లెబనాన్‌ నిరాశ్రయులు.. పది లక్షలు! | Israel Hezbollah War: Over 1 lakh Lebanese cross over into Syria amid Israeli bombings | Sakshi
Sakshi News home page

Israel Hezbollah War: లెబనాన్‌ నిరాశ్రయులు.. పది లక్షలు!

Published Mon, Sep 30 2024 5:16 AM | Last Updated on Mon, Sep 30 2024 7:16 AM

Israel Hezbollah War: Over 1 lakh Lebanese cross over into Syria amid Israeli bombings

సిరియా బాట పడుతున్న లక్షలాది మంది 

లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో లక్షల మంది నిరాశ్రయులవుతున్నారు. ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల భయంతో సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారు. లక్షలాది మంది సరిహద్దులు దాటి సిరియాకు చేరుకుంటున్నారు. ఇప్పటిదాకా ఏకంగా 10 లక్షల మంది ప్రాణ భయంతో పారిపోయినట్టు ప్రధాని నజీబ్‌ మికాటీ ఆదివారం తెలిపారు. ఆరో వంతు జనభా దేశం దాటుతోంది. లెబనాన్‌లో ఇదే అతి పెద్ద వలస ఇదే’’ అని ఆవేదన వెలిబుచ్చారు. గాజా యుద్ధానికి ఏడాది అవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌ తన దృష్టిని లెబనాన్‌పైకి మార్చింది. 

హమాస్‌కు మద్దతు ఇస్తున్నట్లు హెజ్‌బొల్లా ప్రకటించడంతో ఈ దాడులు తీవ్రమయ్యాయి. హెజ్‌బొల్లా స్థావరాలపై దాడుల తర్వాత ప్రజలు ఇళ్లలో ఉండటం లేదు. చాలా మంది వీధులు, సముద్రతీర కార్నిష్, పబ్లిక్‌ స్క్వేర్లు, తాత్కాలిక షెల్టర్లలో రాత్రంతా ఉంటున్నారు. కుటుంబాలకు కుటుంబాలు వీధుల్లోనే నిద్రిస్తున్నాయి. దహియాలో ఎక్కడ చూసినా నేలమట్టమైన భవనాలు, శిథిలాలతో నిండిన వీధులు, పొగ, ధూళి మేఘాలు కనిపిస్తున్నాయి. లెబనాన్‌ రాజధానికి ఎగువన ఉన్న పర్వతాల వరకు ప్రజలు పసిపిల్లలు, కొన్ని వస్తువులను వెంటపెట్టుకుని ర్యాలీగా వెళ్లారు. 50 వేల మందికి పైగా  సిరియాకు వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల చీఫ్‌ ఫిలిప్పో గ్రాండి తెలిపారు.  

సిరియాకే ఎందుకు?  
నిరాశ్రయులైన లెబనాన్‌ ప్రజలు శరణార్థులుగా సిరియాకు వెళ్తున్నారు. లెబనాన్‌ ప్రజలు సిరియాకు వెళ్లాలంటే డాక్యుమెంట్లు అవసరం లేదు. దీంతో ప్రతి గంటకు వందలాది మంది సిరియాకు వెళ్తున్నారు. పిల్లలు సిరియాలోకి వెళ్తుంటే తండ్రులు ఏడుస్తూ వీడ్కోలు పలుకుతున్న దృశ్యం కంటతడి పెట్టిస్తోంది.  

యూకేకు సంపన్నులు
లెబనాన్‌లో దాడుల దృష్ట్యా విమానాశ్రయం చుట్టూ భయానక వాతావరణం నెలకొంది. చాలా విమానాలు రద్దయ్యాయి. దీంతో యూకేకు ఓకే ఒక కమర్షియల్‌ ఫ్లైట్‌ రాకపోకలు సాగిస్తోంది. మధ్య తరగతి, సంపన్న వర్గాలకు చెందినవారు లెబనాన్‌ను విడిచి యూకే లాంటి దేశాలకు వెళ్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement