homeless people
-
నర్సుల విశాల హృదయం..సేవతో కొత్త ఏడాదికి స్వాగతం..!
హైదరాబాద్(Hyderabad) నగర వీధుల్లో చలికి గజగజ వణుకుతూ ఇబ్బంది పడుతున్న నిరుపేదలు, నిర్భాగ్యుల((Homeless People)ను ఆదుకునేందుకు ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి(Aster Prime Hospital) నర్సులు(Nurses) సహృదయంతో ముందుకొచ్చారు. ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో వీధుల్లో ఉంటున్న సుమారు 50 మంది నిరుపేదలకు రగ్గులు పంచిపెట్టారు. సుమారు 120 మంది నర్సులు తాము సంపాదించిన దాంట్లోంచి తలా కొంత వేసుకుని ఈ రగ్గులు కొని, వీధుల్లో ఉంటున్నవారికి ఉచితంగా పంచిపెట్టారు. ప్రతిరోజూ ఆస్పత్రిలో సేవలు అందిస్తున్న ఏంజెల్ నర్సులు ఈసారి కొత్త సంవత్సరం సందర్భంగా ఏదైనా మంచి పని చేయాలని తలపెట్టి, నిరుపేదలను చలి నుంచి రక్షించేందుకు రగ్గులు పంచాలని నిర్ణయించారు. మంగళవారం సాయంత్రం ఎస్ఆర్ నగర్ ప్రాంతానికి వెళ్లి, అక్కడ రోడ్లపై ఉంటున్న 50 మందికి ఈ రగ్గులు అందించారు. ఈ సందర్భంగా ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ లిండామోల్ జోయ్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం క్రిస్మస్, కొత్త సంవత్సరం సందర్భంగా ఏదో ఒక సంబరాలు చేసుకుంటామని, ఈసారి అలా కాకుండా.. పేదలను ఆదుకోవడానికి ఏమైనా చేస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చిందని చెప్పారు. వెంటనే తమ నర్సింగ్ గ్రూపులో పోస్ట్ చేయగా, ఏంజెల్ నర్సులు అంతా ముందుకొచ్చి తమకు చేతనైనంత సాయం చేశారన్నారు. వచ్చే ఏడాది కూడా మరింత మంచి కార్యక్రమాలు చేస్తామన్నారు. నర్స్ ఎడ్యుకేటర్ రాహుల్ కమర్ మాట్లాడుతూ..అన్నీ ఉన్న మనమే చలిని తట్టుకోలేకపోతున్నామని.. అలాంటిది కనీసం గూడు కూడా లేకుండా నడివీధిలో పడుకుంటున్న నిర్భాగ్యులను చూసి తామంతా చలించిపోయామని అన్నారు.అందుకే ఈసారి వీరికి చలిని తట్టుకునేందుకు వీలుగా రగ్గులు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో కూడా ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి సిబ్బంది నిరుపేదలను ఆదుకునేలా వినూత్న కార్యక్రమాలతో ముందుకు వస్తారని తెలిపారు.(చదవండి: చిరుత ఎంట్రీతో..ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోం ఆఫర్ ..!) -
లెబనాన్ నిరాశ్రయులు.. పది లక్షలు!
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో లక్షల మంది నిరాశ్రయులవుతున్నారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల భయంతో సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారు. లక్షలాది మంది సరిహద్దులు దాటి సిరియాకు చేరుకుంటున్నారు. ఇప్పటిదాకా ఏకంగా 10 లక్షల మంది ప్రాణ భయంతో పారిపోయినట్టు ప్రధాని నజీబ్ మికాటీ ఆదివారం తెలిపారు. ఆరో వంతు జనభా దేశం దాటుతోంది. లెబనాన్‌లో ఇదే అతి పెద్ద వలస ఇదే’’ అని ఆవేదన వెలిబుచ్చారు. గాజా యుద్ధానికి ఏడాది అవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ తన దృష్టిని లెబనాన్‌పైకి మార్చింది. హమాస్‌కు మద్దతు ఇస్తున్నట్లు హెజ్బొల్లా ప్రకటించడంతో ఈ దాడులు తీవ్రమయ్యాయి. హెజ్బొల్లా స్థావరాలపై దాడుల తర్వాత ప్రజలు ఇళ్లలో ఉండటం లేదు. చాలా మంది వీధులు, సముద్రతీర కార్నిష్, పబ్లిక్ స్క్వేర్లు, తాత్కాలిక షెల్టర్లలో రాత్రంతా ఉంటున్నారు. కుటుంబాలకు కుటుంబాలు వీధుల్లోనే నిద్రిస్తున్నాయి. దహియాలో ఎక్కడ చూసినా నేలమట్టమైన భవనాలు, శిథిలాలతో నిండిన వీధులు, పొగ, ధూళి మేఘాలు కనిపిస్తున్నాయి. లెబనాన్ రాజధానికి ఎగువన ఉన్న పర్వతాల వరకు ప్రజలు పసిపిల్లలు, కొన్ని వస్తువులను వెంటపెట్టుకుని ర్యాలీగా వెళ్లారు. 50 వేల మందికి పైగా సిరియాకు వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల చీఫ్ ఫిలిప్పో గ్రాండి తెలిపారు. సిరియాకే ఎందుకు? నిరాశ్రయులైన లెబనాన్ ప్రజలు శరణార్థులుగా సిరియాకు వెళ్తున్నారు. లెబనాన్ ప్రజలు సిరియాకు వెళ్లాలంటే డాక్యుమెంట్లు అవసరం లేదు. దీంతో ప్రతి గంటకు వందలాది మంది సిరియాకు వెళ్తున్నారు. పిల్లలు సిరియాలోకి వెళ్తుంటే తండ్రులు ఏడుస్తూ వీడ్కోలు పలుకుతున్న దృశ్యం కంటతడి పెట్టిస్తోంది. యూకేకు సంపన్నులులెబనాన్లో దాడుల దృష్ట్యా విమానాశ్రయం చుట్టూ భయానక వాతావరణం నెలకొంది. చాలా విమానాలు రద్దయ్యాయి. దీంతో యూకేకు ఓకే ఒక కమర్షియల్ ఫ్లైట్ రాకపోకలు సాగిస్తోంది. మధ్య తరగతి, సంపన్న వర్గాలకు చెందినవారు లెబనాన్‌ను విడిచి యూకే లాంటి దేశాలకు వెళ్తున్నారు. -
Libya Floods: లిబియాలో ఊహకందని మహా విషాదం
డెర్నా: అస్థిర ప్రభుత్వాలు, సంక్షోభం, ఎవరికీ పట్టని ప్రజా సంక్షేమంతో సమస్యల వలయంలో చిక్కిన లిబియాపై ప్రకృతి కత్తి గట్టింది. ఊహించని వరదలు, వరద నీటి ధాటికి పేకమేడల్లా కుప్పకూలిన రెండు డ్యామ్‌లు.. వరద విలయాన్ని మరింత పెంచాయి. డ్యామ్‌ల నుంచి దూసుకొచ్చిన నీటిలో కొట్టుకుపోయి జలసమాధి అయిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం నాటి గణాంకాల ప్రకారం డెర్నా సిటీలో వరద మృతుల సంఖ్య ఏకంగా 5,100 దాటింది. ఇంకా వేలాది మంది జాడ గల్లంతయిందన్న కథనాలు చూస్తుంటే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వరద ఉధృతికి ఇళ్లుసహా సర్వం కోల్పోయి నిరాశ్రయులైన వారు వేలాదిగా ఉన్నారు. డెర్నా సిటీ తీరప్రాంతంలోని పర్వతాలు, లోయలతో నిండిన నగరం. వరదల కారణంగా చాలా రోడ్లు దెబ్బతిని సహాయక బృందాలు వరద ముంపు ప్రాంతాలకు చేరుకోలేని పరిస్థితి. దీంతో చాలా చోట్ల సహాయక చర్యలు మొదలేకాలేదు. అతికష్టం మీద కొన్ని బృందాలు చేరుకుని జలమయమైన ఇళ్లలో బాధితుల కోసం అన్వేషణ మొదలుపెట్టాయి. నేలమట్టమైన భవనాలు, శిథిలాల కింద వెతికే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. 30 వేలు దాటిన వలసలు వరద ధాటికి సర్వం కోల్పోవడంతో దాదాపు 30 వేల మంది స్థానికులు పొట్టచేత పట్టుకుని వేరే ప్రాంతాలకు వలసవెళ్లారని ఐక్యరాజ్యసమితికి చెందిన మైగ్రేషన్ ఏజెన్సీ తెలిపింది. అయితే ఈ సంఖ్య 40,000కుపైనే ఉంటుందని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్‌క్రాస్ సొసైటీ లిబియా ప్రతినిధి తమెర్ రమదాన్ అంచనావేశారు. రెండు ప్రభుత్వాల మధ్య నలిగి.. తూర్పు ప్రాంతంలో ఒక ప్రభుత్వం, మరో దిశలో ఇంకో ప్రభుత్వాల నిర్లక్ష్య ఏలుబడిలో ఉన్న లిబియాలో మౌలిక వసతుల కల్పన అరణ్యరోదనే అయ్యింది. ‘నగరంలో ఉన్న ఏకైక శ్మశానానికి తరలించేందుకు మృతదేహాలను ఒక దగ్గరకు చేరుస్తాం. ఈ జల విలయంలో 11 మంది కుటుంబసభ్యులను కోల్పోయి గుండెలవిసేలా రోది స్తున్న ఒకాయనను ఓదార్చడం ఎవరి తరం కావట్లేదు’ అని సహాయక బృంద సభ్యుడొకరు చెప్పారు. ‘ నా కుటుంబం మొత్తాన్నీ కోల్పోయా. వరదల్లో మా వాళ్ల మృతదేహాలు సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చాయి’ అని అబ్దల్లా అనే వ్యక్తి వాపోయారు. రోడ్లలో పేరుకుపోయిన బురదను తొలగించేందుకు బుల్డోజర్లుతో రెండు రోజులుగా నిరంతరంగా పనిచేయిస్తున్నారు. అప్పుడుగానీ అత్యవసర సరుకుల్ని తరలించలేని దుస్థితి. వేరే పట్టణాలకు మృతదేహాల తరలింపు సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిపించే పరిస్థితు లు డెర్నీ సిటీలో కరువవడంతో వందలాది మృతదేహా లను సమీపంలోని పట్టణాలకు తరలిస్తున్నారు. మరణించిన వారిలో 84 మంది ఈజిప్టువాసులూ ఉన్నారు. దక్షిణాన ఉన్న బెనీ సుయెఫ్ రాష్ట్రంలో ఎల్–షరీఫ్ గ్రామంలో డజన్లకొద్దీ ఈజిప్షియన్లు జలసమాధి అయ్యారు. డెర్నాలో భీతావహ దృశ్యం నగరంలో చాలా చోట్ల మృతదేహాలు కనపడుతు న్నాయి. బురదనీటిలో కూరుకుపోయి, వీధుల్లోకి కొట్టుకొచ్చి, సముద్ర తీరం వెంట.. ఇలా చాలా ప్రాంతాల్లో స్థానికులు విగతజీవులై కనిపించారు. ఒక్కసారిగా నీరు రావడంతో ఎటూ తప్పించుకోలేని నిస్సహాయక స్థితి. ‘నగరంలో ఏ ప్రాంతంలో సహాయం చేసేందుకు వెళ్లినా అక్కడ మాకు చిన్నారులు, మహిళల మృతదేహాలే కనిపిస్తున్నాయి’ అని బెంఘాజీకి చెందిన ఒక సహాయకుడు ఫోన్లో మీడియా సంస్థకు చెప్పారు. ‘సిటీ శివార్లలోని డ్యామ్ బద్దలైన శబ్దాలు మాకు వినిపించాయి. నగరం గుండా ప్రవహించే వాదీ డెర్నీ నదిలో ప్రవాహ ఉధృతి అమాంతం ఊహించనంతగా ఎగసి జనావాసాలను ముంచేసింది. ‘ డ్యామ్ బద్దలవడంతో ఏకంగా ఏడు మీటర్ల ఎత్తులో దూసుకొచ్చిన ప్రవాహం తన మార్గంలో అడ్డొచ్చిన అన్నింటినీ కూల్చేసింది’ అని లిబియాలో రెడ్ క్రాస్ కమిటీ ప్రతినిధి బృంద సారథి యాన్ ప్రైడెజ్ చెప్పారు. మధ్యధరా ప్రాంతంలో సన్నని తీరప్రాంతంలో పర్వత పాదాల చెంత ఈ నగరం ఉంది. పర్వతాల నుంచి వచ్చిన వరద నీరు నగరాన్ని ముంచేస్తూ తీరం వైపు కిందకు ఉరకలెత్తడంతో వరద తీవ్రత భయంకరంగా ఉంది. వరద ధాటికి దక్షిణం వైపు కేవలం రెండు రోడ్లు మాత్రమే మిగిలిపోయాయి. కూలిన వంతెనలు నగరం మధ్య భాగాన్ని రెండుగా చీల్చాయి. దీంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. గాయపడిన ఏడు వేలకుపైగా స్థానికులను మైదానాల్లోని తాత్కాలిక వైద్యశాలల్లో చికిత్సనందిస్తున్నారని తూర్పు లిబియాలోని అంబులెన్స్, అత్యవసర కేంద్రం అధికార ప్రతినిధి ఒసామా అలీ చెప్పారు. -
అదే దైన్యం..! కోలుకోని తుర్కియే, సిరియా.. 33 వేలు దాటిన మృతుల సంఖ్య
