిక్ష నిలిపేశారు అధికారులు. ఈలోపు అలబామా సుప్రీంకోర్టు ఇచ్చిన డెత్ వారెంట్ గడువు ముగిసిపోయింది. దీంతో.. అతని మరణశిక్ష అమలుపై సమీక్ష జరపాలని అలబామా గవర్నర్ కెయ్ ఇవెయ్ ఆదేశించారు. చివరకు.. నైట్రోజన్ హైపోక్సియా పద్ధతితో శిక్ష అమలు చేయాలని అధికారులు నిర్ణయించగా.. అసలు వ్యవహారం మొదలైంది.
ఐరాసతో సహా అభ్యంతరాలు..
అయితే.. ఈ తరహా మరణశిక్ష అమలుపై ప్రపంచవ్యాప్తంగా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. తొలి ప్రయత్నం విఫలమయ్యాక.. స్మిత్ శారీరక మానసిక స్థితి స్థితి ఘోరంగా దెబ్బతిందని అతని తరఫు న్యాయవాదులు వాదిస్తూ వచ్చారు. స్మిత్ కుటుంబ సభ్యులు కూడా ఈ తరహా శిక్షను అమలుచేయడానికి వీల్లేదని.. ఆయన అనుభవించిన శిక్షా కాలం పరిగణనలోకి తీసుకుని విడుదల చేయాలని క్షమాభిక్ష కోరారు. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల సంఘాలు సైతం ఇది అత్యంత మానవీయమైన చర్యగా పేర్కొంటూ వస్తున్నాయి. మరోవైపు ఐక్యరాజ్య సమితి మాన హక్కుల సంఘ కార్యాలయం సైతం ఈ శిక్షను నిలిపివేయాలంటూ అలబామాను కోరుతూ వస్తోంది.
అయితే ఎలిజబెత్ కుటుంబ సభ్యులు మాత్రం శిక్ష అమలు చేయాల్సిందేనని కోరుతూ వస్తున్నారు. ఈలోపు అమెరికా రాజ్యాంగంలోని ఎనిమిదో సవరణ ప్రకారం(నేర, అసాధారణ శిక్షల నుంచి రక్షణ) శిక్షను నిలిపివేయాలని కోర్టును ఆశ్రయించారు స్మిత్ తరఫు లాయర్లు. ఈలోపు బుధవారం.. యూఎస్ సుప్రీం కోర్టు ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. తొమ్మిది మంది న్యాయమూర్తుల్లో ముగ్గురు మాత్రమే స్మిత్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోగా.. మిగతా మెజార్టీ న్యాయమూర్తులు పిటిషన్‌ను తిరస్కరించారు.
ఎలా ఉంటుందంటే..
నైట్రోజన్ హైపోక్సియా అంటే.. నైట్రోజన్ సిలిండర్‌కు బిగించిన పైప్‌ను మాస్క్ ద్వారా నిందితుడి ముక్కుకు బిగిస్తారు. గ్యాస్‌ను విడుదల చేయగానే.. ఆక్సిజన్ అందక నైట్రోజన్ మోతాదుతో ఆ వ్యక్తి గిలగిల కొట్టుకుంటూ మరణిస్తారు. ఐసీయూలో ఆక్సిజన్ సిలిండర్ ద్వారా ఒక వ్యక్తి ప్రాణాల్ని ఎలా రక్షిస్తారో.. అదే విధంగా నైట్రోజన్‌తో ఆ ప్రాణాల్ని హరిస్తారన్నమాట. అదీ చట్టబద్ధంగా!. బుధవారం అర్ధరాత్రి దాటాక(గురువారం 12గం. నుంచి.. ఆ మరుసటి రోజు ఉదయం 6గం. లోపు ఈ శిక్షను అమలు చేస్తారు).
ఇప్పటిదాకా అమెరికాలో ప్రాణాంతక ఇంజెక్షన్ల ద్వారానే మరణశిక్షలు అమలు చేస్తూ వచ్చారు. అయితే.. ఆ ఇంజెక్షన్‌లలో ఉపయోగించే మందు దొరకడం కష్టతరం అవుతుండడంతో(ఐరోపా దేశాలు వాటిని నిషేధించాయి).. ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అలబామాతో పాటు మిసిసిప్పీ, ఓక్లహోమా నైట్రోజన్ గ్యాస్‌తో చంపడం లాంటి శిక్షలను పరిశీలనలోకి తెచ్చుకున్నాయి.
:::సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment