
వారి వివరాలను సమూలంగా పరిశీలిస్తున్న ట్రంప్ సర్కార్
భారతీయులపైనా ప్రభావం పడే ఛాన్స్
గత జో బైడెన్ ప్రభుత్వం చూపించిన ఉదారవాద విధానాలను స ద్వినియోగం చేసుకుని ఇప్పటికే శరణార్థి/నిరాశ్రయుల హోదా సంపాదించిన విదేశీయులకు అందజేసే గ్రీన్‌కార్డుల జారీ ప్రక్రియ హఠాత్తుగా ఆగిపోయింది. తాత్కాలికంగా ఈ గ్రీన్‌కార్డుల జారీ ప్రక్రియను నిలిపేసినట్లు అమెరికా పౌరసత్వం, శరణార్థి సేవల విభాగం తాజాగా ధ్రువీకరించింది. దీంతో అక్రమ మార్గా ల్లో అమెరికాలోకి వచ్చి ఎలాగోలా శరణార్థి హో దా పొందిన వారికి ఇక కొత్త కష్టాలు మొదలయ్యే అవకాశముంది.
శరణార్థి/నిరాశ్రయుల హోదా పొందటంతో ఏవైనా అవకతవకలు జరిగాయా లేదంటే వీళ్లంతా నిజంగానే సొంతదేశాల్లో హింస, పీడనకు గురయ్యారా? అనేది తేలాల్సి ఉంది. ఇందుకోసం డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సంబంధిత పాత రికార్డులను తవ్వితీయనుందని తెలుస్తోంది. గ్రీన్‌కార్డు హోదా కోసం దరఖాస్తు చేసుకున్న వారి పూర్వాపరాలను సమీక్షించాకే వారికి గ్రీన్‌కార్డు కట్టబెట్టడంపై ముందుకెళ్లాలని ట్రంప్ యంత్రాంగం నిర్ణయించింది. దీంతో లక్షలాది మంది శరణార్థులు/నిరాశ్రయుల గ్రీన్‌కార్డు కలలపై ఒక్కసారిగా నీలినీడలు కమ్ముకున్నాయి.
భారతీయుల్లో 466 శాతం ఎక్కువ
రెండేళ్ల క్రితం అంటే 2023 ఏడాదిలో ఏకంగా 51,000 మందికిపైగా భారతీయులు అమెరికాకు చేరుకుని శరణార్థి హోదా కోసం దరఖాస్తు చేసుకున్నారు. గతంతో పోలిస్తే ఒకేఏడాదిలో ఇంతమంది భారతీయులు శరణార్థులుగా అగ్రరాజ్యం చెంతకు చేరడం ఇదే తొలిసారి. 2018 ఏడాదిలో కేవలం 8,000 మంది భారతీయులు ఈ తరహా దరఖాస్తు చేసుకోగా 2023 ఏడాదికి వచ్చేసరికి ఏకంగా 466 శాతం అధికంగా 51,000 మంది అప్లై చేశారని జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం విడుదలచేసిన గణాంకాల్లో వెల్లడైంది. అక్రమ మార్గాల్లో మెక్సికో, కెనడా సరిహద్దుల గుండా అమెరికా భూభాగంలోకి అడుగుపెడుతూ అమెరికా బోర్డర్ సెక్యూరిటీ పోలీసులకు చిక్కిన వేలాది మంది భారతీయులు శరణార్థి హోదా కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇందుకు అమెరికా ఇమిగ్రేషన్ సిస్టమ్ అనుమతిస్తోంది.
శరణార్థి హోదా.. సుదీర్ఘ ప్రక్రియ
బోర్డర్ వద్ద చిక్కిన వాళ్లకు వెంటనే శరణార్థి హోదా ఇవ్వరు. వాళ్లు చెప్పే వివరాలను అధికారులు నమోదుచేసుకుని దరఖాస్తు ప్రక్రియను మొదలుపెడతారు. వైద్య పరీక్షలతోపాటు ముఖాముఖి ఇంటర్వ్యూలు చేస్తారు. సంబంధిత శరణార్థి అధికారులు ఈ బాధ్యతలను నెరవేరుస్తారు. ఈ సందర్భంగా తాము స్వదేశాన్ని ఎందుకు వీడాల్సి వచ్చింది?. స్వదేశంలో తాము పడిన కష్టాలు, ఎదురైన సమస్యలు, సొంత సమాజంలో అణచివేతకు గురవడానికి కారణాలను వివరించాల్సి ఉంటుంది. వీళ్లు చెప్పే మాటలు, వివరాలను అధికారులు/ఇమిగ్రేషన్ న్యాయమూర్తులు నమ్మితే శరణార్థి హోదా వచ్చే అవకాశాలు మెరుగవుతాయి.
కార్యనిర్వాహక ఉత్తర్వుతో అడ్డుకున్న ట్రంప్
ఎలాగోలా శరణార్థి హోదా పొందిన వారికి అమెరికాలో తాత్కాలికంగా నివసించేందుకు అవకాశం చిక్కుతోంది. ఈ అవకాశం లేకుండా చేసేందుకు రెండోదఫా అధికారంలోకి వచ్చిన ట్రంప్ వెంటనే రెండు కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీచేశారు. శరణార్థులుగా వచ్చే వారిని లోపలికి రానివ్వడం ఆపేశారు. అరెస్టయి శరణార్థి శిబిరాల్లో ఉంటున్న వారు శరణార్థి హోదా దరఖాస్తు చేయకుండా నిలువరిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా–మెక్సికో సరిహద్దు వద్ద ఈ రెండు విధానాలను ట్రంప్ కఠినంగా అమలుచేస్తున్నారు. ఈ ఉత్తర్వులను ఇప్పటికే కొందరు కోర్టుల్లో సవాల్‌చేశారు. కొందరిని స్వదేశాలకు తిరిగి పంపడాన్ని ఇటీవల ఒక ఫెడరల్ జడ్జి తన ఉత్తర్వులతో అడ్డుకోవడం తెల్సిందే.
హోదా సవరణపై ట్రంప్ సర్కార్ తీవ్ర అభ్యంతరం
శరణార్థి హోదాతో చాన్నాళ్లుగా అమెరికాలో ఉంటున్న వాళ్లు ఇక శాశ్వత స్థిర నివాసం కోసం గ్రీన్‌కార్డుకి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ దరఖాస్తుల పరిశీలనను ట్రంప్ సర్కార్ తాజాగా ఆపేసింది. హడావుడిగా వీళ్లకు గ్రీన్‌కార్డు ఇచ్చేయకుండా అసలు ఈ శరణార్థుల గతచరిత్ర స్వదేశంలో ఎలాంటిది?. భవిష్యత్తులో వీళ్లు అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా మారే ప్రమాదముందా?.. ఇలా పలు అంశాల తుది నిర్దారణకు సంబంధించి ‘స్క్రీనింగ్’విధానాలను అవలంబించాలని, అందుకోసమే అప్లికేషన్ల పరిశీలనను ఆపేశామని యూఎస్ సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐసీ) అధికారులు స్పష్టంచేశారు. మెక్సికోలో గతంలో డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్న వ్యక్తులు/కుటుంబాలు అమెరికాలో శరణార్థులుగా ఉంటే అలాంటి వారి జాబితాను ఈ గ్రీన్‌కార్డు దరఖాస్తుల్లో వెతుకుతున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్