అంటాక్యా (తుర్కియే): ఆరు రోజులు గడిచినా భూకంప ప్రకోపం ప్రభావం నుంచి తుర్కియే, సిరియా ఏమాత్రమూ తేరుకోలేదు. కుప్పకూలిన వేలాది భవనాల శిథిలాల నుంచి ఇంకా మృతదేహాలు బయట పడుతూనే ఉన్నాయి. మరోవైపు లక్షలాది మంది సర్వం పోగొట్టుకుని కట్టుబట్టలతో నిరాశ్రయులుగా మిగలడంతో ఈ విపత్తు క్రమంగా పెను మానవీయ సంక్షోభంగా మారుతోంది. వారికి కనీస వసతులు కల్పించడం కూడా ప్రభుత్వానికి సవాలుగా పరిణమిస్తోంది. దాంతో బాధితుల్లో ఆక్రోశం ఆగ్రహంగా మారి కట్టలు తెంచుకుంటోంది. మరోవైపు రెండు దేశాల్లో మృతుల సంఖ్య ఇప్పటికే 33 వేలు దాటేసింది. తుర్కియేలోనే కనీసం 80 వేల మందికి పైగా గాయపడ్డారు. మృతదేహాలను సామూహికంగా ఖననం చేస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. వెలికితీత, సహాయ కార్యక్రమాలు నత్తనడకన నడుస్తుండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. భూకంపం రావచ్చని ముందే సమాచారమున్నా దాన్ని ఎదుర్కొనేందుకు సరైన చర్యలు తీసుకోలేదంటూ కూడా ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించి భారీ జన నష్టానికి కారకులయ్యారంటూ తుర్కియేలో వందలాది మంది కాంట్రాక్టర్లను అరెస్టు చేస్తున్నారు. తుర్కియేలో ఈ శతాబ్ది విపత్తుగా పరిగణిస్తున్న ఈ భూకంపం ధాటికి 500 కిలోమీటర్ల పరిధిలో 1.3 కోట్ల మంది తీవ్రంగా ప్రభావితులయ్యారు. సిరియాలోనూ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాలు ప్రభుత్వ, వేర్పాటువాదుల అధీనంలోని ప్రాంతాల మధ్య విస్తరించడం సహాయ చర్యలకు అడ్డంకిగా మారింది. ఇప్పటిదాకా 4,000కు పైగా మరణించారని అంచనా. వీరంతా మృత్యుంజయులు తుర్కియేలో ఓ రెండు నెలల చిన్నారిని ఏకంగా 128 గంటల తర్వాత శిథిలాల నుంచి సజీవంగా రక్షించారు! అదియమాన్ నగరంలో ఓ ఆరేళ్ల బాలున్ని ఏకంగా 151 గంటల అనంతరం ఆదివారం కాపాడారు. ఈ కార్యక్రమాన్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయడం విశేషం! మరో చిన్నారి బాలికను కూడా 150 గంటల తర్వాత కాపాడారు. అంటాక్యాలో మరో 35 ఏళ్ల వ్యక్తిని 149 గంటల తర్వాత కాపాడారు. శిథిలాల కింద చిక్కిన వారిని గుర్తించేందుకు థర్మల్ కెమెరాలు తదితర మార్గాల్లో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భారత్‌తో పాటు పలు దేశాల నుంచి వచ్చిన సిబ్బంది అహోరాత్రాలు సహాయ, పునరావాస కార్యక్రమాల్లో చెమటోడుస్తున్నారు. -
నిధుల లేమి.. నిర్వహణ లోపం
సాక్షి, హైదరాబాద్: ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. చలికి వణుకుతూ ఫుట్‌పాత్‌ల మీద, రోడ్ల పక్కన నరకయాతన అనుభవించే అభాగ్యులను హైదరాబాద్‌తో పాటు అన్ని పట్టణాల్లో చూస్తుంటాం. ఈవిధంగా తల దాచుకునేందుకు అగచాట్లు పడే అనాథలు, ఒంటరి యాచకులు, అభాగ్యులు, మానసిక రుగ్మతలతో బాధపడేవారికి అండగా నిలవాల్సిన బాధ్యత స్థానిక పాలకుల దేనని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఆచరణలోకి తీసుకురావడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. వాస్తవానికి ఇలాంటి వారి కోసం జాతీయ పట్టణ జీవనోపాధి పథకం (నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ – ఎన్యూఎల్ఎం) కింద రాత్రి ఆవాసాలు (నైట్ షెల్టర్లు) ఏర్పాటు చేయాల్సిన బాధ్యత పట్టణ పాలక సంస్థలదే. ఈ విధంగా నైట్ షెల్టర్లు ఏర్పాటు చేసే ప్రక్రియకు 2014లో శ్రీకారం చుట్టినా.. పట్టణ సంస్థల చిత్తశుద్ధి లోపంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కేవలం 35 నైట్ షెల్టర్లు మాత్రమే ఏర్పాటయ్యాయి. వీటిలో 17 సెంటర్లు జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ సర్కిళ్లలో ఉండగా, మిగతా 141 పట్టణ స్థానిక సంస్థల్లో ఉన్న నైట్ షెల్టర్లు కేవలం 18 మాత్రమే కావడం గమనార్హం. కాగా ఉన్న నైట్ షెల్టర్లు కూడా సరైన నిధుల లేమి, నిర్వహణ లోపంతో ఓ ఉదాత్త కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో విఫలమవుతున్నాయి. ఖమ్మం నైట్‌షెల్టర్‌లో ఆశ్రయం పొందుతున్న నిరాశ్రయులు నవంబర్‌లో ర్యాపిడ్ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా మరో 23 కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ వేగంగా సాగుతోంది. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ అండ్ కమిషనర్ (సీడీఎంఏ) సత్యనారాయణ నేతృత్వంలో ఈ కొత్త సెంటర్ల నిర్మాణం జరుగుతోంది. తాజాగా రాష్ట్రంలో నిరాశ్రయుల ర్యాపిడ్ సర్వే ప్రక్రియ నవంబర్ నెలలో ప్రారంభం కానుంది. తదనుగుణంగా 6 కొత్త సెంటర్లను జనవరి నాటికి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అన్ని షెల్టర్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ, బెడ్లు, ట్రంకులు, బాత్ రూం సదుపాయం కల్పించాలి. ఆశ్రయం పొందేవారిలో పనిచేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న 10 శాతం మందికి ఆహారాన్ని అందించాల్సి ఉంటుంది. చాలాచోట్ల ఈ పరిస్థితి లేదన్న ఫిర్యాదుపై ... ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే గుర్తించి తగిన చర్యలు తీసుకోనున్నట్లు ఓ అధికారి తెలిపారు. స్వచ్ఛంద సంస్థల నిర్వహణలో.. పలు స్వచ్ఛంద సంస్థలు ఈ నైట్ షెల్టర్లు నిర్వహిస్తున్నాయి. ఇందుకోసం మెప్మా ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. నైట్ షెల్టర్ నిర్వహణకు తొలి సంవత్సరం రూ. 6 లక్షలు, మరుసటి ఏడాది నుంచి ఏటా రూ.4 లక్షల చొప్పున చెల్లిస్తుంది. ఈ నిధులకు అదనంగా స్వచ్ఛంద సంస్థలు విరాళాలు సేకరించి నిర్వహణ బాధ్యతలు చూస్తాయి. షెల్టర్లలో ఆశ్రయం పొందేవారికి బ్లాంకెట్లు, ఫ్యాన్లు, ఇతర సౌకర్యాల కల్పనకు కొన్ని సంస్థలు దాతల నుంచి సహకారాన్ని తీసుకుంటున్నాయి. రామగుండంలో మూడు షెల్టర్లున్నా.. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో మూడు నైట్‌షెల్టర్ల ఏర్పాటుకు 2013లో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఒక్కో నైట్‌షెల్టర్‌కు రూ.44 లక్షలు చొప్పున కేటాయించారు. గోదావరిఖని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో, ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రి ఆవరణలో, రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలో 2019 నుంచి వీటిని వినియోగంలోకి తీసుకొచ్చారు. ఒక్కో షెల్టర్‌లో 50 మంది వరకు ఆశ్రయం పొందే వీలుండగా ఇందులో ఐదుగురికి మాత్రం భోజనం పెడతారు. మరోవైపు సరైన సదుపాయాలు, టాయ్లెట్లు లేక బస చేయడానికి నిరాశ్రయులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. అధికారులు రాత్రుళ్లు సర్వే చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు నైట్‌షెల్టర్ల గురించి ప్రచారం కూడా చేయకపోవడంతో నిరాశ్రయులకు రోడ్లు, ఫుట్‌పాత్‌లే దిక్కవుతున్నాయి. ఖమ్మంలో భేష్.. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో రెండు నైట్ షెల్టర్లు ఉన్నా యి. ప్రభుత్వ ఆస్పత్రిలో మెప్మా ఆధ్వర్యంలో నైట్ షెల్టర్ ను ఏర్పాటు చేశారు. ఇక్కడ 20 మంది పడుకునేందుకు బెడ్లు ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ నైట్ షెల్టర్‌ను 5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. మరొకటి బైపాస్ రోడ్డులోని ప్రభుత్వ భవనంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ 200 మంది ఉండేలా సౌకర్యాలు కల్పించారు. భవనంలో పై అంతస్తులో 100 మంది మహిళలు, గ్రౌండ్ ఫ్లోర్లో 100 మంది పురుషులు ఉండొచ్చు. ఈ షెల్టర్‌ను అన్నం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు జరగని సర్వే ఎన్యూఎల్ఎం కింద రాష్ట్రంలో మున్సిపల్ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన మిషన్ (మెప్మా) ఆధ్వర్యంలో నడుస్తున్న 35 నైట్ షెల్టర్లలో 1,990 మంది మాత్రమే ఆశ్రయం పొందేందుకు అవకాశం ఉంది. ఖమ్మం బైపాస్ రోడ్డులోని టాకులపల్లి బ్రిడ్జి దగ్గర డాక్టర్ అన్నం సేవా ఫౌండేషన్ నిర్వహిస్తున్న నైట్‌షెల్టర్‌లో మాత్రమే అత్యధికంగా 350 మంది ఆవాసం ఉండేందుకు అవకాశం ఉంది. ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసు పత్రి వద్ద ఆదిలాబాద్ పట్టణ సమాఖ్య నిర్వహిస్తున్న కేంద్రంలో 100 మంది, హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రి కేంద్రంలో 118 మంది, బేగంపేట కంట్రీక్లబ్ వద్ద గల కేంద్రంలో 130 మంది, కోఠి ఆర్టీసీ బస్టాండ్ వద్ద సెంటర్లో 100 మంది నిరాశ్రయులు ఉండేందుకు వీలుగా నైట్ షెల్టర్లు ఉన్నాయి. మిగతా అన్ని చోట్లా 15 నుంచి అత్యధికంగా 77 మంది నిరాశ్రయులు మాత్రమే రాత్రి వేళల్లో ఉండేందుకు ఏర్పాట్లు ఉన్నా యి. మెప్మా ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సర్వే నిర్వహించి, ఆశ్రయం లేక ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి ఈ కేంద్రాల్లో చేర్చాల్సి ఉన్నప్పటికీ.. ఈ తర హా కసరత్తు సరిగా జరగడం లేదనే ఫిర్యాదులున్నాయి. ఉన్న కొన్ని షెల్టర్లలో ప్రజలు పూర్తిస్థాయిలో తలదాచుకునే పరిస్థితులు లేవనే విమర్శలు కూడా ఉన్నాయి. నిధుల్లేవు.. వసతుల్లేవు.. కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, ఆదిలాబాద్ వంటి చోట్ల మెప్మా పర్యవేక్షణ లోపంతో షెల్టర్లలో ఉన్న వారికి మౌలిక వసతుల కల్పన జరగడం లేదనే ఆరోపణలున్నాయి. కొన్నిచోట్ల నిర్వహణకు అవసరమైన సొమ్ము అందడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. వరంగల్‌లోని రెండు సెంటర్లలో ఒక సమయంలో 233 మంది నిరాశ్రయులకు నైట్‌షెల్టర్లు ఆశ్రయం కల్పించాయి. అయితే నెలకు రూ.33 వేల చొప్పున చెల్లించాల్సిన నిర్వహణ ఖర్చులను మెప్మా నుంచి అందలేదు. దీంతో నిర్వహణ గాడితప్పింది. రామగుండంలో ఒక్కో షెల్టర్‌లో 50 మంది వరకు ఉండే వీలున్నా, 10 మంది కూడా ఉండడం లేదు. వాస్తవానికి గోదావరి ఖని, రామగుండం ప్రాంతాల్లో రోడ్లపక్కన చలికి గజగజ వణుకుతూ పడుకునేవారు కోకొల్లలు. ఇక రాష్ట్రవ్యాప్తంగా వీరిసంఖ్య వేలల్లోనే ఉండే అవకాశం ఉండగా..వివిధ కారణాల రీత్యా ప్రస్తుతం నైట్‌షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్నవారు కేవలం 1,500 మంది వరకు మాత్రమే ఉండటం శోచనీయం. అనా«థలకు నీడనిస్తున్న ఈ సెంటర్ల విషయంలో మెప్మా మరింత చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
Russia-Ukraine war: కలకలానికి నెల!
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఆరంభమై నెల రోజులైంది. ఇప్పటివరకు ఈ సంక్షోభ కారణంగా వేలాది మంది మరణించగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ యుద్ధం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉక్రెయిన్ను నిస్సైనికీకరణ చేయడమే లక్ష్యంగా దాడి చేస్తున్నట్లు రష్యా పేర్కొంది. ఉక్రెయిన్‌లో నియో నాజీ జాతీయవాదులు పెరిగారని, వీరిని అదుపు చేయడమే తమ లక్ష్యమని పుతిన్ చెప్పారు. ఉక్రెయిన్ మిలటరీ, మౌలిక సదుపాయాలపై మిస్సైల్ దాడులకు ఆదేశించారు. రష్యా దురాక్రమణకు నిరసనగా అమెరికా, యూరప్‌దేశాలు ఆంక్షల కత్తి ఝళింపించాయి. ఆంక్షల ఫలితంగా రష్యా వద్ద ఉన్న విదేశీ నిల్వల్లో దాదాపు సగం వాడుకునే వీలు లేకుండా పోయింది. రష్యా ఇంధన దిగుమతులను నిలిపివేయాలన్న డిమాండ్‌కు కూడా యూరప్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. రష్యా చర్చలకు వస్తే నాటోలో చేరే డిమాండ్‌ను వదులుకుంటామని జెలెన్స్కీ ప్రకటించారు. రష్యాకు ఎదురు దెబ్బలు కీవ్ వరకు వేగంగా వచ్చిన రష్యా దళాలకు అక్కడినుంచి భీకర ప్రతిఘటన ఎదురైంది. పాశ్చాత్య దేశాలందించిన ఆయుధాలతో ఉక్రెయిన్ బలగాలు రష్యన్లను ఎక్కడికక్కడ నిరోధించాయి. దీంతో పలు చోట్ల రష్యాకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఉక్రెయిన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు రష్యా చెప్పినా, ఇప్పటికీ ఉక్రెయిన్ నింగిపై రష్యాకు పట్టు చిక్కలేదు. మారియోపోల్ వంటి నగరాలను రష్యన్లు స్వాధీనం చేసుకోగలిగినా ఇంకా కీలక నగరాలు రష్యాకు చిక్కలేదు. నాటో అంచనా ప్రకారం యుద్ధంలో దాదాపు 15వేల మంది రష్యన్లు మరణించారు. కాగా, అణు, జీవ, రసాయన ఆయుధాలు రష్యా ప్రయోగించే ప్రమాదముందని భయాలు పెరిగాయి. తర్వాతేంటి? ఆంక్షల ప్రభావంతో రష్యా ఆర్థికంగా తీవ్రంగా ప్రభావితమవుతోంది. అయినా పుతిన్ వెనక్కి తగ్గలేదు. రష్యాలో పుతిన్‌పై అభిమానం తగ్గడం లేదు. ఇరు పక్షాల మధ్య జరిగిన చర్చలు నిష్ఫలంగా ముగిశాయి. ఉక్రెయిన్ తటస్థంగా ఉండాలని, నిస్సైనికీకరణకు అంగీకరించాలని, క్రిమియాపై రష్యా ఆధిపత్యాన్ని ఒప్పుకోవాలని, తూర్పు రిపబ్లిక్ల స్వయం ప్రతిపత్తిని గుర్తించాలని పుతిన్ కోరుకుంటున్నారు. సెక్యూరిటీ గ్యారెంటీలిస్తే తటస్థ స్థితిపై చర్చిస్తామని, నాటోలో చేరమని జెలెన్స్కీ తాజాగా ప్రకటించారు. అయితే క్రిమియా, తూర్పు రిపబ్లిక్ అంశాలపై కాల్పుల విరమణ, రష్యన్ బలగాల ఉపసంహరణ తర్వాత చర్చిద్దామని ప్రతిపాదించారు. ఉక్రెయిన్‌పై మరింత పట్టు సాధించిన అనంతరం పుతిన్ మెట్టుదిగివస్తాడని యుద్ధ నిపుణులు అంచనా వేస్తున్నారు. యుద్ధం ఆరంభం: ఫిబ్రవరి 24 ఉక్రెయిన్ను వీడిన శరణార్థులు: 35 లక్షలు నిరాశ్రయులైనవారు: కోటిమంది. ఉక్రెయిన్ ఆర్థిక నష్టం: సుమారు రూ. 8 లక్షల కోట్లు ఉక్రెయిన్ వైపు మరణాలు: 691 మంది పౌరులు. గాయపడిన వారు: 1,143 మంది (ఐరాస లెక్కల ప్రకారం) రష్యా వైపు మరణాలు: 15,800 మంది సైనికులు (ఉక్రెయిన్ రక్షణశాఖ గణాంకాలు). -
చిప్స్ ప్యాకెట్లతో నులి వెచ్చటి దుప్పట్లు!
చాలా మంది పేదవాళ్ల కోసం తమకు తోచినరీతిలో రకరకాలు సహాయ సహకారాలు అందించడం గురించి విని ఉన్నాం. అంతెందుకు వాళ్లకు ఉండేందకు వసతి, మూడు పూటలా భోజనం వంటి రకరకాల ఏర్పాట్లు చేసిన గొప్ప గొప్ప వ్యక్తులను కూడా చూశాం. కానీ 11 ఏళ్ల బాలిక తనకు వీలైనంతలో అది కూడా పర్యావరణ రహితంగా నిరాశ్రయులకు ఉపయుక్తంగా ఉండేలా దుప్పట్లు తయారు చేసి తనకున్న దొడ్డ మనసును చాటుకుంది. (చదవండి: ఒమిక్రాన్ ప్రమాదకారి కాదని అనుకోవద్దు, ఆస్పత్రుల్లో చేరుతున్నారు.. ప్రాణాలు పోతున్నాయ్) అసలు విషయంలోకెళ్లితే....యూకేలో వేల్స్‌లోని ప్రిస్టాటిన్కు చెందిన 11 ఏళ్ల అలిస్సా డీన్ నిరాశ్రయుల కోసం దుప్పట్లను తయారు చేస్తోంది. చలికాలంతో వెచ్చని దుప్పట్లు లేక బాధపడుతున్న అభాగ్యులను సురక్షితంగా ఉంచే నిమిత్తం దుప్పట్లను తయారు చేయాలనుకుంది. అంతేకాదు దుప్పట్లు తయారు చేసే నిమిత్తం ప్లాస్టిక్ సంచులను సేకరించడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఆమె టోపీలు, చేతికి వేసుకును గ్లౌజులు, చాక్లెట్ ట్రీట్ వంటి తదితర ప్యాకెట్లను ఉపయోగించి 80 దుప్పట్లను తయారు చేసింది. అయితే ఒక్కో దుప్పటి తయారు చేయడానికి 44 ప్యాకెట్లు అవసరం. అంతేకాదు విరామ సమయంలో అలిస్సా, ఆమె తల్లి రకరకాల సంచులను సేకరించే పనిలో నిమగ్నమౌతారు. ఈ మేరకు ప్రతి దుప్పటిని ఇస్త్రీ చేసి వెదర్ ప్రూఫింగ్(అన్ని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా) చేసి ఇస్తామని అలిస్సా తెలిపింది. అయితే తాము వారికి మన్నికైన మంచి దుప్పట్లు ఇవ్వాలనుకున్నాం అని అన్నారు. అయితే వీటిని తయారుచేసేందుకు ఆమె కూతురు తన పాకెట్ మనీ ఉపయోగించేది. కానీ ఇప్పుడూ తాము నిధులను సమకూర్చుకుంటున్నాం అని అన్నారు. అంతేకాదు తాము తయారు చేసే దుప్పట్లు డెన్బిగ్షైర్తో పాటు కాన్వీ, ఫ్లింట్షైర్ అంతటా పంపిణీ చేశాం అని చెప్పారు. ఈ మేరకు అలిసా, ఆమె తల్లి ఫేస్బుక్ సాయంతో దుప్పట్లు తయారు చేయడానికి అవసరమైన ప్యాకెట్లను సేకరిస్తామని తెలిపారు. (చదవండి: క్యూఆర్ కోడ్ ఉన్నపెప్సీ ట్రక్‌లను తగలబెట్టేస్తా!) -
Anila Parashar: మహిళా పోలీస్..శీతల సైనికురాలు
Madhya Pradesh: Woman Police Anila Parashar donate blankets to homeless people: నిరాశ్రయులై వీధుల్లో తలదాచుకునేవారికి ఒంటిమీద బట్టలే సరిగా ఉండవు. ఇక చలి నుంచి రక్షణకు కంబళ్లు, దుప్పట్లు అంటే కష్టమైన పనే. అలాంటి వారు పడే ఇబ్బందులను గుర్తించిన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో మహిళా సబ్ ఇన్స్పెక్టర్ అనిలా పరాశర్ రాత్రిపూట వీధుల్లో పడుకునే నిరాశ్రయులకు దుప్పట్లు, రగ్గులు పంచుతూ ఉదారతను చాటుకుంటోంది. ఈ మహిళా పోలీస్ చేసే పని పై అధికారులను కూడా కదిలించింది. పోలీసులే బృందాలుగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని మూడేళ్ల నుంచి నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తోంది. అనిలా పరాశర్ చేస్తున్న ఈ దాతృత్వాన్ని తెలుసుకోవడానికి అక్కడి ఏ పోలీసును అడిగినా ఆమె గొప్పతనాన్ని చెబుతారు. కదిలించిన సంఘటనలు మూడేళ్ల క్రితం చలికాలంలో రాత్రిపూట ఆమె విధుల్లో భాగంగా పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు విపరీతమైన చలి కారణంగా కొందరు మహిళలు, వృద్థులు చనిపోవడం చూశామని చెబుతారు అనిల. ‘ఆ హృదయవిదారక సంఘటనలు ఇప్పటికీ నా కళ్లముందు కదులుతూనే ఉంటాయి. ఆ పరిస్థితులను గమనించాక ఇంటి నుంచి దుప్పట్లు, కంబళ్లు తీసుకెళ్లి పంచేదాన్ని. పోలీసుల బృందాలనే కదిలించి.. అది కాస్తా ఓ కార్యక్రమంగా ప్రారంభమైంది. పరిస్థితి వివరించినప్పుడు నా భర్త వికాస్ పరాశర్ కూడా ఇందుకు సాయం చేస్తా అని చెప్పాడు. దీంతో ‘తాండ్ కే సిపాయ్’ (శీతల సైనికుడు) అనే పేరుతో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మా పోలీసులూ ఇందుకు ముందుకు వచ్చారు. ఒక బృందం ఏయే ప్రాంతాల్లో నిరాశ్రయులు ఉన్నారో గుర్తిస్తుంది. ఆ పై నిర్దిష్ట ప్రాంతాల్లో మరో బృందం దుప్పట్లు, కంబళ్లు పంపిణీ డ్రైవ్ నిర్వహిస్తుంది’ అని వివరిస్తారు ఈ మహిళా పోలీస్. సామాజిక సంస్థలూ చేయూత ‘ఈ ధార్మిక కార్యక్రమంలో నేనూ పాలుపంచుకోవడం అనిల భర్తగా పిలిపించుకోవడం నాకు చాలా గర్వంగా ఉందంటారు ఈ మహిళా పోలీస్ భర్త వికాస్ పరాశర్. అనిలా ప్రారంభించిన ఈ కార్యక్రమం మూడేళ్లుగా తన సేవలు అందిస్తోంది. కిందటేడాది ఎనిమిది వేలకు పైగా దుప్పట్లు, కంబ్లళ్లను పంచింది. ‘ఇండోర్‌లో రాత్రిళ్లు పనిచేసే సమయాల్లో అధికారులు సైతం చలిలో వణుకుతూ విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితులు ఎదురవు తుంటాయి. అలాంటి పరిస్థితిలో పోలీసులకు దుప్పట్లను ఇచ్చేవారు. అందులో భాగంగానే పోలీసులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. ఇప్పుడు కొన్ని సామాజిక సంస్థలు కూడా చేరాయి. దీంతో ఈ కార్యక్రమం ద్వారా అసుపత్రులు, అనాథ శరణాలయాల్లోనూ దుప్పట్లు, కంబళ్లు పంపిణీ చేస్తున్నారు. సాధారణంగా ఖాకీ డ్రెస్ వేసుకున్నవారిలో కాఠిన్యమే కనిపిస్తుంది అనుకుంటారు చాలా మంది. కానీ, సమాజ రక్షణలో నలుదిక్కులను గమనించేవారికే సమస్యలు బాగా కనిపిస్తాయని, వాటికి పరిష్కార మార్గం కూడా వారికే బాగా తెలుస్తుందని నిరూపిస్తుంది అనిలా పరాశర్. మహిళా పోలీసుగా ఒక చిన్న అడుగుతో మొదలైన ఈ కార్యక్రమం ఇప్పుడు పోలీసు బృందాలే పనిచేసే దిశగా ఎదిగింది. చదవండి: ‘ఫోర్బ్స్’ లిస్ట్‌లో ఆశా వర్కర్..ఎందుకంటే..? -
మనీషాయే దిక్కు.. ‘తమిళనాడు థెరిస్సా’
దిక్కు లేని వారికి దేవుడే ఏదో ఒక దిక్కు చూపిస్తాడు. తమిళనాడులో అయితే ఆ దిక్కును ‘మనీషా’ పేరుతో పిలుస్తారు. 24 ఏళ్ల మనీషా ఈరోడ్‌లో నర్సింగ్ కాలేజీలో పాఠాలు చెబుతుంది. కాని ఆ కాసేపు మినహాయిస్తే తక్కిన సమయమంతా దీనులకు ఆమె అమ్మగా మారుతుంది. మతిస్తిమితం తప్పి వీధుల్లో ఉన్నవారిని మామూలు మనిషిని చేసే వరకూ ఆమె విశ్రమించదు. దూరం నుంచి దానం అందరూ చేస్తారు. దగ్గరి నుంచి సేవ చేసే మనీషి మనీషా. మనీషా చిన్నప్పుడు చెన్నైలో తన తండ్రితో పాటు కలిసి తండ్రి నడిపే మటన్షాప్కు వెళ్లేది. నాలుగు రోజులు వెళ్లాక తండ్రి ఎంత కష్టంగా సంపాదన చేస్తున్నాడో, ఎంత కష్టంగా పేదరికంలో తాము బతకాల్సి వస్తోందో ఆమెకు అర్థమైంది. మూడు పూట్ల అంతో ఇంతో తినడానికి ఉన్న తమ పరిస్థితి ఇలా ఉంటే రోడ్డు మీద ఏ దిక్కూ లేకుండా తిరిగే దౌర్భాగ్యుల పరిస్థితి ఏమిటి అని ఆ వయసులో ఆమెకు అనిపించేది. ఎందుకంటే షాపులో ఉన్నంత సేపు పిచ్చివాళ్లో, దిక్కులేని వాళ్లో కనిపిస్తూనే ఉండేవారు. పెద్దయ్యాక అయినా వారి కోసం ఏమైనా చేయగలనా అనుకునేది మనీషా. డాక్టర్ అవ్వాలని బాగా చదివి డాక్టర్ అవ్వాలని అనుకునేది మనీషా. కాని అంత డబ్బు లేదు. అందుకు ప్రిపేర్ అయ్యేందుకు కూడా డబ్బు లేదు. సైన్యంలో చేరి దేశం కోసం పని చేయాలనుకుంది. కాని ఆడపిల్లను పంపడానికి తల్లిదండ్రులు, బంధువులు ఎన్నో విధాలుగా సంశయించారు. అందుకని నర్సింగ్ కోర్స్ చదివి ఈరోడ్‌లో లెక్చరర్ అయ్యింది మనీషా. డాక్టర్‌గా చేయాల్సిన సమాజ సేవ, సైనికురాలిగా చేయాల్సిన దేశ సేవ రెండూ ఒక సామాజిక కార్యకర్తగా చేయాలని నిశ్చయించుకుంది. 2018లో ఒక న్యూస్పేపర్లో ఆమె తంజావూరులో ఒక దీనుడి ఫొటో చూసింది. ఎవరూ పట్టించుకోక ఆ దీనుడు ఆకలితో అలమటిస్తున్నాడని ఆ ఫొటో సారాంశం. వెంటనే మనీషా ఆ ఫొటోను ఫేస్బుక్లో పెట్టి అందరి సాయం కోరింది. తంజావూరు వెళ్లి మరీ ఆ దీనుడి షెల్టర్‌కు చేర్చడంలో సాయపడింది. అలా ఆమె పని మొదలయ్యింది. ఇలాంటి వారు కావాలి డబ్బు సాయం చేయమంటే చేసేవారు చాలామంది ఉంటారు. కాని ప్రత్యక్షంగా సేవ చేయమంటే వెనుకాడుతారు. కాని మనీష తానే స్వయంగా సేవ చేస్తుంది. పిల్లలు బాగా మురికి పడితే కన్న తల్లే విసుక్కుంటుంది. కాని సంవత్సరాల తరబడి స్నానపానాలు లేకుండా శుభ్రత లేకుండా తిరిగే పిచ్చివాళ్లకు, డ్రగ్ అడిక్ట్స్‌కు, అనాథలకు, ఇళ్ల నుంచి పారిపోయిన వారికి తానే స్వయంగా సేవ చేస్తుంది మనీషా. వారికి క్షవరం చేస్తుంది. స్నానం చేసేలా చూస్తుంది. బట్టలు ఇస్తుంది. వారి షెల్టర్ కోసం ప్రయత్నిస్తుంది. ఈరోడ్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తూ ఆదుకుంటోంది. వీరిలో ఎవరైనా పనిచేసి సంపాదించే సత్తా ఉన్నవారికి వివిధ నైపుణ్యాలలో శిక్షణ ఇప్పించి ఉపాధి మార్గాలను చూపుతోంది. జీవితం ఫౌండేషన్ తాను సంపాదించే దాంట్లో తన ఖర్చులకు పోగా మిగిలిందంతా ఊరి దిమ్మరుల కోసం ఖర్చు చేస్తుంది మనీష. కాని అది చాలదు. సమాజం ఆసరాతో ఈ పని చేయాలని ‘జీవితం ఫౌండేషన్’ పేరుతో ఒక సంస్థను ప్రారంభించింది. దాదాపు 500 మంది దిమ్మరులకు స్వస్థత, భద్రత, భరోసా కలిగించడంలో కృషి చేసింది. ఆమెతో పాటు అలాంటి స్ఫూర్తి ఉన్న యువతరం కూడా తోడయ్యింది. వీరంతా ఒక టీమ్‌గా పని చేస్తూ దీన బాంధవులుగా మారారు. ముఖ్యంగా కరోనా సమయంలో మనీష ఒక గొప్ప మానవిగా మారింది. ఆ సమయంలో అన్నీ మూతపడగా ఈరోడ్ చుట్టుపక్కల కొత్తగా వచ్చే లేదా ముందు నుంచి ఉన్న దిమ్మరులకు అన్నమే లేకుండా పోయింది. వారికి నిలువ నీడ లేదన్న సంగతి కూడా కనిపెట్టింది. వెంటనే ఆమె ఈరోడ్ కమిషనర్ని కలిసి ఒక స్కూల్‌ను టెంపరరీ షెల్టర్‌గా అడిగింది. వెంటనే కమిషనర్ అందుకు అంగీకరించాడు. మనీష ఆ ఇరుగు పొరుగు వారికి వంట చేయమని దినుసులు సరఫరా చేసింది. ఊళ్లో ఉన్న దాదాపు 80 మంది అభాగ్యులను ఆ స్కూల్లో ఉండేలా చూసింది. వారికి మాస్కులు, శానిటైజర్లు, రేషన్, మూడుపూటల భోజనాన్ని అందించింది. వ్యాయామం చేయించి ఆరోగ్యాన్ని మెరుగుపరచడమేగాక, కొంతమందికి వొకేషనల్ ట్రైనింగ్ ఇప్పించి 54 మందికి ఉపాధి కల్పించింది. మరికొంత మందిని వృద్ధాశ్రమాలకు, కుటుంబాల ఆచూకి తెలిసిన వారిని, కుటుంబ సభ్యులకు అప్పచెప్పింది. మైనర్లకు అరిక ప్లేట్లు, గ్లాసులు తయారు చేసే మెషిన్లను అందించి వారికి ఉపాధి కల్పించింది. మనిషి బాధ్యత ‘ఎదుటివారి కష్టానికి స్పందించడం మనిషి కనీస బాధ్యత. మన దేశంలో ఎందరో ఎన్నో కారణాల రీత్యా రోడ్డు మీదే బతుకుతుంటారు. వారి గోడు ఎవరూ పట్టించుకోరు. వారి వేదన ప్రభుత్వాలకు అర్థం కాదు. కాని వారిని అక్కున జేర్చుకుని మనుషులుగా చేసే ప్రయత్నం చేసినప్పుడు వారి ముఖాల్లో కూడా చిరునవ్వు వెలుగుతుంది. అలాంటి చిరునవ్వు నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. నేను నా జీవితం అంతా ఆ పనికి వెచ్చిస్తాను. పిల్లలు గెంటేసిన వృద్ధులు, డ్రగ్స్ బానిసలైన యువకులు, వీధి బాలలు... వీరందరి కోసం ఒక సొంత షెల్టర్ కట్టాలని నా కోరిక. ఏదో ఒకరోజు దానిని సాధిస్తాను. ఈలోపు సమాజంలోని మంచి మనసున్న వారితో ఈ సహాయాన్ని కొనసాగిస్తాను’ అంటోంది మనీషా. భవిష్యత్తులో ఆమెను జనం తమిళనాడు థెరిస్సా అని పిలిచినా ఆశ్చర్యం లేదు. -
6 నెలల వ్యవధిలో 13 హత్యలు.. ఇప్పటికీ అతని పేరు కూడా మిస్టరీనే !
Stone Man: విచక్షణ కోల్పోయిన మనుషులకు ఇతరుల జీవితాలు ఎప్పటికీ ఓ ఆటే. అవసరం ఉన్నా లేకపోయినా అవకాశం ఉన్న ప్రతిసారీ.. ఉన్మాదపు కోరలతో బుసకొట్టడం, తాము చేసిన వికృతానికి జడిసిపోయే సమాజాన్ని అజ్ఞాతంగా గమనిస్తూ గర్వపడటం సైకోలకు అలవాటే. చరిత్ర మోసిన ఈ తరహా రక్తపు మరకల్లో మనదేశానికి చెందిన స్టోన్‌మేన్ కథ ఒకటి. ముంబై, కోల్‌కతా వంటి మహా నగరాలను గజగజలాడించిన ఈ రాక్షసుడి జీవితం నేటికీ ఓ మిస్టరీనే. 1985లో మొదలైన అతని హత్యాకాండ.. 2009 వరకూ కొనసాగింది. అతని టార్గెట్.. నిరాశ్రయులు, అనాథలే. కటిక దారిద్య్రంతో అల్లాడిపోతూ.. బంధాలు, బంధువులు లేక.. ఒంటరిగా ఆరుబయట, ఒళ్లు మరచి పడుకునే అభాగ్యులను నిర్దాక్షిణ్యంగా బండరాయితో మోది చంపేసేవాడు. గుర్తుపట్టలేని విధంగా ముఖాలను ఛిద్రం చేసి.. పోలీసులకే సవాలుగా మారాడు. 1989లో కోల్‌కతా పోలీసులకు.. అక్కడి మొదటి కేసుతోనే.. వెన్నులో వణుకు పుట్టించిన ఈ సీరియల్ కిల్లర్.. 6 నెలల వ్యవధిలో ఒకే విధంగా 13 హత్యలు చేశాడు. హత్యకు గురైనది ఎవరో కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. చీకటిపడితే చాలు బయట అంతా భయం.. భయం చీకటిపడితే ఇళ్ల నుంచి బయటికి రావద్దని.. ఒంటరిగా తిరగొద్దని నగరవాసులకు హెచ్చరికలు జారీ చేసే వారు పోలీసులు. రాత్రయితే చాలు అన్ని ఇళ్లకు తాళాలు పడేవి. ఆ జనసముద్రం కాస్త అలజడి లేని నిర్మానుష్య ఎడారి అయిపోయేది. అలా అతగాడ్ని పట్టుకోవడానికి పెద్దఎత్తునే ప్రయత్నాలు చేశారు. కానీ ఆచూకీ దొరకలేదు. రాయితో చంపుతున్నాడు కాబట్టి మీడియా అతడికి స్టోన్‌మేన్ అని పేరుపెట్టింది. హత్యకు సుమారు 30 కిలోల బండరాయిని ఉపయోగించేవాడని తేలింది. చంపిన తీరును బట్టి.. అతడు బలిష్టమైన కండలు కలిగిన వాడని, పొడగరని అంచనా వేశారు. ఎందరో అనుమానితుల్ని విచారించారు.పైగా హత్యకు గురైన బాధితులంతా అనాథలు, నిరాశ్రయులే కావడంతో వారిని ఎవరూ గుర్తించలేకపోయారు. మృతదేహానికి దరిదాపుల్లో ఎలాంటి బండరాయి కానీ, బలమైన రాడ్డు కానీ ఎప్పుడూ దొరకలేదు.కోల్‌కతా కంటే ముందే 1985–88 మధ్యకాలంలో ముంబైని వణికించాడు ఈ స్టోన్‌మేన్. అక్కడా ఇదే తరహాలో నిరాశ్రయులైన 26 మంది అనాథలను హత్య చేసి కోల్‌కతాకు చేరాడు. సినిమా కూడా తెరకెక్కింది 2009లో అస్సాంలోని గువాహటిలో కూడా ఇలాంటి హత్యలే జరగడంతో వాటిని కూడా స్టోన్‌మేన్ ఖాతాలోనే వేశారు పోలీసులు. ఈ వాస్తవ ఘటనల ఆధారంగా 2009లో ‘ది స్టోన్‌మేన్ మర్డర్స్’ అనే సినిమా తెరకెక్కింది హిందీలో. ఎన్ని విచారణలు జరిపినా.. ఎన్ని రాష్ట్రాలు మారినా.. నేటికీ స్టోన్‌మేన్ జాడ కాదుకదా కనీసం అతని అసలు పేరు కూడా ఈ ప్రపంచానికి తెలియలేదు. చదవండి: పుట్టింటి నుంచి అత్తింటి సారె తీసుకెళ్తూ.. -
ప్రకృతి వికృతి
తాత్కాలికంగానైనా ఇల్లు వాకిలి వదిలిపెట్టి వెళ్లిపోవడానికి ఈ మధ్య కాలంలో మరో కారణం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అదే ప్రకృతి. భారీ వర్షాలు, వరదలు, తుఫాన్లు కొండచరియలు విరిగిపడడం వంటి ఘటనలతో ప్రపంచదేశాల్లో ప్రజలకు నిలువ నీడ లేకుండా పోతోంది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో వివిధ దేశాల్లో తుపాన్లు ఇతర తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా 70 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ది ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మోనటరింగ్ సెంటర్ వెల్లడించింది. వివిధ దేశాల ప్రభుత్వాలు, ఐక్యరాజ్యసమితి మానవీయ వ్యవహారాలు చూసే సంస్థ, మీడియా నివేదికలు ఆధారంగా ఆ సంస్థ గణాంకాలను రూపొందించి ఒక నివేదికను విడుదల చేసింది. 2003 సంవత్సరం నుంచి ప్రకృతి వైపరీత్యాలపై జరిగిన నష్టాన్ని విశ్లేషించిన ఆ నివేదిక 2019 సంవత్సరం మొదటి ఆరు నెలల్లో వాతావరణంలో వచ్చిన అనూహ్యమైన మార్పులు ప్రజలపై తీవ్ర స్థాయిలో పడ్డాయని వెల్లడించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ముందస్తుగానే తుపాన్లను గుర్తించి ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకోవడం, లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత శిబిరాలకు తరలించడంతో మరణాల రేటు గణనీయంగా తగ్గిందని ఆ నివేదిక వెల్లడించింది. మనిషి ప్రకృతి ముందు మరుగుజ్జే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో తుపాన్లు ఎప్పుడొస్తాయో పసిగడుతున్నాం. పిడుగులు ఎక్కడ పడతాయో అంచనా వేస్తున్నాము. వాన రాకడని తెలుసుకుంటున్నాం. ప్రాణం పోకడని నివారిస్తున్నాం. కానీ ప్రజలు నిరాశ్రయులు కాకుండా ఏమీ చెయ్యలేకపోతున్నాం. టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా మనిషి ఎప్పుడూ ప్రకృతి ముందు మరుగుజ్జే. అందులోనూ ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ప్రకృతి ప్రకో పం తారస్థాయికి చేరుకుంది. ఈ ఏడాది చివరి నాటికి ప్రకృతి వైపరీత్యాల కారణంగా 2.2 కోట్ల మంది నిరాశ్రయులు కావచ్చునని ది ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ అంచనా వేస్తోంది. ‘‘వాతావరణ మార్పులు భవిష్యత్‌లో మరింత ప్రభావాన్ని చూపిస్తుంది. బహమాస్ వంటి దేశాల్లో తరచూ వానలు ముంచెత్తుతాయి. దీనికి ముందు జాగ్రత్తలు మరింత అవసరం’’ అని మానిటరింగ్ సెంటర్ డైరెక్టర్ అలగ్జాండర్ బిలక్ హెచ్చరించారు. ఏయే దేశాల్లో ఎంతమంది నిరాశ్రయులు ? ► ఫణి తుపాన్ పడగ విప్పడంతో భారత్, బంగ్లాదేశ్ దేశాల్లో నిలువనీడ కోల్పోయినవారు 34 లక్షలు. ఈ తుపాను కారణంగా 100 మంది లోపే ప్రాణాలు పోగొట్టుకున్నారు. ► ఇదాయ్ తుపాన్ దక్షిణాఫ్రికాను ముంచెత్తడంతో 6,17,000 మంది నిరాశ్రయులయ్యారు. వెయ్యి మందికిపైగా మరణించారు. మొజాంబిక్, మాలావీ, జింబాబ్వే, మడగాస్కర్‌లో ప్రజలు ప్రాణాలరచేతుల్లో పెట్టుకొని సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ► గత కొన్ని దశాబ్దాల్లో కనీవినీ ఎరుగని వరదలు ఇరాన్లో సంభవించడంతో 5 లక్షల మంది వరకు చెల్లాచెదురయ్యారు. ► బొలీవియాలో వరదలు, కొండచరియలు విరిగిపడడంతో 70 వేల మంది సొంత ఇళ్లను వీడి వెళ్లిపోయారు. -
ఇల్లు లేని పేదలు ఎందరు?
సాక్షి, హైదరాబాద్: నీడ లేని పేదల లెక్క తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. గూడు లేని బడుగులను జూన్ 10 కల్లా గుర్తించాలని పురపాలక సంఘాల కమిషనర్లను ఆదేశించింది. మున్సిపాలిటీల్లో రహదారులు, చెట్లే అడ్డాగా జీవనం సాగిస్తున్న పేదల డేటా సేకరించాలని.. వారందరికీ కనీస వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. మంగళవారం మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సేకరించే వివరాల ఆధారంగా ఇల్లు లేని పేదలకు జనన ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, పింఛన్, బ్యాంక్ ఖాతాలు తెరిచేలా చొరవ చూపాలన్నారు. నీడ లేని వారందరినీ షెల్టర్లకు తరలించాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. కమిషనర్లు విధిగా షెల్టర్లను సందర్శించాలని, వారికి అందుతున్న సేవలను తెలుసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 143 పట్టణ స్థానిక సంస్థలుండగా.. ఇందులో 53 మున్సిపాలిటీల్లోనే షెల్టర్లు ఉన్నాయని, 11,389 మంది ఇక్కడ నివసిస్తున్నారని అధికారులు ఆయన దృష్టికి తెచ్చారు. ఇందులో 5,807 మందికి ఆధార్ కార్డులు, 787 మందికి ఓటరు గుర్తింపు కార్డులు, 1,555 మందికి పింఛన్లు అందుతున్నాయని చెప్పారు. 3,497 మందికి రేషన్ కార్డులు కూడా ఉన్నాయని, 201 మందికి బీమా సౌకర్యం కూడా కల్పించినట్లు కమిషనర్లు వివరించారు. 694 మందిని అంగన్వాడీ కేంద్రాలకు పంపుతున్నామని, 5,728 మందికి ఉచితంగా ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 1,050 ఆరోగ్య పరీక్షా శిబిరాలను ఏర్పాటు చేశామని, ఇందులో 129 మందిని శస్త్రచికిత్సల నిమిత్తం ఆస్పత్రులకు సిఫారసు చేసినట్లు వివరించారు. 1,541 మందికి బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేసినట్లు తెలిపారు. -
భారీ భూకంపం.. 400 మంది మృతి
జకార్తా/పలూ: ఇండోనేసియాపై మరోసారి ప్రకృతి పగబట్టింది. 2004 నాటి సుమత్రా సునామీ దుర్ఘటనను, రెండు నెలల క్రితం నాటి భూకంపాన్ని మరిచిపోకముందే మరోసారి భూకంపం, సునామీ రూపంలో ప్రకృతి కన్నెర్రజేసింది. సులవేసి ద్వీపంలోని పలూ పట్టణంలో దేశ, విదేశీ పర్యాటకులు బీచ్ ఫెస్టివల్‌కు సిద్ధమవుతున్న తరుణంలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో భూకంపం, ఆ వెంటనే 4–6 మీటర్ల ఎత్తు రాకాసి అలలతో సునామీ విరుచుకుపడటంతో 400 మంది మృతిచెందారు. వంద మందికిపైగా గల్లంతయ్యారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఆసుపత్రులు కూలిపోవడంతో ఆరుబయటే క్షతగాత్రులకు చికిత్సనందిస్తున్నారు. సముద్రతీరంలోని పలూ పట్టణం దాదాపుగా నేలమట్టమైంది. సహాయ కార్యక్రమాలను ప్రారంభించిన సైన్యం, అధికారులకు ఎటు చూసినా శవాల గుట్టలే కనబడుతున్నాయి. బీచ్‌లో ఇసుకలో కూరుకుపోయి సగం బయటకు కనబడుతున్న మృతదేహాలే దర్శనమిస్తున్నాయి. శనివారం రాత్రి వరకు అందిన సమాచారం ప్రకారం 384 మంది చనిపోయారని అధికారులు చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. భూ ఉపరితలానికి పదికిలోమీటర్ల లోతులో శుక్రవారం సాయంత్రం సమయంలో భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. కాగా, సునామీ బారిన పడిన ఇండోనేసియాను ఆదుకుంటామని ఐక్యరాజ్య సమితి ప్రసంగంలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. హృదయ విదారక దృశ్యాలు భూకంపం తీవ్రతకు చాలాచోట్ల ఇళ్లు కూలిపోవడంతో శిథిలాల్లో చిక్కుకుని పలువురు చనిపోగా వేల మంది క్షతగాత్రులయ్యారు. ఆసుపత్రులూ కూలడంతో ఆసుపత్రుల ఆరుబయటే చికిత్సనందిస్తున్నారు. బీచ్‌లో కూరుకుపోయిన వారు కొందరైతే.. అలల ధాటికి కొట్టుకొచ్చి బలమైన గాయాలతో చనిపోయిన వారు మరికొందరు. బురదలో కూరుకుపోయిన ఓ చిన్నారి మృతదేహాన్ని సహాయక సిబ్బంది బయటకు తీసి బంధువులకు అప్పజెబుతున్న దృశ్యాలు కంటతడిపెట్టించాయి. నిరాశ్రయులు లక్షల్లోనే.. భూకంపం తాకిడికి ఇళ్లన్నీ కూలి వేల మంది నిరాశ్రయులయ్యారు. భూమి కంపిస్తున్న సమయంలో స్థానికులు ప్రాణాలు కాపాడుకునేందుకు ఇళ్లు, రిసార్టులనుంచి బయటకు పరుగులు తీస్తున్న సమయంలోనే సునామీ విరుచుకుపడింది. సముద్ర తీరంలో ఉన్న ఓ మసీదు ఉవ్వెత్తున ఎగిసిపడిన అలల ధాటికి ధ్వంసమవగా.. సమీపంలోని ఇళ్లలోకి కార్లు, ఇతర వాహనాలు చొచ్చుకొచ్చాయి. ఓ ఎత్తైన భవనంపై ఏర్పాటుచేసిన సీసీటీవీలో ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. రోడ్లు, వీధి దీపాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో ఈ పట్టణమంతా శుక్ర, శనివారాల్లో రాత్రంతా చీకట్లోనే మగ్గింది. ‘అలలు అంతెత్తున ఎగసిపడుతుండటాన్ని చూసి పరిగెత్తాను. అందుకే ప్రాణాలు కాపాడుకోగలిగాను’ అని ఓ స్థానికుడు పేర్కొన్నారు. రంగంలోకి సైన్యం ఈ ఏడాది జూలై, ఆగస్టులో లోంబోక్ ద్వీపంలో వచ్చిన దానికంటే ఈసారి వచ్చిన భూకంప తీవ్రతే ఎక్కువని అధికారులు తెలిపారు. కాగా, సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో సైన్యాన్ని రంగంలోకి దించారు. విద్యుత్, సమాచార వ్యవస్థతోపాటు మౌలిక సదుపాయాలను పునరుద్ధరించే పనిలో సైన్యం ఉంది. శనివారం కూడా పలూలో భూమి పలుమార్లు స్వల్ప తీవ్రతతో కంపించింది. కాగా పలూకు సమీపంలోని దొన్గాలా ప్రాంతంపైనా సునామీ విరుచుకుపడినట్లు సమాచారం అందిందని.. అయితే అక్కడి పరిస్థితేంటనేది ఇంకా తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. ‘భూకంపం, సునామీల బాధితుల్లో చిన్నారులే ఎక్కువగా ఉండటం బాధ కలిగించింది. నీటి తీవ్రతకు కొట్టుకుపోయారని ప్రత్యక్షసాక్షులు, అధికారులు చెబుతున్నారు’ అని సేవ్ ద చిల్డ్రన్ ఎన్జీవో చీఫ్ టామ్ హోవెల్ పేర్కొన్నారు. పలూ పట్టణానికి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణాలు, గ్రామాల ప్రజలు కూడా వారి ప్రాంతాల్లో ఒకసారి భారీ కుదుపు వచ్చిందని పేర్కొన్నారంటే భూకంప తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సుమత్రాలో మొదలై.. ప్రపంచంలోని అద్భుతమైన పర్యాటక కేంద్రాల్లో ఒకటైన ఇండోనేసియాపై 2004 నుంచి ప్రకృతి పగబట్టింది. ఆ ఏడాది బాక్సింగ్ డే (డిసెంబర్ 26) సంబరాల్లో పర్యాటకులు ఉన్నపుడు 9.3 తీవ్రతతో వచ్చిన భూకంపం, ఆ తర్వాత 24 మీటర్ల ఎత్తులో వచ్చిన రాకాసి అలలు విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో ఇండోనేసియా వ్యాప్తంగా లక్షా 68వేల మంది చనిపోయారు. నాటి సునామీ భారత్‌సహా పలు దేశాలపై ప్రభావాన్ని చూపింది. 2005 మార్చిలో 8.6 తీవ్రతతో వచ్చిన భూకంపంలో 900 మంది చనిపోయారు. 2006 మేలో జావా ద్వీపంలో వచ్చిన భూకంపం 6వేల మందిని బలిగొంది. 2009లో సుమత్రా ప్రధాన ఓడరేవైన పడాంగ్‌లో 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపం 1,100 మందిని చంపేసింది. ఆ తర్వాత అడపా దడపా వచ్చిన భూకంపం, సునామీలు ఇండోనేసియాపై విరుచుకుపడుతూ వందల సంఖ్యలో ప్రాణాలు బలితీసుకుంటున్నాయి. రవాణా వ్యవస్థ ధ్వంసం పలూ నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఓ భారీ బ్రిడ్జి ధ్వంసమైంది. ఈ నగరానికి మిగిలిన ప్రపంచంతో అనుసంధానం చేసే రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. కొండచరియలు పడి దార్లు మూసుకుపోయాయి. ప్రార్థనలకోసం తీరంలోని మసీదుకు వచ్చిన వారు మొదట భూమి కంపించగానే పరుగులు తీశారు. అంతలోనే వరుసగా భూమి కంపించడంతో చాలా మంది మసీదు శిథిలాల కింద చిక్కుకుపోయి మరణించినట్లు తెలుస్తోంది. బురదలో కూరుకుపోయిన చిన్నారి మృతదేహాన్ని తరలిస్తున్న సహాయక సిబ్బంది దాదాపు పూర్తిగా నేలమట్టమైన పలూ నగరంలోని ఆస్పత్రి ఆవరణలో చికిత్స పొందుతున్న భూకంప బాధితులు -
నిరాశ్రయులపై నిర్లక్ష్యమొద్దు
న్యూఢిల్లీ: ఇళ్లులేని పట్టణ నిరుపేదల పట్ల నిర్లక్ష్యం తగదని సుప్రీంకోర్టు కేంద్రానికి చురకలంటించింది. శీతాకాలం రాబోతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరికీ ఇళ్లు కనీస అవసరమని పేర్కొంది. పట్టణ నిరాశ్రయుల బాగోగులు చూసే పౌర కమిటీల సభ్యుల పేర్లను ఇంకా ప్రకటించని 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలపై రూ.1–5 లక్షల మధ్య జరిమానా విధించింది. నిరుపేదలకు వసతి కల్పనపై కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ దాఖలుచేసిన పత్రాల్లోని వివరాలు విస్మయానికి గురిచేస్తున్నాయని జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. మార్చి 22నే తాము ఆదేశాలు జారీచేసినా ఇంకా కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పౌర కమిటీల సభ్యుల పేర్లను ప్రకటించకపోవడం శోచనీయమని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో విఫలమైన హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, మణిపూర్, గోవా, మిజోరం, మేఘాలయ, ఒడిశా, త్రిపుర, చండీగఢ్లపై రూ.1 లక్ష చొప్పున, హరియాణాపై రూ.5 లక్షల జరిమానా విధించింది. వరదలతో దెబ్బతిన్న కేరళ, ఉత్తరాఖండ్‌లకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. మూడు వారాల్లోగా జరిమానాను సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ వద్ద జమచేయాలని సూచించింది. ‘రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాం తాలు అవసరమైన చర్యలు తీసుకునేంత వరకు జరిమానా విధించడం మినహా మరో మార్గం కనిపించడం లేదు. శీతాకాలం రాబోతోంది. ఈ పరిస్థితుల్లో ఇళ్లు లేని నిరుపేదలను అలా వదిలేయకూడదు. గృహకల్పనపై కేంద్రం భారీ ప్రణాళికలు రూపొందించుకున్నా, అవి సరిగా అమలుకావడం లేదు’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. పౌర కమిటీల సభ్యుల పేర్లను ప్రకటిస్తూ రెండు వారాల్లోగా నోటిఫికేషన్ జారీ చేయాలని జరిమానా విధించిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. విపత్తు నిర్వహణకు ప్రాధాన్యమివ్వాలి విపత్తు నిర్వహణకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అధిక ప్రాధాన్యమివ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ మేరకు విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెబ్సైట్లో కేవలం 9 రాష్ట్రాలే తమ ప్రాంతీయ భాషల్లో ప్రణాళికలు, నివేదికలను పొందుపరిచాయని పేర్కొంది. ‘ కేరళలోని భారీ వరదలను ఎలా మరచిపోగలం. కానీ కొన్ని రాష్ట్రాలు ఈ విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నాయి. విపత్తు ప్రణాళికల్ని అనువదించేందుకు ఇంత సమ యం ఎందుకు తీసుకుంటున్నాయి?’ అని అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఏఎన్ఎస్ నాదకర్ణిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మూడు నెలల్లో అన్ని రాష్ట్రాలు తమ ప్రాంతీయ భాషల్లో ప్రణాళికల్ని అందుబాటులోకి తెస్తాయని నాదకర్ణి బదులిచ్చారు. ఎస్సీ, ఎస్టీ చట్టంపై స్టే ఇవ్వలేం ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలో పాత నిబంధనలు పునరుద్ధరిస్తూ పార్లమెంట్ చేసిన సవరణలపై స్టే విధించలేమని సుప్రీం స్పష్టం చేసింది. ఈ సవరణలను సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్లపై ఆరువారాల్లోగా బదులివ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. పార్లమెంట్ తన అధికార పరిధిని దాటి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల(వేధింపుల నిరోధక) చట్టంలో సవరణలు చేసిందని, వాటిని రద్దుచేయాలని పిటిషన్‌దారులు కోరారు. నిందితుల అరెస్ట్‌కు సంబంధించి కొన్ని రక్షణలు చేరుస్తూ సుప్రీంకోర్టు మార్చి 20న చట్టంలో మార్పులు చేసింది. కోర్టు ఆదేశాలను తోసిపుచ్చుతూ పాత నిబంధనలు పునరుద్ధరించే బిల్లును ఆగస్టు 9న పార్లమెంట్ ఆమోదించింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ చేసిన సవరణలను సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం శుక్రవారం విచారణకు చేపట్టింది. పిటిషన్ల తదుపరి విచారణ జరిగే వరకైనా, పార్లమెంట్ పునరుద్ధరించిన నిబంధనలపై స్టే విధించాలన్న పిటిషన్‌దారుల తరఫు న్యాయవాది పృథ్విరాజ్ చౌహాన్ విన్నపాన్ని కోర్టు తోసిపుచ్చింది. ‘ స్టే ఎందుకు? పార్లమెంట్ ఆమోదం తెలపడం వల్ల ఇప్పుడవి చట్టబద్ధమయ్యాయి. లోపాలు సరిదిద్దకుండా ప్రభుత్వం చట్టంలో సవరణలు చేసిందన్న సంగతి మాకూ తెలుసు’ అని ధర్మాసనం తెలిపింది. ‘మూకహింస’ ఆదేశాలు పాటిస్తోంది 11 రాష్ట్రాలే మూక హింస, గోరక్షణ పేరిట జరుగుతున్న దాడుల కట్టడికి తాము జారీచేసిన ఆదేశాలకు కట్టుబడి ఉంటున్నామని కేవలం 11 రాష్ట్రాలే నివేదికలు సమర్పించడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నివేదికలిచ్చేందుకు వారం రోజుల గడువిచ్చింది. ఇందులోనూ విఫలమైతే సంబంధిత రాష్ట్ర హోంశాఖ కార్యదర్శులు వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాలని బెంచ్ ఆదేశించింది. జూలై 20న రాజస్తాన్‌లోని అల్వార్‌లో ఓ పాడిరైతును కొందరు కొట్టి చంపిన ఉదంతంలో అధికారులు కోర్టు ఆదేశాలను పాటించడంలో విఫలమయ్యారని, వారిపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. వారంలోగా నివేదిక సమర్పించాలనిరాజస్తాన్ను ఆదేశించింది. -
సామాన్యులే రియల్ హీరోలు
వారంతా సాధారణ ప్రజలు. ఇతరులకు సాయం చేయడానికి కోట్లకొద్దీ డబ్బు లేదు. చేతిలో అధికారం లేదు. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు అవసరమైన అధునాతన పరికరాలు లేవు. ఉన్నదల్లా కేరళ వరదల్లో చిక్కుకున్న వారికి సహాయం చేయాలనే సంకల్పం. ఆ ఆశయంతోనే ఎంతోమంది సాధారణ ప్రజలు ముందుకు కదిలారు. వారిలో పదేళ్లు కూడా నిండని పిల్లలు, జైలు ఖైదీలూ ఉన్నారు. అలాంటి కొందరు స్ఫూర్తిప్రదాతల గురించి తెలుసుకుందాం. కిడ్డీ బ్యాంక్ ఇచ్చేసింది.. తమిళనాడులోని విల్లుపురానికి చెందిన 9 ఏళ్ల అనుప్రియ సైకిల్ కొనుక్కోవాలనే లక్ష్యంతో చాలా రోజుల నుంచి ఒక్కో రూపాయీ పోగేస్తోంది. రూ.9,000దాకా ఆమె కిడ్డీ బ్యాంక్‌లో పోగయ్యాయి. అదే సమయంలో టీవీల్లో కేరళ ప్రజల దైన్యాన్ని చూసి చలించిపోయింది. సైకిల్ కొనుక్కోడానికి దాచిన నగదంతా సహాయక కార్యక్రమాలకు పెద్ద మనసుతో ఇచ్చేసింది ఈ చిన్నారి. ఈ విషయం తెలుసుకున్న హీరో సైకిల్స్ సంస్థ బాలికపై ప్రశంసలు కురిపించింది. మానవత్వానికి అనుప్రియను ప్రతీకగా అభివర్ణించిన హీరో సైకిల్స్.. ఆమె జీవితాంతం ఏడాదికొక సైకిల్‌ను అనుప్రియకు బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మత్స్యకారుల మానవీయత చేపల వేట కోసం రోజూ సముద్రంలోకి వెళ్లే గంగపుత్రులు వారు. లోతైన నీటిలోనూ ఎలాంటి బెరుకూ లేకుండా ఈదడం వారికి వెన్నతో పెట్టిన విద్య. తమకు తెలిసిన విద్యతో కేరళలో వరదల్లో చిక్కుకున్న వారి ప్రాణాలను కాపాడాలని వారు తలచారు. అనుకున్నదే తడవుగా సొంత ఖర్చుతోనే తమ పడవలను ట్రక్కుల్లోకి ఎక్కించి తీవ్ర వరద ప్రభావిత ప్రాంతాలకు బయల్దేరారు. వారిలో ఎక్కువగా త్రివేండ్రానికి చెందినవారే ఉన్నారు. మత్స్యకారుల సాయం గురించి తెలుసుకున్న కొందరు ట్రక్కు డ్రైవర్లు, యజమానులు.. వారి పడవలను ఉచితంగానే రవాణా చేశారు. పతనం తిట్ట, ఎర్నాకుళం, త్రిస్సూర్ సహా అనేక చోట్ల మత్స్యకారులు రంగంలోకి దిగారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, సహాయక సిబ్బంది తాము చేరుకోలేమంటూ చేతులెత్తేసిన చోటుకి కూడా జాలరులు వెళ్లి ఎంతోమంది ప్రాణాలను కాపాడారు. కేపీ జైసాల్ అనే మత్స్యకారుడు ఇలా బలగాలకు సాధ్యంకాని చోటుకు కూడా చేరుకుని తన వీపును మెట్టుగా మార్చి ముగ్గురు మహిళలను బోటులోకి ఎక్కించి రక్షించడం మనకు తెలిసిందే. ఈ నిజమైన హీరోల సేవలను గుర్తించిన సీఎం విజయన్.. వారందరికీ ఒక కొత్త బోటుని, సహాయక చర్యల్లో పాల్గొన్నన్ని రోజులకూ రోజుకు రూ. 3 వేల ఆర్థిక సాయాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు. నిరాశ్రయులకు ఖైదీల చపాతీలు వరదల్లో నిరాశ్రయులుగా మారిన వారికి ఆహారం అందించేందుకు త్రివేండ్రం పూజాప్పురలో ఉన్న కేంద్ర కారాగారంలోని ఖైదీలు తీవ్రంగా శ్రమించారు. మంచినీటి సీసాలతోపాటు దాదాపు 50 వేల చపాతీలను ఖైదీలతో తయారు చేయించి జైలు అధికారులు సహాయక బృందాలకు అందజేశారు. నీటిలో చిక్కుకుని ఆహారం కోసం ఎదురుచూస్తున్న వారికి హెలికాప్టర్ల నుంచి జారవిడిచేందుకు తమ చపాతీ ప్యాకెట్లు బాగా ఉపయోగపడ్డాయని అధికారులు చెప్పారు. 2015లో చెన్నైలో వరదల సమయంలోనూ ఇదే జైలు నుంచి 50 వేల చపాతీలను పంపారు. సాధారణ రోజుల్లోనూ ఖైదీలు చపాతీతోపాటు శాకాహార, మాంసాహార వంటకాలను తయారుచేసి త్రివేండ్రంలో ‘ఫ్రీడమ్’ బ్రాండ్ పేరుతో తక్కువ ధరకే విక్రయిస్తుంటారు. ప్రేమతో.. ఫేస్బుక్ దళం 2015లో చెన్నై వరదల సమయంలో సహాయక కార్యక్రమాల కోసం పురుడుపోసుకున్న ఫేస్బుక్ గ్రూప్ ఒకటి ప్రస్తుతం కేరళలో సహాయక చర్యల్లో పాల్గొంటోంది. నాడు 9 మందితో ప్రారంభమైన ఈ గ్రూప్‌లో నేడు వేలాది మంది ఉండగా దాదాపు 2,000 మంది సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ఆ గ్రూప్ పేరే ‘అన్బోదు కొచ్చి’ (ప్రేమతో కొచ్చి). కొచ్చిలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలోనే ఈ గ్రూప్‌లోని 500 మంది ఆహార పదార్థాలు, ఇతర వస్తువులను ప్యాక్ చేసి నిరాశ్రయులకు పంపించే పనిలో ఉన్నారు. బిస్కెట్లు, రస్క్, వంట పాత్రలు, దుస్తులు తదితరాలను ప్యాక్ చేసి సహాయక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ దళాల ద్వారా అవసరమైన వారికి అందిస్తున్నారు. కొచ్చిలో ఓ పాఠశాలలో ఏర్పాటుచేసిన తాత్కాలిక శిబిరంలో భోజనం చేస్తున్న ఓ వరదబాధిత చిన్నారి -
పునరావాసమే సవాల్!
తిరువనంతపురం/కొచ్చి: వర్షాలు తెరిపివ్వడంతో కేరళలో వరద ఉధృతి తగ్గినా కొత్త సమస్యలు మొదలవుతున్నాయి. లక్షల మంది నిరాశ్రయులకు పునరావాస కేంద్రాల్లో కనీస వసతులు కల్పించడం సవాల్‌గా మారింది. తిండి, నీరు, తాత్కాలిక ఆశ్రయం కల్పించడంతోపాటు అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవడం ప్రభుత్వం, అధికారుల ముందు అతిపెద్ద సమస్యగా నిలిచింది. వరదల కారణంగా మృతుల సంఖ్య 376కు చేరింది. 5,645 పునరావాస కేంద్రాల్లో 7.24 లక్షల మంది నిరాశ్రయులున్నారు. మరోవైపు, పలుప్రాంతాల్లో వరద ఉధృతి తగ్గకపోవడంతో నీటిలో చిక్కుకున్న వారిని కాపాడే కార్యక్రమాలు సాగుతున్నాయని సదరన్ కమాండ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ డీఆర్ సోనీ పేర్కొన్నారు. డ్రోన్ల ద్వారా ఇంకెవరు చిక్కుకుని ఉన్నారనే విషయం తెలుసుకుని.. ఆయా ప్రాంతాలకు చేరుకుంటున్నామని ఆయన వెల్లడించారు. ‘అందరినీ కాపాడి పూర్తి పునరావాసం కల్పించడంపైనే దృష్టిపెట్టాం’ అని ఆయన తెలిపారు. సహాయక బృందాలకు అవసరమైన కనీస సదుపాయాలు లేకపోవడం ఇబ్బందికరంగా మారిందని ఆయన పేర్కొన్నారు. రెస్క్యూ ఆపరేషన్లు దాదాపుగా ముగిసినట్లేనని వైస్ అడ్మిరల్ గిరీశ్ లుథారా పేర్కొన్నారు. అక్కడక్కడ చిక్కుకుని ఉన్నవారిని గుర్తించామని వారిని కాపాడేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సహాయక చర్యలు ముమ్మరం ఇళ్లపైకప్పుల పైన, మిద్దెల పైన నిలబడి సాయం కోసం అర్థిస్తున్నారు. ఎవరైనా రాకపోతారా.. కాపాడకపోతారా అనే ఆశతో తిండితిప్పల్లేకుండా ఆశగా ఎదురుచూస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని శాటిలైట్ ఫోన్ల ద్వారా చేరుకుంటున్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. మరోవైపు, ఎర్నాకులం జిల్లా పరూర్‌లో ఆదివారం రాత్రి ఆరు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే వీడీ సతీశన్ స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్న దాదాపు అందరినీ క్షేమంగా పునరావాస కేంద్రాలకు పంపించినట్లు ఆయన వెల్లడించారు. వరద తగ్గిన ప్రాంతాల్లో ఇళ్లలో పేరుకుపోయిన బురద, రాళ్లురప్పలు తొలగించే పనులు కూడా ఊపందుకున్నాయి. ఈ ప్రాంతాల్లో స్వచ్ఛమైన తాగునీటిని అందించడంతోపాటు విద్యుత్ సదుపాయాన్ని పునరుద్ధరిస్తున్నారు. నేవల్ ఎయిర్‌బేస్, కొచ్చి పోర్టు ద్వారా.. కొచ్చి నేవల్ ఎయిర్‌బేస్‌లో వాణిజ్య విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. బెంగళూరునుంచి సరుకులతో వచ్చిన విమానం సోమవారం ఉదయం ఎయిర్‌బేస్‌లో ల్యాండైంది. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగస్టు 26వరకు విమానాల రాకపోకలకు అవకాశం లేకపోవడంతో.. కేంద్రంతోపాటు వివిధ రాష్ట్రాలనుంచి సహాయసామాగ్రి కోసం ఈ ఎయిర్‌బేస్‌నే వినియోగించనున్నారు. మరోవైపు, కేరళ పోర్టుకు కూడా వివిధ రాష్ట్రాలనుంచి సముద్రమార్గం ద్వారా సహాయ సామగ్రి రవాణా మొదలైంది. ముంబై నుంచి 800 టన్నుల స్వచ్ఛమైన నీరు, 18 టన్నుల సరుకుతో నేవల్షిప్ ఐఎన్ఎస్ దీపక్ చేరుకుందని కొచ్చి పోర్టు ట్రస్టు అధికారులు తెలిపారు. పోర్టునుంచే పునరావాస కేంద్రాలకు ట్రక్కుల్లో ఈ సామగ్రిని పంపిస్తున్నారు. మరోవైపు, కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మరో భారీ సరుకుల నౌక వల్లార్‌పదం పోర్టుకు చేరుకుంది. మరోవైపు, ముంబై నుంచి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు చెందిన భారీ నౌకలో 50వేల మెట్రిక్ టన్నుల ఇంధనం కూడా కొచ్చి పోర్టుకు చేరుకుంది. సహాయక కార్యక్రమాలు, ట్రక్కుల కోసం భారీగా ఇంధనం అవసరమైన నేపథ్యంలో బీపీసీఎల్ ఈ నౌకను పంపించింది. అటు, తిరువనంతపురం, ఎర్నాకులం మధ్య రైలు సేవలను పునరుద్ధరిస్తున్నారు. ట్రయల్‌రన్ తర్వాత సహాయకసామగ్రిని తరలించేందుకు ఈ ట్రాక్ కీలకంగా ఉపయోగపడుతుంది. మరోవైపు, తిరువనంతపురం నుంచి చెన్నై, ముంబై, బెంగళూరు, ఢిల్లీలకు రైలు సేవలు పాక్షికంగా ప్రారంభమయ్యాయి. సాయం అందుతోంది! వరదకోరల్లో చిక్కుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళకు అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రూ.3కోట్లు, అస్సాం ప్రభుత్వం రూ.3కోట్ల సాయం అందిస్తున్నట్లు ప్రకటించాయి. కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ మొత్తాన్ని ఇవ్వనున్నట్లు ఆయా ప్రభుత్వాలు వెల్లడించాయి. అటు, రూ.10 కోట్ల సాయం అందించిన ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 2,500 టన్నుల బియ్యాన్ని ప్రత్యేక రైల్లో కేరళకు పంపించింది. కేంద్ర ప్రభుత్వం కూడా 100 మెట్రిక్ టన్నుల ధాన్యాలు, 52 మెట్రిక్ టన్నుల అత్యవసర మందులను సోమవారం కేరళకు పంపించింది. దీంతోపాటుగా 2,600 మెగావాట్ల విద్యుత్‌ను అందించేందుకు అంగీకారం తెలిపింది. జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ (ఎన్సీఎమ్సీ) కేరళలో వరద పరిస్థితి, అందుతున్న సాయంపై సమీక్ష నిర్వహించింది. తలచుకుంటేనే భయమేస్తోంది: బాధితులు అటు పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారు కూడా భవిష్యత్తును తలచుకుని భయభ్రాంతులకు గురవుతున్నారు. తిరిగి ఇళ్లకు వెళ్లిన తర్వాత అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తలచుకుంటేనే ఒళ్లుగగుర్పొడుస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ వరదలకు ముందుపరిస్థితి నెలకొనడం ఎలాగనేదే పెద్ద సమస్యంటున్నారు. ‘మళ్లీ ఇళ్లకు వెళ్లాక మా పరిస్థితేంటో అర్థం కావడం లేదు. సర్వం నష్టపోయాం. మా ఇళ్లను కట్టుకునేందుకు తగినంత సాయంకావాలి’ అని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని పునరావాస కేంద్రాల్లోనూ పరిస్థితి ఒకేలా లేదు. చాలాచోట్ల కనీస వసతులు కూడా ఇంకా ఏర్పాటుచేయలేదు. ఎర్నాకులంలోని ఓ కేంద్రంలో ఓ చిన్నారికి తట్టు (చికెన్ పాక్స్) సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో వెంటనే ఆ చిన్నారికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రత్యేక ఏర్పాట్లతో చికిత్సనందిస్తున్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా చల్లేందుకు అవసరమైన బ్లీచింగ్ పౌడర్ కొరత కారణంగా మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. రండి.. కాపాడుకుందాం: కేంద్రం పిలుపు వరదలతో అతలాకుతలమైన కేరళ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలు, బడా కంపెనీలను కేంద్ర ప్రభుత్వం కోరింది. ‘విషాదకరమైన మానవత్వ సంక్షోభం’లో ఉన్న కేరళను ఆదుకునేందుకు తోచినంత సాయం చేయాలని కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు విజ్ఞప్తి చేశారు. సాయం విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేయదలచుకోవడం లేదని.. సహాయం చేయడం, చేసేవారిని కలుపుకుని వెళ్లడమే తమ లక్ష్యమన్నారు. ఇందుకోసం పారిశ్రామికవేత్తలు, సీఐఐ, ఫిక్కీ వంటి వ్యాపార సంస్థలు తదితరులతో అధికారులు మాట్లాడుతున్నారన్నారు. అటు కేరళనుంచి వివిధ ప్రాంతాలకు విమానచార్జీలు పెంచుతున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై మంత్రి స్పందిస్తూ.. విమానయాన కంపెనీలు మానవతాధృక్పథంతో వ్యవహరించాలన్నారు. అటు, కేరళ సాధారణస్థితికి చేరుకునేందుకు వందలు, వేల సంఖ్యలో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు అవసరమని మరో కేంద్ర మంత్రి కేజే అల్ఫోన్స్ అన్నారు. జాతీయవిపత్తుగా గుర్తించబోం: కేంద్రం న్యూఢిల్లీ: కేరళలో వరద విలయాన్ని తీవ్రమైన విపత్తుగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ‘కేరళలో వరదల తీవ్రత, కొండచరియలు విరిగిపడిన ఘటనలను, జరిగిన అపార నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని తీవ్రమైన ప్రకృతి విపత్తుగా గుర్తించాం’ అని కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ప్రకృతి ప్రకోపాన్ని అరుదైన/తీవ్రమైన విపత్తుగా గుర్తించినపుడు రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయస్థాయిలో సహాయం అందుతుంది. ఎన్డీఆర్ఎఫ్ నిధి నుంచి అదనపు సాయంపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. కేంద్రం, రాష్ట్రాల మధ్య 3:1 నిష్పత్తితో విపత్తు సహాయ నిధి (సీఆర్ఎఫ్)ను ఏర్పాటుచేస్తారు. ఈ నిధిలో డబ్బులు తగ్గినపుడు నేషనల్ కెలామిటీ కంటిన్జెన్సీఫండ్ (100%కేంద్ర నిధులు) నుంచి సాయం అందిస్తారు. తీవ్రమైన విపత్తు ప్రకటించిన ప్రాంతాల్లో బాధితుల రుణాల చెల్లింపులో వెసులుబాటు, కొత్త రుణాలు ఇచ్చే అవకాశాన్ని చూస్తారు. కేరళ వరదలను జాతీయ విపత్తుగా గుర్తించబోమని కేరళ హైకోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం ఈ విషయం తెలిపింది. ‘కేరళ విపత్తు తీవ్రమైనది. జాతీయ విపత్తు నిర్వహణ నిబంధనల ఆధారంగా దీన్ని లెవల్ 3 విపత్తుగా గుర్తించాం. ఎంత పెద్ద విపత్తు ఎదురైనా ఈ నిబంధనల ఆధారంగానే కేటగిరీలు నిర్ణయిస్తాం. కేరళ వరదల విలయాన్ని జాతీయ విపత్తుగా గుర్తించబోవడం లేదు’ అని పేర్కొంది. తగ్గిన కర్ణాటక వరదలు కర్ణాటకలోని కొడగు జిల్లాలో నాలుగురోజులుగా బీభత్సం సృష్టించిన వరద తగ్గుముఖం పట్టింది. జిల్లాలోని అన్ని హోటళ్లు, లాడ్జీల్లో పర్యాటకుల బుకింగ్స్‌ను రద్దుచేసి నిరాశ్రయులకు గదులు కేటాయించారు. వరదలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, సైన్యం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి ఒక్కో కుటుంబానికి రూ.3,800 చొప్పున మధ్యంతర సహాయం అందించనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు. అలువా జిల్లాలో అంటువ్యాధులు సోకకుండా మందుల పంపిణీ కొచ్చి ఆడిటోరియంలో బాధితుల కోసం సహాయ సామగ్రిని సిద్ధం చేస్తున్న వాలంటీర్లు -
అమెరికాలో పేదలపై వివక్ష
ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికాలో ఆర్థిక అసమానతలు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఐక్యరాజ్యసమితి తాజా నివేదికలో తేలింది. పేదరికంలో మగ్గుతున్న 4.1 కోట్ల మందికి ఆ దేశంలోని అపార సంపద, ఆధునిక సాంకేతికత, ప్రభుత్వ విధానాలు ఏ విధంగానూ సాయపడటం లేదని వెల్లడైంది. త్వరలో అమల్లోకి రానున్న పన్ను సంస్కరణల చట్టంతో అమెరికా సమాజంలో ఇప్పటికే పెరిగిన ధనిక–పేద తారతమ్యాలు మరింత ఎక్కువ అవుతాయని నివేదికలో ఐరాస ప్రత్యేక ప్రతినిధి ఫిలిప్ ఆల్స్టన్ హెచ్చరించారు. అమెరికాలోని పేదరికం, మానవ హక్కుల అమలును పరిశీలించేందుకు ఆల్స్టన్ ఆధ్వర్యంలో ఐక్యరాజ్యసమితి నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఎంతటి శక్తివంతమైన దేశమైనా మానవహక్కుల చట్టాల పరిధిలోనే పనిచేయాల్సిందేనన్న సందేశాన్నిచ్చేలా ఈ కమిటీ పర్యటన సాగింది. అమెరికాలోని సామాజిక, ఆర్థిక అసమానతలు, ఇళ్లూ వాకిలి లేని వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వర్ణవివక్ష, పరిశ్రమల్లో ఉద్యోగాల తగ్గుదల వంటి అంశాలపై ఆల్స్టన్ దృష్టి సారించారు. కాలిఫోర్నియా, అలబామా, జార్జియా, పశ్చిమ వర్జీనియా, వాషింగ్టన్ డీసీ, అమెరికా పాలనలో ఉన్న ప్యూర్టోరికోల్లో పర్యటించి పేదలు, నిరాశ్రయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారి దుర్భర జీవితాల్ని పరిశీలించి ప్రాథమిక నివేదిక విడుదల చేశారు. అమెరికన్ల పౌర, రాజకీయ హక్కులపై పేదరికం ప్రభావాన్ని ఇందులో ప్రస్తావించారు. అమెరికా ప్రజలకు వైద్య సంరక్షణ హక్కు, సొంతిల్లు, ఆహారం వంటి ప్రాథమిక సామాజిక, ఆర్థికహక్కులు కొరవడుతున్న నేపథ్యంలో ఈ నివేదిక ప్రాముఖ్యతను సంతరించుకుంది. సంపన్నులు, పేదల మధ్య అంతరం ‘అసమానతలు, పేదరికంపై అమెరికా ప్రభుత్వ విధానాల్లో మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో తాజా పన్నుల విధానం ప్రజల సంపద, ఆదాయ వ్యత్యాసాల్ని మరింత పెంచుతుంది. ఒక శాతం సంపన్నులు, పేదరికంలో ఉన్న అమెరికన్ల మధ్య అంతరం మరింత పెరుగుతుంది. సంక్షేమరంగంపై విధించే కోతలు సామాజిక భద్రతను మరింత హరిస్తాయి. చైనా, సౌదీ అరేబియా, రష్యా, యూకే, ఇండియా, ఫ్రాన్స్, జపాన్ల మొత్తం రక్షణ రంగం వ్యయం కంటే అమెరికా అధికంగా ఖర్చు చేస్తోంది. 2013లో శిశు మరణాలు అభివృద్ధి చెందిన ఇతర దేశాలతో పోల్చితే అమెరికాలోనే అత్యధికం. మిగతా ఐరోపా దేశాలతో పోల్చితే అసమానతల స్థాయి ఎంతో ఎక్కువగా ఉంది. ప్రజలందరికీ మంచి నీరు, పారిశుద్ధ్యం అందుబాటులో ఉన్న దేశాల్లో అమెరికా ఇంకా 36వ ర్యాంక్‌లోనే ఉంది. తుర్కెమినిస్తాన్, ఎల్ సాల్వడార్, క్యూబా, థాయ్‌లాండ్, రష్యాల్లోని జైళ్లలో కంటే అమెరికా జైళ్లలోనే ఖైదీల సంఖ్య ఎక్కువ. ఓఈసీడీ(ఆర్థికంగా అభివృద్ధి చెందిన 35 దేశాల కూటమి) దేశాలతో పోలిస్తే అమెరికాలోనే ఎక్కువ శాతం యువత దారిద్య్రంలో ఉన్నారు. కెనడా, యూకే, ఐర్లాండ్, స్వీడన్, నార్వేలతో పోల్చితే అమెరికా పిల్లల్లో పేదరికం ఎక్కువ’ అని నివేదికలో పేర్కొన్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఇంటి అవసరాలకు డబ్బు ఎలా..?
-
'ఇల్లు లేని వారి కోసం షెల్టర్లు నిర్మించండి'
న్యూఢిల్లీ: శీతాకాలం నేపథ్యంలో ఇల్లులేని నిరుపేదల కోసం షెల్టర్లు నిర్మించాలని సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలను ఈ మేరకు ఆదేశించింది. షెల్టర్లు నిర్మించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని సుప్రీం కోర్టు హెచ్చరించింది.